Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 33


    "ప్రేమంటే నాకు నమ్మకం లేదు."
    "నాకుంది డాడీ?"
    "మీరనుకునేది ప్రేమకాదు."
    "మరి ఏమంటారు డాడీ?"
    "వ్యామోహం అంటారు?"
    హరిణి నవ్వింది. "నా గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేసుకున్నావు డాడీ!"
    "ప్రేమలోపడ్డ ప్రతి ఆడపిల్లా అలాగే అనుకుంటుంది."
    "నేనందరి ఆడపిల్లల్లాంటి దాన్నికాను డాడీ!"
    "నేనూ అందరి తండ్రుల్లాంటివాణ్ణి కాదు. అవసరమొస్తే ఎంత కఠినంగానైనా వుండగలను."
    "ఎంత కఠినత్వానైనా భరించగల శక్తి నాకుంది డాడీ."
    "నిజంగా ఎంతటి కఠినత్వాన్నయినా భరించగలవా?"
    "ఆఁ!"
    "నేను నీకు దూరమైపోయినా సరే."
    "ఆఁ"
    "ఆస్తి, సంపదా అన్నీ పోగొట్టుకుంటున్నాసరే!"
    "ఆఁ"
    అర్జునరావుగారికి చాలా ఆవేశమొచ్చింది. "ఎదిగి ఎదగని వయసులో ఉద్భవించే ప్రేమ చాలా చంచలమైనది. అదంతా ఓ భ్రమ. ఈ భ్రమను ప్రేమనుకుని జీవితాలు నాశనం చేసుకున్నవాళ్ళను చాలామందిని చూశాను" అన్నాడు.
    "మా జీవితాలు కూడా నాశనం కావచ్చు _ కాని ఎట్టి పరిస్థితుల్లోను యీ భ్రమను గురించి కాదు."
    "నీ మీద నీకింత చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం దేనికి?"
    "నేను వేసే ప్రతి అడుగూ తెలిసే వేస్తాను కాబట్టి."
    "ఇదంతా నీమీద ప్రేమ అనే మమకారంతోనే చెబుతున్నానని ఎందుకనుకోవు?"
    "డాడీ! ఆ ప్రేమనూ, మమకారాన్నీ దుర్వినియోగం చెయ్యనని నువ్వెందుకనుకోవు?"
    "కాని దీనివల్ల నీ చదువు పాడయిపోతుంది."
    అయితే అయిందిలే అందామనుకుంది. కాని తన చదువు గురించి ఆయన పడే తపన, తనని డాక్టర్ని చెయ్యాలన్న ఆయన ఆకాంక్ష. కనే కలలు గుర్తొచ్చి అనలేకపోయింది. ఆమె కళ్ళలో నీళ్ళు చిగురించాయి.
    "అవునా?"
    ఆమె మాట్లాడలేకపోయింది.
    ఆమె బలహీనత ఎక్కడుందో గ్రహించినట్లు ఆయన ఇంకా ముందుకు పోయాడు.
    "మీ ప్రిన్సిపాల్ నీ, ప్రొఫెసర్లనీ కలసి వాకబు చేశాను. అతను పిచ్చిలోపడి నువ్వు చదువులో చాలా వెనుకబడి వున్నావని చెప్పారు. అసలు నీలాంటిదానికి ఎంట్రెన్స్ లో సీటు ఎలా వచ్చిందన్న ఆశ్చర్యం కూడా వెలిబుచ్చాడు. నాతల కొట్టేసినట్లయింది. నా కూతురు చాలా బ్యాడ్ స్టూడెంట్ అన్న రిమార్కు చాలా బాధగా వుంది."  
    ఆయన గొంతులోని వొణుకు విని ఆమె చలించింది. తానంటే అయనకెంత ప్రేమో ఆమెకు తెలుసు. తన జీవితంలోని ఏ అపశృతయినా ఆయన్నెంత కలవరపరుస్తుందో తెలుసు.
    "డాడీ! నీ గురించి ఏమయినా చేస్తాను. మహేష్ ను వదులుకోవడం తప్ప" అంది ఆర్ద్ర స్వరంతో.
    "వదులుకొమ్మని నేను చెప్పటంలేదు. నీ ప్రేమను నిరూపించుకుని అతన్ని సాధిస్తే నా కభ్యంతరం లేదు."
    హరిణి కళ్ళు సంతోషంతో మెరిశాయి.
    "దానికోసం ఏం చేయమంటావో చెప్పు డాడీ."
    "నువ్వు ఎగ్జామ్స్ సక్రమంగా పాస్ కావాలంటే...."
