లీలకి చిరాగ్గానే వుంది ఈ ఆలోచన మళ్ళీ!
తులసమ్మ ఉలిక్కిపడింది. గతం కళ్ళముందునుంచి కదలటం లేదు. అసలీ పెళ్ళి చేయకుండా వుండాల్సింది-తనెవరూ చేయటానికీ, చేయకపోవడానికి! - తులసమ్మకి ఆ దృశ్యం మళ్ళీ కళ్ళలో నీళ్ళు తెప్పించింది.
"కాదు పిన్నీ.... ఇవాళే అంటే ఎలా? అమ్మ జీవితం గడవాలి కదా!" అంది.
తులసమ్మ ఏమీ అనలేదు. పక్కనున్న చంద్రయ్య ఫక్కున నవ్వాడు.
"నీ జీవితం సంగతి కూడా చూసుకోవాలి. నేను చెప్పి చూసా... వినడం లేదు" అన్నాడు.
లీల ఏం మాట్లాడుతుంది. విధి అంటే ఇదేనేమో!!
తన చేతిలో పసిపిల్ల అటు ఇటు కదులుతోంది.
"అమ్మా..." లీల కళ్ళు తిరుగుతున్నట్టనిపించింది. రోజురోజుకీ సమస్య పెరిగిపోతోంది... రోజూ బెదిరింపులే!
ఇల్లు తన పేరు రాయలట - లేకపోతే తనెళ్ళి పోతాడట! ఎక్కడికీ...? బాబాయి మరో సంబంధం చూడగలడట.
- లీలకి అంత బాధలోనూ నవ్వొచ్చింది... మరో ఆడది బలి అవాలి, అంతేగా!!
చేతులకున్న నల్లపూసల తాడు నోట్లో పెట్టుకుంది పిల్ల.
ఇంతకీ....ఎవరికోసం ఈ ఇల్లు? - తెలుసు లీలకి..... వ్యాపారంలో నష్టం వచ్చిందిట, ఇల్లు అమ్మి డబ్బు తెమ్మంటాడు చంద్రయ్య! సుధాకర్ కేమిటీ దీంతో!! సుధాకర్ చదువుకి, తల్లి జబ్బుకి సహాయం చేశాడు చంద్రయ్య. అయినా తీరుస్తానన్నాడు తను. కానీ, ఇప్పుడే కావాలట!
లీలకి ఏం చేయాలో తెలియలేదు. అమ్మ బతికుండగానే ఇల్లు అల్లుడు పేర రాయటం ఏమిటీ?! ఆ ఇల్లు కాస్తా అమ్మేస్తే, ఎక్కడుంటుంది తల్లి? చంద్రయ్య కళ్ళముందు బ్రహ్మరాక్షసుడిలా కనిపించాడు లీలకి.
"అటో ఇటోతేల్చేయాలి.... కాపురం నిలబడాలి అంటే ఆ ఇల్లు మావాడి పేరిట రాయాలి అంతే!" అన్నాడు. సుధాకరూ అదే అంటాడు.
లీల ఈ మానసిక సంఘర్షణలో కొట్టుమిట్టాడిపోయింది.
తల్లికున్న ఆ కాస్త ఆధారాన్ని తను లాగేసుకోటం- తల్లిని అడగటానికి మనసు ఒప్పుకోలేదు. 'నిరభ్యంతరంగా సుధాకర్ కి మరో పెళ్ళి చేస్తా'నని బెదిరించే చంద్రయ్య, 'నిన్ను పెళ్ళి చేసుకోవటంలో మా ఉద్దేశమే అది!' అని తెగేసి చెప్పే భర్త..!
ఆరోజు పెద్ద వర్షం - పిల్లని ఎత్తుకుని వచ్చింది లీల తులసమ్మ దగ్గరికి.
"పిన్నీ - ఏదైనా మార్గం చూపించు... ఆ ఇంట్లో ఇంక వుండలేను!" అంటూ ఏడ్చింది.
తులసమ్మ కొంచెం కంగారుపడింది.
"ఇంత అన్నం పెట్టు, ఇక్కడే వుండిపోతా!" అంది లీల.
"ఆ చంద్రయ్య నిన్నూ, నన్నూ బతకనిస్తాడా? మీ యింటికి వెళ్ళిపో, తరువాత చూద్దాం!"
లీల పిల్లనెత్తుకుని చాలాసేపు నిలబడింది. ఆ ఇంటికి వెళ్ళాలంటే భయం! మనసు, శరీరం రకరకాల వేధింపులతో అలసిపోయాయి.
