Previous Page Next Page 
శతఘ్ని పేజి 28

 

    కృష్ణకళ్ళలో భయంపేరుకుంది..... "కాని నీ కంతధైర్యం లేదుకదూ..."
    
    లేదంటే లక్ష రూపాయలు అదృష్టం చేజారిపోయేట్టుంది. కంగారుగా అన్నాడు కృష్ణ "అహ...అంత డబ్బిస్తానంటే కష్టమైనా....."
    
    "హత్యచేస్తానంటావ్" నవ్వేశాడు పరమహంస"కాని దానికి గట్స్ కావాలి కృష్ణా! అవే ఉంటే నువ్విలా పిరికివదిల ఆత్మహత్యకి సిద్దపడే వాడివి కాదు..... సో నీలాంటివాడికి హత్యకన్నా ఆత్మహత్య సులభం...."
    
    కరెన్సీ నోట్లని కృష్ణ ముందుగిరాటేశాడు పరమహంస. అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
    
    "ఇదంతా...."అంత డబ్బుని ఎప్పుడూ చూసి ఎరుగని కృష్ణ తడబడిపోతున్నాడు.
    
    "నీకోసమే కృష్ణా....."
    
    "నిజంగా...." నమ్మలేకపోతున్నాడేమో కత్తిమొనల్లా పదునుగా వున్న కరెన్సీ అంచుల్ని ఉద్వేగంగా స్పృశించాడు "నిజం కృష్ణా.....నీమీద జాలితో నీపరంగా నీ కుటుంబానికి మేలు జరగాలన్న ఆలోచన తో ముకుందంగారు అడ్వాన్సు గా నీకిస్తున్న యాభైవేలు..."
    
    ఆనందం, ఆందోళన, తత్తరపాటు" అందాకా ఇది తీసుకో....ఆనక అంటే మరో రెండు రోజుల్లో నీకు మిగతా ఏభైవేలూ ఇస్తాను...."
    
    "ఏం చేయాలి నేను" ఏం చేయడానికయినా సిద్దమన్నట్టు కంపిస్తూ అన్నాడు కృష్ణ "సింపుల్ నువ్వు చచ్చిపోవాలి."
    
    నిప్పుని తాకినట్టు గభాల్న చేతుల్ని వెనక్కి తీసుకున్నాడు కృష్ణ.
    
    "అవును కృష్ణా....ఎందుకూ కొరగాకుండా చావాలనుకున్న నువ్వు నీ బ్రతుకుని లక్షరూపాయల ఖరీదుతో మా కోసం వెచ్చించాలి"
    
    ఇలాంటి బేరాలూ ఉంటాయనీతెలీని కృష్ణ అవాక్కయిచూస్తున్నాడు "ఎలాఅంటే ఆత్మాహుతికి సిద్దపడి...." చేయాల్సింది చెప్పుకుపోయాడు పరమహంస "ఈ డబ్బును తీసుకున్న నువ్వు ఎల్లుండి సాయంకాలానికల్లా మిగతా డబ్బునీ తీసుకుంటావు. అదితీసుకున్న అరగంటకల్లా నీ కుటుంబానికి అందించి వెంటనే డబ్బుతో పాటు మేం అందించే లీటర్ పెట్రోల్ ని నీ ఒంటిపై పోసుకుని మేం చెప్పిన చోటచావాలి. కాకపోతే చచ్చేముందు నువ్వు సీతారామరాజు అమర్ రహే అంటూ ఓ రెండు సార్లు గట్టిగా గావుకేకలు పెట్టాలి......బస్.....అంతే..."
    
    ముందుభయమనిపించింది ఆ తర్వాత కాదంటే ఈ డబ్బు దక్కదన్న విషయమూ స్ఫురించింది.
    
