నచ్చింది కాబట్టి కోదండపాణి, సుభద్ర అతి శిలాశాసనంగా తీసుకున్నారు.
"అన్నింటికీ ఒప్పుకున్నాను. ఎమ్మే అయ్యేదాకా ఆగమంటున్నాను" అంది హాస మొండిగా.
ఆ యింట్లో హాసను బాధ పెట్టడం ఎవరికీ యిష్టముండదు. ఆమెనో పరుష వాక్యం అనడానికి నిత్యం రుసరుసలాడే సుభద్రకే నచ్చదు.
అప్పుడు రమణ తనే ఈ బాధ్యత తీసుకుని హాసను కలుసుకుందుకు ప్రయత్నం ప్రారంభించారు. పరీక్షల వంకతో హాస అతణ్ణి తప్పించుకొంది.
ఇప్పుడు పరీక్షలైపోయాయి.
"నా మాట నీకు తెలుసు. ఎమ్మే పూర్తి కావాలి...." అంది హాస.
"నిన్ను ఎమ్మే నేను చదివిస్తాను. పెళ్ళికీ ఎమ్మేకీ సంబంధంలేదు."
హాస గంభీరంగా, "నేనొక అబ్బాయిని ప్రేమించాను. అతడ్ని కాక నిన్ను పెళ్ళిచేసుకోవాలనుకుంటున్నాను. కానీ ఆ అబ్బాయినింకా ప్రేమించాలని వుంది. పెళ్ళయితే అది సాధ్యపడుతుందా? సాధ్యపడుతుందని నువ్వంటే అది నీ మంచితనమనుకోను. నువ్వో అవకాశవాదివనీ, నీ పని నెరవేరడం కోసం ఎలాంటాబద్ధమయినా చెప్పగలవనీ భావిస్తాను. ఇంతవరకూ నీ మీదున్న గౌరవం పోతుంది...." అంది.
రమణ తెల్లబోయి ఆమె వంక చూశాడు.
ఈమె సాధారణ యువతి కాదు. చాలా చాలా తెలివయినది.
"ఆ అబ్బాయెవరు?" అన్నాడతను.
"ఆ అబ్బాయి పేరు ఎమ్మే."
"అంటే ఎం ఆనందరావా?"
"కాదు మాస్టరాఫ్ ఆర్ట్స్!"
రమణ గల గలా నవ్వాడు. ఎప్పుడూ అలా నవ్వి వుండలేదేమో. ఆ నవ్వు చిత్రంగా వుంది.
హాస ఆశ్చర్యంగా అతడివంక చూసింది.
రమణ నవ్వాపుకుని, "హేట్సాఫ్ టూ యూ హాసా! నన్నిలా ఇంతవరకూ ఎవరూ నవ్వించలేదు. అందుకే నిన్ను త్వరగా నా జీవితంలోకి రమ్మంటున్నాను? నా జీవితంలో నవ్వుల పువ్వులు కురిపించడానికి వెంటనే పెళ్ళికి ఒప్పుకో" అన్నాడు.
"పెళ్ళి గురించి నీకెందుకంత తొందర?" అంది హాస.
"ప్రేమ కోసం తపించిపోతున్నాను. ఆ కారణంగా వ్యాపార వ్యవహారాల్లో సరిగ్గా పాలుపంచుకోలేక పోతున్నాను. గత రెండు మాసాల్లో నా కారణంగా రెండు లక్షలు నష్టం వచ్చింది. నాక్కావలసిన ప్రేమ నాకు లభిస్తే నెల్లాళ్ళలో పదిలక్షలు లాభం తీయగలను."
"అంటే నీ ప్రేమ వ్యాపారం అన్నమాట...."
అతడు జాలిగా ఆమె వంక చూశాడు.
ఆమె నవ్వి "నువ్వెంత అమాయకుడివో నాకు తెలియదు. కానీ చాలా అమాయకంగా కనిపిస్తావు. అసలు నువ్వు వ్యాపారం చెయ్యగలవా అని నా అనుమానం" అంది.
