'రండి, నన్నాగారూ -- సగౌరవంగా పిలిచాడు రాంబాబు.
రాంబాబు కేసి ఆదరంగా చూసి అన్నాడు వెంకటేశ్వర్లు . 'ఏం చేస్తున్నావు బాబ్జీ?'
'ఏం లేదు, పనేమైనా ఉందా?'
'పనా? -- లేదు. ముందు బట్టలు మార్చు...'
రాంబాబు మరేం మాట్లాడలేదు. మౌనంగా బట్టలు మార్చుకున్నాడు.
మంచం మీద దుప్పటిని సరిచేసి, దాని మీద కూర్చుని, తండ్రి కేసి తిరిగాడు రాంబాబు ఇక చెప్పండి అన్నట్లు.
'ఈవేళ నీవు పుట్టిన రోజు -- గదా?'
'అవునండీ..'
'ఎన్నేళ్ళు వచ్చాయిరా నీకు?'
'ఇరవై మూడు-'
అంటే రాధ పోయి ఇరవై మూడేళ్ళయిందన్న మాట-- హు-'
రాంబాబు నిట్టూర్చాడు -- తన తల్లి పోయి ఇరవై మూడేళ్ళయిందన్న మాట! తన కోక సంవత్సరం వస్తున్న కొద్దీ తల్లి పోయిన కాలమూ పెరుగుతుంటుంది. నిజంగా తను నష్ట జాతకుడు! లేకపోతె -- లేకపోతె , తన పుట్టుక, తల్లి చావు అన్నీ గంటల తేడాలో జరగదమేమిటి? మొదటి కాన్పుకే ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ అయ్యాక ఇద్దరూ సేఫ్ అన్నారు! అంతే! గంట తిరగకుండానే తల్లి కన్ను మూసేసింది, పొత్తిళ్ళ ల్లో బిడ్డను, పుట్టెడు దుఃఖం లో భర్తను వదిలేసి --
తను నష్ట జాతకుడే-- లేకపోతె కనీసం తన తల్లి అయినా బతికెది! తల్లి బదులు తనే చనిపోయి ఉండేవాడు . తనకు అదృష్టం అనేది ఏమైనా ఉండి ఉంటె-- బహుశా తన తల్లి బతికే ఉన్నా, ఇలాగే అనుకునేదేమో -- మొత్తానికి , తను బతకాల్సి ఉంది-- అంతే ! అంతే జరిగింది.
వెంకటేశ్వర్లుకు మాత్రం గాయం అయింది. ఇది-- రాధ - హాస్పిటల్ కు వెళ్ళేటప్పుడు అన్ని విధాల నవ్వుతూ, నవ్విస్తూ వెళ్ళింది-- తిరిగివచ్చే టప్పుడు 'మీకింతే కావాలి ' అంది 'బంగారు బాబును' అన్నాడు తను. కానీ రాధ నవ్వింది-- 'నాకు మరి బంగారు పాప కావాలె' అంది. 'మరి నాకు బాబే--' అన్న తనకు జవాబుగా 'పోనీలెండి, ఇద్దరినీ తెస్తాను--' అంది. వెళ్ళింది -- తిరిగి రాకుండానే రాధ వెళ్ళిపోయింది. తన జీవితం అంతా శోకం లో ముంచేస్తూ -- ఏడుస్తూనే కాలం గడపమని తన్నేడిపిస్తూ వెళ్ళిపోయింది రాధ-
తన గుర్తుగా మిగిల్చింది ఈ బాబ్జీని!!
అందుకే బహు ప్రేమగా చూసుకుంటున్నాడు వెంకటేశ్వర్లు -- తల్లి లేని లోటు అతనికి ఎప్పటికో గానీ గుర్తొచ్చేది కాదు. ఇంతవరకూ ఏ విషయం లోనూ రాంబాబు ను గట్టిగా కేకలేసి ఎరుగడు వెంకటేశ్వర్లు .
ఈవేళ --
ఈ విషయం లో అతన్ని హెచ్చరించాలంటే ,మనశ్శాంతి కోల్పోయాడు. పైగా ఎలా చెప్పాలో, ఎలా చెబితే అతను గ్రహించగలడో , ఏఏ పదాల ప్రయోగం వల్ల అతనిలో తను కోరుకునే మార్పు వస్తుందో వెంకటేశ్వర్లుకు తెలీలేదు.
