Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 5

   

     అతను నవ్వు దాచుకుంటూ "ఫర్వాలేదులెండి ఇష్టంలేకపోతే దాచుకోవచ్చు" అన్నాడు.
   
    చాలాసేపటికి ఆమె మాటలు వెతుక్కుని యిలా అంది. "నాకు కొంచెంసేపు ఏడవాలనిపించింది. అమ్మ వింటే తనూ ఏడుస్తుందని యిక్కడకు వచ్చి ఏడుస్తున్నా."

   
    ఈసారి ఆ మసక వెల్తుర్లో ఆమె ముఖంకేసి నిశితంగా తిలకించాడు. నిజమే! చారలు కానీ కాస్త తమాషా చేద్దామని "నాకు నమ్మకంలేదు. ఏదీ చూపించు, ఇందాక ఎలా ఏడ్చావో" అన్నాడు ఏకవచన ప్రయోగం చేస్తూ.
   
    కళ్ళు తుడుచుకుని "ఎగతాళిగా వుంది కదూ మీకు?" అంది.
   
    "నాకేమిటి, యీ మాటలు వింటే ఎవరికైనా అలాగే వుంటుంది."
   
    "భర్తచేత తాపులు తినటం అలవాటు లేనివాళ్ళకు."
   
    స్త్రీ ఎక్కడవుంటే అక్కడే తాపులుకూడా వుంటాయన్న నెపోలియన్ వాక్యాలు గుర్తుకువచ్చి "అది సహజమే కదా?" అని నోరు జారాడు.
   
    "ఏదీ? తన్నులు తినడమా?" అంది తలెత్తి వాడిగా చూస్తూ.
   
    "మన దేశంలో యివి కష్టాలని స్త్రీలు అనుకోకూడదు తెలుసా?"
   
    "ఏం? మీకూ అదే సంతోషమా?"
   
    "నేను మగవాడ్ని."
   
    ఆమె రోషంగా "అయితే మీరు మీ భార్యను కొట్టండి, హింసించండి."
   
    ప్రధమ పరిచయంలో యింత చనువు తీఉస్కుని మాట్లాడిన స్త్రీని అతను యిదివరకు చూడలేదు.
   
    "నాకింకా పెళ్ళికాలేదు. అయినా యిప్పటినుంచీ కాబోయే భార్యకోసం ఓ పేముబెత్తం సిద్దంచేసి వుంచాను. చూస్తావా?"
   
    "అక్కర్లేదు. మా యింట్లోనూ ఓ పేముబెత్తం వుంది" అని, రెండు చేతుల్తో ముఖాన్ని దాచుకుని "వద్దండీ, మీకు పుణ్యముంటుంది. అటువంటివి గుర్తు చేయకండి. నాకు భయమేస్తుంది." అంది దీనంగా.
   
    "దాంతో ఆయన నిన్ను బాధిస్తాడా? సరే. నా దగ్గరవున్న బెత్తం మరీ బలమైంది. దీంతో ఆయన ఒళ్ళు వాయగొట్టు" అని ఎంత పొరపాటు మాట్లాడానూ అని నాలిక కొరుక్కోవటం మొదలుపెట్టాడు.
   
    ఆమె చిన్నగానవ్వి "ఇంకేం లేదు" అని ఊరుకుంది.
   
    "ఆపావేం?"
   
    జవాబు చెప్పలేదు. బహుశా తను వాళ్ళ ఆయనను కొడుతూన్న దృశ్యం ఊహిస్తోందేమో హఠాత్తుగా అతనికి భయంవేసింది..క్రింద పడుకున్న వాళ్ళెవరికైనా మెలకువ వచ్చి చూస్తే....?
   
    "నన్ను క్షమించండి" అన్నాడు.
   
    అదే క్షణంలో ఆమెకూడా వల్లమాలిన సంకోచంతో తబ్బిబ్బు అవుతూ "ఛీ ఎంత సిగ్గుమాలిన పనిచేశాను? మీరు ఆ గదిలో నిద్రపోతున్నారని తెలిస్తే యిక్కడింతసేపు కూర్చునేదాన్ని కాదు." అని దుఃఖపడసాగింది.
   
