కాలేజీ ఏనివర్శరీకి ఐటమ్సు లో విశాలి - పాటకూడా చేర్చారు ఫ్రెండ్సు.
"నన్నొదిలేయండి. నేను- పాడలేను" అని ఎంత గానో చెప్పి చూసింది విశాలి.
ఇంట్లో అన్నయ్య ప్రవర్తన రోజురోజుకీ బాధిస్తుండడంవల్ల విశాలి సంతోషంగా తిరగలేకపోతూందీ మధ్య. దేనిమీదా కుతూహలం కనపరచలేకపోతూంది.
"నిన్నొదిలి పెట్టేస్తే ఇంకెవరున్నారు, తల్లీ, నీ అంత మధురంగా పాడేవారు?" అయినా నీ పాట లేకుండా ఏనివర్సరీ ఏమిటీ?" అంటూ బలవంతం చేయడంతో మరి మాట్లాడలేకపోయింది విశాలి.
ఈ సంగతి తెలిసిన రామం చెల్లెలి మీద కోప్పడ్డాడు.
విశాలి కాలేజీలో నలుగురి ముందూ పాడటం తనకి నచ్చదన్నాడు.
స్నేహితురాళ్ళు బలవంతం చేసి ఒప్పించారని ఉన్న మాట చెప్పింది విశాలి.
"నీకు నే నంటే అసలు--లక్ష్యం ఉంటేగా?" విసురుగా వెళ్ళిపోయాడు రామం.
'ఎందు కన్నయ్యా అటువంటి మాటలు? ఇంతకన్నా చిత్రవధ నా కింకొకటి లేదు. నువ్వుకాక నాకు లక్ష్యపెట్టడానికి మరెవరున్నారు? నువ్వు నన్నర్ధం చేసుకునే రోజు వస్తుందో రాదో?' కుమిలిపోయింది విశాలి లోలోనే.
* * *
ఆ రోజే కాలేజీలో ఫంక్షన్.
ఉన్న వాటిలో మంచి బట్టలు, లేత నీలంరంగు చీర, అదే రంగు జాకెట్టు పైకి తీసింది విశాలి పెట్టెలోంచి.
తొందరాగా వంట ముగించి తయారై, లేత నీలంరంగు దుస్తుల్లో మబ్బుకన్నెలా బయలుదేరింది విశాలి.
ముఖం చిట్లించుకుని ముభావంగా ఊరుకున్నాడు రామం.
"వెళుతున్నా నన్నయ్యా" అంటూ, ఏమైనా చెపుతాడేమోనని ఒక నిమిషం ఎదురుచూసి మౌనమే సమాధానం కావటంతో వెళ్ళిపోయింది విశాలి.
రంగు రంగుల బట్టలతో రమణీయంగా ఇటూ అటూ తిరుగాడే యువతులు, ఎక్కడలేని గాంభీర్యం ముఖంలోకి తెచ్చుకుని అందరి చూపుల్నీ ఆకట్టుకోవడానికి హడావిడి పడుతున్న యువకులు, ఆడపిల్లల్ని ఎన్ని విధాలుగా ఏడిపించవచ్చో రీసెర్చి చేస్తున్న ప్రబుద్దులు, ముఖాలమీద చిరునవ్వు పులుముకుని చూస్తున్న లెక్చరర్లు....వీరందరితో దివ్యంగా వెలుగుతూంది. కాలేజి. అందరి కబుర్లూ వింటూ మౌనంగా కూర్చుంది విశాలి. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఆనంద్ పాడుతున్నాడు స్టేజీమీద నిలబడి మంచి ఫోజులో.
కొంతమంది కతని పాట నచ్చింది, కొంతమందికి నచ్చలేదు.
నచ్చినవాళ్ళు చెవులప్పగించి వింటున్నారు.
నచ్చని వాళ్ళు దిక్కులు చూస్తూ, సందు దొరికితే కబుర్లాడుకుంటున్నారు.
తన వంతు రాగానే అప్రయత్నంగా స్టేజీమీదికి నడిచింది విశాలి.
పైట నిండుగా కప్పుకుని, చేతులు కట్టుకుని, ముఖంలో గాంభీర్యం, మర్యాదా ఉట్టిపడుతూ మైక్ ముందు నిలబడ్డ విశాలి అందరి మనసుల్లో ప్రత్యేక మైన స్థానం ఆక్రమించుకుంది.
స్కూల్లో చదివేరోజుల్లో నేకాక, కాలేజీలో చేరిన ఈ నాలుగేళ్ళలోనూకూడా విశాలి ఎవరిచేతా అనిపించుకోవడంగానీ, హేళన చేయబడటంగానీ జరుగ లేదు. దానికి కారణం విశాలి నిర్మలమైన మనసు, వంక పెట్టలేని ప్రవర్తన, ఆడంబరం లేని వేషభాషలు.