ఇది చాలా సున్నితమైన పరిస్థితి -- కొడుకుకు ఈ విషయం చెప్పాల్సి వస్తే ఏ తండ్రైనా ఎలా చెప్పగలడు?
అందుకే చాలాసేపు తటపటాయించాడు వెంకటేశ్వర్లు.
తండ్రికి తల్లి గుర్తొచ్చిందేమో ననుకున్నాడు రాంబాబు.
'బాబ్జీ....'
తలెత్తి చూశాడు రాంబాబు తండ్రి కేసి.
'ఎక్కడికి వెళ్ళార్రా మీరు?'
'గుడికి వెళ్ళామండి....'
'ఓ...వెళ్తామనెగా చెప్పారు, ఇందిర ఏదిరా అన్నట్లు?'
'వెళ్లి పోయిందండీ-'
'వాళ్ళ ఇంటికేనా?'
'ఆ-- అలా అడుగుతున్నారే?'
'ఏం లేదు....చూడు బాబ్జీ --కొంత వయసనేది వచ్చాక ఎవరూ చెప్పకుండానే కొన్ని మనంతట మనమే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది అలాంటిదే మరి!' వెంకటేశ్వర్లు ఆగాడు. అతనికి మళ్ళీ మాటలు దొరకలేదు.
ఏ విషయం నాన్నగారూ?'
అదే! ఇందిరా...నువ్వు....'
రాంబాబు కు అర్ధమయింది.
'చూడు బాబ్జీ , ప్రొద్దున్న అనుకోకుండా నేను నీ గదిలోకి వచ్చాను. నీకా సంగతి తెలీదనుకో, కానీ పొద్దున్న నువ్వు చేసిన పని ఏమీ బాగాలేదు....'
'నాన్నగారూ...'
'నిజమే కాదనను, ...నిగ్రహమనే దెప్పుడూ తగిన సమయంలోనే ఉండాలి. మొదట కాలు జారితే , ఆ తర్వాత ఎన్ని అనుకున్నా లాభం ఉండదు--'
'నాన్నగారూ...'
'ఇంకేమీ చెప్పకు నాకు. నాక్కావలసిందంతా ఒకటే! ఇందిరతో ఇక తిరగడం మానేసేయ్....'
'నాన్నగారూ , నా మాట వినండి...'
'బాబ్జీ, అనవసరంగా విషయాన్ని పెంచకు. ఇందిరతో మాత్రం తిరగడం కట్టి వేసేయ్- ఇంతకన్నా కావాల్సింది , నేను కోరేది ఏదీ లేదు-- ఆ అమ్మాయిలో గ్రహింపు శక్తి లేకపోతె కనీసం నీలోనన్నా ఇంగితమనేది ఉండాలి!' వెంకటేశ్వర్లు తీవ్రంగానే అన్నారు.
'నా మాట విని మరి....'
'ఏమిటది?'
'నేను ఇందిరను పెళ్లి చేసుకోదలచుకున్నాను నాన్నగారూ-----'
'బాబ్జీ---'
'క్షమించండి , మీకీ విషయాన్నీ ఎప్పటికప్పుడు చెబుదామనే అనుకుంటున్నాను...'
'ఇది నా సలహా కోరటమా? లేకపొతే నిర్ణయం తెలియజేయడమా?-'
క్షణం రాంబాబు ఏదీ మాట్లాడక పోయేసరికి మళ్ళీ వెంకటేశ్వర్లె అన్నారు. "పోనీలే. అలాగానే బావుందను కుందాం. కానీ ఆ ఊహ వాళ్లకి రావాలి మరి!'
'ఇందిరకేం అభ్యంతరం లేదు.'
'అంటే- బాబ్జీ -- ఈ విషయాన్ని నిర్ణయించాల్సింది నువ్వూ, ఇందిరా కాదు--'
'కానీ నాన్నగారూ -- ఇది మా పెళ్లి సంగతి ...రాంబాబు తీవ్రంగానే అన్నాడు.
'కరక్టే! - కానీ రామచంద్రయ్య గారు కూడా ఒప్పుకోవాలన్నది మర్చిపోకు--'
'ఔననుకొండి ....'
