లోపల జనం క్రిక్కిరిసిపోయి వున్నారు. రాత్రి ఎనిమిది గంటల వరకూ భరతనాట్యం చేసిన అమ్మాయిలు ఇపుడు ఒంటిమీద నూలు పోగుతో కాబరే డాన్స్ లు చేస్తున్నారు.
"ఇలారా" అన్నాడా వ్యక్తీ భవానీశంకర్ ని ఓ మూలగా ఉన్న మెట్లవేపు పిలుస్తూ.
అప్పుడు గుర్తుకొచ్చింది భవానీశంకర్ కి.
ఆ రోజు స్మితారాణిని ఫోటోలు తీయమని కెమెరా ఇచ్చింది వీరే. అతని వెనుకే మెట్లెక్కి పైకి చేరుకున్నాడు.
పైన చాలా పెద్ద ఆఫీస్ వాతావరణం కనబడుతుంది. డేకలాన్ తో చేసిన వుడెన్ ఫార్టిషన్స్ తో కొత్త ఫర్నిచర్ తో చాలా నీట్ గా , అందంగా ఉంది. ఓ పెద్ద గదిలో అడుగు పెట్టరందరూ. లోపల చాలా విశాలంగా అందంగా అలంకరించి వుంది. గది మధ్యలో రౌండ్ టేబుల్ - మధ్యలో రివాల్వింగ్ చైర్ - ఆ చెయిర్ లో కూర్చుని ఉన్నాడో వ్యక్తీ - అతనే సిద్దార్ధరావు అయ్యుంటాడని ఊహించాడు భవానీశంకర్. లావూ, లావుకి తగ్గ పొడుగూ, మొఖమంతా మచ్చలు, కత్తిగాట్లు, మొటిమలతో భయంకరంగా వున్నాడతను. అతనికి ఓ పక్కన ఓ మధ్య వయసు స్త్రీ కూర్చుని వుంది.
"రా! కూర్చో" అన్నాడు సిద్దార్ధరావు.
భవానీశంకర్ కుర్చీలో కూర్చున్నాడు.
"ఎక్కడుండా నోట్ బుక్?" అడిగాడతను కర్కశంగా.
"అలాంటి సిల్లీ ప్రశ్నలు వేయకూడదు కామ్రేడ్ సిద్దార్ధరావు! ఆ పుస్తకం విలువ తెలిసి కూడా ఎవడయినా జేబులో పెట్టుకుని తిరుగుతాడా? కొంచెం కామన్ సెన్స్ అవసరం బ్రదర్" చిరునవ్వు తో అన్నాడు భవానీ శంకర్.
సిద్దార్ధ మొఖంలో కోపం కనిపించింది. అకస్మాత్తుగా కళ్ళు ఎర్రబడ్డాయి.
"ఇదిగో చూడు తంబీ! ఎక్కువ మాట్లాడకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు! సంధ్యారాణిని ఎక్కడ దాచావు?"
"నాకు తెలీదు కామ్రేడ్! ఆ పేరే వినలేదేప్పుడూ!"
సిద్దార్ధరావు ముఖం కోపంతో మరింత తీక్షణంగా మారింది -
"ఆ అబద్ధాలే నా దగ్గర పనికిరావు. సంధ్యారాణిని నువ్వే ఎక్కడికో తీసుకెళ్ళి దాచావని మావాళ్ళు చెప్పారు."
"వాళ్ళందర్నీ వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించండి కామ్రేడ్! లేకపోతే పిచ్చి ముదిరి రోడ్డు మీద ఏ ఆడపిల్ల కనిపించినా "ఓ సంద్యారాణి నా సంధ్యారాణి" అంటూ వెర్రి కేకలు వేస్తూ వెంబడి పడే అవకాశం వుంది."
సిద్దార్ధరావు కోపం అణుచుకోలేక పిడికిలి బిగించి బలంగా టేబుల్ మీద కొట్టాడు.
"ఆఖరి వార్నింగిస్తున్నాను. నిజం చెప్పేయ్! సంధ్యారాణిని కారు ప్రమాదం నుంచి రెండు సార్లూ రక్షించింది నువ్వు కదూ?"