    "మరి నేను బయటకు వచ్చాక కూడా ఎందుకని వెళ్ళిపోలేదు?"
   
    "ఓహో! నేరమంతా నామీద ఆపాదిద్దామని చూస్తున్నారన్నమాట. నేను వెళ్ళడానికి అవకాశం యిచ్చారు గనుకనా?"
       
    "అయితే ఇది నేరమని నీకు తెలుసన్నమాట?"
   
    ఆమె జవాబు చెప్పకుండా కోపంతో వెళ్ళిపోసాగింది. "నీ పేరు చెప్పి మరీ వెళ్ళు" అన్నాడు.
   
    "ఏం? దాంతో ఏమయినా పనివుందా?"
   
    "ఒట్టి కుతూహలం."
   
    "అయితే ఆ కుతూహలం కూడదు" అని గబగబా క్రిందకు దిగి వెళ్ళిపోయింది. అతను నవ్వుకుంటూ, అంతలోనే బాధపడ్తూ తిరిగివచ్చి పడుకున్నాడు.
   
    ఉదయం గోవిందు వచ్చి లేపాడు. "ఏడు దాటింది బాబూ" అన్నాడు.
   
    "వాన వెలిసిందా?"
   
    "ఆహా! నిక్షేపంగా!"
   
    అతను క్రిందికి దిగివచ్చాడు. హాల్లో వాళ్ళు నలుగురూ చేరి ఏదో మాట్లాడుకుంటున్నారు. "రాత్రి బాగా నిద్రపట్టిందా?" అని పరామర్శించాడు వృద్దులని.
   
    "చక్కగా పట్టింది" అన్నారు.
   
    "ఇహ మేము శెలవు పుచ్చుకుంటాం బాబూ!" అంది స్త్రీ.
   
    "వెడతారా?" అన్నాడు యధాలాపంగా.
   
    "అవును బాబూ! మీ ఉపకారం మరచిపోలేము"
   
    వాళ్ళు నలుగురూ నెమ్మదిగా వెళ్ళిపోయారు. యువతి వంచిన తల ఎత్తకుండానే నిష్క్రమించింది. ఇల్లంతా బోసిపోయినట్లయింది. పెరట్లోకి వచ్చి ఆకాశంవంక చూశాడు. తడిసిన చీరె విప్పుకుని పొడివస్త్రం ధరించినట్లు హాయిగా వుంది.
   
    కాఫీ తాగుతూ "అలా బయటకు వెళ్ళి ఊరు ఎట్లా నాశనమైందో చూసి వస్తాను" అన్నాడు.
   
    గోవిందు "నేనూ వెళ్ళాలనుకుంటున్నాను బాబూ- మీరు వచ్చాక" అన్నాడు.
   
    బయటకు వచ్చాడు. ఇంత ఒదులు పైజామా వేసుకురావటం పొరపాటని పించింది. రోడ్లన్నీ బురదమయమై వున్నాయి. గోతులలో నీళ్ళు, ప్రజలు నీరసంగా నడుస్తున్నారు. అతనిమేడ ప్రక్క విశాల ప్రదేశంలోని పాకల్లో వాళ్ళంతా యివతలకు వచ్చి అటూయిటూ తిరుగుతున్నారు. అందరి ముఖాలు చిరాగ్గా పాలిపోయివున్నాయి. రెండుమూడు పాకలు శుభ్రంగా మారిపోయాయి. ఆడవాళ్ళు గుంపులుగుంపులుగా వీధి మొదట్లోవున్న పంపు దగ్గరచేరి నీళ్ళు పట్టుకుంటున్నారు. పెద్ద రావిచెట్టు బాగా, వ్రేళ్ళతోసహా ముందుకు వంగిపోయి, చెట్టు మొదట్లో నిల్చుని, ఎవరైనా తోస్తే క్రింద పడిపోయేటట్లుగా వుంది. ఇంతలో ఓ పాకలోంచి వచ్చిన ఓ మనిషి అతన్ని చూసి నమస్కారం చేశాడు.
   
