"అవునండీ! మీ కుక్క కన్వీనియెన్స్ కోసం అలా ఏర్పాటు చేశామని కూడా అన్నారు"
"కానీ మీ కుక్క పేరు చాలా బావుందండీ! వెరీ నైస్ నేమ్"
"ఆ పంజరంలోని చిలకలన్నీ ఏమయిపోయినయ్?" కర్కశంగా అడిగాడు కల్నల్.
"ఎగిరిపోయాయండీ" అనేసి నాలిక్కరచుకున్నాడు సింహాద్రి.
"వాట్? ఎగిరిపోయాయా?"
"అవునండీ"
"అంటే- అది మీ పనేనన్నమాట"
"అబ్బే! మాకదేం తెలీదండీ"
"తెలీందే ఎగిరిపోయినాయని ఎలా చెప్పావ్ మరి?"
"ఎలాగంటేనండి- ఎలాగంటేనంది - ఎలాగంటే...." సహాయం కోసం చిరంజీవివేపు చూశాడతను.
"అది జస్ట్ కామన్ సెన్సండీ" జొరపడుతూ అన్నాడు చిరంజీవి.
"కామన్సెన్సా?" కోపంగా అడిగాడు కల్నల్.
"అవునండీ! చిన్నప్పుడు మీరు తెలుగువాచకంలో గేయం చదువలేదూ? ఆ గేయం పేరు చక్కని ఓ పక్షులారా' చాలా అద్భుతంగా వుంటుంది. రాసిందెవరంటే- సారీ పేరు గుర్తులేదు, కానీ గేయం పేరుమాత్రం.... చక్కని ఓ పక్షులారా"
"టు హెల్ విత్ దట్ గేయం" పళ్ళు కొరుకుతూ అన్నాడు కల్నల్.
"అఫ్ కోర్స్! ఆ గేయం మనకు ఆ ప్రస్తుతం! నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను" అన్నాడు సింహాద్రి.
"అయితే కేజ్ డోర్ తెరచింది నువ్వేకదూ?"
"లేద్సార్! జస్ట్ కామన్ సెన్స్ ప్రకారం చెప్పాను. అంతే!"
"ఏమిటా కామన్ సెన్స్?"
"అదే జంతువులు పరుగెత్తును, చేపలు ఈదును, పక్షులు ఎగురును- ఇవన్నీ కామన్ సెన్సే కదండీ! జస్ట్ కామన్ సెన్స్"
"టు హెల్ విత్ కామన్ సెన్స్! కేజ్ డోర్ ఎవరు తెరచారు?"
* * * * *
ఇలా ఆ సంభాషణ ఇంకెంత సేపు కొనసాగేదేదోగాని ఈలోగా ఓ పొడుగాటి వ్యక్తి బ్రీఫ్ కేస్ తీసుకుని సరాసరి లోపలికొచ్చేశాడు.
"గుడ్ మానింగ్" అన్నాడు కల్నల్ తో.
కల్నల్ అతనివంక అయిష్టంగా చూశాడు.
మాంచి ముఖ్యమయిన సన్నివేశంలో ఉండగా పర్మిషన్ తీసుకోకుండా ఇంట్లో జొరబడటమే కాకుండా- పేరుపేరునా అందరినీ విష్ చేయడం, ఆ తర్వాత గ్రూప్ విష్షింగ్ ఇవన్నీ పరమ చిరాకు కలిగించినయ్ అతనికి. ఇలా ముక్కూ మొఖం తెలీని సజ్జంతా ఇంట్లో జొరబడి ఇకిలించడానికి ఇదే డ్రామా కంపెనీ కాదుగదా!
"హు ఆర్ యూ?" అన్నాడావ్యక్తి వేపు తిరిగి కోపంగా.
ఆ వ్యక్తి మళ్ళీ చిరునవ్వు నవ్వాడు.
"ఓ! నన్ను గుర్తుపట్టలేదన్నమాట" అన్నాడు ఆశ్చర్యంగా.
"హూ ఆర్ యూ?" మరింత కోపంగా అన్నాడు కల్నల్.
అతను మళ్ళీ చిరునవ్వు నవ్వాడు.
"ఇదే మొదటిసారి ఎవరయినా నన్ను గుర్తుపట్టకపోవడం" అన్నాడు వేదాంతధోరణిలో.
"నువ్వెవరు?" తెలుగులో అడిగితే అర్ధం చేసుకుంటాడే మోనని అడిగాడు కల్నల్.
సరిగ్గా అప్పుడే వంట అమ్మాయి లోపల్నుంచి వచ్చి "భోజనం రడీ" అంది.
