"ఎందుకు నప్పవు? నాతో రా నేను సెలెక్టు చేస్తాను. విమల్, గార్డెన్ వెరైటీల్లో ఎన్ని రకాలున్నాయో, మన కంపెనీలోనూ అన్ని వెరైటీలున్నాయి."
"ఏమక్కర్లేదు ఫ్రీగా వచ్చినాయని అందరూ దెప్పి పొడవటానికా?"
"ఫ్రీ ఏమిటి?"
ఆమెకి అసలు విషయం చెప్పక తప్పలేదు. వింటూంటే అతడికి నవ్వొచ్చింది.
"చూడు మాధవీ! నువ్వు పొట్టిగా వుంటావు. కుచ్చిళ్ళు ఎక్కువ పెట్టుకోవద్దని లక్షసార్లు చెప్పాను, నువ్వు విన్లేదు. పెద్ద పూసలు, ఎక్కువ నగలు పెట్టుకోకూడదని చెప్పాను.....అంత వరకూ ఎందుకు? లావుగా వున్నవాళ్ళు చిన్నసైజు హాండ్ బ్యాగ్ ఉపయోగించాలని చెప్పాను. అదికూడా నీకు పట్టలేదు. అన్నిటికన్నా ముఖ్యంగా పొట్టిగా వున్నవాళ్ళు కూర్చునేటప్పుడు కాళ్ళు రెండూ దగ్గిరగా పెట్టుకుని కూర్చోవాలని ఎన్నిసార్లు చెప్పాను నీకు?.... ఈ తప్పులన్నీ నీలో పెట్టుకుని... మా చీరలని అంటావేం?"
అప్పటికే ఆమె ఏడుపు ప్రారంభించింది. "నేను లావుగా వున్నాననేగా.....పొట్టిదాన్ననేగా...."
"చూడు మాధవీ! పొట్టి అనేది దేముడిచ్చిన శాపం. దానికి నువ్వేం చేయలేవు. కేవలం పొడుగు-పొట్టి వల్లే మనిషి ఆనందం ఆగిపోదు. కనీసం నువ్వు చేయగలిగింది కూడా చెయ్యవెందుకని?"
"ఏమిటి? ఏం చెయ్యాలి?"
"రోజుకి ఎనిమిది గంటలు నిరర్ధకంగా గడిపే బదులు ఒక్క అరగంట వ్యాయామం చెయ్యవచ్చు."
"ఇంకానయం సర్కస్ లో చేరమన్నారు కాదు."
అతడికి విసుగేసింది. చాలామంది బ్రతకటంకోసం జీవిస్తారు. కొద్దిమందే బ్రతకటంలో ఆనందాన్ని ఆస్వాదిస్తారు. ఆమె మొదటి టైపు. పెళ్ళయిన మొదటిరోజునుంచీ చెపుతూనే వున్నాడు - పక్క మీదకు వచ్చేటప్పుడు నోట్లో ఒక యాలక్కాయ వేసుకొమ్మని. ఆమె అర్ధం చేసుకోదు. అంతవరకూ ఎందుకు పౌడరు వేసుకోవలసింది మొహంమీదే కాదు- సగం అందం మెడవల్ల వస్తుంది. మెడ వెనుక కూడా మొహమంత బాగా అద్దంలా వుండాలి అన్నంత చిన్న విషయం కూడా ఆమెకి తెలీదు. చెప్పినా వినదు.
అతడికి జీవితంలో ప్రతీ సెకనూ అర్ధవంతంగా వుండాలి. ఏదో కొత్తదనం ఆలోచించాలి. మరో కొత్త డిజైను కనిపెట్టాలి...... అవే ఆలోచన్లు కొంతకాలానికి మెదడు అలసిపోతోంది. అలసిన మెదడుకు విశ్రాంతి కావాలి. అది మాత్రం ఇంట్లో దొరకదు. శారీరక సుఖం ముఖ్యం కాదు, ప్రేమ కావాలి. ప్రేమకి మొదటి స్టెప్పు అర్ధం చేసుకోవటం. ఎక్కడుందో తప్పు? అని మాత్రం తెలియటం లేదు. ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం.
గులాబీ...... గులాబీ...... ఏ సావన్ కి ఖుష్ బూ
ఖూబ్ సూరత్ నహోత్ - అగర్
ఇస్ మె రంగె మొహబ్బత్ నహోత......
(వర్షాకాలపు గులాబీతోట కూడా- ప్రేమ అంశ లేకపోతే అందంగా వుండదు.)
చిన్నప్పుడు విన్న పాత అతడిని వెంటాడుతుంది.
