Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 27

 

    "సారీ మేడమ్......ఇప్పటికే ఆ కేసెట్ సాక్ష్యం కూడా చూడడం అయిపొయింది. అన్ని దృశ్యాలు వున్నాయి తప్ప ఎవరో కావాలని ఎడిట్ చేసినట్టు ఆ దొంగతనం ఎలా జరిగిందో అది మాత్రం లేదు.'
    "వ్వాట్"
    "ఎస్ మేడమ్....."
    ఇద్దరి మధ్యా కొన్ని నిమిషాల పాటు ఎలాంటి సంభాషణ దొర్లలేదు.
    'ఒకే మేడమ్ ఈ కేసులో నాకు ఎలాంటి ఇన్ ఫర్ మేషన్ తెలిసినా మీకు తెలియజేస్తాను....." అంటూ సెల్యూట్ చేసి బయటకు వెళ్ళిపోయాడు.
    అతని జీప్ స్టార్టు అయి వెళ్ళిపోవడం స్పష్టంగా కిరణ్మయి కి తెలుస్తూనే వుంది.
    ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ చెప్పిన కొత్త దొంగతనం చుట్టూనే ఆమె ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి. నగలు దొంగలించిన వ్యక్తీ తప్పనిసరిగా అడ దొంగే ఎందుకు అయి వుండకూడదు. అనే పాయింట్ మీదే ఏసిపి కిరణ్మయి తన దర్యాప్తు కేంద్రికరించాలని నిర్ణయించుకున్నది.

