Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 36


    ఎప్పుడూ తెల్లవారుఝామునే నిద్రలేచే స్నేహితుడు ఏడయినా లేవకపోయేసరికి "ఒరేయ్! కాలేజీకి టైమవుతోందిరా? లేచి తయారవవూ?" అంటూ చంద్రం గట్టిగా తట్టిలేపాడు.
    మహేష్ లో చలనం లేదు. ఏదో అనుమానమొచ్చి ప్రక్కకి చూసిన చంద్రానికి ఖాళీగావున్న డైజిపాం టాబ్లెట్స్ స్ట్రిప్స్ కనిపించి గుండె గుభేలుమంది.
    చంద్రం శరీరంలోని నరాలన్నీ ఒక్కసారిగా వొణికి పోయాయి.
    "ప్రేమలో పడ్డాడు. శపథాలు చేశాడు. ఇలా కొంప ముంచుతాడని అనుకుంటూనే వున్నా." అంటూ గగ్గోలుపడిపోయి యిప్పుడేం చెయ్యాలా అని ఆలోచించసాగాడు. ఎక్కడకు తీసుకెళ్ళాలి? గవర్నమెంట్ హాస్పటల్ కు తీసుకెళితే? అసలే మెడికల్ స్టూడెంట్ అల్లరవుతుందేమో. హరిణి దగ్గరకు వెళితే? ఆ అమ్మాయి బెంబేలుపడిపోతుందేమో. అసలు వీడి పరిస్థితెలా వుంది? తనకు కనీసం పల్స్ చూపడమైనా నేర్పాడు కాదు" అనుకుంటూ ఏంచెయ్యాలో తోచక గదిలో అటూఇటూ తిరుగుతూ కంగారు పడసాగాడు.
    ఉన్నట్లుండి "చంద్రా!" అని ఎవరో పిలిచినట్లయింది. ఉలికిపడి ప్రక్కకు తిరిగి చూశాడు మహేష్ కళ్ళువిప్పుకుని చూస్తున్నాడు.
    "వొరేయ్!?" అని ఒక్కగావుకేక ఆనందంతో పెట్టి ముందుకు ఉరకబోయి, అంతలోకే ఏదో అనుమానం తోచి ఆగిపోయి కళ్ళు పెద్దవిచేసి చూడసాగాడు.
    "ఏమిట్రా! అలా అనుమానంగా చూస్తున్నావ్? పిలిచింది నేనేరా?"
    "ను....వ్వే....నా?....?"
    "ఏమిట్రా అలా హడలిపోతున్నావు?"
    "ఎప్పుడూ చంద్రం అని పిలిచేవాడివి. చంద్రా అని పిలుస్తున్నావు."
    "అలా పిలిచానా? అయితే ఏమిటి?"
    "....గుత్తులు గుత్తులు నిద్రబిళ్ళలు మింగావు. ఇప్పుడేమో పేరు కొత్తరకంగా పిలుస్తున్నావు. అసలు నువ్వు...."
    "ఏరా? చచ్చిపోయి దెయ్యం మాట్లాడుతుందనుకుంటున్నావా?" అంటూ మహేష్ కోపంగా లేచి కూర్చున్నాడు.
    చంద్రం ఆశ్చర్యంగా చూస్తున్నాడు. మత్తూ, మగతా వగైరాలేవీ లేకుండా మహేష్ యాక్టివ్ గా, దృఢంగా కనిపిస్తున్నాడు.
    "ఒరేయ్! నువ్వా టాబ్లెట్స్ మ్రింగలేదా?"
    "మింగాను. మనసు బావుండక మింగాను. ఎంతకూ నిద్రపట్టకపోతే మింగాను. అంతేగాని ఒరేయ్ చంద్రా! చచ్చిపోవడం కోసం కాదురా. అసలు_ ఐ హేటిట్. బలవంతంగా చచ్చిపోవటాన్ని నేను అసహ్యించుకుంటాను. తీవ్రంగా వ్యతిరేకిస్తాను."
    "మనసు బావుండకపోవటం." చంద్రానికి అర్థమయింది. మహేష్ మీద ఎనలేని జాలికూడా పుట్టుకొచ్చింది.
    "అందుకే చెప్పానారోజు. ఇప్పుడు చూడిహ. నిద్రమాత్రలు, సిగరెట్లు బ్రాందీ తాగటం...."
    "ఛీ ఛీ. నేను సిగరెట్లూ, మందుకొట్టటంలాంటివేమీ చెయ్యను. నిద్రమాత్రలు వేసుకుని పడుకుంటాను."
    "అవి కూడా ఎక్కువయితే ప్రమాదంరా."
    "అంత ప్రమాదం ముంచుకొచ్చేటంత వేసుకోనురా. నేను కాబోయే డాక్టర్ని. ఎన్నెన్ని వేసుకుంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు."