3
రవితేజ కంపెనీ దైరెక్టర్ల అతి ముఖ్యమైన సమావేశం ఆ రోజు జరుగుతూంది. ఒక ప్రధానమైన నిర్ణయం ఆ రోజు తీసుకోవాలి. వస్త్రాల వ్యాపారంలో ఒక కంపెనీ మిగతా కంపెనీల నుంచి నిరంతరం చాలా గట్టి పోటీని ఎదుర్కోవలసి వస్తుంది.
రవితేజ టెక్స్ టైల్స్ కి పోటీగా చెంచురామయ్య అండ్ కో చాలా హడావుడి చేస్తోంది. దాదాపు పాతిక సంవత్సరాలుగా రంగంలోవున్న ఆ సంస్థ పునాదులు-రవితేజ కంపెనీ రావటంతో కదిలిపోయాయి. చివరి ప్రయత్నంగా చెంచురామయ్య ఒక వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టాడు. లాటరీ తీసి మారుతీకారు ప్రెజెంటు అన్నాడు. ప్రతీ నగరంలోనూ అది ఏర్పాటు చేశాడు.
అద్దాల్లోంచి రిబ్బను కట్టిన మారుతీకారు ఆహ్వానిస్తూ వుంటుంది. నెలరోజులే టైము...... అదృష్టం ఎవరి తలుపన్నా తట్టవచ్చు.
ఎవరాగ్గలరు?
జనం గుంపులు గుంపులుగా చెంచురామయ్య షోరూమ్ ల మీద పడ్డారు.
క్యూల్లో నిలబడ్డారు.
ఇది ఒకవైపు నుంచి తాకిడి.
రిడక్షన్ సేల్స్ మరొకవైపు.
"వీధిన పడ్డాను"
అకస్మాత్తుగా అప్పులవాళ్ళు వత్తిడి చేయటంతో, వున్న ఆస్తులన్నీ అమ్మి వీధిన పడ్డాను. సరుకంతా ఏ ధరకైనా అమ్మివేయటానికి నిశ్చయించుకుని మీ వూరు వచ్చాను- మూడు రోజులు మాత్రమే. 175 రూ. షర్టు పీసు 1-75 పైసలు...
... లాటి ప్రకటనలు, షాపులు.
ముఫ్ఫై అయిదు రూపాయలకే చీర అయిదు రూపాయలకే నైటీ ఏదో ఒకటి చేస్తే తప్ప లాభంలేదు.
రవితేజ ఏం చేస్తాడు?
డైరెక్టర్లందరూ ఆసక్తిగా మీటింగ్ లో కూర్చుని వున్నారు.
"డియర్ సర్స్...." అన్నాడు రవితేజ. ".....మనమిక్కడ సమావేశమైంది ఒక ముఖ్య విషయం చర్చించటానికి మన సమస్య మీకు తెలుసు. తాకిడి రెండువైపుల్నుంచి వుంది. ఆకర్షణీయమైన బహుమతులు పెట్టి కస్టమర్లని ఆకర్షిస్తూన్న కంపెనీలొకవైపు, రిడక్షన్ అమ్మకాల పేరిట చౌక సరుకు అంటగడుతూన్న చిన్న షాపులొకవైపు. ఈ రెంటినీ మనం ఎదుర్కోకపోతే గత అయిదేళ్ళుగా మనం సాగిస్తున్న అభివృద్ధి ఆగిపోతుందని మీ అందరికీ తెలుసు. ఈ విషయమై మన ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ఎన్నో పథకాల్ని నాకు గత కొన్ని వారాలుగా సమర్పిస్తూ వుంది. అలాగే మన మార్కెటింగ్ సెక్షన్ తో ఎన్నో సుదీర్ఘమైన చర్చలు జరిపాను. నేను ఈ రెంటితోనూ చర్చించిన విషయాన్ని మన చైర్మన్ కి ఈ రోజే క్లుప్తంగా వివరించి, నేను అమలు జరపబోయే విషయాలకు ఆయన అనుమతి తీసుకున్నాను. ఈ పథకాల్లో మీకేమైనా అనుమానాలుంటే చర్చించటం కోసమే ఈరోజు ఈ సమావేశం" అంటూ ఆగేడు.
రవితేజ టెక్స్ టైల్స్ చైర్మన్ శర్మ నవ్వుతూ చూస్తున్నాడు. ఆయనకి యాభై సంవత్సరాల వయసుంటుంది. లక్షాధికారి పిల్లలు లేరు.