లీల వెళ్ళిపోయింది.
తులసమ్మ తలుపెసుకుంది. ఉలిక్కి పడింది తులసమ్మ. ఇదేమిటీ - అయ్యో!! ఈ చీకటిలో ఇలా కూర్చుండిపోయాను!! నీరసంతో తూలిపోతున్నట్లనిపించింది ఓ క్షణం!
ఎలాగో ఓపిక తెచ్చుకుని లేచి ముందు గదిలోకెళ్ళింది. కళ్ళు చీకట్లు కమ్మినట్లు అనిపించింది. అంతలోనే పనిమనిషి రాములమ్మ లోపలకొచ్చింది. గ్లాసుతో నీళ్ళందించింది.
* * *
గబగబా లోపలకొచ్చిన సుమతి ఇల్లంతా కలయచూసింది.
ఎక్కడా ఏ సందడీ లేదు.
రాజీవ్ మేడమీద గదిలో కూచుని సితార్ వాయిస్తున్నాడు. మనసు బాగా లేనప్పుడు రాజీవ్ చేసే పని ఎప్పుడూ అదే!
సుమతి తలుపు వేసి తొంగిచూసింది..... గబగబా కిందకొచ్చింది.
"పనయింది, వెళ్ళేప్పుడు అయ్య చెప్పి వెళ్ళమన్నాడు, వెడుతున్నా!" చిన్న గుడ్డ సంచీలోంచి పాన్ తీసి బుగ్గన పెట్టుకుని తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది పని మనిషి.
సుమతి మళ్ళీ రాజీవ్ గదిలోకెళ్ళింది. రాజీవ్ ని పలకరించాలంటే భయంగా వుంది. 'పిల్ల ఏదీ?' అని అడగాలి! 'చూడు.... కళ్ళు పెట్టుకుని!' అంటాడు. 'చూసాను! లేదు' అంటే - సుమతికి భయం మరీ ఎక్కువైంది.
గబగబా కిందికొచ్చింది. పొద్దున్న వెళ్ళిన తను రాత్రయ్యాక ఇంటికొచ్చింది...'ఎక్కడికెళ్ళావ్...' అని అడగడేమిటీ! తనకీ కోపం రావచ్చుగా, ఆ దిక్కుమాలిన పిల్లని చూడను- అంతమాత్రం చేత నా సంసారం పాడుచేసుకుంటానా? రాజీవ్ మనిషిని అర్ధం చేసుకోగలడు - అతని కోపం తాటాకు మంటలాంటిదే అని తనకి తెలుసు మరి!
సుమతి గబగబా మేడమీదకొచ్చింది మళ్ళీ.
అప్పటికి రాజీవ్ సితార్ వాయించటం ఆపి కిటికీలోంచి రోడ్డును చూస్తున్నాడు-'ఎంత నిర్ధయురాలు ఈ సుమతి? - పిల్ల ఏదీ.... అని అడగదేం? - ఆ పిల్లని ఎలాగైనా తను కాపాడి తీరతాడు - ఎక్కడున్నా ఆ పిల్ల రక్షణ బాధ్యత వహిస్తాడు - ఆ తల్లి మనసు ఎంత ఘోషిస్తోందో పిల్లని అలా వదిలేయవలసి వచ్చినందుకు! - రాజీవ్ కళ్ళలో అప్రయత్నంగా నీళ్ళు తిరిగాయి!!
వెనక్కి చూడగానే సుమతి!
"నా కోసం వెతకటం ప్రారంభించారనుకున్నాను" అంది భర్త పక్కన ఆనుకుని నిలబడి సుమతి.
"ఎందుకు వెతకనూ, ఈ రాత్రి కూడా ఇల్లు చేరకపోతే...వున్నాయి కదా టీవీలు, రేడియోలు, పోలీసుస్టేషన్లు!" రాజీవ్ సుమతి కళ్ళలోకి చూసాడు.
"ఛీ, అప్రతిష్ట! అయినా- నా ఇల్లొదిలి నేనెక్కడికెడతానూ?!" అంది అటూఇటూ చూస్తూ....ఏ మూలైన నిద్రపోతోందేమో- అనే ఆశతో!!
రాజీవ్ మాట్లాడలేదు.... మెట్లు దిగి వెళ్ళిపోయాడు.
