Previous Page Next Page 
అరణ్యకాండ పేజి 32

    నానీ మాటలకన్నా  చివరగా  ఉపయోగించే "మరేటో" అన్న పదం  మరీ వినాలనిపించేటట్టుగా వుంది.
          "సరే.ప్రామిస్__నేనిక్కడే  ఉంటాను. నువ్వు తినేసిరా."

    "అమ్మదొంగా. నువ్వూ అబద్ధం  చెబుతున్నావుగా" అన్నట్టు ఆకతాయిగా తలూపి "నేను అన్నం తినేవరకూ మీరు  లోపలికి  వచ్చికూచోవాలి" అన్నాడు అదో షరతులా.

    మానసికంగా  అలసిపోయిన  చైతన్యకు నానీ మాటలు  రిలీఫ్ గా ఉన్నాయి. వెళ్ళాలని ఉన్నా ఆమె పక్క నుంచి రెస్పాన్సు  రాకుండా  వెళ్ళడం  భావ్యం  కాదనుకున్నాడు.

    "కొంచెం రండి ఓ అయిదు  నిమిషాలు...." పిలిచింది వెళ్ళాడు  చిన్న పెంకింటింటిలోకి.

    ఉన్నంతలో  అందంగా  అమర్చినట్టున్న  గదిని  చూస్తూ తన వొడిలోనే  కూచుని  అన్నం  తింటున్న  నానీతో "మమ్మీని  ఇలా  అల్లరి పెట్టొచ్చా" అన్నాడు చైతన్య.

    "అదేంటోనండీ! సరిగా  వేళకి అన్నం  తినడు. తినమంటే నాకేదో మేలు చేస్తున్నట్టు  అల్లరి చేస్తాడు. గట్టిగా  మందలిస్తే  నాన్న రానియ్  చెబుతా నంటాడు...." భర్త గుర్తుకొచ్చాడేమో  ఆమె గొంతు పూడుకుపోయింది.

    "మరి డాడీ వస్తాడని  ఎప్పుడూ  చెబుతుంది. కానీ అస్సలురాడు. మరేటో...." భోంచేస్తూనే  కంప్లయింటు చేశాడు నానీ.

    "మీవారు...." అర్ధోక్తి లో  ఆగిన  చైతన్యతో  ఆమె ఏదో  చెబుతుండగానే  "పులిమీదెక్కి దేవుడి  దగ్గర  కెళ్ళాడు" అని  నానీ  టక్కున  జవాబిచ్చాడు. అర్ధమయింది  చైతన్యకు.

    ఆమె తల వంచుకుంది. మొహంలో  భావాలు  కనిపించకుండా.

    చైతన్య ఆ ప్రసక్తిని  కొనసాగించలేదు. కాని ఆమె చెప్పింది. బ్రతుకుతెరువు  కోసం  అక్కడ  అంగన్ వాడి టీచర్ గా పనిచేస్తున్న విషయం.

    "మీ డాడీ వచ్చేవరకూ  నిన్నాడిస్తాను. మరి  రోజూ మీ మమ్మీ చెప్పినట్టు  వింటావా....అల్లరి చేయకుండా  బుద్ధిగా  ఉండాలి" అన్నాడు చైతన్య.

    'ఓ' అంటూ  కళ్ళు  చక్రాల్లా  తిప్పాడు  నానీ.

    "ఇంకెప్పుడూ  అంకుల్ తో నేను  ఆడుకుంటానన్నమాట" తల్లికి అర్ధంకాలేదేమో  అని గడుసుగా  విషయాన్ని  బోధపరిచాడు.

    నానీ భోంచేసేక  "అంకుల్....మమ్మీకి  తెలియకుండా  మనం ఓ పనిచేద్దామా" అన్నాడు రహస్యంగా.

    "మరేం లేదు. నేనెన్ని  ఉత్తరాలు  రాసినా  డాడీకి  అందడంలేదు  మరేటో....దేవుడి ఎడ్రసు పెద్దాడివి  కాబట్టి  నీకు బాగా తెలుస్తుందిగా అందుకని  నువ్వు  రాసిస్తే  నేను పోస్టు  డబ్బాలో  వేస్తా."

