Previous Page Next Page 
భార్యా గుణవతి శత్రు పేజి 33

  

    "చాలా ఇంపార్టెంటు మర్చిపోవద్దు".    
    "అయ్యో! మీరింత చెప్పాక ఎలా మర్చిపోతాను? అలారం పెట్టుకుంటాను లెండి".    
    కదలకుండా ఇంకా అక్కడే నిలబడిన సౌదామినివేపు 'ఏమిటి?' అన్నట్లు ప్రశ్నార్ధకంగా చూశాడు అతను.    
    మెల్లిగా అంది సౌదామిని. "మీరు లేవదల్చుకుంటే నాతో చెప్పకుండానే అలారం పెట్టుకుని వుండొచ్చు కాఫీ పెట్టమని ఆసెయ్యతో చెప్పి వుండవచ్చు. కానీ నాకే చెప్పటంవల్ల ఎంత సంతోషంగా వుందో తెలుసా! మధ్యాహ్నం నుండి మీరు సరిగ్గా మాట్లాడకుండా వుంటే నన్ను పరాయిదానిలాగా చూస్తున్నారేమో అనిపించి దిగులేసింది".    
    'వహ్వా! భేష్ భేష్! వన్స్ మోర్'.    
    అనుకున్నాడు బాలూ కసిగా. 'నెరజాణ' అని నవలల్లో చదివాడు తను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాడు. 'పనులన్నీ నీకే పురమాయిన్చాను అని పులకరింతగా వుందా! ఉబుసుపోక ఊరికే చెప్తాననుకుంటున్నావేమిటీ! చాల ఆలోచించే చెబుతున్నాను... పొద్దున్నే కాఫీ పెట్టమని. ఇవాళ రాత్రి ఫ్యూజ్ ఆన్ చేసి, ట్యూబ్ కి కన్నం చేస్తాను. గ్యాసు పల్చగా చీకట్లో గాలి దెయ్యంలా గదంతా ఆవరించుకు వుంటుంది. నువ్వు స్విచ్చి వేస్తున్నప్పుడు వచ్చే అతి చిన్న స్పార్కు చాలు. గ్యాసు అంటుకుని బాంబులా పేలుతుంది. ఆ తర్వాత నువ్వు నా గుండెలాగా వెయ్యి ముక్కలయిపోతావు!' అనుకున్నాడు మనసులో.    
    "పని....టెన్షన్, అంతే ఇంకేంలేదు" అన్నాడు పైకి.    
    ఏదో అనబోయి, మనసు మార్చుకుని అక్కడినుంచి వెళ్ళిపోయింది సౌదామిని.    
    డాబాలోకి వచ్చి, వాష్ బేసిన్ లోకి తలవంచి, చల్లటి నీళ్ళతో మొహం కడుక్కున్నాడు బాలూ.    
    తర్వాత అతని కాళ్ళు అప్రయత్నంగానే పిట్టగోడవైపు నడిచాయి. గోడకి చేతులానించి నిలబడ్డాడు. అతనికి తెలియకుండానే అతని కళ్ళు జానకి కోసం వెదకడం మొదలెట్టాయి.    
    జానకి కనపడలేదు.    
    ముసలాయన కనబడ్డాడు.
        అతనికి ఒక విషయం స్ఫురించింది.    
    అసలా ముసలయాన పేరేమిటి? కనుక్కోవడానికి తనెందుకు ప్రయత్నించ లేదు. పొద్దుట హాస్పిటల్లో కూడా ఆయన పేరు ఎక్కడ రాయవలసిన అవసరం రాలేదు. తను పట్టించుకోలేదు.
    
