Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 28


    మహేష్ కు కలలా , మాయలా వుంది. ఈ అమ్మాయి తనతో యిన్నాళ్ళు నటిస్తూ తన అవసరాల కోసం ఉపయోగించుకుంటూ గడిపింది. తనను ఓ బొమ్మను చేసి ఆడించింది.
    తన జీవితంతో ఆటలాడుకుంది.
    "ఏయ్! మళ్ళీ యింకో నాటకమా? నేనే అంజనేయుల్ని వస్తావా రావా?" అంటూ ఆ వ్యక్తీ తేరుకుని ఆమెను చెయ్యి పట్టుకుని లాగుతున్నాడు.
    మహేష్ తన ఆలోచనల్లోంచి కోలుకుని, కళ్ళముందు జరిగే అత్యాచారానికి ఉద్రేకం ఆపుకోలేక ముందుకు ఉరికాడు.
    మేడమీద పిడుగు పాటు లాంటి దెబ్బ పడటంతో ఆంజనేయులు విద్యుద్ఘాతం తగిలినట్లు వొనికి ఆమెను విడిచి పెట్టి ప్రక్కకి తూలాడు. ఆ షాక్ నుంచి తేరుకునేందుకు ప్రయత్నించేటంతలో నడుం మీద విసురుగా యింకో తన్ను. నాలుగడుగుల దూరంలోకి వెళ్ళి బోర్లా పడ్డాడు. ఆపడటంలో నేల నున్న రాయి తగిలి, చిట్లి బొటబొట నెత్తురు కారింది. ఆంజనేయులు స్నేహితుడు వెనుక వైపు నుంచి మహేష్ మీదకు దూకి పిడికిళ్ళు బిగించి తలమీద కొట్టటానికి ప్రయత్నించాడు. బ్యాలెన్స్ చేసుకోలేక అతను క్రిందపడి తిరిగి లేవబోతుండగా మొహం మీద యింకో తన్ను . కనీసం మొహం కాపాడుకుందామని ప్రక్కకి తిరగాబోయేటంతలో పళ్ళు ఊడిపోయేలా నోటిమీద యింకోటి. కళ్ళు చీకట్లు క్రమ్ముతుండగా తల ప్రక్కకి వాల్చేశాడు.
    జరిగేదంతా ప్రియంవద నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడింది.
    మహేష్ ఆమె దగ్గరకు వొచ్చి రెక్క పుచ్చుకుని "పద" అన్నాడు.
    ఇద్దరూ మాట్లాడటం లేదు. ఇద్దరి మనస్సులో అగ్నిపర్వతాలు బ్రద్దమవుతున్నాయి. ఇద్దరి గుండెల్లో సముద్ర కెరటాల ప్రళయ ఘోషలు వాదిస్తున్నాయ్.
    మెయిన్ రోడ్డుమీదకు వోచ్చేశారు.
    ఆమె అతని ముఖంలోకి చూసింది. ఎన్నడూ లేనంత కోపంగా ,  ఆవేశంగా , ఉద్రేకంతో వోణికిపోతున్నాడు.
    ఆమె అతన్ని పలకరించాలంటే చాలా భయంగా వుంది. తప్పు చేసినట్లు , పశ్చాత్తాపంతో కుమిలి పోతున్నట్లు.....కళ్ళలో నీళ్ళు ఉబుకుతున్నాయి.
    ఎలాగో ధైర్యం కూడగట్టుకుని "మహేష్" అంది.
    అతను పలకలేదు.
    చెయ్యి పట్టుకుని "బావా!' అంది దీనంగా.
    ఆమె చేతిని విదిలించి కొట్టాడు. పూర్తిగా అభిముఖంగా తిరిగి ముఖంలోకి సూటిగా చూస్తూ "యూ .....యుహ్యావ్ చీటేడ్ మీ లైక్ ఎనీ థింగ్."
    "మహేష్ ప్లీజ్! నేను చెప్పేది విను."
    "నో . లీవ్ మీ ఎలోన్.'
    "ఐ కాంట్ . ఎందుకిలా జరిగిందో...."
    "నాకేమీ చెప్పవద్దు.....అని అమెనక్కడ వొంటరిగా వొదిలేసి విసురుగా వెళ్ళిపోయాడు.

