Previous Page Next Page 
అరణ్యకాండ పేజి 30

    వేగంగా పైకి లంఘించి  చైతన్య మెడపై  పంజాతో  దెబ్బతీయాలనుకున్న  మేనీటర్ రెప్పపాటులో  చెట్టు ఆవలి భాగానికి  చేరుకున్న మనిషిని గమనించక ఆ వూపులో  చెట్టు మొదల్ని ఢీ కొంది.

    మీదనున్న  మంచె వూగిసలాడి  తవిటయ్య  నేలకు  జారిపడతానేమో  అన్న భయంతో  రైఫిలు వదిలి కొమ్మల్ని గట్టిగా  పట్టుకున్నాడు.

    చైతన్యకు  తెలుసు  తనను  తాను కాపాడుకొన్నది. తన ఆయుష్షును పెంచుకున్నది మరో లిప్తమాత్రమే అని.

    అంతే....కళ్ళ ముందు  వేళ్ళాడుతున్నది పామో, కొండచిలువో, మరేదో ఊహించకుండా  గట్టిగా  పట్టుకుని  బలాన్ని  కూడగట్టుకుని వేళ్ళాడుతూ కాళ్ళతో  బలంగా  చెట్టు మొదల్ని  తన్నేడు.

    మరుక్షణం  అతడు  ఎదురుగా  వున్న మరో  చెట్టుపై  ఉన్నాడు.

    విప్పచెట్టును  ఆనుకుని వున్న  మర్రివూడల్ని  తను పట్టుకున్నానని. చాలా దైవికంగా  వాటి సాయంతో  ఎత్తుగా వున్న మరోచెట్టు కొమ్మల పైకి  చేరుకున్నానని  తెలీని చైతన్య వణికిపోతూ  బలంగా కొమ్మల్ని పట్టుకున్నాడు.

    విఫలమైన  తన ప్రయత్నానికి  ఉగ్రురాలైన  మేనీటర్ ఆవేశంగా  చెట్టుపైకి  ప్రాకాలని  గోళ్ళతో చెట్టుమానుపై  మోదుతూ  అడివిని వణికించింది.

    అప్పటికే  ఇంచు మించు  స్పృహ తప్పిపోయినట్టు  నిస్సత్తువగా  ఉండిపోయాడు చైతన్య.

    కొన్ని  నిముషాలపాటు  విశృంఖల  విహారం  చేసిన మేనీటర్ శవాన్ని  నోట కరుచుకుని  మరెక్కడికో  పరుగు తీసింది.

    చైతన్య  ఇరవై నాలుగేళ్ళ  జీవితంలో  ఓ భయంకరమైన  కాళరాత్రిది. తెల్లవారేక  చెట్టుదిగాడు. ఒళ్ళంతా  చెమటతో  ఇంకా  తడిసి పోతూనే  వుంది.

    అప్పటికే  అతని  ముందు  నిలిచిన  తవిటయ్య  రైఫిల్ ను అందించాడు.

    క్రోధంతో  అక్కడి కక్కడే  తవిటయ్యను  కాల్చి  చంపాలన్నంత  ఆవేశాన్ని  నిగ్రహించుకుని  రైఫిల్ ను పైకెత్తి  గాలిలోకి పేల్చాడు.

    ఆశ్చర్యం....ట్రిగ్గర్ నొక్కినా  తూటా బయటికి  రాకుండా మూగ పోయినట్టుండి పోయింది  రైఫిల్. బోల్టు వెనక్కిలాగేడు. రాలేదు లోపల జామైనట్టుగా.

    అంటే....ఎన్నో  రకాల  రైఫిల్స్  హేండిల్  చేయగలిగిన  చైతన్య మేగజిన్ లోని  బుల్లెట్స్ పూర్తిగా చాంబరులోకి  వెళ్ళకుండానే ప్రెస్ చేసి వదిలిపెట్టాడా!

    అప్పుడు  గుర్తుకొచ్చింది  చైతన్యకు, తన పొరపాటల్లా  తవిటయ్యను  నమ్మి  రైఫిల్ ను లోడ్ చేయమనడమేనని. అంటే ఇది కావాలని  జరిగిందా అవివేకంతో  తవిటయ్య అలాంటి  ప్రమాదానికి  కారణమయ్యాడా? చైతన్య ఊహించలేకపోయాడు.

                                         15


    మొదటిసారి  మేనీటరుతో  జరిగిన  ముఖాముఖీ పోరాటంలో  చైతన్య విఫలుడయ్యాడు. వేటాడాలని వెళ్ళి తనే వేటాడబడబోయాడు. పొరపాటు మెకానికల్ గా జరిగిందో, మేన్యువల్ గా జరిగిందో  అప్పటికి  అతనూ  ఊహించలేకపోయాడు.

    తవిటయ్య పై  అనుమానం  మరింత  బలపడింది. అనుభవమున్న ఒక ఫారెస్టు గార్డు అలాంటి  పొరపాటు చేస్తాడంటే  అతనికి  నమ్మబుద్ధి కాలేదు. ఏది ఏమైనా  ఇక ముందు  తవిటయ్యతో  కూడా జాగ్రత్తగా ఉండాలని, అవసరమయితే  అతన్ని ఆ రేంజి నుంచి  ట్రాన్సుఫర్ చేసి పంపేయాలని  నిర్ణయించుకున్నాడు.

    ఆవేశంలో ఒంటరిగా  బయలుదేరి  తన కళ్ళముందే  రాత్రి మేనీటర్ తరలించుకుపోయిన  శవంకోసం గాలించాడు_కాని ప్రయోజనం లేకపోయింది. తన అసమర్ధతకి  సిగ్గుపడ్డాడు. ఇరవై నాలుగు గంటల్లో  రెండు శవాలు  మాయమయ్యాయి.