"హాసా! వెంటనే పెళ్ళికి ఒప్పుకో...."
"ఒప్పుకోకపోతే?"
"ఏం చేస్తాను? ఎదురు చూస్తాను...." ఆవేదనగా అన్నాడతను.
"నేను బాగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను. అవి మారవు. ఆ పట్టుదల నెరవేరాలంటే ఒక్కటే మార్గముంది. అదేమిటంటే మా వాళ్ళను ఒత్తిడి చేయడం. నా మనసును కష్టపెట్టడం. మా వాళ్ళకిష్టముండదు. కానీ నా క్షేమాన్నే కోరుతున్నామనుకుని ఈ విషయంలో వాళ్ళు నన్ను కష్టపెట్టినా పెట్టగలరు. అందుకు నువ్వు వాళ్ళకు ప్రోత్సహించు. వాళ్ళ మాటలు నాకు శిలా శాసనాలు. ఇదీ నా ప్రాణ రహస్యం...." అంది హాస.
రమణ ఆలోచనలోపడ్డాడు.
ఆమె ఎందుకిలా మాట్లాడుతోంది? తనను నిజంగా పెళ్ళిచేసుకోవాలనుందా? ఎమ్మే ఒక వంక అయితే తల్లి దండ్రులు బలవంతం మీద పెళ్ళికొప్పుకున్నట్లు నటిస్తుందా?
ఏది ఏమైనా త్వరగా తను వ్యవహారం పూర్తిచేయాలి. ఎంతో వ్యవధి లేదు తనకి!
"థాంక్స్....మంచి ఉపాయం చెప్పావు" అంటూ లేచాడతను.
హాస లేవకుండా "నా ఉపాయాన్ని మెచ్చుకున్నావంటే మా వాళ్ళ గురించి నీకు సరిగ్గా తెలియదు. మా వాళ్ళ మాటలు నాకు శిలాశాసనాలయ్యాయంటే అందుక్కారణం నా ఉపాయం నీకు ఫలించదు" అంది.
అతడామె మాటలకు రియాక్టవకుండా "ఇక వెడదామా....?" అన్నాడు.
"నువ్వు వెళ్ళు. నేను కాసేపిక్కడే వుండి భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి" అంది ఆమె.
రమణ వెళ్ళిపోయాడు.
* * * *
రమణ ఇలా వెళ్ళగానే అలా ప్రత్యక్షమైందక్కడ ప్రతిభ.
హాస ఆమెను చూసి ఉత్సాహంగా "హాయ్" అంది.
"అతడెవరే?" అంది ప్రతిభ.
"ఎవరో ఇంకా నాకూ తెలియదు. పేరు మాత్రం రమణ...." అంది హాస.
"ప్రపోజరా?" అంది ప్రతిభ.
హాస నవ్వింది. అదే ఆమె సమాధానం.
"ప్లీజ్! చెప్పవే!"
"ఈ సమాధానం వల్ల నీకు ప్రయోజనమేమిటి?"
"ఉంది...." అంది ప్రతిభ.
ఆమె తనకు దేవేంద్ర తీసుకొచ్చిన సమస్య గురించి చెప్పి, "వాడి తెలివి మాడిపోనూ! ఉన్నవి చాలక తనకు లేని దుష్టలక్షణాలు కూడా చెప్పుకుని మా పిన్నిని ఇంప్రెస్ చేశాడు. పెళ్ళయ్యాక నాకు నరకం చూపించగలనని నమ్మించాడు. రెండో పెళ్ళి వాణ్నని అబద్ధం చెప్పాడు. ఆపైన డబ్బిస్తానంటున్నాడు. పిన్ని నాకు వాడితో పెళ్ళి జరిపించాలని నడుం కట్టింది. నాకయితే ఇంట్లోంచి పారిపోవాలని వుంది. కానీ తెగినగాలి పటాన్నవుతానని భయం. ఒకసారి దేవేంద్ర బారి నుంచి నన్ను రక్షించాడన్నానే.... ఆ యువకుడే ఈ రమణ. ఇతడితో నీకు పరిచయముంటే ఈ కష్టం నుంచి గట్టెక్కడానికి సాయపడు. నీ రమణ నన్ను దేవేంద్ర బారి నుండి రక్షించగలడు" అంది.
