కొత్త యింటికి మారదాం అనగానే మోహన్ గొడవపెట్టాడు. వెళ్ళేటట్లయితే తమతోపాటు వుంటున్న తమ్ముడి కుటుంబాన్నీ తీసుకెళ్ళాలని అతడి వాదన. రాహ ససేమిరా అంది. ఒకసారి మొదలయితే అదలా కొనసాగుతూనే వుంటుందని ఆమెకు బాగా తెలుసు.
"ఎప్పుడయినా ఓ వందో, రెండువందలో కావాలంటే సాయం చేద్దాం. వాళ్ళు విడిగా వుండడమే మంచిది" అంది.
"డబ్బు సంపాదిస్తున్నానని ఎంత అహం నీకు! వాళ్ళకు కావలసింది డబ్బుకాహ్డు మన ఆసరా. ఏదో చిన్న ఉద్యోగంతో అవస్థ పడుతున్నాడు. ఈ సమయంలో వొంటరిగా వదిలేస్తే ఇబ్బంది పడతాడు. నీకు నేనున్నానని చెప్పి తీసుకొచ్చాను. ఇప్పుడు నా సుఖం చూసుకు వెళ్ళిపోతే నలుగురూ ఏమనుకుంటారు?"
"నీకు నీవాళ్ళ గురించి తప్ప నా గురించి, మన పిల్లల గురించి ఆలోచన రాధా? వాళ్ళని తీసుకొచ్చావు కాదనలేదు. అతడికి ఉద్యోగం దొరికింది వాళ్ళ బ్రతుకు వాళ్ళని బ్రతకనీ".
"నాకంత స్వార్ధంలేదు. ఇల్లు పెద్దదేగా, వాళ్ళుంటే నీకేం ఇబ్బందని?"
"అందులో రెండు గదులు అద్దెకు ఇస్తున్నాను".
మోహన్ కోపంగా చూశాడు. "అయితే నన్ను ఒక్కమాట అగడాల్సిన అవసరం లేదన్నమాట నీ ఇల్లు కదూ? వెళ్ళు, వెళ్ళి ఒక్కదానివీ సంతోషంగా బ్రతుకు" అని కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. ఆమె అలాగే కూర్చుండిపోయింది.
స్కూలు నుంచి వచ్చిన పిల్లలకు బట్టలైనా మార్చదు తోడికోడలు ఓ ఐదువందలు ఇంట్లో ఇచ్చేయగానే మరిది బాధ్యత తీరిపోయిందనుకుంటాడు. ఇక పిల్లల బాధ్యత మొత్తం అనూరాధదే. "ఇంట్లో పళ్ళేమీలేవు. వచ్చేటప్పుడు అరటిపళ్ళు కొనుక్కురా అక్కయ్యా యాపిల్స్ కూడా బాగా దొరుకుతున్నాయట కదా? ఓ అరడజను తీసుకురా అలాగే బిస్కెట్లు కూడా" అని తోడికోడలు ఆజ్ఞాపిస్తుందామెను. ఆఫీస్ నుంచి చచ్చీచెడీ పనిచేసివస్తే పిల్లలు పాలుకూడా తాగివుండరు. భార్యాభర్తలిద్దరూ ఏ షికారుకో వెళ్ళి వుంటారు. ఉదయం వెళ్ళే లోపల అన్నీ చేసిపెట్టి వెళ్ళాలి. వచ్చీరాగానే అన్ని పనులు చేసుకోవాలి. ఎందుకు ఇలాంటివాళ్ళ కోసం కష్టపడటం? తను స్వార్ధపరురాలే! అయితే తన హక్కులకి సంబంధించినంతవరకు మాత్రమే స్వార్ధపరురాలు!!
అనూరాధ ఇల్లంతా కలయచూసింది. ఆ ఇంట్లో ప్రతి చిన్న వస్తువూ తను కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నవే. అంతా తీసుకుపోయినా అడిగే హక్కు ఎవరికీ లేదు. అయినా అవసరమైన వస్తువులు మాత్రం సర్దుకుంది.
"మొగుడి మాట వినకుండా ఎదురు తిరగడం మా ఇంతా వంటా లేదు. నాలుగు తన్నినా నోరు మూడుకుని కాపురం చెయ్యాల్సిందే. మంచి సంబంధాలు ఎన్ని వచ్చినా కాదని చేసుకున్నందుకు మంచి పాఠమే నేర్పుతుంది" అత్తగారు సణుగుతోంది.
"కలో, గంజో తాగి భర్తతో వుండాలి తప్ప విడిగాపోయి పంచభక్ష్య పరమాన్నాలు తినే ఆశ ఆడవాళ్ళకు వుండటం మొదటిసారి చూస్తున్నాం-" తోడికోడలు తనలో తనే పైకి అంటోంది.
సామానులు ట్రక్కులో వేస్తోంటే వచ్చాడు మోహన్. జరుగుతున్నదంతా చూసి అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.