అలామేట్లు దిగుతుంటే రాజీవ్ పెదాలపై చిన్న నవ్వు మెరిసింది. జీవితంలో కొందరు మెట్టుమెట్టు పైకి ఎక్కుతారు, కొందరు దిగుతారు- అంతే!!
సుమతికి చిరాగ్గా వుంది- అయినా అంత పంతం దేనికీ? పిల్ల ఏమైందో తనూ అడగవచ్చుగా!
రాజీవ్ కీ అనిపించింది-పిల్ల ఏమైందో తనూ చెప్పచ్చుగా!
ఎక్కడో 'కేర్...' మన్న ఏడుపు వినిపించినట్టయింది సుమతి చెవులకి.
"ఎక్కడ దాచారూ...!" అంది.
"ఎవర్ని?"
"దాన్నే..!"
"ఇచ్చేసా!"
"అంటే-"
"పంపించేశా!"
ఒక్క సెకను సుమతి ముఖంలో రంగులు మారాయి.
మరుక్షణంలో, "ఎక్కడికి..?" అంది రాజీవ్ వైపు చూస్తూ.
"ఎక్కడికో..!"
ఆ పొడిపొడి మాటలు కోపం తెప్పించాయి సుమతికి.
"ఎక్కడికో ఏమిటీ - చెప్పండి!" అంది భర్తని తనవైపు తిప్పుకుంటూ.
"నీ కనవసరం. నువ్వు ఓ పసిగుడ్డుని చూడలేవు, పాలీయలేవు, పెంచలేవు- నీకెందుకివన్నీ..?"
సుమతి బుగ్గలు ఎర్రబడ్డాయి. అంటే... ఎక్కడ దింపి వచ్చాడో చెప్పడా..? లేకపోతే ఆ వర్షంలో పిల్లని ఇక్కడ వదిలిందే వచ్చి తీసుకుపోయిందేమో! అందుకే అంత నిర్లిప్తత! సుమతి ఆడమనసు కుతకుతలాడిపోయింది.
- అసలీ పిల్ల ఎవరు, ఈ పిల్ల తల్లి ఎవరూ? ఏ సంబంధమూ లేకపోతే ఆ పిల్లమీద ఇంత మమకారమెందుకూ?! హమ్మో.... ఎంత కుట్ర! పెళ్ళికాకముందున్న ఇలాటి స్నేహాలు వదిలించుకోవటం అంత తేలిక్కాదుగా! అందుకే తెలివిగా నన్ను పెంచమన్నాడు. అంటే, తర్వాత నెమ్మదిగా దాన్ని రానివ్వమంటాడు! దీర్ఘ ఉచ్చ్వాస నిశ్వాసాల మధ్య ఆడనాగులా ఊగిపోతూ సుమతి గొంతెత్తి అరవడం మొదలుపెట్టింది.
"నాకు తెలుసు, ఈ రహస్యం ఎన్నిరోజులు దాగుతుందీ, అదెవరో, ఆ పిల్లెవరో అసలు విషయమేమిటో తెల్సుకోలేననుకుంటున్నారా? అందుకే 'పాలియ్యి..... పిల్ల ఏడ్చి చచ్చిపోతుం'దని నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది యిందుకా..? చెప్పండి- ఆ పిల్లని ఎవరు తీసుకెళ్ళారు?"
- ఆవేశం కట్టలు తెంచుకుని సుమతి అరుస్తుంటే, రాజీవ్ కి నవ్వు వచ్చింది. బాధా వచ్చింది. 'భర్తల్ని ఎంత తేలిగ్గా అపార్ధం చేసుకోగలరో భార్యలు!' అనుకుంటూ.
"సుమతీ... నా మాట వింటావా?" అన్నాడు అనునయిస్తూ.
"నిజం చెప్పండి, ఆ పిల్ల ఎవరూ?" అంది.
రాజీవ్ కి సుమతి పై జాలేసింది. సుమతిని గుండెలకి హత్తుకుంటూ-
"అనవసరంగా అపోహలతో మనసు పాడుచేసుకోకు. ఆ పిల్ల గురించి నీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు... నా మాట నమ్ము!"
"చచ్చినా నమ్మను" సుమతి కోపంగా లోపలకెళ్ళిపోయింది.
ఏంచేయాలి తను! రాజీవ్ తలపట్టుకు కూర్చున్నాడు...
పదినిమిషాల్లో బయలుదేరి వెళ్ళాడు బయటికి.
* * *