ఇద్దరూ సైలెన్సయిపోయారు.
"ఇద్దరూ లేవండి ముందు"
ఇద్దరూ లేచి నిలబడిపోయారు.
"ఇలా దగ్గరకు రండి"
"దగ్గరకాండీ' దిగులుగా అడిగాడు సింహాద్రి.
"అవును"
"ఎందుకులెండి! ఇక్కడికి బాగానే వినబడుతున్నాయ్ మీమాటలు"
"ఐసే షటప్! వస్తారా? నన్నే మీ దగ్గరకు రమ్మంటారా?"
ఇద్దరు కర్నల్ వేపు రెండడుగులు వేశారు.
"నేనడిగేది మీరు ఇక్కడ నా యింట్లో ఏం చేస్తున్నారూ అని?"
"కూర్చున్నామండీ"
"జస్ట్ రిలాక్సింగ్" సర్ది చెప్పాడు సింహాద్రి.
"ఎందుక్కూర్చున్నారు?"
అప్పుడర్ధమయింది చిరంజీవికి కర్నల్ ప్రశ్నలోని అర్ధం.
"అదా- మేము మీ ఇంటికెందుకొచ్చామనా మీ అభిప్రాయం" అంటూ ఈజీగా కనిపించడానికానీ గట్టిగా నవ్వాడు చిరంజీవి" సంగతేమిటంటే మేము శ్రీదేవిగారి బర్త్ డే కోసం వచ్చామండీ"
"బర్త్ డే కా?" కర్నల్ కి రాన్రాను వాళ్ళమీద అనుమానం బలపడిపోతోంది.
"ఎగ్జాక్ట్ లీ"
"ఎవరు పిలిచారు మిమ్మల్ని?"
"శ్రీదేవిగారేనండీ!"
"ఏదీ- శ్రీదేవి పంపిన ఇన్విటేషన్ కార్డ్ చూపించండి"
"అదా! అది పోస్ట్ లో మిస్సయిపోయిదండీ!"
కర్నల్ నడుముకి వేలాడుతున్న పిస్టల్ మీద చెయ్యి వేశాడు.
"పోస్ట్ లో మిస్సయిందా! నేన్నమ్మను" అన్నాడు కఠినంగా.
"నమ్మరా?" ఆశ్చర్యంగా అన్నాడు సింహాద్రి.
"ఛస్తే నమ్మను"
సింహాద్రి ఆశ్చర్యంగా చిరంజీవి వేపు చూశాడు.
"ఏమిట్రా! నమ్మనంటున్నారు?"
"పోస్టల్ వాళ్ళు మాగజైన్లు, యితర పుస్తకాలు చాలావరకూ కొట్టేస్తూంటారండీ!"
"అవునండీ, కావాలంటే, ఏ మాసపత్రిక ఎడిటర్నయినా అడగండీ!"
కర్నల్ యింక సహించదల్చుకోలేదు. తను యిప్పటికే చాలా ఎక్కువ మార్జిన్ యిచ్చాడు వీళ్ళకు. ఇంత మార్జిన్ ఈమధ్య కాలంలో ఎవరికీ యివ్వలేదు. రంగాగాడు కాబోలు-పంజరంలో వున్న చిలకల్లో ఒకదానికి జ్వరం వచ్చినప్పుడు బయటకు తీస్తుంటే ఎగిరిపోయిందది. అలాంటి చిలకను వదిలేసినందుకు వాడిని కాల్చి పారేద్దామనుకున్నాడు గానీ, వాడు రెండ్రోజులు టైమడిగి. దానిని మళ్ళీ పట్టి యివ్వడం చేత ఊరుకున్నాడు.
"గెటౌట్" అన్నాడు కర్నల్ బయటకు దారి చూపుతూ.
సింహాద్రీ, చిరంజీవీ ఆశ్చర్యంగా ఒకర్నొకరు చూసుకున్నారు.
"ఎవర్నండీ" అర్ధం కాక అడిగాడు సింహాద్రి.
"ఇడియట్! యింకెవర్ని? మిమ్మల్నే!"
"కానీ... మమ్మల్ని బర్త్ డే కి రమ్మని....."
"షటప్! అరచాడు కర్నల్.
"యిదిగో యిప్పుడు టైమెంతయిందో తెలుసా?"
"తెలీదండీ!"
"పదకొండు గంటల ఎనిమిది నిమిషాలయింది"
"ఫర్లేదండీ! మాకింకెక్కడా వేరే పనిలేదు" చెప్పాడు చిరంజీవి.
కర్నల్ అదేమీ వినిపించుకోలేదు.