    "కాబోయే డాక్టరివేగానీ_ఇలా టాబ్లెట్స్ కు అలవాటుపడితే నిద్రలో పడి పరీక్షలు ప్యాసు కాలేక ఎప్పటికీ డాక్టరివి కాకపోతే ఎప్పటికీ హరిణి నీకు దక్కదు."
    "అవునా?" అన్నాడు మహేష్ దిగులుగా.
    "అది ఒప్పందం."
    "మరి హరిణిని చూడకుండా వుండలేకపోతున్నాను.
    "ఆ సంగతి ముందు తెలుసుకుని వుండాల్సింది."
    "ఇలాంటివి ముందు తెలీవు."
    "ఆ మాట నిజమే" అని ఒప్పుకున్నాడు చంద్రం.
    "నేను హరిణితో మాట్లాడాలి."
    "కుదరదు."
    "ఉండలేకపోతున్నాను."
    మహేష్ ఆరోజు కాలేజికి వెళ్ళలేకపోయాడు. చంద్రం అతన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఇన్నేళ్ళ సహచర్యంలో స్నేహితుడు కాలేజి మానెయ్యటమెప్పుడూ చూడలేదు. అతన్ని చూస్తే చాలా దిగులుగా వుంటుంది. మునుపటికన్న చిక్కిపోయాడు. సరిగ్గా తిండికూడా తినటంలేదు.
    రెండురోజులపాటు అలోచించాక చంద్రానికి ఓ ఉపాయం తట్టింది. అతను పనిచేస్తోన్న ఫోటోస్టూడియో అన్నివిధాలా పుంజుకుని ఇప్పుడు చాలా మంచి స్థితిలో వుంది. ఈ మధ్య టి.వి.లూ, వీడియోలూ వచ్చాక వాళ్ళ స్టూడియోకి గిరాకి బాగా పెరిగింది. చంద్రంమీద అతని యజమానికి బాగా ఆదరణ, నమ్మకం ఏర్పడి వీడియోతో అవసరమున్న ప్రతి కార్యక్రమానికీ అతన్ని పంపించేవాడు. పెళ్ళిళ్ళ సీజన్ లో అసలు చంద్రానికి ఊపిరాడేదికాదు.
    ఆ సాయంత్రం "త్వరగా తెములు. నీట్ గా డ్రెస్ చేసుకో" అంటూ హడావుడి చేసేశాడు.
    "ఎక్కడకురా?"
    "చెబుతారా. ఊ త్వరగా బయల్దేరు."
    మహేష్ కు అర్థంకాకపోయినా, ట్రిమ్ గా డ్రెస్ చేసుకుని చంద్రం వెంట బయల్దేరాడు. చంద్రం అతన్ని స్టూడియోకి తీసుకెళ్ళాడు.
    లోపలకు వెళ్ళాక రూమ్ తలుపులు వేసేసి వీడియో కెమేరా అతని ముందుపెట్టి యాంగిల్ వగైరా ఎడ్జస్ట్ చేసుకుని, లైట్లు ఫోకస్ చేసి "ఊ_ మాట్లాడు" అన్నాడు.
    "ఏమిట్రా యిదంతా? ఎవరితో మాట్లాడాలి?"
    "హరిణితో"
    "హరిణి ఎక్కడ వుందిరా?"
    "ఒరేయ్. నిన్నిప్పుడు డైలాగ్స్ తో సహా వీడియోలో చిత్రీకరించబోతున్నాను. హరిణి నీ ముందు వుందనుకుని మాట్లాడెయ్యి. నీ మనసులోని బాధనంతా అందమైన భాషలో వెళ్ళగ్రక్కెయ్. ఎందుకంటే భాష బావుండకపోతే వినటానికి బావుండదు. నీ వేదనంతా హరిణికి దృశ్యరూపంలో ప్రదర్శిస్తాను. తిరిగి ఆమె జవాబు అనేక భంగిమల్లో నీకు ప్రదర్శిస్తాను"
    ఈ ఐడియా మహేష్ కు గొప్పగా నచ్చింది. గొంతు సరిచేసుకుని "హరిణీ!" అంటూ డైలాగ్ చెప్పబోయాడు. కుదరలేదు. ఎదురుగా చంద్రం వుండటంతో సిగ్గనిపించింది.
    "వొరేయ్ నేను ఒక్కడ్నే వుంటేగాని భావాలు బయటకు రావటం లేదరా. నన్ను వంటరిగా వదిలేసి నువ్వు బయటికెళ్ళు."
    "నేను లేకపోతే కెమేరా ఆపరేట్ చేసేదెవర్రా ఆప్పుడప్పుడూ ఎపెక్ట్స్ కోసం యాంగిల్స్ మారుస్తూ వుండాలి"
    "యాంగిల్సూ అవేం వద్దు కానీ లైటు డైరెక్టుగా మొహంమీద పడకుండా ఎడ్జస్ట్ చేసి వెళ్ళిపో, నేనుమాత్రం వంటరిగా వుండాలి" 

 Previous Page Next Page