సావిత్రి మెట్లకేసి చూస్తూ నిల్చుంది కళ్ళప్పగించి. ఆమె చెవిలో ఏదో స్వరం "సావిత్రీ! ఒకసారి ఆలోచించి చూడు ఇందులో నీ పాత్ర ఏమయినా ఉందా?" అన్నది.
"లేదు లేదు" అనుకుంది సావిత్రి నిశ్చలచిత్తంతో.
14
"అక్కా! ఓ చిక్కులో పడ్డానే" అంది ఓ సాయంత్రం సుజాత అనురాధతో.
అనూరాధ లేసు అల్లుకుంటోంది. "ఏమిటా చిక్కు?" అంది తల ఎత్తి.
"ఒక యువకుడు నన్ను ఊపిరి సలపనివ్వటం లేదు."
"ఎవరు? ప్రభాకరమా?"
"కాదే అక్కా!" అంది సుజాత నిట్టూర్చి విచారంగా. "అతన్ని నువ్వెప్పుడూ చూడలేదు. పేరు చంద్రం అతనిది ఈ ఊరుకాదు. బిజినెస్ మీద ఈ ఊరు వస్తుంటాడు. నాకోసం కూడా వస్తున్నట్లు అనుమానం."
"బాగా డబ్బున్నవాడా?"
సుజాత తల ఊపి "అనుకుంటాను. అతన్నెప్పుడూ అడగలేదు. మొదటిసారి హైదరాబాద్ లో కలిశాడు. అప్పుడు జానకిరాం అతన్ని బాగా అవమానించి పంపించేశాడు. మేష్టర్ విషయం తెలుసుగా! కళ విషయం తప్ప నాతో వేరే ఎవరైనా మాట్లాడితే అతను సహించలేడు. ప్రభాకరం నటన్ని మెచ్చుకున్నా, యీ విషయంలోకి వచ్చేసరికి మంట. ఏం చెయ్యనే అక్కా! అబ్బా! ఏమిటే ఈ మగవాళ్ళు ఎందుకిలా చేస్తారు మనల్ని?" అంది దీనంగా.
అనూరాధ చేస్తున్న పనిని ఆపి "ఎందుకే నీకంత కంగారు? ఇవాళైతే నా దగ్గరకు ఫిర్యాదు చేస్యడానికి వచ్చావ్? అదివరకు ఎంతమంది ప్రేమల్ని తిరస్కరించలా?" అంది నవ్వుతూ.
సుజాత సిగ్గుపడుతూ "అలా కాదులేవే ఈ విషయం తేడా వుంది."
"ఏమిటి తేడా? అందగాడా ఆ చంద్రం?"
"నువ్వే చూడు అక్కయ్యా నాకేమే తెలియదు. ఎంతమందితోనో కఠినంగా మాట్లాడాను. అతన్తో మాట్లాడలేకపోతున్నాను. బెజవాడనుంచి యివాళ ఉత్తరం రాశాడు. ఎంత చక్కగా రాస్తాడనుకున్నావ్ ఉత్తరాలు?" అంది సుజాత.
"ప్రభాకరం నిన్ను ప్రేమిస్తున్నాడు. తెలుసా?" అనడిగింది అనూరాధ.
సుజాత బాధగా తల ఊపింది. ఆమెలో అవ్యక్తమైన ఆలోచనలు ఎన్నో చెలరేగాయి "నేను నాటకాల్లో వెయ్యనే" అంది అక్కదగ్గరకు వెళ్ళి కూర్చుని.
"ఏమలా?"
"ఈ పరీక్ష నేను భరించలేకుండా వున్నాను. జానకిరాం ఎంత తెలివైనవాడో అంత కఠినుడు. కోపంకూడా ఎక్కువ. ఒక్కొసారి కొట్టినంత పని చేస్తాడు. నేను నటించడం కోసం అనుకుంటాను. అప్పుడెప్పుడూ మళ్ళీ కాసేపటికే విరక్తి పుడుతూ వుంటుంది. ఏదో సంఘర్షణ నాలో నేను అతీతురాలిని కానని నాకనిపిస్తూ ఉంటుంది. చాలా సామాన్యురాలిని, గాలికి కొట్టుకు పోయేదాన్ని."