    ఆమె ప్రశ్నార్థకంగా చూసింది.
    "నువ్వు పరిపూర్ణమైన డాక్టరుగా రూపొందే వరకూ...."
    ఆమె ఊపిరి బిగపెట్టి నిరీక్షిస్తోంది.
    "అతన్తో నువ్వు మాట్లాడకూడదు."
    ఆమె గుండె గబగబ కొట్టుకుంది. ఒక్కక్షణం....కాని తమాయించుకుంది.
    "సరే! డాడీ."
    "అతను పలకరించినా, కవ్వించినా జవాబివ్వకూడదు."
    "అలాగే డాడీ!"
    "అతనికి వుత్తరాలు రాయకూడదు."
    "రాయను డాడీ."
    "ప్రామిస్ !"
    "ప్రామిస్."
    ఆయన చెయ్యి చాచాడు. చేతిలో చెయ్యివేసి ప్రామిస్ చేసింది.
    "మాట తప్పినట్లయితే ఇక్కడ్నుంచి ట్రాన్స్ ఫర్ చేయించి తీసుకెళ్ళిపోతాను."
    "అలాంటి పరిస్థితి రాదు" అన్నది ధీమాగా హరిణి.
    అక్కడ్నుంచి అర్జునరావుగారు సరాసరి మహేష్ రూమ్ కి వెతుక్కుంటూ వెళ్ళారు. ఒక వ్యక్తి జీవితంలోకి ఇంకోవ్యక్తి ఏదో హక్కు వున్నట్లు జొరబడటం, ఇహ అప్పట్నుంచీ కదలకుండా తిష్ఠ వేసుకు కూర్చోవడం ఆయనకు చాలా చికాకనిపించింది. బుద్ధిగా చదువుకోవాల్సిన వయస్సులో అహోరాత్రులూ శ్రమించి చదువుకుని మంచి వుద్యోగాలు చేస్తూ, హోదా సంపాదిస్తూ _ అప్పుడు తనకు యిష్టమొచ్చిన వాళ్ళనో, పెద్దలు చూపిన వారినో పెళ్ళిచేసుకుని, ఆ వ్యక్తినే ప్రేమించి జీవితాన్ని సక్రమంగా గడపకుండా ఎందుకలా ఎగుడు దిగుడు బాటలు ఎన్నుకుంటారు?    
    తలుపు తట్టగానే తీసిన యువకుణ్ణి చూసి, కోపంతో ఉరకలు వేస్తున్నట్లుగా "ప్రేమించడం గొప్పనుకున్నావా?" అన్నాడు.
    ఆ మాట అన్న మనిషి ఉగ్రరూపం చూసి చంద్రం తనను కాలరు పట్టుకొని అవతలకు విసిరి వేస్తాడోనని వొణికిపోతూ "అనుకోలేదండీ" అన్నాడు.
    "మరి....ఎందుకు ప్రేమించావు?"
    "నేను ప్రేమించలేదండి. నిజం చెప్పాలంటే నాకు ప్రేమించటం చేత కూడా కాదండి."
    అర్జునరావుగారు అతనివంక అనుమానంగా చూస్తూ "నువ్వు మహేష్ వి కాదా?" అన్నారు.
    "కాదండి అతని స్నేహితుడు చంద్రాన్నండీ"
    "మరి ఆ విషయం ముందే ఎందుకు చెప్పలేదు?"
    "మీరు చెప్పనిస్తే కదండి."
    "సరే మీ స్నేహితుడు మహేష్ ని పిలువు"
    "గలాటా విని మహేష్ బయటకు వచ్చాడు. "నమస్తే. నేనే మహేష్ ని" అన్నాడు.
    అర్జునరావుగారు ఆ కుర్రాడివంక చూసి విస్మయంగా వుండిపోయారు. నుదుటిమీదకు పడుతున్న ఉంగరాల జుట్టు, చురుగ్గా మెరిసే నల్లటి కళ్ళు, పెదాలమీద ఎప్పుడూ చెరగదేమో అన్నట్టు మెదిలే చిరునవ్వు, లేతదనం, రఫ్ నెస్ రెండూ కలబోసివున్న చెంపలు....
    "ఇతనికేం తక్కువ? కుర్రాడు ముచ్చటగా, స్మార్ట్ గా వున్నాడు. మెడిసిన్ చదువుతున్నాడు. ఒకవేళ నేనెంత గాలించినా ఇలాంటి సంబంధం తీసుకురాగలనా? అని అనుకున్నాడు.

 Previous Page Next Page