"మీకు సరిగ్గా రెండు నిముషాలు టైమిస్తున్నాను. ఈ రెండు నిమిషాల్లో ఇల్లూ, కాంపౌండూ కూడా దాటి బయట పడకపోతే ఆ తర్వాత ఈ పిస్టల్ గుళ్ళకు స్ట్రెచర్ మీద వెళ్ళాల్సి వస్తుంది... ఓకే?"
"ఒకేసార్" అన్నాడు చిరంజీవి అప్పుడే తలుపు వేపు అడుగులు వేయటం ప్రారంభిస్తూ.
"కొయ్ ట్ సింపుల్" అన్నాడు సింహాద్రి అతన్ని ఫాలో అవుతూ.
సరిగ్గా అప్పుడే శ్రీదేవి నవల పట్టుకుని పరుగుతో వచ్చిందక్కడికి.
"హల్లో డాడీ!" అంది కర్నల్ ని చూసి ఆప్యాయంగా.
"హల్లో బేబీ!" కోపం తగ్గించుకుంటూ జవాబిచ్చాడు కర్నల్.
"డాడీ!"
"యస్ బేబీ!"
"మీకు నా ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను మీట్ మిస్టర్..."
"వాట్? వీళ్ళు నీ ఫ్రెండ్సా?" షాక్ తింటూ అడిగాడు కర్నల్.
"అవును డాడీ"
"మరలా డెకాయిట్స్ లాగున్నారేమిటి?"
చిరంజీవి ఛప్పున అందుకున్నాడు.
"అబ్బే! క్రాఫ్ కొంచెం చెదిరిపోయిందండీ. అందుకని అలా కనబడుతున్నాం"
"అవునండీ! దువ్వెనా, అద్దం ఇస్తే మళ్ళీ మామూలుగా అయిపోతామండీ!" చెప్పాడు సింహాద్రి.
"ఐసీ షటప్!" మళ్ళీ భీకరంగా అరచాడు కర్నల్!
శ్రీదేవి పరిస్థితంతా ఠక్కున అర్ధం చేసుకుంది.
తమ వెంటనే కలుగ జేసుకోలేకపోతే పరిస్థితి మరింత క్షీణించే ప్రమాదం వుందని తెలుసుకుని ఠక్కున అడ్డుపడి పోయింది.
"డాడీ!"
"యస్ బేబీ!"
"వేటలో ఏదీ దొరకలేదా డాడీ!"
"లేదమ్మా! బులెట్స్ వేస్ట్ అయినయ్ గాని ఒక్కటి కూడా దొరకలేదు ఆ మచ్చల జింక వుంది చూడు! దాన్ని ఈసారి మాత్రం వదలను! యిది రెండోసారి కొంచెంలో మిస్సవడం"
"ఓ! అందుకే చాలా కోపంగా వున్నారు డాడీ! పదండి! మేడమీదకెళ్ళి డ్రస్ మార్చుకుందురుగాని! నేనీలోగా కాఫీ లైట్ రిప్రెష్ మెంట్స్ ఎరేంజ్ చేస్తాను"
కర్నల్ ఓసారి చిరంజీవి వంకా, సింహాద్రి వంకా అయిష్టంగా చూశాడు.
వాళ్ళకూ, తనకూ మధ్య శ్రీదేవి నిలబడడంతో ఇంకేమీ మాట్లాడలేక మేడ మీద కెళ్ళిపోయాడు.
శ్రీదేవి తేలిగ్గా గాలి పీల్చుకుంది.
అంతకంటే ఎక్కువ గాలి సింహాద్రీ, చిరంజీవీ పిల్చుకున్నారు.
"ఓ అయామ్ సారీ ధనుంజయ్ గారూ! ముందే చెప్పాను కదా! మా డాడీకి వేటలో జంతువు దొరక్కపోతే ఎవర్ని పడితే వాళ్ళను కాల్చిపారెయ్యాలని కోరికగా ఉంటుందిట!" అంది నొచ్చుకుంటూ!
"సైకలాజికల్ వీక్ నెస్" అన్నాడు చిరంజీవి.
"మీరేమీ అనుకోకండి!" సింహాద్రి వంక చూస్తూ అందామె.
చిరంజీవి సింహాద్రి భుజం తట్టాడు.
"శ్రీదేవిగారితో ఆ విషయం మాట్లాడుతుండు! నేనీలోగా గార్డెన్ ఓసారి చూసి వస్తాను" అంటూ సింహాద్రికి కన్నుకొట్టి బయటకెళ్ళాడు.