    "ఆలోచించుకో కృష్ణా, నువ్వు చచ్చేఅమరవీరుడు కృష్ణ అనేఖ్యాతి మాత్రమేకాదు నిస్సహాయంగా వున్న నీ కుటుంబానికి లక్ష రూపాయల రాబడి. నీ తల్లికి ట్రీట్ మెంట్, నీ అక్క ఇక వ్యభిచారంచేయనవసరంలేని పరిస్థితి. నీలాంటివంశాంకురాన్ని కన్న నీ తల్లికి జాతి నివాళులు బ్రహ్మరధం...."హిప్నటైజ్ చేస్తూ చెప్పుకుపోతుంటే "చాలు....." గావుకేకలా అరిచాడు కృష్ణ.
    
    లేతగులాబి గుండె రెమ్మల్లారాలిపడుతున్న అశ్రువులు.....కాలాన్ని కడుపు మంటతో శాపించాలన్న తమకం....."చేస్తాను....కాదు చస్తాను.....ఈ డబ్బంతా నాకిస్తానంటే ఇంకా దారుణంగా అయినా చస్తాను"
    
    "గుడ్" అభినందించాడు పరమహంస. "వెంటనే ఈ డబ్బు తీసుకువెళ్ళనీ వాళ్ళకి అందచేయి. ఆ తర్వాత ఇక్కడికి రా. కోరింది తిను....... ఆడు.....పాడు.......మిగిలిన స్వల్పకాలం ఏం కావాలన్నా అంటే అది ఎలా బ్రతకాలి అంటే అలా నీ ఇష్టం వచ్చినట్టు"
    
    వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు కృష్ణ.
    
    "కాని ఒక్క షరతు" హెచ్చరికలా అన్నాడు పరమహంస" ఇదంతా చాలా గోప్యంగా జరిగిపోవాలి. అంటే ఈ రహస్యం నీ డబ్బు మాత్రమే కాక మరో అర లక్ష నీకింకా కావల్సివుందని గుర్తుంచుకో అంతే కాదు. దక్కిన ఈ యాభైవేలు చాలని నువ్వు తెలివి మీరి ప్రవర్తిస్తే నీతోపాటు నీ కుటుబం అంతా నాశనమౌతుంది"
    
    వెళ్ళిపోయాడు కృష్ణ. అప్రతిభుడైచూస్తున్న ముకుందంకొద్దిపాటి అపనమ్మకాన్ని ప్రదర్శించబోతుంటే అన్నాడు పరమహంస"తిరిగి రాడన్న అనుమానం నీకక్కర్లేదు ముకుందం. ఈ తరగతి మనుషులగురించి నాకు బాగా తెలుసు. కృష్ణ పెదవి విప్పకముందే అతడి వివరాలన్నీ సేకరించాను. నేను కావాలనే ఇప్పుడు ఇంటికి పంపాను ఈ ఒక్కరాత్రి తనవాళ్ళతో గడిపి రేపు ఉదయానికల్లా ఇక్కడికి వస్తాడు ఆ మాత్రం అవకాశం ఇవ్వడం తప్పుకాదుగా"
    
    "ఇప్పుడేంచేయబోతున్నారు?"
    
    చెప్పాడు పరమహంస ప్రసన్నంగా"ఈ సాయంకాలానికి కల్లా ఓ తెలుగు దినపత్రిక ఈవెనింగ్ ఎడిషన్ రిలీజ్ చేస్తుంది. అందులో బ్రహ్మాజీచెక్కుచెదరని ధీశాలి గురించి మాత్రమేకాక ఎల్లుండి సాయంకాలం అంబేద్కర్ విగ్రహందగ్గర ఆత్మాహుతి చేసుకోబోతున్న ఓ విద్యార్ధి స్టేట్ మెంట్ గురించి ప్రజలకు తెలియచెబుతుంది. హఠాత్తుగా నగరంలో ముఖ్యంగా విద్యార్దిలోకంలో సంచలనం రేగుతుంది. ఆ విద్యార్ధిని అరెస్ట్ చేయాలని పోలీసు బలగం రంగంలోకి దిగుతుంది కాని ఆ విద్యార్ధిఎవరో తెలీక చేష్టలుడిగి నిలబడిపోతుంది. సీతారామరాజు విషయంలో బ్రిటిష్ వాళ్ళచేత క్షమార్పణలు చెప్పించలేని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పై అక్కసుతోనే రేపటి కల్లా రాష్ట్రం సరిహద్దుల్నిదాటి పార్లమెంటుభవనంలోనూ ప్రవేశించి దేశస్థాయిలో అలజడిని సృష్టిస్తుంది అంటే.....కృష్ణనబడే ఈ నిప్పురవ్వ ఆరిపోతూ సైతం విద్యార్ధి లోకాన్ని మండేంత దావానలమై పోతుంది. ఇంకెంత మరో నలభైతొమ్మిది గంటలు...అంతే"
    
