Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 39


                                 12


    మహేష్ కూ, హరిణికీ పెళ్ళి జరిగిపోయింది.
    అది లవ్ మేరేజ్ అనటం కన్నా లవ్లీ మేరేజ్ అనటం సమంజసం.
    మెడికల్ కాలేజ్ స్టూడెంట్సంతా అటెండయ్యారు. ప్రొఫెసర్లూ, హాస్పటల్లో డాక్టర్లూ, సిస్టర్లూ_ అంతా వచ్చారు. ఒక్క స్టూడెంట్ కూడా హాజరవకపోవటం చేత ఆరోజు మెడికల్ కాలేజికి సెలవిచ్చేశారు. చాలా హాయిగా, నవ్వులతో ఛలోక్తులతో_ ఓ వేడుకలా జరిగిపోయింది. రాజమండ్రి నుంచి సునంద కూడా వచ్చింది.
    "నాకు తెలుసు ఈ ఘటాలిద్దరూ గట్టివాళ్ళని. ఊరికే అలా టెస్ట్ పెట్టానంటే. ఎం.బి.బి.ఎస్. లో మిగతా సబ్జెక్ట్స్ తోబాటు యిదికూడా ఓ ఎగ్జామినేషన్....నేనంత మొండిగా వుండకపోతే మా హరిణి డాక్టరయ్యేదా" అని అర్జునరావుగారు మీసం మెలేశారు.


                           *    *    *


    ఇద్దరూ కలిసి హైదరాబాద్ లో ప్రాక్టీసు పెట్టారు.
    హరిణి అర్జునరావుగారిని తమతోబాటు వచ్చి వుండమంది.
    "వస్తాలేమ్మా. అవసరమైనప్పుడల్లా కబురుచేస్తూ వుండు. వచ్చి కనిపిస్తూ వుంటాను" అన్నాడాయన.
    తండ్రి ఒంటరితనాన్నే ప్రేమిస్తాడని తెలుసు. ఆయన డిసిప్లిన్ లో ఎంత ప్రేమ వుందో ఆమె అనుభవించి వుంది. కళ్ళల్లో తిరగబోయిన నీటిని అదిమిపెట్టుకుంది.
    మహేష్ కష్టపడి ఊరంతా గాలించి హాస్పటల్ కోసం ఓ బిల్డింగ్ అద్దెకు తీసుకున్నాడు.
    పదిహేను బెడ్స్ దాకా పడతాయి. రూమ్సన్నీ నీట్ గా, కుదురుగా వున్నాయి.
    ఇద్దరికీ రెండు కన్సల్టేషన్ రూమ్స్ విడివిడిగా అమర్చాడు.
    "ఇదిగో, యిది నా కన్సల్టేషన్ రూమ్. ఎదురుగా వున్నది నీది. కొంచెం తలకాయ వంచి చూస్తే నాకు నువ్వు, నీకు నేను కనిపిస్తూ వుంటాము" అన్నాడు మహేష్.
    "మనిద్దరికీ వేరువేరు కన్సల్టేషన్ రూమ్స్ దేనికి? ఒకటి చాలదా?" అన్నది హరిణి.
    అదేమిటి? నీకోసం వచ్చే లేడీ పేషెంట్స్ నాకోసం వచ్చే పేషెంట్సు వేరువేరుగా వుంటారు. ఎవరి రూమ్స్ వారికి విడివిడిగా లేకపోతే ఎగ్జామిన్ చెయ్యటమెలా?" అన్నాడు మహేష్.
    "నా కేసులు కూడా నువ్వే ఎగ్జామిన్ చెయ్యి. నేను కూచుని నిన్ను చూస్తూ వుంటాను" అంది హరిణి.
    "లేడీ పేషెంట్లు నాతో ఎలా ఎగ్జామిన్ చేయించుకుంటారు? అందులో పి.వీ. అదీ."
    "ఎందుకు చేయించుకోరు? మహ చక్కగా చేయించుకుంటారు. అందులో ఇప్పటిరోజుల్లో ఆడవాళ్ళు ఇలాంటివి కేర్ చెయ్యరు."
    "మరి నువ్వేం చేస్తావు?"
    "చెప్పానుగా నిన్ను చూస్తూ కూర్చుంటానని."
    "హరిణీ! ఎందుకలా మాట్లాడుతున్నావు? యూ ఆర్ ఎ డాక్టర్"
    "డాక్టరయితే ప్రాక్టీస్ చెయ్యాలని ఎక్కడుంది? మహేష్! నేను డాక్టరయింది నిన్ను పొందటం కోసం. ఎప్పుడయితే నిన్ను పొందానో అప్పుడే నా బాధ్యత తీరిపోయింది. ప్రతి నిమిషం నిన్ను స్మరిస్తూ, నీ నామం గుండెల్లో పదిలపర్చుకుంటూ ఓ తపస్సు, ఓ మహాయజ్ఞం పూర్తిచేశాను. ఇక నావల్ల కాదు. నిన్ను చూసుకుంటూ, నీ ఒడిలో తల దాచుకుంటూ సంవత్సరాలు నిమిషాల్లా గడిపేస్తాను."
    "అవన్నీ ఇంట్లో ఉన్నప్పుడు. హాస్పటల్లో నువ్వు బుద్ధిగా డాక్టర్ డ్యూటీ చేస్తోంటే ఇంకా ఇంకా ప్రేమిస్తాను."
    "నిజమా?"
    మహేష్ నిజాయితీగా తల ఊపాడు.
    "అయితే కొన్ని షరతులు. హాస్పటల్లో వీలున్నప్పుడల్లా నువ్వు నాతో మాట్లాడుతుండాలి."
    "అలాగే."
    "నువ్వు డాక్టరువైనావు కాబట్టి రోజురోజుకూ సొసైటీలో నీ స్టేటస్ పెరుగుతూ వుంటుంది. నన్ను విడిచి మీటింగులకూ, విందులకూ వెళ్ళకూడదు."
    "అలాగే."
    "మన హాస్పటలూ, ఇల్లూ కలిసివుంటే పేషెంట్స్ వచ్చి ఎప్పుడూ డిస్టర్బ్ చేస్తూ వుంటారు. మనం వుండటానికి వేరే ఇల్లు తీసుకుందాం."
    "అలాగే. అలాగే."
    హరిణి గభాల్న ముందుకువచ్చి అతని పెదవులమీద ముద్దు పెట్టుకుంది.
    "అయితే నేను తప్పకుండా హాస్పటల్లో పనిచేస్తాను."