అనూరాధ కొంచెం కోపంగా "నీ భవిష్యత్ ని చేతులారా నాశనం చెసుకుంటావా వెర్రి ఊహల్తో?"
"ఏమిటా భవిష్యత్?"
"ప్రపంచంలో ఏ లక్షకు ఒకరికో తప్ప ఏ సినిమా తారకూ లేని అందం నీకు ఉంది. నాటకరంగంలో ఏ నటీమణి సృష్టించలేని వాతావరణం నువ్వు సృష్టించావు నీతో ఓ కొత్తశకం ఆరంభం కాసాగింది. అయిదేళ్ళ జానకిరాం అన్వేషణలో లభించిన అమూల్యరత్నానివి నువ్వు కీర్తికోసం, ఆశయంకోసం తనని తాను త్యాగం చేసుకోవటం కళాహృదయ ధర్మం."
సుజాత "ఎంత పేరు సంపాదించినా, పైకి వెళ్ళినా నేను నటీమణినే" అంది పొడిగా.
"నీ ఉద్దేశం...?"
"నాటకాలలో స్త్రీ పాత్ర లేకపోతే నిండుతనం లేదు. స్త్రీ నటించకపోతే జనం అంతగా హర్షించరు. కళను గురించి అంత ఉపన్యాసాలు దంచుతారు. ఆమె వ్యక్తిగత జీవితంపట్ల మాత్రం ఎవరికీ సదభిప్రాయం ఉండదు. గౌరవమూ లేదు. నాటకాల్లో వేసే అమ్మాయి అంటూ తేలికదృష్టితో చూస్తారు. పాడుచేయడానికి రకరకాల ఉపాయాలు పన్నుతారు. ఆమెను తాకటం అసలేమీ తప్పుకాదన్నట్టు కూడా ప్రవర్తిస్తారు" అంది సుజాత ఆవేశంతో.
"కానీ నీ స్థితి వేరు సుజా! కొద్దికాలంలోనే ఎవరూ నిన్ను సమీపించలేని కొండశిఖరాన్ని నువ్వు చేరుకుంటావ్."
"కానీ అక్కా! ఈ దీక్ష, సాధన, ఏకాగ్రత చివరికి విపరీత పరిణామాలకే దారి తీస్తాయేమో? ఓ సామాన్యురాలికి అందుబాటులో వున్న శాంతి సుఖాలు తనకు దుర్లభమేమో? అందుకే అక్కా ఈ నటులందరూ కొంతకాలం పోయాక గార్హస్థ్య జీవితంమీద మోజు చూపుతారు."
అనూరాధ కొంచెం విసుగ్గా "సరేలేవే నీవన్నీ వెర్రి వెర్రి ఆలోచనలు. ఆనాడు జానకిరాం వచ్చి అడిగినప్పుడు బాగా యోచించమని నేను చెప్పిన మాట త్రోసిపుచ్చి, ఎగిరిగంతేసి ఒప్పుకుంది నువ్వే గుర్తుందా?" అంది.
సుజాత ముఖం సిగ్గుతో ఎర్రబడి మరింత మనోహరంగా తయారయింది. ఏదో జవాబు చెప్పబోతోంది. ఇంతలో బయటనుంచి ఓ మనిషివచ్చి రిహార్సల్స్ కి అంతా తయారుగా వున్నారని బయల్దేరతీశాడు. "వస్తానక్కా" అని అతనితో బయటకు వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళేసరికి అప్పటికే అంత తయారుగా వున్నారు. ఆరు దాటుతోంది. వాళ్ళు కూర్చున్న హాలంతా మనుష్యులతో సందడిగా వుంది. గోడ దగ్గరగా వేయబడ్డ ఓ కుర్చీలో జానకిరాం కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు. ప్రక్కన నూతనాగంతకుడు ఆసీనుడై వున్నాడు. "రా సుజాతా!" అని ఆప్యాయంగా ఆహ్వానించాడు జానకిరాం. "ఈయన కొత్తగా సినిమా తీద్దామనుకుంటున్నారు, హీరోయిన్ గా నిన్ను బుక్ చేసుకుందామని వచ్చారు."
సుజాత ఆయనకు వినయంగా నమస్కారం పెట్టి ఎదురుగా నిల్చుంది.