    నిర్లిప్తంగా  నానీ కేసి  చూశాడు.

    "ఉత్తరాలు  రాస్తే  మీ డాడీకి  తప్పకుండా  అందుతాయి  కాని అది పోస్టుబాక్సులో  పడేయకూడదు."

    "మరి...."

    వెంటనే  జవాబేం  చెప్పాలో  స్పురించలేదు  చైతన్యకి.

    "ఆఁ! బోధపడింది" తల పంకించిన  నానీ "ఓ పని  చేద్దాం" అని ఆగాడు.

    "దేవుడు  మీదనుంటాడుగా. అందుకని  ఉత్తరం  రాసి  గాలి పడక్కి  అంటించి  పై కెగరేద్దాం. అప్పుడయితే  డాడీకి   అందుతుంది."

    కరెక్ట్ అనేసిన  చైతన్యకు తెలీదు. కేవలం  ఆ ప్రయత్నంలో నానీ ఎలాంటి  ప్రమాదంలో  ఇరుక్కుపోబోతున్నదీ.

    "నాకు  జీప్ నడపడం  నేర్పు, అంకుల్" అంటూ  వెళుతున్న చైతన్య దగ్గర మారాం చేస్తుంటే "ఓ" అన్నాడు. "తుపాకీ పేల్చడం?" దానికి  సరేనన్నాడు చైతన్య జీప్ ను ముందుకు  పోనిస్తూ.

    అతి స్వల్పకాలంలో  ఎంతో  చేరువైపోయాడు.

    బహుశా  అలా నిష్కల్మషంగా  కలిసిపోగలగడ  మన్నది నిర్మలమైన మనస్సులు గల పసిపిల్లలకే  సాధ్యమేమో....  

                                          16


    రెస్టు హౌస్ లో మధ్యాహ్నం  భోజనంచేసి  ఈజీఛెయిర్ లో  విశ్రమించిన  చైతన్య అతడు బయలుదేరిన  దగ్గరనుంచీ  జరిగిన సంఘటనల్ని  ఒక్కొక్కటే  మననం  చేసుకున్నాడు.

    గుట్టపైనించి  బండరాయిని దొర్లించి  తనపై  చేసిన  హత్యాప్రయత్నం, అంధుడైన  దానయ్యను  పులివాత బడకుండా  కాపాడటం, ఎర్రచందనం  దొంగతనంగా  తరలించుకు  పోతున్న  ముఠాని  ఆపే విఫల ప్రయత్నం, జీపు  బ్రేకుల్ని  పనిచేయకుండా  చేసి  తనపై  చేసిన రెండో హత్యా ప్రయత్నం.

    చినబగతా తమ్ముడి  శవం  అదృశ్యం  కావడం__

    త్రాచుపాము  బారినుండి  తనను తాను కాపాడుకోవడం__

    తవిటయ్య  మూలంగా  ప్రాణహాని  జరగబోవటం__

    అన్నిటినీ  మించి  అర్దరాత్రి అడవిలో  దివిటీ  ప్రయాణం__

   
    రోజులు  గడుస్తున్నాయి. అడుగడుగునా  ప్రమాదాలు. తన ఎత్తుల్ని  అనుభవాన్ని  చిత్తు చేస్తున్న  మేనీటర్.

    మాప్ ను తీసుకున్నాడు. అడవిలో  మేనీటర్  విజృంభించిన  ప్రదేశాలను  ఎర్ర పెన్సిల్ తో మార్కు చేసుకుని  తరవాత ఏం చేయాల్సిందీ  నిర్ధారణ  చేసుకున్నాడు.

    ఇక తవిటయ్య  సహాయాన్ని  తీసుకోవడంతో  అర్ధం  లేదనిపించి  జీప్ తీసుకుని కుంతెర్ల  గ్రామానికి  బయలుదేరాడు.

    ఒక గంట  వ్యవధిలో  రెండు  ఎద్దుల్నికొని  వాటిని  తాను  పెన్సిలుతో  మార్కు  చేసుకున్న  ప్రదేశాలలో  కట్టేసే  ప్రయత్నంగా  గ్రామస్థుల సహాయం  తీసుకున్నాడు.

