Previous Page Next Page 
అపరాజిత పేజి 5

                                 


    "మాటా పలుకూ లేకుండా, అక్కడ పెట్టి పోతే ఎవరి కనుకోను?'
    'నాకు సంకోచ మెక్కువ. నిజమే! ఆమాత్రం అపరాధానికి యింత శిక్షా?'
    కన్నీళ్లను నిగ్రహించుకున్నా కంఠస్వరంలో బాధను దాచుకోలేక పోయింది మాధవి.
    'నేను అన్నం తినక పోవటం మీకు శిక్షా?'
    'ఎంతో అభిమానంతో మీరు తినాలని చేసినప్పుడు తినకపోవడం శిక్ష కాదూ?'       

     'అభిమానంతో 'నేను తినాలని' చేసారా?'
    అప్రయత్నంగా తన నోట వెలువడ్డ మాటలు మధు నోట పునరుక్తమయ్యే సరికి వాటి అర్ధం తెలిసి లజ్జా భారంతో మాధవి తల భూమిలోకి దిగిపోయింది.
    అక్కడ నిలబడలేక వెళ్ళబోయి గుమ్మం దగ్గిర ఆగి-'త్వరగా తినండి-చల్లారిపోతుంది' అంది.
    'ఎవరైనా వడ్డిస్తే వెంటనే తినబుద్ది అవుతుంది - లేకపోతే ఏమో! ఎప్పుడు తింటానో?' కొంటెగా మాధవి ముఖం లోకి చూస్తూ అన్నాడు.
    మాధవి కొంచెంసేపు గుమ్మం దగ్గర ఆగిపోయింది. తర్వాత విసుగ్గా ముఖం పెట్టి 'రండి వడ్డిస్తాను'-అంటూ ఆ బల్లమీదే అతని కంచం కడిగి పెట్టి' గ్లాసులో మంచినీళ్ళు కూడా పెట్టింది.
    మధు మాధవి ముఖంలోకి చూస్తూ 'వడ్డించేవాళ్ళు చిరునవ్వుతో వుండక పోతే నాకు తిన బుద్ది వెయ్యదు-'అన్నాడు.
    ఫక్కున నవ్వింది మాధవి.
    'మీరు చాలా అల్లరి చేస్తున్నారు-'
    'రామ, రామ! నేను చాలా బుద్ది మంతున్ని-మీరు తినమంటే తింటాను-మానెయ్యమంటే మానేస్తాను-'
    'గొప్పవారు-ముందు అన్నం తినండి, ప్రొద్దుటినుంచీ ఏం లేకుండా వున్నారు.'
    అప్పటికీ మధు భోజనానికి రాలేదు-
    'అబ్బ! ఇంకా ఏవిఁటండీ!'
    'రేపు సాయంత్రం పార్కులోకి వస్తా నంటే...'
    'హమ్మ బాబోయ్! నా వల్ల కాదు.....'
    మధు మూతి ముడుచుకు కూర్చున్నాడు.
    'ముందు అన్నం తినండీ-'
    'నాకు ఆకలిగా లేదు-'
    మాధవి కోపంగా కనుబొమలు ముడుచుకుంది.
    'తింటే తినండి - మానేస్తే మానెయ్యండి-నన్ను వెళ్ళిపోమన్నారా?'
    గంభీరంగా అంది.
    మధు కాస్త జంకాడు.
    'ముందు మీరా గంభీర్యపు ముసుగు తీసెయ్యండి-అదుంటే నేను భాష మర్చిపోతున్నాను-'
    'ముసుగా?'
    'కాదా? కనుబొమలు ముడుచుకోగలరు కాని, నవ్వే కళ్ళను ఏం చెయ్యగలరు? కటువైన వాక్యాలు కూర్చుకోగలరు కానీ, కంఠంలో మాధుర్యం ఎక్కడ దాచగలరు?' పకపక నవ్వింది మాధవి.
    'ఇంతకూ తింటారా లేదా?'
    'మీరు వస్తారా? రారా?'
    'అ-బ్బ! వస్తా లెండి-ముందు అన్నానికి రండి-' కొసరి వడ్డిస్తూంటే సుఖంగా భోజనం ముగించాడు మధు.
    
