Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 5

 

   శారదకి, తలనొప్పిపుడుతోంది. "శారదా, ఇదిగో ఈ మాత్ర వేసుకో" - మంచం పక్కన రామం కూర్చున్నాడు.
   
    శారదకి శివమెత్తినట్టే అయింది. "ఏం మాత్ర అది పూర్తిగా చంపేయటానికి అది మీరు ఆలోచించుకుని వేస్తున్నారా" - శారద గుడ్లు ఉరిమింది. రామం చేతిలోనున్న మంచినీళ్ళగ్లాసు విసిరికొట్టింది.
   
    "శారదా - ఏం మాట్లాడుతున్నదో తెలుసా, నాకు లలితకి వున్న స్నేహాన్ని నువ్వు.
   
    "ఓహోహో గొప్ప స్నేహం. చీ, మీరెళ్ళండి ఇక్కడ నుంచి మీలో ఇంత మోసం వుందని తెలుస్తే అసలు పెళ్లికే అంగీకరించేదాన్ని కాదు".
   
    "అసలు నీలాటి వాళ్ళు పెళ్ళిచేసుకోకూడదు. హక్కులకోసం పోట్లాడే వాళ్ళు బాధ్యతల్ని కూడా తెలుసుకోవాలి. నువ్వు ఆడదానిగా భర్తతో సంసారం చేయగలవ్ కానీ తల్లిగా పిల్లల్ని కనలేవా - ఛీ, నువ్వసలు ఆడదానివా".
   
    రామం మంచం మీద నుంచి లేచి కిటికీదగ్గర నిలబడ్డాడు "అవును. నేను ఆడదాన్నికాను. నేను తల్లిని కాను. మీకు నేనెందుకు. ఈ విషయం ముందుచెప్తే. అబార్షన్ వరకూ కూడా రానియ్యకుండ మీ పడగ్గదిలో అడుగుపెట్టకుండా. శారద అరుస్తోంది.
   
    "ఏం మాట్లాడుతున్నావో తెలుసా. నోర్ముయ్యి. స్త్రీ వ్యక్తిత్వం అంటే ఒక మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోమని అంతేకాని, వ్యక్తిత్వాన్ని చెడగోట్టుకుని ఆవేశంగా అరవటంకాదు" రామం శారద వంక చూసాడు.
   
    'నా వ్యక్తిత్వం గురించి మరేం చెప్పక్కర్లేదు - మీ వ్యక్తిత్వం ఏమిటి మీరు తెలుసుకోండి. శారద మాట పూర్తికాలేదు. శారద చెంప చెళ్ళుమంది..
   
    'ఇప్పుడర్ధమయిందా. ఎందుకు అబార్షన్ చేయించుకున్నానో - ఆడదాని బ్రతుకింతే - అందుకు. భార్యని కొట్టే మొగాడు ఒక మొగాడేనా. నాకేం గతిలేక మీతో బతుకుతున్నాననుకోకు. ఒక తప్పు చేసాను. ఇంకో తప్పు చేయను" - శారద ఆవేశంతో ఊగిపోయింది. రామం ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోయాడు -
   
                                      *    *    *
   
                                          3

   
    అనుకోకుండా వచ్చిన తుఫాను కొన్ని సార్లు కొద్ది నష్టం చేస్తే, కొన్నిసార్లు ఊహించరానంత, భరించలేనంత నష్టం చేస్తుంది.
   
    శారద, రామం జీవితాల్లో తుఫాను చెలరేగింది ఆ క్షణం నుంచి".
   
    బయటకెళ్ళిన రామంరాలేదు. శారద మనసు వికలమైపోయింది. ఏ ఆదర్శాలతో పెళ్ళిలోకి అడుగుపెట్టిందో అవన్నీ ఇంత త్వరగా కుప్పకూలిపోవటం దురదృష్టం - పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే మన వాళ్ళ మాటలోవున్నా సత్యం తను గ్రహించలేదా. పెళ్ళి త్యాగాన్ని, సహనాన్ని, ఆప్యాయతల్ని, బాధ్యతల్ని, బరువుల్ని, అనుబంధాల్ని, ఆత్మీయతల్ని. ఇలా ఎన్నిటినో పెంచుతుంది. అన్నిటిని పంచుకోమంటుంది. పెళ్ళి ఇద్దరివ్యక్తిత్వాలను నిలబెట్టాలనే అనుకుంది కానీ, వ్యక్తిత్వాలకన్నా గొప్పవైన మనసులగురించి అనుకోలేదు - ఎంత పొరబాటు - రామం మంచివాడుకాడా ! - ఒక్క రూపాయికూడా తన దగ్గరనుంచి ఆసించకుండా తనని ప్రేమించి పెళ్ళాడిన రామం చెడ్డవాడా! ఆదర్శాలతో, ఆవేశాలతో అతని జీవితంలో ప్రవేశించిన తను మంచిది కాదా! - ఎందుకీ ఘర్షణ - ఎక్కడుంది తప్పు! వ్యవస్థలోనా - వ్యక్తిత్వంలోనా - విలువలలోనా - ఏది సత్యం - ఏది సత్యం - తనకేంకావాలి - తనకేంవద్దు - తేల్చుకోలేని మనస్థితిలో కొట్టుమిట్టాడింది శారద అంతరంగం.
   
