Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 3

  

      "ఇది ఆ దౌర్భాగ్యుడికి నచ్చలేదుట. ఇంతకంటే వాళ్ళ ఎదురింటి నాయుడి గారమ్మాయి బాగుందట. తిట్టేవాడు, కొట్టేవాడు. ఆ బాధలు పడలేక నా దగ్గరకు పారిపోయి వచ్చింది. అప్పట్నుంచీ దానికి నచ్చచెబుతూనే వున్నాను. ఆడది మొగుడ్ని వదిలి వచ్చేస్తే దానిజీవితం ఎంత అధ్వాన్నంగా ఉంటుందో! చిన్నపిల్ల దీనికింకా తెలీదు. నయానా, భయానా చెప్పగా చివరకు ఒప్పుకుంది. మళ్ళీ మొగుడిదగ్గరకు తీసుకువెళ్ళి బ్రతిమాలో, భంగపడో అప్పచెబుదామని యిలా వచ్చాను."
   
    "మీది యీ ఊరు కాదా ఏమిటి?"
   
    "కాదు. గుడివాడ."
   
    "ఒకరు వస్తున్నారు, ఒకరు వెడుతున్నారు. .....అతనేం చేస్తున్నాడు?"
   
    "ఆఁ ఏదో గుమాస్తాపని. నెలకో తొంభై తెచ్చుకుంటాడు."
       
    తరువాత అతనికేం మాట్లాడాలో తోచలేదు. క్లుప్తంగా తెలిశాయి కథలు. అక్కడినుండి లేచివస్తూ యువతివంక ఓరగా చూశాడు. అదేముఖం, అవే చూపులు పేరు అడిగితే బాగుండేది. కానీ ఎలా అడగడం?
   
    బాగా చీకటిపడింది. ఓ ఐదునిముషాలు గడిచేసరికి యింట్లోని దీపాలన్నీ ఆరిపోయాయి. గాలివాన ప్రభావం గోవిందు వచ్చి అవసరమైనచోటల్లా దీపాలు వెలిగించాడు. ఓ అరగంట గడిచాక పైన యజమాని కూర్చున్న చోటుకు వచ్చి "వడ్డించమంటారా బాబూ?" అని అడిగాడు. శివనాథరావు విసుగ్గా "ముందు వాళ్ళకు పెట్టు నాకంత ఆకలిగా లేదు." అన్నాడు. గోవిందు వెళ్ళిపోయాడు.
   
    హఠాత్తుగా మనసంతా కలచివేస్తోంది. గబగబా బీరువా తెరచి కొన్ని ఉత్తరాలు బైటకు తీశాడు. పదివరకూ వున్నాయి మొత్తం. వాటిల్లో భాషకు అర్ధంలేదు. కానీ అతనికి అర్ధం తెలుసు. పది ఉత్తరాలూ పదోసారి చదువుకుంటున్నాడు వింతగా కూర్చుని. కొన్నాళ్ళక్రితం ఈ ఉత్తరాలన్నీ వరుసగా ఎక్కడో ఎవరూ చూడకుండా కూర్చుని ఓ వ్యక్తి ఓపిగ్గా రాసింది. విచిత్రమే ఆ ఉత్తరాలు రాయబడినప్పుడు సమయం ఏ అర్ధరాత్రో అయివుంటుంది. లేకపోతే యింట్లోనివాళ్ళంతా గుడికి వెళ్ళి వుంటారు. లేకపోతే హరికథకు వెళ్ళి వుంటారు. లేదా మధ్యాహ్నం తండ్రి పొలానికి, తల్లి ఇరుగుపొరుగుల్తో లోకాభిరామయణానికీ, అన్న చంద్రాయణానికీ వెళ్ళినప్పుడు రాయబడి వుంటాయి. చెల్లెలికో, తమ్ముడికో అణో బేడో లంచం యిచ్చి పోస్టు చేయించి వుంటుంది. ప్రేమికుల కష్టాలు ఇక్కడినుంచే ప్రారంభమౌతాయి. అసలు ప్రారంభంనుంచీ కష్టాలేగా!
   
    "మనసు పరిపరివిధముల పోవుచున్నది."
   
    "ఇంత పెద్ద విషయం సరోజినికెట్లా తెలిసిందో" అని ఆశ్చర్యమేసింది.
   
