Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 27

   

    బయటనించి నినాదాలు ఉన్నట్లుండి ఉచ్చస్థితిలో రాసాగినయ్. టి.వి.టీమో, ప్రెస్సో, లేక ఏ విఐపియో వచ్చి వుండవచ్చు. ప్రతి కుటుంబంలోనో, లేక వారికి తెలిసిన పరిధిలోనో స్త్రీలమీద ఎన్నో అత్యాచారాలు జరగడం అందరికీ మామూలే. ఈ యువతులు నిజంగానే అరాచకాన్ని ఎదిరించే వాళ్ళయితే వాళ్ళలో ఈ ఐకమత్యం అన్ని విషయాల్లోనూ వుంటే, ఇంతమంది కోడళ్ళు అగ్నికి ఆహుతి అవరు, వరకట్నపు హింసలుండవు, ఏ మగవాడి చెయ్యీ స్త్రీ మీదకు లేవదు. తన అక్కను వాళ్ళ అత్తగారు ఏమైనా అందంటే ఆవేశపడే అమ్మాయే తన వదినను తల్లి సాధిస్తుంటే మరో పుల్లవేసి సంబరపడుతుంది. తన మొగుడు మరో స్త్రీ వెంటపడితే, ఆ అవతలి స్త్రీ టక్కులాడి. తన అన్న ఆ పని చేస్తే వదిన సుఖ పెట్టలేనందువల్లనే అన్న అలా మారాడని జాలి! తన స్వంతవాళ్ళలో తప్పుల్ని కూడా తప్పులుగా గ్రహించి ఎదిరించగల ధైర్యం మనుషుల్లో వచ్చినప్పుడు ఇలా పబ్లిక్ గా వచ్చి నినాదాలు చేయాల్సిన అవసరమే వుండదు.
   
    కిరణ్మయి మనసు నిర్లిప్తతని ఆపాదించుకుంది. తను మరేదో ఆలోచించి బుర్రపాడుచేసుకుంటోంది. రాయన్న ఏ నిర్ణయం తీసుకున్నా అమెకిప్పుడు ఒకటే మిగిలింది. అన్నింటికి మనసుని సమాయత్తపరుచుకోవడం. ఓటమికయినా, విజయానికయినా అదే చివరిమెట్టు!!!
   
    ఆట మొదలవబోతోంది. పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ లిద్దరూ గ్రౌండ్ లోకి వచ్చారు. స్టేడియం అంతా చప్పట్లతో మోగుతోంది. ఆమె కళ్ళు విప్పారితం అయ్యాయి.
   
    తలవంచుకుని రాయన్న ఫీల్డులోకి వెళ్తున్నాడు!! ఆమె ఆనందాన్ని అతికష్టం మీద అణుచుకుంది.
   
                                   *    *    *
   
    ఆట మొదలయింది. పదిహేను ఓవర్లయ్యాయి. పాకిస్తాన్ జట్టు వంద పరుగులు పూర్తయ్యాయి. అప్పటికి ఒక వికెట్ కూడా పడలేదు. ప్రేక్షకులు నిరాసక్తంగా చూస్తున్నారు. రాయన్నకు అంతవరకు బౌలింగ్ ఛాన్స్ ఇవ్వలేదు. బయట వినిపిస్తున్న నినాదాలతో అతడి మనసు గాయం మరింత తీవ్రమవుతోంది.
   
    కెప్టెన్ బౌలింగ్ చేయమని పిలవడంతో రాయన్న ఉలిక్కిపడ్డాడు. బాల్ చేతిలో పడగానే అతడి చెయ్యి వణికింది. ధైర్యం నీరసపడి కాళ్ళలో సత్తువ హరించుకుపోయింది. బాల్ తీసుకుని పరిగెత్తాలంటే మనసు, శరీరం కూడా సహకరించనంటున్నాయి. రాయన్న స్పిన్ బౌలర్ అంపైర్ వెనగ్గా వెళ్ళి నిలబడ్డాడు. గుండెల్లో ఆందోళన దాన్ని  జయించాలన్న తపన. అంతరాంతరాల్లోనే యుద్ధం గెలవాలి, గెలవాలి అన్న పట్టుదల! అంపైర్ సిగ్నల్ చూసి చేతిలో బాల్ మీద ఒక్క క్షణం దృష్టి కేంద్రీకరించి ముందుకు వచ్చాడు. ఉన్నట్లుండి స్టేడియంలో నాలుగువైపులనించి నినాదాలు 'రాయనన డౌన్ డౌన్' అంటూ నీరసంతో అతడు ఆగిపోయాడు.
   
    'వాటిని చెవిన పడనియ్యకు ఇక్కడనించి పారిపో' పిరికితనం హెచ్చరిస్తోంది. 'అదిగో అదే నీ శత్రువు దాన్ని జయించు నీ నిరపరాధిత్వాన్ని రుజువు చేసుకో ఇదే అవకాశం' అంటోంది కిరణ్మయి రూపంలో అంతరాత్మ.
   