"అవునమ్మా!" అని ఆయన తను తీయబోతున్న పిక్చర్ ని గురించి వివరాలు, తన బహారీ ఎత్తు ప్రయత్నాలూ చెప్పసాగాడు. అంతా ఆసక్తి లేకుండానే విని "నాదేముంది?" అంది సుజాత.
"నీ ఉద్దేశం నాకర్ధమయింది సుజాతా! ఈ విషయంలో నేను జోక్యం కలిగించుకోను. నీ భవిష్యత్ ని గురించి నిర్ణయించుకునే అధికారం నీకుంది. నువ్వు సినిమా లోకంలో కాలు పెట్టదలిస్తే నేనెట్టి అభ్యంతరమూ చెప్పబోను" అన్నాడు జానకిరాం.
ఆ మాటల్లోని అంతరార్ధం సుజాతకు తెలుసు "నేను రాలేనండీ" అంది మృదువుగా.
వచ్చిన మనిషి ఎంతో నచ్చచెప్పటానికి ప్రయత్నించి, విఫలుడై ముఖం యింత చేసుకుని వెళ్ళిపోయాడు. జానకిరాం ఆ విషయంగురించి ప్రస్తావించలేదు. రిహార్సల్స్ మొదలయింది.
ఇది కొత్తనాటకం. ఇదికూడా జానకిరామే రాశాడు. నెలరోజులు బయట ప్రపంచాన్ని మరచి ఏకదీక్షగా స్క్రిప్ట్ తయారుచేశాడు. 'చూడు సుజాతా!' నిన్నో కొత్త వ్యక్తిని చేస్తాను" అనేవాడు. దీన్నిగురించి యిద్దరుముగ్గురుకొత్త ముఖాల్నికూడా తీసుకురావటం జరిగింది. ఈ నాటకాన్ని తీసుకుని ఆంద్రదేశమంతా, వీలయితే దేశంలోని ముఖ్యమైన నగరాల్లోకూడా ప్రదర్శించాలని ప్రయత్నం అన్ని రోజులు తిరగడానికైతే తన కూతురికి వీలుకాదని ఓ చిన్ననటి తల్లి తనకూతుర్ని పంపించడం మానేసింది. మేము వస్తామంటే మేమని కొత్తవాళ్ళు చాలామంది ఉత్సాహంగా ముందుకువచ్చారు. ఒకరికి తప్ప మిగతావాళ్ళకి ఛాన్సు రాకపోయేసరికి కోపంవచ్చి తిట్టుకుంటూ పోయారు.
రిహార్సల్స్ ముగిసేసరికి తొమ్మిదిన్నర దాటింది. సుజాతను ఇంటిదగ్గర దింపడానికి ప్రభాకరం బయల్దేరాడు. అక్కడికి ఆమె యిల్లు ఓ మైలుకి పైగా దూరం ఉంది. నడిచే పోసాగారు యిద్దరూ.
ప్రభాకరం కొంచెం ఆస్తి వున్నవాడు. అతనికి నాటకాల పిచ్చి జాస్తి. అందుకని ఉద్యోగ ప్రయత్నాలు చెయ్యకుండా ఇందులోనే పడి తిరుగుతున్నాడు.
"ఒక మనిషిని ఆరాధించడం, చూస్తూ తన్మయుడు కావటం, ప్రక్కన నటించి వింత అనుభూతి పొందటం యిదేనా జీవితమంటే?" అన్నాడు ప్రభాకరం.
"అది చాలదా?" అంది సుజాత నవ్వుతూ.
"ఉహు. అది చాలదు. నాకేకాదు, ఆ విషయం నీక్కూడా తెలుసు. నాక్కావలసింది నీతో నటించడం కాదు.....నువ్వు"
సుజాత కన్నులు పెద్దవి చేసి "ఏం చేయమంటావు నన్ను.... ఒట్టి బొమ్మని" అన్నది.
"ఆ బొమ్మతో ఆడుకుంటాను."
"నువ్వు గొప్ప యాక్టర్ వి. స్టేజిమీద నీ డైలాగులు విని విని విసిగిపోయాను. అంది సుజాత నీ మాటల్ని ఎలా నమ్మేది?" అంది సుజాత.