ఆమెను చూడగానే ఆ కొత్తవ్యక్తి మొఖం మీద చిరునవ్వు - మరింత వెలిగిపోయింది. ఆమె దగ్గరకెళ్ళి-
"హాపీ బర్త్ డే టూ యూ, హాపీ బర్త్ డే టూ యూ, హాపీ బర్త్ డే టూ యూ" అన్నాడు ఇంచుమించుగా నృత్యం చేస్తున్నట్లు కదులుతూ.
కల్నల్ కి పగ్గాలు తెగిపోయాయ్.
"నోర్మూసుకుని నువ్వెవడివో చెప్పు" అంటూ అరచాడు.
అప్పటికి ఆ వ్యక్తి చెక్కు చెదరలేదు. "శ్రీదేవిగారిల్లు ఇదేనా?" అనడిగాడు అనుమానంగా.
"అవును" అన్నాడు సింహాద్రి.
"అయితే- ఐయామ్ ఇన్ కరెక్ట్ ప్లేస్ ఓన్లీ" మళ్ళీ చిరునవ్వుతో అని వంటమ్మాయ్ వేపు తిరిగాడు.
"మీరు కూడా నన్ను గుర్తుపట్టలేదా?" అనడిగాడు.
ఆ అమ్మాయి భయపడిపోయింది.
"ఎవర్నువ్వు?" అంది రెండడుగులు వెనక్కు వేస్తూ.
"హాపీ బర్త్ డే టూ యూ" అన్నాడతను మళ్ళీ.
కల్నల్ పిస్టల్ పైకి తీశాడు.
"నోర్మూసుకుని ముందు నువ్వెవడివో చెప్తావా లేదా?" అన్నాడు ఆఖరుసారిగా.
ఆ వ్యక్తి పిస్టల్ చూసి కంగారుపడ్డాడు. ఆ మాట అన్నది తనను కాదేమోనని అటూ ఇటూ చూశాడు.
"నిన్నే అడిగేది- అలా దిక్కులు చూస్తావేమిటి? చెప్పు! హూ ఆర్ యూ?"
ఇంక ఇంట్రడ్యూస్ చేసుకోవడం చాలా ఆరోగ్యకరమయిన విషయంగా కనిపించిందా వ్యక్తికి.
"ఓకే! ఓకే. నా ఫోటో ఎప్పుడూ చూడలేదా?" కల్నల్ నడిగాడతను.
"అడ్డమైన ఫోటోలు చూసేవాడిక్కడ ఎవడూ లేదు" అన్నాడు కల్నల్.
"నేననేది అడ్డమయినవాళ్ళ ఫోటోల సంగతి కాదండీ! నా ఫోటో సంగతి"
"నీ ఫోటో సంగతే చెప్తున్నాను" అన్నాడు కల్నల్.
ఆ వ్యక్తి కొంచెం ఖంగుతిన్నాడు.
"ఆల్ రైట్... ఆల్ రైట్! అయామ్ ధనుంజయ్. ప్రఖ్యాత రచయిత ధనుంజయ్ ని నేనే" అంటూ ఆనందంగా చుట్టూ చూశాడు.
"వ్వాట్" అదిరిపడ్డాడు కల్నల్.
అతనితోపాటు సింహాద్రీ, చిరంజీవి, గదిమూల సోఫాలో కూర్చున్న శ్రీదేవి కూడా అదిరిపడ్డారు.
"ప్రఖ్యాత రచయిత ధనుంజయ్ అంటే నువ్వా?" మళ్ళీ అడిగాడు కల్నల్.
"సెంట్ పర్సెంట్"
"కల్నల్ జెర్క్ ఇచ్చినట్లు తలతిప్పి సింహాద్రివేపు చూశాడు. సింహాద్రి కూడా అదే స్పీడ్ లో చిరంజీవి వేపు చూశాడు. చిరంజీవికి ఎటు చూడాలో తెలీలేదు. అంచేత కల్నల్ వేపు చూసి-
"ఇహిహి" అన్నాడు.
"డోంట్ లాఫ్" అన్నాడు కల్నల్.
శ్రీదేవి మెల్లగా లేచి గది మధ్య కొచ్చింది.
"మీరు రచయిత ధనుంజయ్ గారా?" అంది ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ.
"సెంట్ పర్సెంట్ నేనే రచయిత ధనుంజయ్ ని. శ్రీదేవి గారి పెన్ ఫ్రెండ్ ని" అంటూ చిరునవ్వుతో వంట అమ్మాయ్ వేపు మళ్ళీ రెండడుగులు వేశాడు.
"ఇప్పుడు తెలిసిందా శ్రీదేవిగారూ! అయామ ధనుంజయ్ మీ బర్త్ డే కదూ ఇవాళ. అందుకే హాపీ బర్త్ డే టూ యూ, హాపీ బర్త్ డే టూ యూ, మెనీ హానీ రిటర్న్ ఆఫ్ ది డే టూయూ..."