    రాయన్న మళ్ళీ ముందుకు వచ్చాడు. నిగ్రహాన్ని కూడగట్టుకుని బాల్ వేశాడు. అప్పటికే నిలదొక్కుకుని ఆడుతున్న బ్యాట్స్ మన్ దాన్ని సులభంగా గాలిలోకి ఎగరగొట్టాడు. "ఫోర్!" ప్రేక్షకులనుంచి బ్యాట్స్ మన్ కోసం చప్పట్లు .... రాయన్న గురించి ఈలలు...... రెండోబంతి అదే స్థానంలో పడింది......మళ్ళీ ఫోర్.....
   
    అయిపోయింది రాయన్నా నీ క్రికెట్ జీవితం ఈ రోజుతో ముగియబోతోంది. మరో రెండు బంతులు పరుగులేమీ రాలేదు.
   
    ధైర్యాన్ని కూడగట్టుకుంటూ అయిదోబంతి వేశాడు. అది కొద్దిగా బౌన్స్ అవటం, బ్యాట్స్ మన్ దాన్ని గాలిలోకి బలంగా ఎగరగొట్టటం కనిపించింది. సిగ్గుతో, బాధతో అతడు తలదించుకున్నాడు. క్రికెట్ జీవితంలో మొదటిసారిగా అతడికంట నీరు తిరిగింది. తనిక ఆటకి పనికిరాడు. తను క్రికెటర్ గా చచ్చిపోయాడు.
   
    ఉన్నట్లుండి స్టేడియం చప్పట్లతో నిండిపోయింది. ఫోరా, సిక్సా అని తలెత్తి చూడడానికి కూడా ధైర్యం చాలడంలేదు. ఎవరో వచ్చి గట్టిగా వాటేసుకోవడంతో అతడు అప్పుడు తలెత్తి చూశాడు. ఫీల్డర్స్ అందరూ పరుగెత్తుకు వస్తున్నారు. ఆ బంతి పైకిలేచి కవర్స్ లో నిలబడ్డ అజారుద్దీన్ అందుకోగా బ్యాట్స్ మన్ క్యాచ్ అవుట్ అయ్యాడని అప్పుడర్ధమయింది. నెమ్మదిగా ముఖంలో కాంతి వచ్చింది. మొదటి వికెట్ తనే తీసుకున్నాడు. దుఃఖంతో పుట్టిన నీటిబిందువు ఆనందబాష్పంగా మారి నేలను ముద్దెట్టుకుంది.
   
    కొత్త బ్యాట్స్ మన్ వచ్చాడు. ఓవర్ లో చివరిబంతి అది. అదొక్కటి వేసేస్తే కొద్దిసేపు తనను తాను నిలదొక్కుకోవడానికి కొద్దిగా విరామం! రాయన్న బాల్ తో ముందుకు వచ్చాడు. బ్యాట్స్ మన్ రైట్ హ్యాండర్ రాయన్న ఎడంచేత్తో బౌలింగు చేస్తూ అనాలోచితంగా గుగ్లీ వేశాడు. బ్యాట్స్ మన్ ఎదుర్కొంటున్న మొదటి బాల్ అది. డిఫెన్సివ్ గానే ఆడాలనుకున్నాడు. అతడు బాల్ ని టచ్ చేయబోయేంతలో అది ఎడమ వైపుకి స్పిన్ అయింది. అతడు గాభరాగా ఒకడుగు వెనక్కువేసి బంతిని కొట్టబోయాడు. బాల్ ఎగిరి బ్యాట్ కి తగిలి వికెట్ కీపర్ చేతిలో పడింది. వికెట్ కీపర్ అరవడం, అంపైర్ అవుట్ సిగ్నల్ ఇవ్వడం ఒక్కసారే జరిగిపోయాయి. తోటి ఆటగాళ్ళంతగా వచ్చి రాయన్నను పైకెత్తేశారు. స్టేడియం అంతా గోల, చప్పట్లు పాకిస్తాన్ జట్టు స్కోర్ రెండు వికెట్ల నష్టానికి నూటమూడు పరుగులు ఆ ఓవర్ తో లంచ్ ఇచ్చాడు అంపైరు.
   
    ఢిల్లీచేరాక మొదటిసారిగా తోటి ఆటగాళ్ళతో నవ్వుతూ మాట్లాడగలిగాడు రాయనన. ఒక చిన్న విజయం ఎంతటి ఉత్సాహాన్నిస్తుందో అనుభవంలోకి వచ్చినట్లనిపించింది.
   
    లంచ్ తర్వాత రెండో ఓవర్ మళ్ళీ రాయన్నది. అతనిలో ఆత్మ విశ్వాసం పుంజుకుంటోంది. అపురూపలక్ష్మి మరణం, తన అరెస్టు, బెయిల్ - ఏవీ అతడి మనసులో లేవు. తన లక్ష్యం ఎదుటి బ్యాట్స్ మన్ ని పడగొట్టటం. ఎదుటి బ్యాట్స్ మన్ మియాందాద్ చాలా గొప్ప ఆటగాడు. రాయన్న బౌలింగ్ చూసినవాదు కాబట్టి జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఈ లోపులో రాయన్న ఆఫ్ సీన్ బాల్ వేశాడు.
   