    "ఎప్పుడూ నిన్నే చూడాలని వుండును."
   
    "హా! నా ప్రియతమా! నాకును అంతియే. సర్వదా నిన్నే చూడాలని వుండును." తన ఆలోచన తనకే నవ్వు వచ్చింది.
   
    "ఆరోజు మెట్లమీద ఎదురుబడి నీవు ఏదో చిలిపిపని చేయబోతే"
   
    అంత ధైర్యం ఎలా వచ్చిందా అని యిప్పుడు ఆశ్చర్యంగానే వుంది. తను డాబామీదనుంచి దిగివస్తున్నాడు. సరోజినీ పైకి వస్తోంది. దారి యివ్వకుండా అడ్డం నిల్చున్నాడు తను. 'దారి యివ్వు' అంది సరోజిని. 'ఇవ్వను' అన్నాడు నవ్వుతూ. 'అయితే దిగిపోతాను' అంటూ వెనక్కి తిరిగింది. 'ఇదిగో' అంటూ పమిటచెంగు పట్టుకుని లాగాడు. 'ఉష్' అంటూ నిర్ఘాంతపోయి మళ్ళీ యిటు తిరిగింది సరోజిని. అతని నరాలు వణికాయి. ఓ మెట్టు క్రిందకు దిగాడు. అప్పుడే స్నానంచేసి వచ్చినట్లుంది సరోజిని. సబ్బు పరిమళం వెదజల్లుతోంది ఆమె శరీరం. మరో మెట్టు క్రిందకు దిగాడు. 'అబ్బ! వొద్దుబాబూ- అంటూ చెంగు విడిపించుకుని దిగి వెళ్ళిపోయింది.
       
    "ఆ నదీ తటాకంబున మన షికారు విహారములు"
   
    అంటే మరేం లేదు. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు కృష్ణ ఒడ్డున గడపడం.
       
    "అనుక్షణమూ నా హృదయమందిరమున నిన్ను పూజించుచున్నాను."
   
    "ధన్యున్ని"
   
    ఈ క్షణంలో ప్రపంచంలో తనకంటే అదృష్టవంతుడెవడూ లేడు. ఎవరు అందుకోగలరు ఈ అమాయకత్వాన్ని? హాస్యంలో యింత గంభీరతను ఎవరు సృష్టించగలరు? తను ధన్యుడు కాదా మరి?
   
    మళ్ళీ ఉత్తరాలన్నీ బీరువాలోపెట్టి తాళం వేసేశాడు. ఈ అద్భుతమయిన వాతావరణంలో సున్నితమైన ఆ ఉత్తరాలు ఎంతో హాయిని కలిగించాయి. ఒంటరితనంలో కలిగే వైరాగ్యం, గతించిన జీవితపు పుటలు చదువుకునే తరుణంలో కలిగే కలవరపాటు అణిచివేసే శక్తి ఆ లేఖలకు వుంది. ఈరోజు ఎందుకో సరోజినిని చూడాలని ఆరాటంగా వుంది.
   
    గాలివాన ఉధృతం లోపలికి కూడా విజ్రుంభిస్తోంది. తన హృదయంలో ఓ పెద్ద ఝంఝానిలం చెలరేగి తన ప్రపంచ ప్రళయరూపముతో అందులో వున్న వ్యక్తుల్ని నామరూపాలు లేకుండా చేసి, మరీ భీకరరూపాన్ని దాల్చి, అతని సుకుమారమైన మనస్సుని తూట్లు పడవేస్తోంది. రక్తం నీరుగా మారినట్లు అయోమయమైన అవస్థ ఛా! ఈ ఆలోచన "మేనియా" తనతోగాని సమాప్తం అయ్యేటట్లు లేదు. ఈ ప్రవృత్తి యిదివరలో చాలామంది మిత్రులకు విసుగూ, ఉత్సాహము అలిగించింది.
   
    ఒక మిత్రుడు తన సోది చాలాసేపు చెప్పి చెప్పి చివరకు "నీ అభిప్రాయం ఏమిటి?" అన్నాడు.
   
    "అదే బాగుంటుంది" అన్నాడు తాను.
   
    "ఏది?"
   