                                   4

    కాలేజి నుండి మాధవి ఇంట్లో ప్రవేశించబోయేసరికి లోపలి నుండి శివశాస్త్రి మాటలు వినిపిస్తున్నాయి-
    'ముందు పెద్దమ్మాయి శ్యామల కవ్వాలి - తర్వాత కాని మాధవికి చెయ్యం-అదీగాక మాధవికి హిస్టీరియా ఉంది - ముందు అది నయం చేయించి ఆ తర్వాత పెళ్ళి సంబంధాలు చూడాలనుకుంటున్నాను-'
    'ఆ! హిస్టీరియా ఉందా? వస్తా మండీ!'
    లోపలి నుండి ఎవరో గబగబ బయటి కెళ్ళి పోయారు-కొంచెంసేపు ఆశ్చర్యంతో అలానే నిలబడిపోయి లోపలకు నడిచింది మాధవి - మాధవిని చూసి శివశాస్త్రి గతుక్కు మన్నాడు-
    'ఎంత సేపయింది మాధవీ నువ్వొచ్చి?
    'ఇప్పుడే వస్తున్నాను పెద్దనాన్నా!'
    'ఆ! లోపలి కెళ్ళమ్మా! కాస్త కాఫీ తాగు- ముఖం చూడు ఎంత వడిలిపోయిందో? కాఫీతాగి విశ్రాంతి తీసుకో!'
    భాగవత గ్రంథంలో తల దాచుకున్నాడు శివశాస్త్రి -
    మాధవి లోపలి కెళ్ళగానే మాధవిని కౌగిలించుకుని బావురుమంది పరమేశ్వరి- మాధవి కంగారు పడింది-
    'ఏవిఁటి పెద్దమ్మా!'
    'నీకు మేం చేసిన ఉపకారం ఉందో, లేదో కాని మొత్తం నీ బ్రతుకును సర్వనాశనం చేస్తున్నాం మాధవీ!'
    'ఏవిటా మాటలు పెద్దమ్మా! ఏం జరిగిందసలు?'
    'మీ పెద్ధనాన్నగారికి నీ పెళ్ళి జరగటం ఇష్టం లేదమ్మా! ఇవాళ మన పక్కింటి శేషాచలంగారు నిన్ను చూసి ముచ్చటపడి కోడలిగా చేసుకోవాలని అడగటానికి వచ్చారు - నువ్వు పెళ్ళి చేసుకుంటే నీ జీతం మాకు దక్కదని మీ పెదనాన్నగారు భయపడ్డారు-అందుకని వాళ్ళతో నీకు హిస్టీరియా అని అబద్ధం చెప్పి...........'
    దుఃఖం ఆపుకోలేక పైటకొంగు నోటికడ్డం పెట్టుకుంది పరమేశ్వరి -
    మాధవి తేలిగ్గా నిట్టూర్చింది.
    'ఓస్! ఇంతేనా? దీనికింత బాధపడుతున్నావా పెద్దమ్మా? ఒకవేళ పెద్దనాన్న గారు వప్పుకున్నా నేను చేసుకుని ఉండే దాన్ని కాను-'
    పరమేశ్వరి ఆశ్చర్యంగా చూసింది-
    'అదేం మాధవీ? నువ్వు...' అనుమానంగా ఆగింది పరమేశ్వరి-మాధవి కంగారుపడిపోయింది-
    'అహ! పెద్దమ్మా....శ్యామలక్క య్యకు కాకుండా నే నెలా చేసుకుంటాను పెద్దమ్మా! ముందు శ్యామలక్కయ్యకు కావాలి-'
    'మాధవీ!'
    ఆప్యాయంగా మాధవి చెక్కిళ్ళు నిమిరింది పరమేశ్వరి-
    శ్యామలను చూసుకోవటానికి పెళ్ళి వారొచ్చారు. చాపమీద ఒదిగిపోతూ కూచుంది శ్యామల-
    'అమ్మాయి కొంచెం నలుపు-'
    ఇకిలించింది పెళ్ళికొడుకు తల్లి-
    'మీ అబ్బాయి మహా తెల్లగా ఉన్నాడా?' అనబోయిన మాధవి ప్రయోజనం లేని తన పౌరుషాన్ని బలవంతాన నిగ్రహించుకుంది-
    'పాటలు వచ్చా?'
    'అంతగా రావండి-కుట్లు అల్లికలూ అన్నీ వచ్చు-'
    'అవన్నీ ఎందుకు లెస్తురూ! ఇంకా ఏదైనా డిగ్రీ ఉంటే వేన్నీళ్ళకు చన్నీళ్ళుగా ఏదైనా ఉద్యోగం చేసి భర్తకు సహాయంగా ఉంటుంది-'

