భోజనం కూడా చెయ్యకుండా శ్రీనివాసు గ్రామానికి వెళ్ళాడు మాధవ.
వేళకాని వేళ వచ్చిన మాధవను చూసి ఆశ్చర్యపోయింది అలమేలు.
"రండి! రండి! కూచోండి. ఇదేమిటి ఇలా వచ్చారు? జానకిని కూడా తీసుకొచ్చారా?" మర్యాద చేస్తూ అంది అలమేలు.
మాధవ గుండెల్లో పిడుగు పడింది. జానకి ఇక్కడకు రాలేదా! ఎక్కడకు వెళ్ళినట్లు?
"ఊరకే వచ్చాను. బావగారినొకసారి చూద్దామని" తడబడుతూ అన్నాడు మాధవ.
'అయ్యో!రాకరాక మీరొచ్చేసరికి అయన కూడా లేరు. మెడ్రాస్ వెళ్ళారు. మా కుసుమ దగ్గరికి."
"ఫర్వాలేదు లెండి వస్తాను" లేచాడు మాధవ.
"ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడమేమిటి? భోజనం చేసి రేపు వెళ్దురుగాని"
"ఫర్వాలేదులెండి! భోజనం చేసే వచ్చాను. అర్జంటు పనుంది. వెళ్తాను" ఆవిడ సమాధానం కోసం ఎదురు చూడకుండా లేచి బయలుదేరాడు మాధవ.
తూలుతూ వెళ్ళిపోతున్న మాధవను వింతగా చూస్తూ నిలుచుండిపోయింది అలమేలు.
* * *
"స్వయంగా వెళ్ళి కనుక్కోచ్చావా? నా మాటలన్నీ నిజమేనని తెలిసిందా? వడలిపోయిన మాధవ ముఖం వైపు చూస్తూ కసీ, ఆవేదనా కలిసిన స్వరంతో అంది సరళ.
శారీరకంగానూ, మానసికంగానూ కూడా చాలా అలిసిపోయాడు మాధవ. ఒక్కసారి విసుగ్గా సరళ వైపు చూసి ముఖం మరోవైపుకు తిప్పుకున్నాడు. ఈ తిరస్కారం సరళ మనసును నొప్పించింది.
"ఏం చెప్పింది జానకి ?" వెటకారంగా రెట్టించింది.
"జానకి లేదు"
"ఉలిక్కిపడింది సరళ.
"లేదూ? వాళ్ళ పుట్టింటికి వెళ్ళి ఉంటుంది"
"అక్కడా లేదు. నిన్ను పంపి చాలా పొరపాటు చేశాను. నువ్వేం మాట్లాడావో తనేం అర్ధం చేసుకుందో? ఎక్కడుందో? ఏమయిపోయిందో? నా జానకి మళ్ళీ నా దగ్గర కేలా వస్తుందో అర్ధం కావటం లేదు"
"నీ జానకీ?' ఈర్ష్యతో మనసు భగ్గుమంటుండగా రెట్టించింది సరళ.
విసురుగా సరళ వైపు తిరిగాడు మాధవ. ధైర్యంగా సరళ చూపులను ఎదుర్కొన్నాడు . "అవును! నా జానకి . ఈ విషయం మొదటే చెప్పి ఉండవలసింది. అన్ని విధాల నేనే నింద్యున్ని . నా పిరికితనమే మొదటి నుంచి అన్ని అనర్దాలకూ కారణం. బ్లస్ట్ గా చెప్పి నీ మనసు నొప్పించలేక ఆ వంకా , ఈ వంకా వెతుక్కోడానికి ప్రయత్నించాను. నిజం చెపుతున్నాను విను. గతానికి నేను సంజాయిషీ ఇచ్చుకోలేను. ప్రస్తుతం నా మనసులో జానకికి తప్ప ఎవరికీ స్థానం లేదు. నిన్ను ప్రేమించగలిగే శక్తి నాలో లేదు. నన్ను క్షమించి నన్ను మరిచిపోయి ఎవరినైనా పెళ్ళి చేసుకో"
సరళ ముఖం తెల్లగా పాలిపోయింది.
జానకిని చూసినప్పటినుండీ ఈ అనుమానమే సరళ మనసులో లీలగా మెదిలి బాధిస్తుంది. అయినా ఆ మాటలు మాధవ నోట విని సహించలేకపోయింది.
"నీ జానకి అని నువ్వు చెప్పుకోవలసిదే! ఆవిడ ఎవరినో అప్పుడే నిశ్చయించుకునే ఉంది. ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళి ఉంటుంది" కసిగా అంది సరళ.
కస్సుమని లేచాడు మాధవ.
"నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు సరళా! జానకి ఎలాంటిదో నా హృదయానికి తెలుసు. జానకికి ఆ మాత్రం ఆధారమే ఉంటే ఆనాడు నన్ను ప్రాధేయపడేదే కాదు. సిగ్గువిడిచి అలాంటి కోరిక కోరవలసి వచ్చినందుకు జానకి ఎంత తల్లిడిల్లిపోయిందో , లజ్జ తో ఎలా ముడుచుకుపోయిందో, ఒక్కొక్క' మాట పలుకుతున్నప్పుడు ఆగొంతు ఎంత వణికిపోయిందో నేను మరిచి పోలేను."