                                                          *    *    *    *
    
    ఫిబ్రవరి , 27... సోమవారం...
    ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం.....
    పి. డబ్ల్యు. గ్రౌండ్ జన సందోహంతో నిండిపోయి వున్నది.
    వీడియో కెమెరా ఆపరేటర్లు నిర్విరామంగా తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. ఉండుండి ప్లాష్ కెమెరాలు క్లిక్ మంటున్నాయి.
    దశ దిశల భక్త జన సందోహం తిరునాళ్ళలా వున్నది.
    గ్రౌండ్స్ మధ్య నున్న వేదిక పై పుర పెద్దలు ఆసీనులై వున్నారు. నగర మేయర్, జిల్లా కలెక్టర్ ధీరజ, మహిళా పోలీసు అధికారిణి కిరణ్మయి, నగర కమీషనర్ పృద్విరాజ్ కూడా ఆ వేదికపైనే వున్నారు.
    ఒకవైపు మహారాజ సింహాసనం లాంటి కుర్చీ ప్రత్యేకంగా వేయబడి వున్నది. దాని ముందు స్పీకర్ ఒకటి అమర్చి వున్నది.
    ఉన్నట్టుండి జనసందోహం నోటి వెంట......
    "విష్ణు.......విష్ణు......విష్ణు" నామోచ్చారణ మారుమ్రోగిపోయింది.
    ఏ దిక్కున విన్నా........ఎవరి నోటి వెంట విన్నా....ఎవరిని కదిలించినా......ఎవరు మాట్లాడుకుంటున్న.....ఏం చెప్పబోతున్నా, అది విష్ణుకు సంబంధించినదే!
    అనుకున్న సమయానికే విష్ణు వేదికపైకి రావడంతో...
    "విష్ణు వర్ధిల్లాలి.....మహా మహిమాన్వితులు విష్ణు వర్ధిల్లాలి"
    భూనభోంతరాళాలు విష్ణు నామధేయంతో దద్దరిల్లిపోయాయి.
    విష్ణు సభికులందరికీ అభివాదం చేస్తూ ప్రత్యేకంగా అమర్చిన ఆసనంలో కూర్చున్నాడు.
    అయన వెంట వచ్చిన శిష్యులు సింహాసనం వెనుక వేపు నిలిచి ప్రేక్షకుల స్పందనను ప్రత్యేక్షంగా గమనించసాగారు. వాళ్ళలో భారతి, రీటాలు కూడా వున్నారు.
    జనం మధ్యలో తిరుగుతూ విష్ణు పట్ల ప్రజలలో వున్న భక్తీ భావాన్ని గమనించిన ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ చెప్పలేనంత విస్మయానికి లోనయ్యాడు.
    సమ్మోహనమైన కంఠంతో విష్ణు సభికులనుద్దేశించి ప్రసంగించడం మొదలుపెట్టాడు.
    "హిందూ ధర్మం మానవులు నిర్మించుకున్నది కాదు. అది అనాదిగా వస్తున్న ధర్మం. ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని ఒడిదుడుగులు ఎదురైనా హిందూ ధర్మానికి అంతం లేదు. మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ మంచిని గ్రహించి చెడు సంస్కారాన్ని వదలాలి. మనం మంచిని పాటిస్తూ సంస్కారవంతులుగా వున్నప్పుడే ఎదుటివారి నుంచి కూడా మంచి సంస్కారం లభించే అవకాశం వుంటుంది. అంతే తప్ప మనం చెడ్డ పనులు చేస్తూ ఎదుటి వారిలో మంచిని ఆశించడం వృధా ప్రయాస. మంచి సంస్కరవంతుడిగా , నీతి మార్గంలో , సన్మార్గంలో, సద్భుద్దితో నడుస్తూ ఆదర్శవంతంగా జీవితం కొనసాగిస్తే చాలు.....అంతే తప్ప దీని కొరకు ప్రత్యేకంగా సన్యాసత్వం తీసుకుని అచరించవలసిన అవసరం లేదు...."
    అశేష జనవాహిని నుద్దేశించి తన అమూల్యమైన వాక్కులతో హితవు పలికాడు విష్ణు.
    హిందూ ధర్మానికి ఆద్యంతాలు లేవనే దాని పైనే చాలాసేపు ప్రసంగం జరిగాక.........
    "ఈరోజు ఈ బహిరంగ సభలో విజ్ఞులైన పెద్దలు కొంతమంది నన్నొక కోరిక కోరారు. మహాశివరాత్రి పర్వదినాన......ఇంద్రకీలాద్రిశిఖరాన కొలువు దీరి వున్న ఆ అమ్మలగన్న అమ్మ చల్లని ఆశీస్సులతో వారి మనోభీష్టం తీర్చాలనుకుంటున్నాను. సభా ముఖంగా బహిరంగ చర్చలో తమ సందేహాలను నివృత్తి చేసే అవకాశం కలిపించమని వారి అభ్యర్ధన. వారి ధర్మ సందేహాలను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను.
    "ఎక్కడో ........నా ఆశ్రమంలో వాళ్ళ సందేహాలను తీర్చుతే వినే భాగ్యం కొందరికే కలుగుతుంది. ఇప్పుడయితే ఈ అనంత భక్త కోటి విని తమ జీవనానికి సరయిన గమ్యాన్ని నిర్దేశించుకోగలరు. సభికుల మధ్య నుంచి వేదిక వైపు వచ్చే త్రోవలో నా శిష్యులు ఎందరో వాలంటీర్లు వున్నారు. అందరూ వేదిక వద్దకు రాలేరు. కాబట్టి మీ ధర్మ సందేహాలను ఒక స్లిప్ పై వ్రాసి నా శిష్యులలో ఎవరో ఒకరికి ఇవ్వండి. వాళ్ళు ఒఅకరి నుంచి ఒకరు అందుకుని ఈ వేదిక పైకి పంపిస్తారు. సముచిత రీతిలో వాళ్ళ సందేహాలను తీర్చడానికి ప్రయత్నిస్తాను. ముందు ఈ సభను ఏర్పాటు చేయడానికి కారకులయిన నగర ప్రముఖుల అభిప్రాయాన్ని విందాము" అని మౌనం వహించాడు విష్ణు.
    "మానవ జన్మ కడు దుర్మభమైనది . మానవజన్మ లక్ష్యము కైవల్యము, కైవల్య ప్రాప్తి కొరకు యోగజ్ఞాన మార్గములను ఆశ్రయించవలసి యున్నది. మంత్ర , లయ, హట , రాజయోగములు ఏ యోగమునకు క్రమముగా అంతర్భుతము ఉన్నవో అదే మహాయోగము, చాతుర్విద భేదములతో చతుర్యోగాములుగా పిలవబడుచున్నవి.

 Previous Page Next Page