                         


    పాపం, శ్యామల తల భూమిలోకి దిగిపోయింది-
    'సరేలెండి-కట్నం విషయం నిశ్చయమైతే, మిగిలిన విషయాలు ఎలాగైనా సర్దుకోవచ్చు-'
    ఉదారంగా ప్రకటించింది పెళ్ళికొడుకు తల్లి-
    'వెయ్యిన్నూట పదహార్లు ఇచ్చుకో గలను-'
    ఆ సమయానికి వెయ్యి నయాపైసలు కూడా లేకపోయినా, దీనంగా అన్నాడు శివశాస్త్రి-
    'భలేవారండీ! ఈ మద్య బి.ఏ. పాసయిన అమ్మాయిని మూడువేల కట్నంతో అడగటానికి వచ్చారు-చదువూ లేదు, అందమూ లేదు, వెయ్యి రూపాయలా?'    
    అంటోనే లేచిపోయారు వాళ్ళు-
    వాళ్ళు అలా వెళ్ళగానే మాధవిని కౌగలించుకుని బావురుమంది శ్యామల-
    'నీమాట విని చదువుకున్నా బాగుండి పోను మాధవీ!' మాధవి తన కన్నీళ్లు తుడుచుకుంటూ శ్యామలను ఓదార్చింది-
    'చదువుకుంటే చాలామంచిదే అనుకో! ఇప్పుడేం చేస్తాం? విచారించకు-అయినా వంకలు పెట్టాలనే వాళ్ళు ఎలాగైనా వంకలు పెడతారు-చదువుకుంటే 'ఇంత చదువుకుంది-తిన్నగా కాపురం చేస్తుందా?' అనేవాళ్ళు లేరా? ఏవిఁటో ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళి ఒక పెద్ద సమస్యగా తయారై కూర్చుంది-నీలాంటివాళ్ళు ఎందరో...........'
    'మూడువేలు!ఎక్కడ తేను?' తల రెండు చేతులతోనూ పట్టుకుని కూర్చున్నాడు శివశాస్త్రి-
    'ఆయన పెన్షనూ, నీ జీతమూ కూడా ఇంటికే అయిపోతోంది మాధవీ! అతి ప్రయత్నం మీద ఈ నెల ఒక వంద దాచగలిగాను-శ్యామల పెళ్ళి ఎలా అవుతుందో?'
    కమిలిలో లేమిలో నిండుకుండలా సంసారం సాగించిన పరమేశ్వరి బేలగా మాధవిని చూసింది-
    'ఈ పూర్వా చారాల వల్ల వచ్చే చిక్కులు ఇవన్నీ-హాయిగా అబ్బాయీ అమ్మాయీ ప్రేమించుకు పెళ్ళిచేసుకుంటే ఏ గొడవా ఉండదు-' విసుగ్గా అంది రాధ -
    పరమేశ్వరి బిత్తరపోయి చూసింది -
    'కానీ, అందులోనూ ఇంతకుమించిన సమస్యలున్నాయి రాధా! యువతీ యువకులిద్దరూ సంస్కారులూ, వివేకవంతులూ, సహృదయులూ అయినప్పుడే ఆ మార్గం మంచిది - అలాకాక నిగ్రహం కోల్పోయి ప్రవర్తిస్తే అన్నివిధాలా బ్రతుకు నాశనమయిపోతుంది-మొగవాడి మీద ప్రకృతి ప్రభావం లేదు-కనుక అతను తప్పు కుంటాడు-చివరకు అన్ని నిందలూ అన్ని కష్టాలూ ఆడది భరించవలసివస్తుంది-?
    ఎన్నివిధాలుగా ఆలోచించినా ఎలా పరిష్కరించాలో అర్ధంకాని శ్యామల పెళ్ళి సమస్య అందరి గుండెల్లోనూ బండరాయై కూర్చుంది-