సరళ కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయింది. తరువాత ఏదో ఆలోచించుకుని అంది.
"ఈ రోజుల్లో ప్రతివాళ్ళకీ డబ్బు కావాలి. నీతో పరిచయం కావటానికి ముందే జానకి మరోకళ్ళను ప్రేమించగా అతడు జానకి బీదపిల్ల అవటం వల్ల తిరస్కరించి ఉండవచ్చు. అందుకే నిన్ను ప్రాదేయపడింది. అప్పుడు చాటుమాటుగా డబ్బు పోగుచేసుకుని మళ్ళీ తన వెనుకటి ప్రియుడి దగ్గరికే వెళ్ళిపోయి ఉంటుంది."
సరళ మాటలతో ఆపాడమస్తకమూ భగ్గుమనగా ఒక పురుగును చూసినట్లు చూశాడు మాధవ.
"నీలాంటి వాళ్ళిలాగే ఆలోచించగలరు. జానకికి చాటుమాటుగా డబ్బు పోగుచేసుకోవలసిన అగత్యం లేదు. అత్తయ్య ఆస్తంతా జానకి పేరనే ఉంచింది. నా ఆస్తి నన్ను తీసుకోమని జానకి పోరుపెట్టని రోజు లేదు."
"నీ ఆస్తి నువ్వు తీసేసుకున్నావా?"
"లేదు"
"ఇకనేం? ఆ ఆస్తి ఉంది గనుకే ధైర్యంగా లేచిపోయింది. లేకపోతే ఎలా వెళ్ళగలుగుతుంది?"
"నోరుమూయ్యి ....." ఒళ్ళు తెలియని కోపంతో గట్టిగా అరిచాడు మాధవ.
"సారీ సరళా! ఇంక జానకి గురించి ఇలా మాట్లాడకు. నేను వినలేను. జానకి తన నోటితో ఏనాడూ చెప్పకపోయినా , జానకి నన్నే ప్రేమిస్తుందని నాకు తెలుసు."
"ఆ ముగ్ధ ప్రాణయమే నా మనసులో ఆమె నిండి పోవటానికి ప్రధానకారణం . నా ఆస్తికి జానకి ఏనాడూ ఆశపడదు. ఏ పరిస్థితుల్లోనూ అందులో చిల్లిగవ్వ కూడా వాడుకోదు"
"ఏ ధైర్యంతో లేచిపోయింది మరి?"
"లేచిపోలేదు. తరమగొట్టబడింది. నేను మూర్ఖుడనై నిన్ను పంపాను. నువ్వు తరిమేశావు...."
"మాధవా! ఇంత నింద వెయ్యకు. నేనావిడతో లేని విషయాలేం చెప్పలేదు. ఇంట్లోంచి పొమ్మని చెప్పలేదు."
"విషయం ఒక్కటే అయినా చెప్పే విధానాన్ని బట్టి వేరు వేరు అర్ధాలు స్పురిస్తాయి. ఇంట్లోంచి పొమ్మని నువ్వు చెప్పనక్కర్లేదు. తను యిల్లు వదలక తప్పని స్థితి అని జానకి అనుకుంటే ప్రాణాలకయినా తెగించి వెళ్ళిపోతుంది. ప్లేజ౧ నువ్వింక వెళ్ళు సరళా! ఇంక నాతొ వాదించకు. నాకు పిచ్చెక్కిపోతోంది. అసలు జానకి ప్రాణాలతో ఉందా లేదా అని భయపడుతున్నాను. పోలీస్ రిపోర్టుయిస్తే అల్లరవుతుందని సందేహిస్తున్నాను. నాకోసం ఇక్కడికి వచ్చిందా అని అనుమానంగా ఉంది. నా ఆస్తి నాకు అప్పచెప్పి కాని ఆత్మహత్య కూడా చేసుకోదనే నమ్మకం నాకు. ఆ ఆశతోనే కొంచెం ధైర్యంగా ఉన్నాను. నాలుగు రోజులు అన్ని చోట్లా వెతికి అప్పుడు పోలీస్ రిపోర్టు యిస్తాను" సరళ ఉనికినే గమనించనట్లు స్వగతంలో మాట్లడుకోసాగాడు మాధవ.
ఆ పరిస్థితుల్లో తను మాధవను మాట్లాడించి ప్రయోజనం లేదని అర్ధమయిపోయింది సరళకు.
జానకికి మాధవ మీద ప్రేమలేదని రుజువు చెయ్యగలిగితేనే కాని, మాధవ తనవాడు కాడు. అదెలా సాధ్యం? గుండెల నిండా గుబులు నింపుకుని భారంగా కదిలిపోయింది సరళ.
* * *
పిచ్చివాడిలా జానకి కోసం వెతుకుతున్నాడు మాధవ. నిద్రాహారాలు సరిగ్గా లేక మనిషి సగంయ్యాడు. ఈ స్టితిలో చిరునవ్వుతో వచ్చిన సరళను చూడగానే అతనికి చాలా చికాకు కలిగింది.