                             *    *    *


    ప్రాక్టీసు మొదలుపెట్టారు. హరిణి కావాలని చాలా లేజీగా ప్రవర్తించేది. తాను సిన్సియర్ గా వుంటే పేషంట్సు ఎక్కడ ముసురుకుంటారోనని ఆమె భయం. ఏమాత్రం అవకాశమొచ్చినా కేసులు అక్కడికీ ఇక్కడికీ రిఫర్ చేయటానికి ప్రయత్నించేది.
    "ఇదిగో నీది హార్ట్ కేసు, హార్ట్ ఎటాక్. చాలా సీరియస్. ఈ కేసు బాగా ట్రీట్ చెయ్యాలంటే యి.సి.జి. మానిటర్ అన్నీ వుండాలి. నా దగ్గర అలాంటి ఎక్విప్ మెంట్ ఏదీలేదు. ఇక్కడుంటే కేసు సీరియస్ అవటానికి అవకాశముంది. హార్ట్ కేసు సీరియస్ అవటమంటే తెలుసుగా అందుకని కార్డియాలజిస్టుకి లెటర్ రాసిస్తాను. ఏమ్మా!" అని గబగబ ఉత్తరం రాసి పంపించేసేది.
    "అమ్మో! యిది ఎపెండి సైటిస్. వెంటనే ఆపరేషన్ చేసెయ్యాలి. లేకపోతే ప్రమాదం. నేనా కొత్తగా ప్రాక్టీస్ పెట్టాను. ఆపరేషన్ చేశాననుకో కేసు గల్లంతయిపోవచ్చు. అందుకని ఓ సర్జన్ కి రిఫర్ చేస్తున్నాను. వెంటనే వెళ్ళి చూపించుకోండి" అని వాళ్ళు వెళ్ళిపోగానే హాయిగా ఊపిరి పీల్చుకునేది.
    "ఇది చూశారా? డిహైడ్రేషన్ కేసు. అందులో నెలల పిల్లవాడు. వెయిన్ దొరకటం కష్టం. స్కాల్ప్ వెయిన్ తో సెలైన్ స్టార్ట్ చెయ్యాలంటే డీప్ సెడేస్ న్ యివ్వాలి. అంత యిచ్చినా పిల్లవాడు అటూయిటూ గింజుకుంటూ వుంటాడు. బెల్ట్ లు వేసి కాళ్ళు చేతులూ గట్టిగా కట్టెయ్యాలి. లేకపోతే ఓపెన్ మెథడ్ లో వెయిన్ కట్ చేసి పెట్టాలి. నేనా? కొత్తగా ప్రాక్టీస్ పెట్టాను. వెయిన్ సరిగా కట్ చెయ్యలేకపోయాననుకో కేసు గోవిందా? అందుకని ఈ కేసు పిడియాట్రిషన్ దగ్గరకు వెంటనే....చాలా వెంటనే తీసుకువెళ్ళండి."
    "హమ్మయ్య" అని వాళ్ళు వెళ్ళిపోయాక కుర్చీలో వెనక్కివాలి కూర్చునేది.

 Previous Page Next Page