        
                              *    *    *

    సునంద గదిలో కూర్చుని కాసేపు ఆ పుస్తకం యీ పుస్తకం తిరగేసింది. కాని ఆమె మనసు వాటిమీద లగ్నం కావటం లేదు. ఈలెటర్ మహేష్ కి డైరెక్ట్ గా అందచేసేయ్యాలి.
    సమాధానం కూడా....
    ఇంకా సమాధానమేమిటి? తనలాంటి అమ్మాయి.....
    ఆమె పెదవులమీద ఆత్మవిశ్వాసంతో కూడిన చిరుహాసం ఉదయించింది. లేచి, వొళ్ళు విరుచుకుని గోడ దగ్గర కెళ్ళింది.
    "బ్రా - బనీను ' మీద ఆమె దృష్టి పడింది. ఇదిలా ఎందుకుంది? విడదీయటానికి వీల్లేకుండా అంటుకుపోయినట్లు , ఊడి రానట్లు.
    "ఏమోలే ' అనుకుంటూ ప్రక్కకు తిరిగేసరికి అంజనేయులి చిత్రం కనిపించింది. ఆమెకు నవ్వు వొచ్చింది. బంగారం లాంటి బావను యింట్లో పెట్టుకుని .....పిచ్చి పిల్ల ....యీ మొద్దు మొహాన్నిలా ఆరాధిస్తుంది!
    పోనీ ఆరాధిస్తున్నదనుకో , అంత అందమైన అమ్మాయి దొరికినందుకు సంతోషించక యీ ప్రబుద్దుడు ఆ పిల్లనలా ఎడిపిస్తాడేమిటి?"
    ఆమెకు అంజనేయుల మీద కోపమొచ్చింది. తన స్నేహితురాల్ని మోసం చేసినందుకు శిక్షించాలనుకుని పిడికిలి బిగించి అతని మొహం మీద ఓ దెబ్బ వేసింది.
    ఆ దెబ్బకు అట్టకు అంటించి వున్న చిత్రం కదిలి క్రింద పడింది. "అరె పాపం" అనుకుంటూ వొంగి ఆ చిత్రాన్ని అందుకుంటూ ఉలికి పడింది. ఇప్పుడామె చేతిలో అంజనేయులి చిత్రం లేదు. మహేష్ రూపం వున్నది.
    "ఏమిటిది?' అనుకుంటూ నిర్ఘంతపోయి చిత్రాన్ని తలకిందులు చేసింది. అంజనేయులి రూపమొచ్చింది.
    ఆమెలో మంచుతెరలు విడిపోతున్నాయి.
    మళ్ళీ తలక్రిందులు చేసింది. మహేష్ రూపం.
    ప్రియంవద బొమ్మలు బాగా గీయగలదని ఆమెకు తెలుసు. కాని ఆమెలో యింత టాలెంట్ వుందని తెలీదు.
    చిత్రాన్ని మాములుగా చూస్తే ఒక రూపం తలక్రిందు లాగా చూస్తె యింకో రూపం వోచ్చేలా. ఎవరికి ఏమాత్రం అనుమానం కూడా కలగకుండా  గీసి, తన కళ్ళముందే ఎప్పుడూ వుండేలా చేసుకుంది.
    సునంద భ్రమలు విడిపోయాయి. ఓ కొత్త సత్యం దృగ్గోచరమై పెరిగి, హిమాలయమై ఆమెను కుదిపివేసింది.
    ఒణికే చేతుల్తో చిత్రాన్ని మహేష్ రూపం కనిపించేలా గోడకు అమర్చి, నీళ్ళు నిండిన కళ్ళతో చూస్తూ నిలబడింది.
    "మహేష్ ! నువ్వు నవాడివి కాదు. నా వాడిని కాదు."
    జాకెట్ లోంచి ఉత్తరం తీసి ముక్కలు ముక్కలుగా చింపివేసింది. ఆ చింపటంలో కసి లేదు, ద్వేషం లేదు. ఓడిపోయానన్న బాధ వుంది. తనకు చెందని వస్తువు కోసం తాపత్రయపడకూడదన్న సంస్కారం వుంది.
    మెల్లగా బయటకు వచ్చి , తలుపులు దగ్గరగా జారవేసి, తమ యింటికేసి నడిచి వెళ్ళిపోయింది.


                             *    *    *

    మహేష్ గదికి వొచ్చాడు. ఈ ప్రపంచమంతా చీకటి మయమనిపించింది. ఎంతో ఆప్తమైన, ప్రియాతి ప్రియమైన వస్తువును పోగొట్టుకుని, సర్వం శూన్యమైపోయినట్లు విచిత్ర భావన.
    గదిలోని వస్తువులన్నీ చిందర వందర చేసి పారేయ్యలని పించింది. బల్ల మీద వున్న గ్లాసును విసిరి కొట్టాడు, పగిలి నేలంతా గాజుముక్కలూ రాలిపోయినాయి.
    దృష్టి గోడ కున్న బ్రా. బనీన్ మీద పడింది. "విడదీసేస్తాను క్రూరంగా విడదీసేస్తాను." అనుకుంటూ చెయ్యి దాని మీద వెయ్యిబోయి ప్రక్కకి చూసి త్రుళ్ళి పడ్డాడు. గోడకు తన చిత్ర పటం వుంది.
    ఆంజనేయులు బొమ్మ ఏది? ఏమయింది.
    చితం వంక తీక్షణంగా చూసి, ఏదో అనుమానం తోచి, చేత్తో దాన్ని గిర్రున త్రిప్పి తలక్రిందులు చేశాడు.

 Previous Page Next Page