హాస ఆమె చెప్పిందంతా ఆశ్చర్యంగావిని, "నీకూ నాకులాగే పెళ్ళి ముహూర్తీం సమస్య వచ్చిందన్న మాట..... సరే, రేపు అతడితో మాట్లాడతాలే!" అంది.
"చాలా థాంక్స్!" అంది ప్రతిభ.
* * * *
రాత్రి పదింటికి తన ఫోన్ నంబరు అయిదు ఒకట్లు తిప్పి, 'హలో' అంది హాస.
తనింట్లో మంచం మీద వెల్లకిలా పడుకుని ఆలోచిస్తున్న గౌతమ్ ఉలిక్కిపడి, "హాసా" అన్నాడు.
"ఊఁ....నేనే!"
"ఏమిటి విశేషం?"
"ఈ రోజు రమణ నాతో మనసు విప్పి మాట్లాడేడు. తన గురించి అన్నీ చెప్పుకున్నాడు...."
"ఊఁ...."
"అతడు నాకు నచ్చేడు."
"ఊఁ...."
"వూఁ ఏమిటి నేను చాలా ఇంప్రెసయ్యాను...." అంటూ రమణ చెప్పినవన్నీ చెప్పింది.
గౌతమ్ అన్నీ శ్రద్ధగా విని, "నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మరి ఈ పెళ్ళి వాయిదా ఎందుకు వేస్తావు?" అన్నాడు.
"నీ సలహా ఏమిటి?"
"వెంటనే పెళ్ళి చేసుకో" అనబోయి ఆగిపోయాడు గౌతమ్.... "ఏమో! ఆలస్యం తనకే మంచిదేమో! ఈలోగా ఈ సంబంధం చెడిపోతే? తనకూ హాసకూ రాసిపెట్టి వుండడం వల్లనే హాస కలాంటి బుద్ధి పుట్టిందేమో!"
ఇలాంటి ఆలోచనలు పుట్టడంతో "ఈ రోజుల్లో ఆడపిల్లకు చదువుండడం మంచిదని సలహాయిస్తే ఆ సలహా అపకారం చేస్తే....?" అన్నాడతను.
"ఏదో నిన్ను సలహా అడిగాను కానీ....ఈ విషయంలో నా నిర్ణయమేనాడో అయిపోయింది."
"ఏమిటది?" ఆత్రుతగా అడిగాడు గౌతమ్.
"అంత తొందరేం....? ఆ రమణ కంటే ఎక్కువ ఆతృతపడుతున్నావు...."
"ప్లీజ్....చెప్పు హాసా!"
"నా స్నేహితురాలు ప్రతిభకు రమణ సాయం కావాలి. అతడు వెంటనే సాయపడగలిగితే.... నేను ఒప్పుకుంటాను."
"ఏమిటా సాయం?"
"ఆమె పెళ్ళి తప్పించాలి" అని కిలకిలా నవ్వింది హాస. ఆ నవ్వుకు ఉలిక్కిపడి లేచాడు గిరిధర్.
"అక్కా! రోజూ అలవాటైనా ఏరోజుకారోజే భయంగా ఉంటుంది నాకు. ప్లీజ్! అలా నవ్వకక్కా!" అన్నాడు గిరిధర్.
గౌతమ్ కి మాత్రం ఇక హాస పిలుపు వినబడలేదు.
24
మర్నాడాఫీసులో గౌతమ్ తీవ్ర నిర్ణయానికి వచ్చాడు.
హాస రమణని ప్రేమిస్తోంది. అతడ్ని పెళ్ళి చేసుకుంటుంది. ఆ పెళ్ళికి అడ్డంటూ వుంటే తన ప్రేమ ఒక్కటే!