    అది బ్యాట్ పక్కనుంచి కుడివైపుకి తిరిగింది. మియాందాద్ కాలు వెనక్కి తీసుకునేలోపులో అది మెరుపువేగంతో కాలుకి తగలటం, అంపైర్ చెయ్యి గాలిలోకి లేవటం ఒకేసారి జరిగాయి. ఎల్.బి.డబ్ల్యూ.... అంతే.
   
    నిశ్శబ్దంలోంచి పుట్టిన హోరుతో స్టేడియం దద్దరిల్లింది. చెవులు చిల్లులు పడేటంత గోల. అయినా ఎవరికీ ఆ ధ్యాసలేదు. ఎవరికి వాళ్ళు సంతోషంతో అరిచేస్తున్నారు. పాకిస్తాన్ టీమ్ లో అతి ముఖ్యమయిన ఆటగాడు కేవలం రెండు పరుగులకే ఔటవడం అందర్నీ ఉత్తేజితుల్ని చేస్తోంది. కాలేజీ స్టూడెంట్స్ తాము వచ్చినపని మర్చిపోయి జయజయ ధ్వానాలు చేస్తున్నారు. కామెంటేటర్ అది 'హ్యాట్రిక్'గా అనౌన్స్ చేయడంతో స్టేడియం మరొకసారి విజయధ్వానాలతో నిండిపోయింది. అజారుద్దీన్ సహా అంతా వచ్చి రాయన్నను కంగ్రాచ్యులేట్ చేస్తున్నారు. ఎప్పుడూ ఎంతో గంభీరంగా వుండే కిరణ్మయికి కూడా కళ్ళు తడి అయ్యాయి. సంతోషంతో కన్నీళ్ళు తుడుచుకుంది. ఇక ఏమైనా ఫర్వాలేదు. ఓటమి అనే బురదలో కూరుకుపోతున్నవాడికి ఓ చెట్టుకొమ్మ ఆధారం దొరికింది. ఎలాగైనా బయటపడగలడు. రాయన్న ఇక ఎలా ఆడినా ఫర్వాలేదు. ఈ హ్యాట్రిక్ మాత్రం ప్రేక్షకులు మర్చిపోలేరు. ఆమె ఆశించినట్లుగానే రాయన్న మరింత విజ్రుంభించి ఆడటం సాగించాడు. ఆ తరువాత అతడు వేసిన పది ఓవర్లలో కేవలం ఇరవై పరుగులిచ్చి మరొ వికెట్టు తీసుకున్నాడు.
   
    ఆ రోజు ఆట ముగియడానికి అరగంట ముందుగా పాకిస్తాన్ టీమ్ రెండువందల ఇరవై పరుగులకి అంతా అవుటయిపోయారు.
   
    నైట్ వాచ్ మెన్ గా వచ్చిన భారత ఆటగాళ్ళు ఎనిమిది పరుగులు చేశారు.
   
    రాయన్న ఫెవిలియన్ లోకి వెళ్ళబోతుండగా అభిమానులు చుట్టుముట్టారు. ఆటోగ్రాఫ్ లిస్తూనే అతని కళ్ళు కిరణ్మయి కోసం వెతికాయి. ఆమె ఎక్కడా కనిపించలేదు.
   
                                   *    *    *
   
    "ఇప్పట్లో నేను ఆయన భార్యగా నలుగుర్లోనూ పరిచయం కావడం మంచిదికాదు. ఆటలో ఆయన విజయం సాధించాలి. నేను నా పనిలో కృత కృత్యురాలనికావాలి. అప్పుడే ఇద్దరం కలసి అందరికీ పరిచయం కావాలి" అంది కిరణ్మయి స్నేహితుడితో దృఢంగా.
   
    ఆమె ఆ సాయంత్రమే హైదరాబాద్ ట్రెయినెక్కింది.
   
                                     *    *    *
   
    చివరిరోజు ఆట మొదలైన గంటలోనే భారతజట్టు చిక్కుల్లో పడింది. సాధారణంగా చివరిరోజు బ్యాటింగ్ చేయటం కష్టం. అరవై పరుగులకే నాలుగు వికెట్లు పోయాయి. అప్పటికే పాకిస్తాన్ వందపరుగుల మొదటి ఇన్నింగ్స్ 'లీడ్'లో వుంది. అంటే, మరొ అరవై పరుగులు చేయకుండా భారతజట్టుని నిరోధించగలిగితే, పాకిస్తాన్ జట్టు మరి ఆడకుండానే విజేతలవ్వచ్చు. అంతకన్నా అవమానం భారతజట్టుకి మరొకటి వుండదు.

 Previous Page Next Page