శ్రోతలందరికీ వినయంగా నమస్కరించి తన కిష్టమైన, ఆర్. బాలసరస్వతి పాడిన 'ఆ తోటలో నొకటి ఆరాధనాలయము' పాటతో ప్రారంభించింది విశాలి. శ్రోతల కోరికమీద, తను అనుకున్నవేకాక ఇంకా చాలా పాటలు పాడవలసి వచ్చినా విసుగూ, చిరాకూ కనిపించలేదు విశాలి ముఖంలో. చీమ చిటుక్కుమన్నా వినిపించే టంతటి నిశ్శబ్దంలో మధురంగా సాగిపోయింది విశాలి గానం.
చప్పట్లతో ఆ ప్రదేశమంతా మారుమోగిపోతుండగా స్టేజి దిగింది విశాలి.
కార్యక్రమం ముగిశాక వెంటనే ఇంటికి బయలుదేరడానికి వీల్లేకపోయింది విశాలికి.
స్నేహితురాళ్ళంతా పొగడ్తలతో చుట్టుముట్టేశారు. అందరికీ చిరునవ్వుతో సమాధానమిస్తూ చాలాసేపటికి గేటు బయట అడుగు పెట్టగలిగింది విశాలి.
అందరూ ఎవరి దారిని వాళ్ళు ఇళ్ళకి వెళుతున్నారు.
విశాలి, సువర్ణ ఇద్దరే ఆ సందులో నడుస్తున్నారు. రాత్రి పదకొండు గంటలకి ఒంటరిగా (మగ సాయం లేకుండా) తా మిద్దరూ అలా వెళుతుంటే భయంతో పాటూ ఎందుకో ఆశ్చర్యంకూడా కలిగింది విశాలికి.
"సువర్ణా! ఇంటివరకూ మనకి సాయంగా ఉండడం కోసం మీ నౌకర్ని రమ్మన్నానని చెప్పావు నాతో! ఏడీ మరి?"
"అదే నాకూ అర్ధం కావటం లేదు. నేను వాడిని పది గంటలకల్లా వచ్చి గేటు దగ్గిర కూర్చోమన్నాను. అమ్మకూడా మరిచిపోకుండా పంపుతానంది వాడిని. ఏమైందో మరి? వెధవ ఎగ్గొట్టాడు." చిరాకు ధ్వనించింది సువర్ణ గొంతులో.
నడుస్తూ నడుస్తూనే ఇద్దరి కాళ్ళూ ఆగిపోయాయి అకస్మాత్తుగా.
ఆ చీకట్లో ఎర్రగా జ్యోతుల్లా మెరుస్తున్న కళ్ళతో చెట్లసందునుండి వచ్చిన నల్లని ఆకారం స్నేహితురాళ్లిద్ధర్నీ శిలా ప్రతిమల్ని చేసింది.
భయంతో బిగుసుకుపోయింది సువర్ణ.
భయంతో కదలకుండా నిలబడిపోయినాకూడా, రోజూ తను చిట్టికి చెప్పే రాజకుమారి రాక్షసుల కథలు గుర్తుకొచ్చి నవ్వొచ్చింది విశాలికి.
ఇద్దరి చేతులూ పట్టుకుని ఒక్క లాగు లాగాడా దొంగ. కెవ్వుమంది సువర్ణ. మనసులో ఆంజనేయున్ని పదేపదే తలుచుకుంటూ వణికిపోతూంది.
"వదులు, వదులుతావా లేదా?" లేని ధైర్యం నటిస్తూ పెద్దగా అరిచింది విశాలి.
"వదలకపోతే ఏం చేస్తావ్? ఊరంతా నిద్ర పోతూంది. నీ బాబుగానీ వచ్చి రచ్చిస్తా డనుకుంటన్నావా?" పగలబడి నవ్వాడు దొంగ.
ఆంజనేయున్ని తలుచుకున్నా లాభం లేదని నిర్ణయించుకున్న సువర్ణ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. గొప్ప ఇంట్లో పుట్టి పెరిగిన దైనందువల్ల కాస్త నిర్లక్ష్యంగానూ, కాస్త అమాయకంగానూ- "నీ కెంత డబ్బు కావలిస్తే అంత డబ్బు మా అమ్మతో చెప్పి ఇప్పిస్తాను. రేపు మా ఇంటికి రా. మా ఇల్లెక్కడో చెప్పనా? పూలబజారుపక్క సందులో పసుపుప్పచ్చ మేడే మా ఇల్లు" అంది సువర్ణ దొంగతో, అతి సామాన్య విషయం మాట్లాడుతున్నట్టు.
అంత భయంలోనూకూడా ఆపుకోలేని నవ్వు వచ్చింది విశాలికి సువర్ణ మాటలతో.
"నాటకం సాలించు. నోరు మూసుకున్నాడు." సింహంలా గర్జించిన దొంగని చూస్తూ వెయ్యి దేవుళ్ళకి మొక్కుకుంది సువర్ణ రక్షించమని. ఆ దొంగ మొహం మరి చూడలేనన్నట్టుగా గట్టిగా కళ్ళు మూసుకుంది ఉబికివస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ.