    అది సహజమే. ఈ ప్రపంచంలో ఎన్నెన్నో విషయాలు జరుగుతుంటాయి. తనకు అవసరమైన వాటినీ- తనకు ఇంట్రెస్టు వున్నవాటినీ మాత్రమే గమనించి గుర్తుపెట్టుకుంటాడు మనిషి కాకపోతే ప్రతి విషయం గమనించి, ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటే మెదడు కందిరీగల పుట్టలా తయారవుతుంది.    
    ఇంతకీ ముసలాయన పేరేమిటి? ఇంతలో జానకి బయటకి వచ్చింది. అంతలో పక్కగా జీబూతాల్లా, నల్లగా, పెద్దవిగా వున్న బర్రెలను తోలుకుంటూ వచ్చాడు పాలవాడు. ఒక బర్రె వెనుక, దాని దూడ కూడా చెంగు చెంగున ఎగురుతూ వస్తోంది.    
    తెల్లగా వుంది దూడ.    
    తల్లి తాలూకు నలుపు దీనికి రాదా! రాలేదా!    
    లేదా దీని తల్లి కూడా సౌదామినిలా ఇంకెవరో తెల్లగేదెతో-    
    తెల్ల గేదె ఏమిటి తన మొహం.    
    అప్పుడు ఇంకో విషయం గుర్తొచ్చింది.    
    తనకు పిచ్చి పట్టిందేమో అన్న భయం! ఉహు తనకే పిచ్చిలేదు, తనే కరక్టు, ప్రపంచంలో మిగతా వాళ్ళందరికీ పిచ్చిపట్టింది అనుకునే స్థితి నిజంగా పిచ్చిది అంటే సైకోసిస్ అన్నమాట.    
    రేప్రొద్దుటితో వీటన్నిటికీ ఎండ్.    
    "శుభం" అని వెండితెరమీద కనబడినట్లే.    
    ఆ తర్వాత తనొక్కడూ కలకాలం హాయిగా వుంటాడు.    
    తనొక్కడూ కలకాలం హాయిగా వుండటమా! ఇదేదో విపరీతంగా లేదూ! ఆ తర్వాత వాళ్ళిద్దరూ హాయిగా వున్నారు! అని కూడా మన కథలకి వుండే ముగింపు...    
    దానికి విరుద్దంగా తనొక్కడే!    
    తల గట్టిగా విదిలించాడు బాలూ, ఏమిటీ ఆలోచనలు? తనకింకా సైకోసిస్ రాకపోవచ్చు. కానీ యిది నిశ్చయంగా న్యూరోసిస్సే అయివుండాలి.    
    న్యూరోసిస్ సైకోసిస్ కి ముందు అధ్యాయం.    
    దీనికి ముందు ఏమీలేదా?    
    ఎందుకు లేదు.    
    సౌదామిని చావే ముందు.    
    ఆ తర్వాత తను.    
    మళ్ళీ అదే! తనొక్కడే హాయిగా ఎలా వుంటాడు! జంటగా ఎవరూ అక్కర్లేదా తనకి!    
    "ఇవాళ యింకో పావు ఎక్కువ పోస్తావా? అయ్యగారికి కావాలి" అంటోంది జానకి పాలవాడితో.    
    పాలవాడు తల వూపి దూడని వదిలాడు. దూడ పరిగెత్తుకొచ్చి తల్లి పొదుగును అందుకుంది.    
    తల్లిపాలు చేపిన తర్వాత, ఒకటి రెండు నిమిషాలు దూడని తాగనిచ్చి తర్వాత దాన్ని దూరంగా లాగేసి పాలు పిండటం మొదలుపెట్టాడు పాలవాడు.    
    గేదెనీ దూడనీ తదేకంగా చూస్తోంది జానకి. బాలూకి అన్పించింది.    
    ఏమని ఆలోచిస్తూ ఉంటుంది ఆమె!    
    అలాంటి అనుభూతి తనకి ఎప్పుడు కలుగుతుందనా!    
    ఆమె వదిలిన నిట్టూర్పు తాలూకు వేడి అతని చెంపలను తాకినట్లయింది.    
    నురుగులు కక్కుతున్న నులివెచ్చటి పాలు గిన్నెలో పోయించుకుని లోపలికి వెళ్ళిపోయింది జానకి.    
    వెళ్ళేముందు ఒక్కసారి కళ్ళెత్తి బలూవైపు చూసింది.    
    ఆమె పెదవులు రెండూ దగ్గరగా చేరి-రెప్పపాటు కాలంలో గాలిలో ముద్దిచ్చి దూరమయ్యాయి.    
    స్నానంచేసి బట్టలు మార్చుకుని మళ్ళీ టవల్ కట్టుకుని పరధ్యానంగా బాత్ రూం వైపు వెళుతూంటే ఆశ్చర్యంగా చూసింది సౌదామిని.    
    బాత్ రూంలోకి వెళ్ళాక అప్పుడు గుర్తొచ్చింది బాలూకి తను స్నానం చేశానని. ఊరికే మొహం కడుక్కుని బయటికి వచ్చాడు.    
    టైం చూసుకున్నాడు.    
    ఏడవుతోంది.    
    "తొందరగా భోజనాలు చేసేద్దామా? బాగా ఆకలేస్తోంది. యివాళ" అన్నాడు సంజాయిషీ చెబుతున్నట్లు.    
    భోజనాలు పూర్తయి, ఆమె వంట యింటి పని ముగించుకుంటేగానీ తను వంటింట్లో పని మొదలెట్టలేడు. భోజనాలు వడ్డించేసింది సౌదామిని. కాసేపు ఇబ్బందికరమైన మౌనం.    
    ఆ నిశ్శబ్దాన్ని చీల్చడానికి ప్రయత్నిస్తూ మొక్కుబడిగా-    
    "రేపు వంట ఏం చెయ్యమంటారు?" అంది.    
    "రేపా?" అన్నాడు బాలూ కంపరాన్ని అణుచుకుంటూ.    
    రేపు మా ఇంట్లో వంట వుండదు. ఆ సంగతి మరెవ్వరికీ తెలియదు తనకి తప్ప.    
    ఎంత గొప్ప యిది! రేపు ప్రొద్దున ఏం జరగబోతోందో తెలిసినవాడు మొత్తం ప్రపంచంలో తనొక్కడే.    
    "అయ్యో అదేమిటి!" అంది సౌదామిని కంగారుగా.    
    చారు అనుకుంటూ, అన్నంలోకి నీళ్ళు వంపుకుంటున్నాడు బాలూ తను చేసినది పొరపాటు ఒప్పుకోవాలని అన్పించలేదు.    
    "ఆకలి లేదు" అని ముక్తసరిగా చెప్పి మిగిలిన నీళ్ళు కూడా ఒంపేసుకుని చెయ్యి కడిగేసుకున్నాడు.    
    వెంటనే తను కూడా చెయ్యి కడిగేసుకుంది సౌదామిని.    
    "ఈ పతివ్రత వేషాలంటే నాకు అసహ్యం" అన్నాడు విసురుగా.