"పోతే పో- పిల్లల్ని మాత్రం ఇవ్వను. ఏ కోర్టుకెళతావో చూస్తాను" అని అరిచాడు. రాధ ఒక్కక్షణం అతడివైపు కన్నార్పకుండా చూసింది. యుగయుగాలుగా ఈ పురుషాహంకారం తగ్గదా? ఇద్దరాడవాళ్ళూ ఆ పురుషుడినే సపోర్టు చేయటం ఏ లాజిక్కూ అర్ధం చెప్పలేని నగ్నసత్యం.
పిల్లలను అడ్డు పెట్టుకుని తనను అణచాలని చూస్తున్నారు. అది ఆమె ముందుగా వూహించిందే. ఆమె లొంగలేదు.
"పోనీ మీ పిల్లలను మీరు జాగ్రత్తగా పెంచుకోండి. నేను పోతున్నాను" అంది కామ్ గా. ఆ జవాబు బాంబులా పేలింది. భయంకరమైన నిశ్శబ్దం.
వాళ్ళు ఈ సమాధానం వూహించలేదు. అవాక్కయి చూస్తూ వుండిపోయారు.
* * *
కొత్త ఇంట్లో మొదటిరాత్రి ఏడుపుతో గడిచింది. వారంరోజులు అంత పట్టుదలగానూ నిలబడగలిగింది. వారం తర్వాత చిన్నదాన్ని తీసుకొచ్చాడు మోహన్.
"నీకంటే ఏ దిగులూలేదు. చక్కగా ఉన్నావు. అదేమో నీకోసం బెంగపెట్టుకుని జ్వరం తెచ్చుకుంది" అంటూ వదిలేసి వెళ్ళాడు. మరో వారం తిరక్కముందే పెద్దపాపని కూడా పంపేశాడు.
"నువ్వేమో కనిపారేశావు. పోషించాల్సింది మేమా?" అన్నాడు.
తన పరిస్థితులకు అనుగుణంగా కొత్త వాదనలు నిర్మించుకోవటం మనిషికి కొత్తకాదని మొన్నేగా అనుకొంది. ఏది ఏమైతేనేం రాధ తృప్తిగా నిట్టూర్చింది. మోహన్ ఇప్పటికయినా వచ్చేస్తే క్షమించడానికి సిద్దంగా వున్నదామె.
"అమ్మా, నాన్నగారు వెరీబాడ్! నన్ను రోజూ కొట్టేవాడు. పిన్ని సరిగ్గా అన్నం కూడా పెట్టేదికాదు. నేను అడిగినా పెట్టేదికాదు. మనం అక్కడకు వెళ్ళొద్దు" అంది మల్లిక.
"అత్తయ్య కూడా నన్ను రోజూ కొట్టేది" అంది రోజా జాలిగా.
"ఇంకేం ఫర్వాలేదమ్మా! ఇకనుంచీ మీకేం కావాలన్నా నేను తెచ్చిపెడతాను" అంటూ కన్నీళ్ళతో గుండెలకు హత్తుకుంది. తనెంత (పైకి కనబడే) స్వార్ధపరురాలు!
అనుకున్నట్లుగానే కొద్దిరోజులకు మోహన్ వచ్చాడు. ఏదో కబుర్లు సమర్ధింపులూ చెప్పాడు. ఉండిపోతానన్నాడు. ఇకనైనా సక్రమంగా వుంటే బావుండనుకుంది. రెండురోజులు సరిగానే వున్నాడు. ఆ మర్నాడు రాధకి జీతం రాగానే ముందు బ్రతిమలాడి, తరువాత దెబ్బలాడి, కొంత డబ్బు తీసుకుని వెళ్ళాడు.
రోజు రోజుకీ అతడు తాగుబోతుగా, జూదరిగా మారుతున్న విషయం ఆమెకు తెలుస్తూనే వుంది. భార్య ప్రవర్తనతో విసిగిపోయి అతడలా తయారవుతున్నాడని అత్తగారు అందరి దగ్గరా చాటింపు వేస్తుంది.... చిత్రం చాలామంది నమ్ముతున్నారు.
డబ్బు కావాలనుకున్నప్పుడల్లా రావడం, గొడవచేసి అవసరం అనిపిస్తే తన ఎదురుగానే పిల్లల్ని కొట్టి, సాధించి, డబ్బులు తీసుకెళ్ళడం అలవాటైపోయింది మోహన్ కి.
సునీత వచ్చి ఇల్లు అద్దెకి అడిగినప్పుడు తనకు తోడుగా వుంటుందని, బాగా తెలిసిన అమ్మాయనీ, రెండు గదులు అద్దెకు ఇచ్చేసింది. ఆమె జీవితంలో అదో మలుపు పుస్తకాలమీద అభిరుచి ఆ ఇద్దర్నీ దగ్గరికి చేర్చింది. విశ్వం సునీతకోసం ఆ పోర్షన్ కి వచ్చేవాడు. అతడికి పఠనాభిరుచి వుంది.