    వ్యవస్థకి విషద్రావకం ఎక్కించి ఆడుకోగల్ల పరమహంస నమ్మకం తప్పుకాలేదు.
    
    కృష్ణమరణానికి సిద్దపడినమాట నిజమే అయినా డబ్బు తీసుకుని సరాసరి ఇంటికి వెళ్ళలేదు. ముందు ఓ ప్రాణ స్నేహితుడ్ని కలిసాడు. అదీ చాలా తప్పనిసరై. పరమహంస వూహించలేనినిజం కూడా అదే.
    
    ఆ సాయంకాలంనగరం నిజంగానే అట్టుడికిపోయింది దానిక్కారణం ఓ ఈవెనింగ్ ఎడిషన్ లో ప్రచురించబడిన సంచలనవార్త.
    
    "దారికిరాని ప్రభుత్వ పై పత్రికలో ఓ విద్యార్ధి చేసుకోబోతున్న ఆత్మాహుతి"
    
    "శుక్రవారం సాయంకాలం అయిదు గంటలకి నగరంలోకి అంబేద్కర్ విగ్రహం వద్ద పెట్రోలు పోసుకుని ఆత్మాహుతికి సిద్దపడుతున్నట్టు మా పత్రికా కార్యాలయానికి ఓ కాలేజీ స్టూడెంట్ ఫోన్ చేయడంజరిగింది. ఆ విధ్యార్ధి అంతకన్నా వివరాలు అందించలేదు. కాని సీతారామరాజు విషయంలో బ్రిటిషు ప్రభుత్వం దారికి వచ్చి క్షమార్పణలు చెప్పి తీరాలన్న ఆలోచనకి తొలి సమిధలా తను ఆహుతి కావాలనుకుంటున్నట్టు తెలియచేశాడు. అంతేకాకుండా బ్రహ్మాజీవంటి నిష్కళంక దేశభక్తుడు తన మరణంతో నిరాహారదీక్ష విరమించాలని తనలాంటి విద్యార్ధులని కూడా ఉద్ఘాటించాడు."
    
    చప్పబడిపోతున్న బ్రహ్మాజీ ఉద్యమానికి వూపిరిలావేడినందించిన ఈ వార్త అపరాత్రి దాకా అందరూ చర్చించుకుంటున్న సమయంలో.....మురికివాడలోని చిన్న పెంకుటింటిలో అడుగుపెట్టాడు కృష్ణ.
    
    ఆరిపోవాలని వెలుగుతున్న కన్నీటి దీపంలా నులక మంచంపై అమ్మ.....ఎక్కుపెట్టిన ప్రశ్నలా ఓ మూలకూర్చున్న అక్కయ్య. మసక వెలుతురుఅయితేనేం గుర్తించాడు ఇంటికొచ్చిన కృష్ణని. "కృష్ణా" ముందు చుట్టేసింది అక్కే. అది కాదు కృష్ణని అంతగాకలవర పరిచింది కలత చెందిన కృష్ణ ఇల్లు వదిలివెళ్ళడానికి తనేకారణమనిపించి ఎన్నిగంటలు కలవరపడిందో ఆమె చెంపలపై చారికలు స్పష్టం చేస్తున్నాయి. "నే....ను....తప్పు.....చేశాను.....నిజమే..... అంత దానికి అమ్మని కూడా కాదని ఎలా వెళ్ళగలిగావు."

 Previous Page Next Page