                                 *    *    *

    మాధవీ మధుల మధ్య చిగిర్చిన అనుబంధం రోజు రోజుకీ మరింత గాఢంగా అల్లుకు పోయింది-పార్క్ లో కూర్చుని అర్ధంలేని కబుర్లు చెప్పుకోవటం నిత్యకార్యక్రమంలో ఒక భాగమయిపోయింది- ఉన్నట్లుండి ఒకరోజున మధు 'మాధవీ నిన్ను చూస్తుంటే నాకేమని పిస్తోందో తెలుసా?' అన్నాడు-
    'మీరు చెప్తేగా!' అల్లరిగా నవ్వింది మాధవి-
    'నేను యవ్వనంలో అడుగుపెట్టిన నాటినుండీ ప్రకృతి నాలో కలిగించిన పులకరింతలన్నీ ఒక్కసారి ఎదుట నిలిచిపలకరించినట్లు - సృష్టిలో మాధుర్యమంతా రూపుదాల్చి సాక్షాత్కరించినట్లు-మధుర భావనలన్నీ మైమరచి నవ్వి నట్లు......'
    'అయ్యో!'
    'ఏఁవిటి మాధవీ!'
    'ఇంతాచేసి మీరు చెప్పదలచుకున్నది పైత్యంలాంటి ఈ కవిత్వమా? మనసులో మమకారముందని చెప్పటానికి ఇన్ని సాముగరిడీలు చెయ్యాలి టండీ!...'
    వెక్కిరిస్తున్నట్లు నవ్వింది మాధవి-
    మధు ఉడుక్కున్నాడు-ఆ కవ్వింపుకు రెచ్చిపోయి 'మమకారం మాత్రమే కాదు...' అంటూ ఆగాడు-
    'మరి?...'
    'చెప్పనా! థియరీ చాలా? ప్రాక్టికల్ ఎక్స్ ప్లేనేషన్ కావాలా?'
    మాధవి కళ్ళలోకి చూస్తూ అడిగాడు-
    ముఖమంతా ఎర్రబడిపోగా తలదించుకుని కొన్ని క్షణాలు మాట్లాడలేక పోయింది మాధవి - అంతలో తలెత్తి ధైర్యంగా మధును చూస్తూ 'రెండూ అక్కర్లేదు-ప్రామిస్ కావాలి-' అంది-
    'గడుసు దానివి-'నవ్వాడు మధు- మాధవి కుడి చేతిని అందుకుని 'నీ యిష్టం-నువ్వెప్పుడంటే అప్పుడు నిన్ను పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను-' అన్నాడు-
    మాధవి ముఖం సంతోషంతో వెలిగింది - మృదువుగా చెయ్యి విడిపించుకుంటూ 'మా శ్యామలక్కయ్యకి కావాలి ముదు-' అంది-
    'సంబంధాలొస్తున్నాయిలా ఉందే! ఇంకా ఏదీ నిశ్చయం కాలేదా?'
    'కుదరటం లేదు - ఇప్పట్లో కుదురుతుందనీ తోచటం లేదు-'
    'అదేం? ఆవిడకేం తక్కువయిందీ?'
    'తక్కువయింది అక్కయ్యకి కాదు- పెద్ధనాన్నకీ పెళ్ళి కొడుకులకీ-ఆయనకి డబ్బు వీళ్ళకి సంస్కారం...'
    'ఓహో! కట్నం దగ్గిర కుదరటం లేదా?'
    'ఊ! కనీసం మూడు వేలైనా కావాలంటున్నారు-మరొక వెయ్యి అయినా ఖర్చులుంటాయి-నాలుగువేలు -ఎక్కడ తేవాలి?'
    'శ్యామలకు చదువూ అబ్బలేదు....'
    'అదోవంక!-అక్కడికి మహా చదువు కున్న వాళ్ళకి కట్నం తీసుకోనట్లు!- ఎంత కష్టపడ్డా, నెలకు వంద పోగు చెయ్యగలమేమో కాని, నాలుగువేలు ఎక్కడ తేగలం?'