"సువర్ణా" అంటూ స్నేహితురాలి మీద చెయ్యి వేసింది విశాలి, ధైర్యం చెపుతున్నట్టుగా.
"అబ్బా!" అన్న దొంగ మాటతో ఉలిక్కిపడి చూశారు ఇద్దరూ.
ఒక్కసారిగా ఇద్దరి ముఖాలూ ఆనందం వెలిగి పోయాయి. దొంగ ఒళ్ళు హూనం చేస్తున్న నూతన వ్యక్తిని చూడగానే.
చావుదెబ్బలు తిని పడుతూ లేస్తూ పరుగు లంకించు కున్నాడు దొంగ.
నుదుటిమీద పడ్డ జుట్టుని వెనక్కి తోసుకుంటూ, "పదండి! మిమ్మల్ని మీ ఇళ్ళ దగ్గిర దిగబెడతాను" అన్నాడా వ్యక్తి. అతనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అడుగు కదిపారు స్నేహితురాళ్లిద్దరూ.
ఒడ్డూ పొడుగుతో, ఠీవిగా నడుస్తున్న ఆ యువకుణ్ణి పరిశీలనగా చూసింది విశాలి. ఆ రూపాన్ని ఆ నిమిషంలోనే మనసులో ముద్రించుకుంది.
నడుస్తూ నడుస్తూ మధ్యలో అతనోసారి తన ముఖం లోకి చూసేసరికి చటుక్కున తల దించుకుంది.
"ఇంత రాత్రివేళ ఒంటరిగా ఆడవాళ్ళు రోడ్డు మీద వెళ్ళడం మంచిది కాదని మీరీ వేళ తెలుసుకున్నా రనుకుంటాను" అన్నాడా యువకుడు చిరునవ్వుతో.
"ఒంటరిగా ఏమిటండీ ఇద్దరం ఉంటేనూ?" తనుకూడా నవ్వేస్తూ ఠక్కున సమాధాన,మిచ్చింది సువర్ణ.
చిరుకోపంతో సువర్ణవైపు చూసింది విశాలి.
అదేమీ పట్టించుకోనట్టే మళ్ళీ అంది సువర్ణ : "అది కాదండీ. మా నౌకర్ని రమ్మని చెప్పాను. వాడేమో రాలేదు. ఎందుకు రాలేదో ఏమిటో ఇంటికెళ్ళాక తెలుస్తుంది. ఫంక్షన్ అయిపోయింది గానీ, వాడి జాడ మాత్రం లేదు. అందుకని ఇంకా కాలేజీ దగ్గిరమాత్రం ఎంతసేపని ఒక్కళ్ళం కూచుంటామని చివరికి ధైర్యం చేసి బయలుదేరాం, అయినా, నా బాడీగా ర్డొకడున్నాడు లెండి, మా క్లాస్ మేట్, రోజూ రెండు పూటలా నన్ను మా ఇంటికి దిగబెడుతూ ఉంటాడు వచ్చీరాని హిందీ పాటలు పాడుతూ. ఇందాక ఫంక్షన్ అయిపోగానే ఆకక్డికీ అడిగాడు కూడా పాపం- 'ఇంటివరకూ దిగబెట్టమంటావా, మిస్?' అంటూ. 'పళ్ళు రాలగొట్టమంటావా, మిస్టర్?' అన్నాను నేను. ప్చ్! ఇన్నాళ్ళూ ఎలాగో దిగబెట్టాడు. ఈ ఒక్క రోజుకూడా ఆ రోమియో వచ్చి ఉంటే ఇలా అయ్యుండేదే కాదు, నాదె పొరపాటు." నిజంగానే విచారం వెలిబుచ్చింది సువర్ణ.
ఇది ఎంతమాత్రం నచ్చలేదు విశాలికి.
పరాయి వ్యక్తితో, అలా కొంచెంకూడా కొత్త లేకుండా అన్నీ చెప్పేసుకోవడం చూస్తుంటే అదోలా అనిపించింది విశాలికి. అయినా ఏమనగలదు అతని ఎదురుగుండా?
మాట్లాడకుండా ఎక్కువ సేపు ఉండలేని సువర్ణ నిశ్శబ్ధాన్ని భరించలేక ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది. "మా విశాలి చాలా బాగా పాడుతుందండీ, మహాతల్లి ఈ వేళ మరీ వండర్ ఫుల్ గా పాడిందేమో నలుగురూ నాలుగు వైపులా చుట్టు ముట్టేసి కధల నిస్తేగా? లేకపోతే పదిన్నరకే మా ఇంటివైపుగా వెళ్ళే అ ఇంగ్లీషు లెక్చరరు వెనకాలే పోయి ఉండే వాళ్ళం." విశాలిని మోచేత్తో పొడుస్తూ అంది సువర్ణ.