"నిజమే చెపుతున్నారు కామ్రేడ్! అబద్దాలు ఇంకా ప్రాక్టీస్ చేయలేదు" అంటుండగానే అతని మెదడులో లైట్లు వెలిగినట్లయింది.
అంటే వీళ్ళు స్మితారాణిని చూసి సంధ్యారాణి అనుకుంటున్నారా! సంధ్యారాణి, స్మితారాణి ఒకటిగానే వుంటారా? సంధ్యారాణి మీద పగతోనే స్మితారాణిని పొరబాటున చంపబోయారా? అసలు సంధ్యారాణి ఎవరు? ఆ అమ్మాయికి సిద్దార్దరావుకీ ఎందుకు వైరం వచ్చింది?
"నువ్వూ ఆ మాధవరావుగాడూ కలిసి నాటకమాడుతున్నారు! నా కంతా తెలుసు. ఆ మాధవరావుగాడితో పాటు నిన్నూ మర్డరు చేయక ముందే సంధ్యారాణిని ఎక్కడ దాచావో చెప్పు.'
"నీ మీద ఒట్టు కామ్రేడ్! నాకందులో ఎలాంటి ప్రమేయం లేదు."
"సిద్దార్ధరావు ఓ క్షణం నిశ్శబ్దంగా వుండిపోయాడు. తరువాత లేచి హలో అటూ ఇటూ పచార్లు చేయసాగాడు.
"సరే - ఇప్పుడు ఆ నోట్ బుక్ కావాలి మాకు! నీకు పదివేల రూపాయలిస్తాను వెంటనే తెచ్చిస్తే - " ఆగి భవానీ శంకర్ మొఖంలోకి చూస్తూ అన్నాడు.
భవానీశంకర్ నవ్వాడు.
పుస్తకం తాలుకూ ఆడ్రస్ లలో ఏదో గొప్ప సీక్రెట్ దాగి వుంది. అదేదో తెలుసుకొందే తను ఆ పుస్తకాన్ని చెయి జారనీయ కూడదు.
"పదివేలా? అహ్హహ్హ ! కొంచెం మనసు విశాలంగా చెయి కామ్రేడ్! పదివేలు మంచిరకం చెప్పుల జత కూడా చాలవు!" హేళనగా అన్నాడు.
సిద్దార్ధరావు ఉడికిపోతున్నాడు - "సరే! నువ్వే చెప్పు! నీ కెంత కావాలో?"
భవానీ శంకర్ త్వరత్వరగా ఆలోచించసాగాడు. ఎంత అడగవచ్చు? రెండు లక్షలా, పది లక్షలా. ఎటూ పాలుపోవటం లేదతనికి. ఏదో ఒక అంకె గ్యాంబుల్ చేయాలి.
"పాతిక లక్షలు" అన్నాడతను. సిద్దార్ధ ఉలిక్కిపడ్డాడు.
"నీకేం పిచ్చెక్కలేదుకదా! ఇదేం గోల్డు వ్యాపారమనుకున్నావా?"
"గోల్డు కంటే ఎక్కువ" చిరునవ్వుతో అన్నాడు భవానీశంకర్.
"నువ్వు మరీ అత్యాశకు పోతున్నావు! అత్యాశకుపోయే వాళ్ళ గతి ఏమవుతుందో తెలుసు కదా!"
"తెలుసు . మన తెలుగు దేశంలో ఎంత అత్యాశకు పోతే అంత ధనవంతులవుతారు. కొంతమంది బార్ ఓనర్స్ అయితే ఇంకొంత మంది ఇండస్ట్రియలిస్ట్ అవుతారు."
సిద్దార్ధరావు మొఖానికి చెమటలు పట్టినాయ్.
"అరేయ్ , పుస్తకం లేకపోతే పోనిండి. వీడిని నరికి అవతల పారెయ్యండి" కసిగా అరిచాడతను. అంతవరకూ భవానీ శంకర్ వెనుకే నిలబడ్డ వ్యక్తులిద్దరూ అతనిని కుర్చిలోంచి కింద కీడ్చేశారు.
"పద - బయటకు పద" అన్నడోకతను లాగి అతని పొట్టలో తన్ని.