    తెల్లబోయింది సౌదామిని.    
    "వేషాలేమున్నాయి ఇందులో? మీరు తినకపోతే నాకూ తినబుద్దికాలేదు. అంతే-"    
    "అదే అంటోంది- ఎవరి ఆకలి వాళ్ళది- నా కోసం నువ్వు కడుపు మాడ్చుకోవడం ఎందుకూ?" అన్నాడు వ్యంగ్యంగా.    
    సౌదామిని మాట్లాడకుండా తల వంచుకుంది.    
    అతను లేచి నిలబడ్డాడు రోజూ అతను అలవాటుగా అడిగే ప్రశ్న అడుగుతాడేమోనని ఎదురు చూస్తోందామె. భోజనం చేసేటప్పుడు తప్పకుండా బాబు సంగతి విచారిస్తాడు. అతను "బాబు అన్నం తిన్నాడా! ఏం తిన్నాడు?" అని.    
    ఇవాళ అతను ఆ ప్రశ్న అడగలేదు.    
    మౌనంగా నేప్ కిన్ తో పెదిమలు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. లివింగ్ రూము సోఫాలో కూర్చుని పేపరు అందుకున్నాడు.    
    వంటింట్లోంచే శబ్దాలు స్పష్టంగా వినబడుతున్నాయి. కంచాలు ఎత్తి సింక్ లో పెట్టిన చప్పుడు తర్వాత గిన్నెలు సర్దుతున్న శబ్దం చీపురుతో వంటిల్లు ఊడుస్తున్న సవ్వడి తర్వాత నేలమీద నీళ్ళుపోసి, కాళ్ళకింద పాతగుడ్డ వేసుకుని తుడుస్తున్న చప్పుడు.    
    వీటన్నింటినీ డామినేట్ చేసి వినపడుతోంది తన గుండెచప్పుడు.    
    ఇవాళ వంటిల్లు శుభ్రం చెయ్యడం అనవసరం అని తెలియదామెకి.    
    ఎలాగూ రేప్రొద్దున రణరంగంలా మారపోతుంది కిచెన్. ఎగిరి ఎక్కడెక్కడో పడిపోయిన కత్తులూ, కత్తిపీటలూ, ఫోర్కులూ, విష్ణుచక్రాల్లా ఎగిరిపడ్డ పళ్ళాలూ, పగిలిన సీసాల తాలూకు ముక్కలూ, ఒలికిన ఎర్రటి టమాటో కెచప్, ధూళి మేఘంలా లేచిన కారం- సౌదామిని రక్తం....మాంసఖండాలూ...    
    భీభత్సంగా వుంటుంది ఆ సీను.    
    వంటింట్లో లైటు స్విచ్చి ఆర్పిన శబ్దం కూడా అ"ఫట్..." మని స్పష్టంగా వినపడింది. - సైలెన్సర్ అమర్చిన తుపాకి ప్రేలుడులా.    
    సౌదామిని పాదాల చప్పుడు దగ్గిరయింది.    
    చప్పున పేపర్లో తల దూర్చేశాడు మళ్ళీ అప్పటిదాకా పేపరు తను తలక్రిందులుగా పట్టుకున్నానని గ్రహించి కంగారుగా దాన్ని సరిగా తిప్పి పట్టుకున్నాడు.    
    మంచినీళ్ళ జగ్గూ, పాలగ్లాసూ పట్టుకొచ్చింది సౌదామిని. మాట్లాడకుండా గ్లాసు అందించింది.    
    మౌనంగా అందుకున్నాడు.    
    మేడమీదకి వెళ్ళిపోయింది ఆమె.    
    అనుమానంగా పాలగ్లాసుని వాసన చూచి, పక్కన పెట్టేశాడు బాలు.    
    సౌదామిని పైన గదిలోకి వెళ్ళిందని నిర్ధారణ చేసుకుని తను నిశ్శబ్దంగా వంటింట్లోకి ప్రవేశించాడు.    
    లైటు వేయలేదు. తడుముకుంటూ షెల్పు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక గ్లాసులో వేసి పెడుతుందామె కిచెన్ నైఫ్ ని.    
    దాన్ని తీసుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళాడు.    
    సిలిండర్ ఆన్ చేశాడు. స్టౌవ్ నీ, గ్యాస్ సిలిండర్ ని కలుపుతూ పసిరిక పాములాంటి ఆకుపచ్చటి ట్యూబు ఉంది. దాన్ని కోశాడు. వెంటనే పాము బుస కొడుతున్నట్లు శబ్దంతో గ్యాస్ లీక్ కావడం మొదలెట్టింది.

 Previous Page Next Page