    ఈ పెళ్ళి తను నిలబెట్టుకోవాలా, వద్దా - ఈ పెళ్ళి నుంచి తను ఆశించిందేమిటి - తను పొందిందేమిటి - పెళ్ళయి మూడేళ్ళవుతోంది శారద దీర్ఘంగా నిట్టూర్చింది - ఎటుచూసినా చీకటి - లైటు వేసుకోనేలేదు ఇంట్లో - గడియారం ఏడుగంటలు కొట్టింది. ఎక్కడికైనా వెళ్ళాలి. ఎక్కడికెళ్ళాలి!

    శారద ముఖంకడుక్కుంది. అద్దాల బ్లౌజు వేసుకుంది - ఎర్ర సిఫాను చీర కట్టుకుంది. ముఖంలో బడలిక కనిపిస్తున్న ఒక అందం కూడా కొట్టవచ్చినట్టు కనిపిస్తోంది - ఎర్రటి లిప్ స్టిక్ - నల్లనికాటుక - తెల్లని ముఖం - ఎరుపు, నలుపు, తెలుపు - రంగులు- రంగు రంగులు - రంగు రంగుల జీవిత రేఖలు - శారద అద్దంలోకి చూసుకుంది. జీవితాన్ని బరువుగా మోసే శక్తి తనకు లేదు - కొందరికుండచ్చు - కానీ తనకి లేదు శారద అద్దంలో చూసుకుని, చిన్నపూల పూలమాలతో ముఖం ఒక్కసారి ఒత్తుకుంది. పక్కపిన్నులు సద్దుకుంది. ఓ, ఏడున్నర తను వెళ్ళాలి ఎక్కడికి!!.

    వీధిలోకొచ్చి ఆటోకోసం చూస్తోంది శారద. ఎక్కడికమ్మా పక్కనే ఆగింది ఆటో -- ఎక్కడికి!!
   
    'హిమాయత్ నగర్-' ఆటోలో కూచుంది శారద.
   
    'హిమాయత్ సాగరా....' ఆటో అతను మీటరువేస్తూ అన్నాడు.
   
    'సాగర్ కాదు నగర్.... హిమాయత్ నగర్ - తెలియదా ఆటోవాడు మాట్లాడకుండా స్టార్ట్ చేశాడు ఆటోను. శారదకీ అర్ధంకాలేదు తను ఎందుకు బయల్దేరిందో ఇప్పుడు.
   
    'ఇక్కడే, ఆపు' శారద కేకకి సడన్ బ్రేక్ వేశాడు ఆటోవాడు.
   
    ఆ పెద్ద భవనంలోకి అడుగుపెట్టాలంటే భయమేసింది. శారదకి ముందు. అది తన క్లాస్ మేట్ నీరజ ఇల్లు. చదువుకొనే రోజుల్లో చాలాసార్లు వచ్చిందిక్కడికి పెద్ద పెద్ద గదులు, వరండాలు, కర్టెనులు, మూడు ఫోన్లు ఇంటి నిండా నౌకర్లు - నాలుగు కారులు, ఎప్పుడూ ఎవరో వచ్చేపోయే మనుష్యులతో సందడిగావుంటుంది ఆ ఇల్లు. ఏం చేస్తారే మీ నాన్న అని ఒకసారి నీరజని అడిగింది శారద 'సింగపూర్ లో బిజినెస్' అంది వెంటనే నీరజ.
   
    'ఎం బిజినెస్'-
   
    'ఏమో నాకూ తెలియదు. మాకు రెండు పెద్ద హోటళ్ళున్నాయి.  అంది నీరజ. గొంతులో గర్వం ధ్వనించింది. ఇదంతా ఎప్పటి సంగతి! నాలుగేళ్ళనాటిది. తను పెళ్ళి చేసుకోనని ప్రతిజ్ఞలు చేస్తున్న సమయం నాటిది!. ఒక్క సంవత్సరం నీరజ తను క్లాస్ మేట్స్ గా వున్ననాటిది!! గుమ్మంలోనుంచున్న శారద కాలింగ్ బెల్ నొక్కింది. నౌకరు తలుపుతీసాడు. 'రండి అమ్మా, రండి' - దారిచూపించాడు. శారద నెమ్మదిగా లోపలకెళ్ళింది. హాలు చూస్తుంటే కళ్ళు తిరిగినట్టనిపించింది శారదకి - ఏమిగొప్పగావుంది! - ఇంద్ర భవనం అంటారు - అది తెలియదు తనకి - బహుశా ఇలాగే వుండచ్చు - గోడనున్న పెయింటింగ్స్ వంక చూస్తోంది శారద.
   
    "హాయ్. నువ్వా". భుజంమీద చేయివేసింది నీరజ ఉలిక్కిపడింది శారద.
        "ఎన్ని రోజులు - కాదు, ఎన్నేళ్ళయిందీ. ఆ, అలాగే వున్నవే కాదు. కాదు అంతకన్నా అందంగా వున్నావే" - నీరజ గలగలా మాట్లాడుతూ ముందు గదిలోకి తీసికెళ్ళింది.
   
    ఆ గదిలోనే విశాలమైన టేబుల్ వుంది. చుట్టూరా నలుగురు మగాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు కూచున్నారు. పేక ఆట సాగుతోంది. బల్లమీద గాజుగ్లాసులు నిగ నిగమెరుస్తోన్నాయి. శారద లోపలకి రాగానే అంతా ఒక్కసారి శారదవైపే చూసారు.

 Previous Page Next Page