    తెల్లగావున  ఎద్దును  గుట్టకు  దిగువ  భాగంలో  ఓ బొప్పాసి చెట్టుకు  కట్టించాడు. రెండో ఎద్దును  పశువుల కాపరిని  మేనీటర్ చంపిన సింధూర  చెట్ల నడుమ  ఓ చెట్టు  మొదలుకి  పలుపుతాడుతో  కట్టే  ఏర్పాట్లుచేశాడు.

    ఓ పద్ధతి ప్రకారం  సంచరించని  మేనీటర్ సరిగ్గా  అక్కడే తిరిగి ప్రత్యక్షమౌతుందన్న  నమ్మకం లేదు.
అంతకుమించి  మనిషి  మాంసానికి  అలవాటుపడ్డ  మేనీటర్ పశువుల  ఎరకు  ఆకర్షితురాలౌతుందన్న  నమ్మకం  అంతకన్నా లేదు. కేవలం  ప్రయత్నం  మాత్రమే.

    కొందరు  వేటగాళ్ళ  అనుభవం  ప్రకారం  ఎరతాలూకు రంగు కూడా  పులిని ఆకర్షించటంలో  చాలా  ముఖ్యమైన పాత్ర వహిస్తుందంటారు.

    చిరుతపులిగాని, పెద్దపులిగాని  తెలుపురంగు  గల  మేకను  గాని, పశువునుగాని  చేరి  చంపడానికి  ఓ రకమయిన  సంకోచాన్ని  ప్రదర్శిస్తుందంటారు. సుమారు ఎనభై చిరుతల్ని  వేటాడిన  ఓ అనుభవజ్ఞుడైన  వేటగాడు.

    నలుపురంగు  గల మేకను  ఎరగా  వాడితే  మేనిటర్ సైతందాన్ని  సమీపించదంటాడు  కారీగాండ్జర్  లాంటి  మరో ఫేమస్ కంటర్.

    ఈ విషయాలు  ఖచ్చితమైనవి  అని నిరూపించే  శాస్త్రీయమైన  ఆధారాలు లేని  వేటగాళ్ళ కేవలం వారి వారి అనుభవాలను  ప్రాతిపదికగా  తీసుకుని  ఎరగా  వాడే  జంతువుల  విషయాల్లో  నిర్ణయాలు  తీసుకుంటుంటారు.

    చైతన్య  ఆలోచనలు వేరు. ఎరగా వాడే జంతువుల రంగన్నది. క్రూరమృగాలను  ఏ కొద్దిగానూ  ఆకట్టుకోవడానికిగాని, అనుమానాల్ని  కలిగించడానికి  గాని  కారణం  కాదన్నది  అతని అభిప్రాయం.

    ఒక బైట్ (ఎర)ను  పులి  సంహరించాలంటే  స్వాభావికంగా  అది ఆకలితోనయినా  ఉండాలి, లేదా  అలవాటైన వినోద  క్రీడగానయినా భావించాలి. అంతేకాకుండా వేటగాళ్ళు  ఒడుపుల్ని ఆకళింపు చేసుకున్న  పులి ప్రస్తుత రోజుల్లో  ఎరను  కట్టిన  విధానంతో  ప్రమాద హేతువో, ప్రమాదరహితమో  నిర్ణయించుకో గలుగుతుంది.

    సామాన్యంగా  ఎరగా  వాడిన  ఎద్దు  మెడలో  తాడును  గమనిస్తే పులి దానిపై లంఘించడానికి  సిద్ధపడదు.

    పశువుల కొట్టాంలో  మాదిరిగా  మెడకు  తాడుతో  అర్దరాత్రివేళ  గ్రామస్థులు  ఓ ఎద్దును  అడవిలో  కట్టి  ఉంచడమన్నది  పులి స్వతహాగా  అనుమానిస్తుంది. అలా అనుమానించడానికి  కారణం  కేవలం  దాని  'ఇన్స్ టింక్ట్'.

 Previous Page Next Page