క్రమేణా విశ్వం ఆ ఇంటికి తరచు రావడం సాగించాడు. గంటల తరబడి కూర్చుని పుస్తకాల గురించీ, ఆచార వ్యవహారాల గురించీ మాట్లాడుకునేవారు.
అప్పుడప్పుడు మోహన్ రావడం, డబ్బుకోసం గొడవ చేయడం కాస్త అలజడి కలిగిస్తున్నా, విశ్వం సునీతల స్నేహంలో త్వరగానే కోలుకుంది రాధ.
కానీ విశ్వం మనసే ప్రస్తుతం బాగోలేదు. జీవితంలో మొదటి సారిగా 'ప్రేమ' అంటే ఏమిటో తెలుస్తోందతనికి, కళ్ళు మూసినా, తెరిచినా రాధ రూపమే కనిపిస్తుంది. ఆమెను చూడలేకపోతే రోజు గడిచేలా లేదు. జయతో పెట్టుకున్న సంబంధం లాంటిది కాదిది. ఆమెను చూడాలి, కాసేపు మాట్లాడాలి. అప్పుడే తృప్తి అంతకుమించి మరేం అవసరం లేదనిపిస్తుంది. కాని రాధకా విషయం చెప్పాలంటేనే భయం. ఆమె నిస్సహాయతను ఆధారంగా చేసుకుని తనుకూడా ఓ అవకాశం కోసం చూస్తున్నాడనుకుంటుందేమోనని భయపడ్డాడు.
అనూరాధకు విశ్వంలో నచ్చిన విషయాలు మరో రెండున్నాయి.
"అందరిలాగా" అతడు ఆమె భర్తని తిడుతూ ఆమెకు దగ్గరవ్వాలని ప్రయత్నించడు. మోహన్ ని దారిలోకి తీసుకురావడం సాధ్యపడుతుందేమోననే ఆలోచిస్తాడు.
"నాకు మోహన్ మీద కోపం రావడం లేదు. నీ మీద సానుభూతి చూపించాలనీ లేదు. అతడిమీదే జాలి కలుగుతుంది. నీలాంటి భార్యను పొందీ అతడు జీవితాన్ని సుఖమయం చేసుకోలేకపోతున్నాడు" అనేవాడు. అతడికి స్త్రీలపట్ల గల గౌరవాన్ని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపడేది. సాధారణంగా మగవాళ్ళు తనలాంటి స్త్రీల గురించి ఉన్నతంగా ఆలోచించరు. ఆలోచించినా పైకి చెప్పరు.
మన ఆచారాలూ, మనం గొప్పగా చెప్పుకునే సంస్కృతీ మన స్త్రీలను అధమస్థితిలోకి తోసేశాయి. భార్య విద్యావంతురాలయితే ఎక్కడ తన అహానికీ, స్వార్ధానికి అడ్డుపడుతోందోనని ఆ అవకాశమే లేకుండా చేశాడు మొగవాడు. భర్త చేతిలో ఎలాంటి హింసనైనా భరించి అతడిని పూజించే స్త్రీయే గౌరవనీయురాలన్నారు పెద్దలు. చాలా పటిష్టమయిన సామాజిక వ్యవస్థ ఇది-అదే అన్నది ఆమె సునీతతో.
"కాని స్త్రీకి పురుషుడి కంటే ముందుగా మరో స్త్రీయే శత్రువవుతోంది కదా?" అని అడిగింది సునీత. దానికి విశ్వం జవాబు ఇచ్చాడు.
"తరతరాలుగా అజ్ఞానంలో వొగ్గడంవల్ల వచ్చిన అనర్ధమిది. తనోబానిసనని, పురుషుడు తనకన్న అన్ని విధాల గొప్పవాడని ఆమె రక్తంలో జీర్ణించుకుపోయింది. పైకి చెప్పకపోయినా 'కొడుకు పుట్టాడు' అనగానే ఆమె చాలా సంతోషిస్తుంది. తనలాంటి 'అబల' మరొకటి జన్మించలేదని సంతోషపడుతుంది. ఎంత విజ్ఞానవంతురాలయినా కూతుర్నీ, కొడుకునీ పెంచే విధానంలో తేడా చూపిస్తుంది. ఆ విధంగా తల్లే బిడ్డకు శత్రువవుతోంది. ఇన్ని తరాలుగా పాతుకుపోయిన ఈ అభిప్రాయాలు ఒక్కసారిగా తొలగిపోవు. ఇది సంధియుగం ఇప్పటికే కొంత మార్పు వచ్చింది. త్వరలోనే స్త్రీ బానిస విధానాన్ని విడనాడి నిజమైన స్వాతంత్ర్యాన్ని సాధించుకుంటుంది-ఇది మాత్రం తథ్యం".