    "పాపం! నిన్నంతా ఎలా గడిపారో!" అన్నాడు శివనాథరావు.
   
    "ఏముందండీ? నిన్న పొద్దుటికాడినుంచీ మాకెవరికీ తిండీ తిప్పలూ లేవు. ఇళ్ళన్నీ చీదరచీదరగా అయిపోయాయి. ఎవరికీ తిండీతిప్పలు లేవు."
   
    తమకైతే పాడి సమృద్దిగా వుందికాబట్టి అరగంటకోసారి చొప్పున కాఫీలు త్రాగటం, ఇంట్లో కావలసినన్ని బియ్యం, కూరలు రెండుపూట్లా భోజనం.
   
    నీరసంగా ముందుకు కదిలాడు. ఇలా బాధలు పడినవాళ్ళంతా తనలాంటి జీవుల్ని తలుచుకుని ద్వేషంతో మండిపోతుంటారేమో!
       
    రెండుమూడు చోట్ల కాలుజారింది. దుస్తులు బురదని పులుముకుంటున్నాయి. నిన్నటినుంచీ ఎక్కడో తలదాచుకున్న కుక్క ఒకటి అతని కాళ్ళ ముందునుంచి పోతూ, అసూయతోనా అన్నట్లు ఓసారి ఒళ్ళంతా దులిపి తన బట్టలు మరింత ఖరాబు చేసింది.
   
    బజారులోకి వచ్చాడు. జనం కిటకిటలాడుతున్నారు. హోటళ్ళన్నీ క్రిక్కిరిసి వున్నాయి. కొంపలన్నీ వికృతంగా, ఇది మా నిజరూపం అన్నట్లుగా వున్నాయి. ఓ పెద్ద వృక్షం కట్టెల అతడిమీద పడింది. ప్రాణాపాయం ఏమీ జరగలేదని తెలిసింది.
   
    దారంతా చీదరగా, భీబత్సంగా వుంది. మెల్లిగా నడిచి సినిమాహాలు దగ్గరకు వచ్చాడు. "ఈరోజు మూడు ఆటలు" అన్న బోర్డు ముఫ్ఫై పగుళ్ళు పడినా, గోడనున్న మేకుకే యింకా వ్రేలాడుతోంది.
   
    కొన్నాళ్ళక్రితం ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు మరణించాడు. ఆ రోజుణ యీ సినిమాహాలు ముందు ఓ మహా సంగ్రామంలాంటిది జరిగింది.
   
    ఆఫీసులూ, షాపులూ మూసివేయించటానికి కంకణంకట్టుకున్న ఓ మూక రెండింటికీ అక్కడకు చేరింది.
   
    "సినిమాహాలు మూసివెయ్యాలి" అని ఓ దేశభక్తుడు అరిచాడు. ఉత్తప్పుడు అతన్నంతా రౌడీ అని పిలుస్తారు.
   
    హాలు యజమాని ఆజానుబాహుడు. గేటులో ఎదురుగా నిల్చున్నాడు.
   
    "మూసివేయడానికి వీలులేదు" అని అరిచాడు.
   
    "ఇవాళ హర్తాళ్."
   
    "నిన్ననే కొత్తసినిమా వచ్చింది. మా కలెక్షన్ పోతుంది."
   
    "పోతే పోనియ్యి."
   
    "అవును నీ సొమ్ము కాదుగా."
   
    "నోరు ముయ్యి హాలు మూస్తావా, ముయ్యవా?"
   
    ఆరోజు ఉదయమే దగ్గర ఊళ్ళో మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్ ని ప్రజలు పట్టుకుతన్నారని యిక్కడ చెప్పుకున్నారు. షాపుకార్లంతా భయంతో దుకాణాలు మూసివేశారు. కాఫీ హోటళ్ళు మూయించడానికి పూనుకున్న ఓ లీడరు కాకా హోటల్లో రహస్యంగా టీ త్రాగాడు. ఆవేశపూరితులైన ప్రజలు హాలు యజమానిని తన్నటానికి సంసిద్దులౌతున్నారు.

 Previous Page Next Page