'అయితే మరి నా మాట విను. పెళ్లి జరిగాక మీరిద్దరూ ఎలా ఉన్నా ఎవరూ పట్టించుకోరు. కానీ పెళ్లి కాక మునుపు- పైగా మరో విషయం ...'
'రామచంద్రయ్య గారు నా వద్దకు రానే వచ్చారు --'
'ఎపుడు?'
'ఇపుడే , ఒక గంట యిందేమో--'
'ఎందుకు?'
'ఇదిగో , ఈ విషయమే హెచ్చరింఛి పోదామని-- ఆయనకు ఇష్టం లేదు మీ ఇద్దరి వ్యవహారం --'
'మీతో అన్నారా అలా అని? నాన్నగారూ!'
'ఔను బాబ్జీ, ఇది ఆడపిల్లతో వ్యవహారం. తండ్రి అందుకే జాగ్రత్త పడుతున్నాడు. అతనికేప్పటి నుంచో ఆ వూహ ఉన్నా, మొహమాటం కొద్ది అనలేక పోయాట్ట! ఆఖరికి ఈవేళ వెంకు పంతులు కూడా హెచ్చరించాడుట- అర్ధమయిందా ఎంత దిగజారామో?'
'వెంకు పంతులా?'- రాంబాబు తీవ్రంగానే అడిగాడు.
'ఔను , వెంకు పంతులే -- అంతే బాబ్జీ అది! ఒక్క వెంకు పంతులు మాత్రమే వెళ్ళగలిగాడు ; చెప్పగలిగాడు గానీ చెప్పకుండా ఇంకా ఎంతమంది ఉన్నారో ఈ వూహతో నీకేమైనా తెలుసా?'
రాంబాబు మాట్లాడటానికి అతనికి పదాలు లేకపోయాయి.
'పోనీలే, ఇంతవరకు జరిగింది జరిగాయ్. జరగాల్సింది ఆలోచించు. ఇందిరతో ఇక తిరగడం మానేసేయ్-'
రాంబాబు మళ్ళీ ఏమీ అనలేదు.
క్షణం సేపు రాంబాబు కేసి చూసి, వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు. రాంబాబు నిర్జీవంగా అక్కడే మంచం మీద కూలబడ్డాడు.
ఎంత అసహ్యంగా ఉంది?
తన తండ్రికి తనే ఈ విషయం చెబుదామనుకునేసరికి తన తండ్రి వచ్చి అదే విషయాన్ని కదపటం ఆశ్చర్యంగానే ఉంది. కానీ రామచంద్రయ్య గారు వచ్చి వెళ్ళారుట-- ఆయనకు వెంకు పంతులు హెచ్చరిక !-- హు !-- ఇదంతా వెంకు పంతులు చేసినపని!
ఛ!-- ఇందిరతో తిరగవద్దని, ఆ చనువు కూడదని ఎంత స్పష్టంగా చెప్పాడు తండ్రి! కానీ ఇందిరతో తిరగకుండా, ఇందిరను చూడకుండా ఎలా? అది ఈ జన్మకు సాధ్యపడదు!
ఇందిర కావాలి తనకు. తప్పదు!
కానీ-
రామచంద్రయ్య - అసలు రామచంద్రయ్య ఇన్నాళ్ళూ తన స్నేహానికి అభ్యంతరం పెట్టలేదు. కానీ ఈ వేళ ఇలా అర్ధాంతరంగా హెచ్చరించి వెళ్ళాడంటే -- హు- ఇదంతా వెంకు పంతులు చేసిన పని!'
కందకు లేని దురద కత్తి పీటకుట!!
అచ్చం అలానే జరిగింది. లేకపోతె -- ఇంకో వారం పది రోజులలోనే అంతా తండ్రికి చెప్పాలనే ఊహ....
కానీ,
ఇందిరకు కనిపించి, జరిగినదంతా చెప్పాలి-- ఇందిర సలహా తీసుకొని ఆ తర్వాత -- ఆ తర్వాత.
ఆ తర్వాతది అతను ఊహించుకోలేక పోయాడు.
మంచం మీద పడుకోన్నవాడు పడుకున్నట్లు గానే నిద్రాదేవి ఒడిలోకి ఒరిగాడు.