    స్వతహాగా సాత్వికుడయినా  చైతన్యలో ఊహించలేని అసహనం  పేరుకుపోయి  నిస్సహాయతతో  తన వ్యక్తిత్వాన్ని  కోల్పోతున్నట్టు  అనిపించింది. కళ్ళుమూసుకుని  స్టీరింగుపై తలానించి  ట్రాన్స్ లోకి జారిపోయినట్టుండిపోయాడు చాలాసేపటివరకు.

    మరో అరగంట గడిచేసరికి  జీప్ లో అతడు  కుందనపల్లి  చేరుకున్నాడు. చినబగతా  తనని, తన అసమర్ధతని  కడిగిపారేస్తాడనుకున్నాడు. నీ మూలంగా  కొడుకు శవానయినా  దక్కించుకోలేక పోయానని  నిందిస్తాడనుకున్నాడు.

    కానీ కూల్ గా రిసీవ్ చేసుకున్నాడతను.

    మొదటిరోజులా  కాక మనిషి చాలా దిగులుగా  కూర్చున్నాడు  మౌనంగా.

    "క్షమించండి....నేను ఫెయిలయ్యాను" తలవంచుకునే అన్నాడు చైతన్య.

    "నా దురదృష్టం. నా మేనల్లుడిది  కానీ, తమ్ముడిది  కానీ ఏ శవాన్నీ  దక్కించుకోలేకపోతిని. అందుకే  తలకొరివి పెట్టే కొడుక్కి  నేనైనా  కొరివి పెట్టాలని  శవం తెచ్చుకుంటానంటిని."

    బదులేం  చెప్పాలో  తెలీని స్థితిలో  చాలాసేపటివరకూ  ఉండిపోయిన చైతన్య మనసులో  ఎన్నో అనుమానాలు....ప్రశ్నలు....కాని ఆ పరిస్థితిలో అడగకూడదనుకున్నాడు. అంతేకాదు, తను అనుమానిస్తున్న  విషయాలు  అతడి ముందు వ్యక్తం చేయకూడదనుకున్నాడెందుకో.

    వారందించిన  చిక్కని  మజ్జిగ  తాగి బయటకు  వచ్చాడు.

    జీప్ డ్రైవ్ చేస్తూ  పల్లె మధ్యగా  ప్రయాణం  చేస్తున్న చైతన్యకు ఆ పల్లె కాస్తా పెద్దదిగా  అనిపించినా, అక్కడి వాతావరణమెందుకో  కాస్త కృతకంగా  కనిపించింది.

    ఆ మేనీటర్ మూలంగా  మరణించిన  వ్యక్తుల సంఖ్య  ఎక్కువ భాగం  ఆ పల్లెకు చెందినవారే. మరెన్నో చావులు సంభవించి ఉండవచ్చు. ఎన్నో గ్రామాల్లో, రికార్డ్స్ ప్రకారం  ఎక్కువగా  బలయింది కుందనపల్లికి చెందినవాళ్ళు.

    రెల్లుగడ్డితో కప్పివున్న  పూరిళ్ళతోపాటు  కమ్మలిళ్లు కూడా  ఎక్కువే వున్నాయి.

    కొందరు స్త్రీలు  మరీ అనాగరికంగా  చీరతప్ప  ఒంటిపై మరే అచ్చాదన లేకుండా  వుంటే, మరికొందరు  యువతులు పట్టణాలకు  ఆనుకుని  వున్న పల్లెల్లోని  అమ్మాయిల్లా  అలంకరించుకుని  ఉన్నారు.

    హఠాత్తుగా  దారికడ్డంగా  నిలబడ్డ  వ్యక్తుల్ని  చూసి  జీప్ ను ఆపిన చైతన్య ఏం కావాలన్నట్టుగా  నొసలు చిట్లించాడు.

    బలిష్టంగా  వున్న  పదిమంది  పల్లె  యువకుల  మధ్య కాస్త ఖరీదైన లాల్చీ పైజామాతో  నిలబడ్డ  యువకుడు "నా పేరు రాజ్య పడాలు" అన్నాడు మీసాలు మెలేస్తూ. మొహం  సైజుకు  మించి  పెరిగినట్టున్న మీసాలు  అసహ్యంగా  వున్నాయి.

    "పెదబగతా తమ్ముడ్ని  నేను" మరింత గర్వంగా  చెప్పాడు.

    ఈ ప్రదర్శనేమిటో  అర్ధంకాలేదు చైతన్యకి.

    అయితే  అన్నట్టుగా  చూశాడు.

    "ఈ గేమంలో  పెవేశించినవాళ్ళు  ముందు  వూరి పెద్దయిన  మా అన్న పెదబగతా ఇంట  అడుగుపెట్టిగాని  మరో సోటకి  వెళ్ళరాదు" పొందికగా  మాటాడాలని చాలా ప్రత్యేకమయిన  శ్రద్ధ  తీసుకున్నా, అలవాటైన  మాండలికం దొర్లుతోంది  అతడి మాటల్లో.

    "సెప్పేది మీకే, అంచేత మా ఆతిధ్యం  తీసుకునిగాని  ఎల్లరాదు" అన్నాడు.

    నవ్వుకున్నాడు  చైతన్య  దబాయించి  తీసుకువెళ్ళి  ఆతిధ్యం ఇవ్వాలని, ఆ విధంగా  అందరికంటే  ఆ గ్రామంలో  తామే గొప్పవారమని  నిరూపించుకోడానికి  అతడు  చేస్తున్న  ప్రయత్నం వింతగానూ, అబ్బురంగానూ వుంది.

 Previous Page Next Page