"సర్స్...... మన పోటీదార్లని ఎదుర్కోవటానికి మనం ఏదైనా చేయాలంటే ఇంకా ఆకర్షణీయమైన బహుమతులు పెట్టాలి. ఏం పెడతాం? ఓడలు? హెలికాఫ్టర్స్!! మా చీర కొంటె చంద్రమండలానికి ఉచిత యాత్ర???"
నవ్వులు.
"ఇవేమీ మనం ఇవ్వలేం. అందుకే...." రవితేజ ఆగి, నెమ్మదిగా అన్నాడు."......మనం ఏమీ ఇవ్వం."
ఎవరో మంత్రించినట్టు నవ్వులు ఆగిపోయాయి. ఇప్పుడు రవితేజ నవ్వాడు. నవ్వి అన్నాడు --
"అవును అంత పెద్ద బహుమతులు ఏమీ ఇవ్వం. ప్రతీ చీరతో రెండు భాగ్యలక్ష్మీ లాటరీ టిక్కెట్లు ఇస్తాం..."
"ఏమిటీ....?" ఎవరో అన్నారు.
"అవును రెండు లాటరీ టిక్కెట్లద్వారా లక్ష రూపాయల బహుమతి పొందటానికి ఎంత తక్కువ ఛాన్సు వుందో, ఒక చీర కొనటంద్వారా మారుతీకారు పొందటానికి అంతే ఛాన్సు వుందన్న భావాన్ని ఈవిధంగా మన కొనుగోలుదార్ల మనసుల్లో చొప్పిస్తాం. సర్స్... ఏ పథకమైనా పెట్టిన కొత్తలోనే అందర్నీ ఆకర్షిస్తుంది. తరువాత జనం కూడా అందులో లొసుగు గుర్తిస్తారు. నా ఊహ నిజమైతే ఈ పథకం ఎక్కువకాలం సాగదు. మనం చేయవలసిందల్లా ఈ పథకాన్ని వాళ్ళు అనుకున్నదానికన్నా తక్కువ కాలంలో ముగించేట్టు చేయటమే...." ఆగేడు.
"ఒక షాపు చీర ధర పెంచకుండా, కేవలం తన వ్యాపారాభివృద్ది కోసం కేటాయించిన డబ్బులోంచి మారుతీకారు బహుమతిగా ఇవ్వాలంటే కనీసం యాభై లక్షలు అమ్మకాలు చెయ్యాలి. ఇదెంతవరకూ సాధ్యం? కాబట్టి చీర ధర పెంచక తప్పదు. "చీరమీద పది రూపాయలు ఎక్కువ పెడతారా- మా చీర మామూలు ధరకి కొని రెండు లాటరీ టిక్కెట్లు పొందుతారా?...." ఈ భావాన్ని కస్టమర్ల మనసులోకి ఇంజెక్ట్ చేస్తాం. మనం చేసే ఈ పనిని చూసి మొదట్లో చాలామంది నవ్వుకుంటారు. కానీ మారుతీ కారుకోసం వెళ్ళేవారిని చూసి, మనం ఈ పని చేయటం గుర్తొచ్చి ఇంకా నవ్వుకుంటారు. ఈ గిల్టీ ఫీలింగ్ ని వారిలోకి ప్రవేశపెట్టడమే మనం చేసే పని...."
చప్పట్లు- ఆగకుండా చప్పట్లు కొట్టారు. డైరెక్టరు శర్మ రవితేజని అభినందిస్తున్నట్టు చూశాడు.
"మన రెండో పోటీదారు బోంబే సేల్స్, రిడక్షన్ అమ్మకాలు, డిస్కౌంట్స్.....! మన ధరలతో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ. కానీ వస్తువులో నాణ్యత కూడా తక్కువే. ఈ విషయం అందరూ వప్పుకుంటారు. కానీ, మనం కూడా వప్పుకోవలసిన విషయం ఒకటుంది. ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా తీసుకోండి. దాన్ని తయారుచేయటానికి అయ్యేఖర్చు పది రూపాయలైతే, దాన్ని పన్నెండు రూపాయలకి, మహా అయితే పధ్నాలుగు రూపాయలకి అమ్ముతారు. ఒక్క చీరల విషయంలోనే, తయారీ ఖర్చు వంద అయితే దాన్ని మూడొందలకి అమ్ముతారు. ముఖ్యంగా పట్టుచీరలైతే, పదిహేనొందలు పెట్టి సంబరపడి కొనుక్కుని వెళ్ళేవాళ్ళకి తెలీదు. దాన్ని తయారు చేయటానికయ్యే ఖర్చు అయిదొందలకన్నా ఎక్కువ వుండదని...."