    ఏదో తనకేం తెలుసు? అసలు అతను చెప్పిందంతా వినే సహనం తనలో ఏదీ? ఏదో ఒక మొగవాడి పేరూ, యిద్దరు ఆడవారి పేర్లూ అతని సోదిలో దొర్లినట్లు గుర్తువచ్చింది.
   
    "లీలని నువ్వు పెళ్ళి చేసుకోవడం."
   
    అతను చకితుడై "లీల ఎవరు?" అని సూటిగా ప్రశ్నించాడు.
   
    "లీల...కాదు, మా...ల..." అని తన అవస్థను గ్రహించుకుని, మాటలకోసం వెతుక్కుంటున్నాడు.
   
    "ఇదన్నమాట నువ్వు వినడం" అని మిత్రుడు కోపగించుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆరోజంతా తను సిగ్గుతో చచ్చిపోయాడు.
       
    మరోరోజు క్లబ్బులో కూర్చుని తనూ మరో మిత్రుడూ లోకాభిరామాయణంలో వున్నారు.
   
    "నేనో బొమ్మ గీశాను దానిని గురించి నీ అభిప్రాయం చెప్పాలి" అన్నాడు. మిత్రుడు మాటల మధ్యలో.
   
    "అలాగే!" అన్నాడు తను తల ఊపేసి.
   
    "నాకు రేపు ఉదయం తీరదు. పనివాడిచేత పంపిస్తాను....ఇది నా ప్రథమ ప్రయత్నం. నెలరోజులు శ్రమ."
   
    మరునాడు పన్నెండింటికి తమ యింట్లో ఫోన్ మ్రోగింది. 'హలో' అన్నాడు.
   
    "హలో! నేను, ఆ బొమ్మ పదింటికి పంపించాను. నీ అభిప్రాయం ఏమిటి?"
   
    నిన్న అతనికి మాట ఇచ్చాక ఆ విషయమే మరచిపోయాడు. అసలు ఎక్కడపెట్టి మరచిపోయాడో ఆ చిత్రం? ఆ మాటచెబితే నొచ్చుకుంటాడేమో అని "నువ్వు పంపినప్పటినుండి అదే పరిశీలిస్తున్నాను. అన్నట్లు మరిచాను ఆ చిత్రం పేరేం పెట్టావు? అదీ! ఏదో అక్షరంతో మొదలవుతుందబ్బా!" అభినయించడం సాగించాడు.
   
    "ఊహా ఊర్వశి'
   
    "రైట్! ఊహా ఊర్వశి నేన్నమ్మను, నీ మొదటి ప్రయత్నమంటే ఆర్ట్ గురించి తెలిసినవాడు ఎవడూ నమ్మడు. ముఖ్యంగా ఆ కళ్ళు వున్నాయి చూశావ్! నేనెప్పుడూ ఊహించలా అంతబాగా చిత్రిస్తావని. జఘనం! ఓహో! బ్రహ్మానందం ఆ చెక్కిళ్ళు... షెభాషనిపించావు. ఆ వ్రేళ్ళకు కొంచెం ఫినిషింగ్ టచెస్ ఇస్తే బాగుండేది. కురులు అద్భుతం పద్దెనిమిదో శతాబ్దం యిన్ ఫ్లూయెన్స్ కొంచెం ఉపయోగించుకున్నావనుకుంటా - అందుకని కొట్టొచ్చినట్టుగా వుంది. ఆ నడక కాస్త ఇటాలియన్ టైపుగా వుంది."
   
    అవతలి గొంతు ఆశ్చర్యంతో "నేను కాళ్ళదాకా వెయ్యలేదే?"
   
    "వెయ్యలేదూ? అవునవును వెయ్యలేదుగా. నాకింకేదో గుర్తువచ్చి...చెబుతున్నా."
   
    తర్వాత ఆ చిత్రంకోసం వెదకడం మొదలుపెట్టాడు. ఎంతకీ కనపడదు. పది నిముషాల్లో మళ్ళీ ఫోన్ మ్రోగింది.
   
    "హలో! మా ఫ్యూన్ ఆ బొమ్మ మీ యింటికి తీసుకురావటం మరిచి పోయాడుట. అది ఇక్కడే వుందే."

 Previous Page Next Page