    'మా కంపెనీలో నెలనెలా తీర్చే పద్ధతి మీద, పెళ్ళిళ్ళ కీ- ఇళ్ళు కొనుక్కోవటానికీ-మొదలైన వాటికి అప్పులిస్తారు - మా చెల్లెలు పెళ్ళికని అప్లై చేసి నాలుగువేలు అప్పు తెస్తాను-నువ్వొక వంద నేనొక రెండువందలూ కలసి నెలకు మూడువందలు కట్టేద్దాం - శ్యామలకి పెళ్ళయిపోగానే మనం పెళ్ళిచేసుకుందాం! అప్పుడు నీ జీతమంతా అప్పుకింద కట్టేసి నా జీతంతో ఇల్లు గడుపుకోవచ్చు- ఏం మాధవీ!'
    'హమ్మయ్యో! మీరు అప్పు తీసుకోవటమే! వద్దు-ఇందులో మిమ్మల్ని ఇరికించటం నా కిష్టం లేదు-ఏమో! భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు? మనం అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరుగుతాయని ఏముందీ?'
    'మాధవీ! ప్లీజ్! అర్ధం చేసుకో! నీకు దూరంగా ఉండాలంటే నాకెంత బాధగా ఉందో నీకేం తెలుసు? మీ శ్యామలక్కయ్యకు పెళ్ళయితేనే కాని, మనకు లైన్ క్లియర్ కాదు - అందుకు ఇంత కంటే మార్గం లేదు-'
    'అయినా..........................'
    'మాట్లాడకు మాధవీ! నిన్నాజ్ఞాపించే అధికారం నాకుంది-నువ్వు నా మాట విని తీరాలి-'
    'అది కాదండీ! ఒకవేళ అప్పు తీర్చలేకపోతే?'
    'ఎందుకు తీర్చలేం? మీ అక్కయ్య పెళ్ళయ్యాక మన పెళ్ళికి ఏం అభ్యతరం ఉంటుందీ? ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటూ ఈమాత్రం అప్పు తీర్చలేమా? నీలో నాకు అపనమ్మకంలేదు-నా సర్వస్వమూ అయిన నువ్వే నన్ను మోసం చేస్తే ఇక నా బ్రతుకు ఏమయిపోతే మాత్రం నాకేం దిగులు?'
    'ఏవిఁటిది మధూ? నేను మిమ్మల్ని మోసం చేస్తానా?'
    'మరి, భవిష్యత్తు ఎలా ఉంటుందో' అని ఎందుకన్నావ్? ఎన్ని చికాకులొచ్చినా, ఏ ఇబ్బందులొచ్చినా మనకుమాత్రం ఎడబాటు ఉండదు మాధవీ! నేను అప్పుతీసుకుంటాను-ముందు శ్యామల పెళ్ళి అయిపోనీ!'
    'మీ ఇష్టం!'
    'గుడ్! మాధవీ!'
    ఆ తర్వాత పదిరోజులు దాటకుండానే మాధవి చేతులో నాలుగువేలు పెట్టాడు మధు-అందుకొంటూంటే మాధవి చేతులు వణికాయి - కళ్ళలో నీళ్ళు తిరిగాయి-
    'ఇంత త్యాగానికి అర్హురాలినా నేను?'
    'పెద్ద మాటలు వాడకు-త్యాగం లేదు-నా తలకాయాలేదు- ముందు మీ శ్యామలక్కయ్యకు పెళ్ళయిపోయే మార్గం చూడు-'
    ఇంకా అక్కడ నిల్చుంటే మాధవి ఏం పొగుడుతుందోనని వెంటనే వెళ్ళి పోయాడు మధు -
    ప్రేమా, గౌరవమూ, ఆరాధనా పెనవేసుకున్న చూపులతో వెళ్ళిపోతున్న అతన్ని చూస్తూ నిలబడిపోయింది మాధవి-

 Previous Page Next Page