విక్రమార్కారావు ముఖం వెలిగిపోయింది.
"అబ్బ! ఎంత గొప్పగా చెప్పాను సార్! అయితే త్వరగా కోటీశ్వరుడవ్వాలంటే దూరదర్శన్ లో చేరాలన్న మాట! నేనింకా కస్టమ్స్ డిపార్టుమెంటే బెస్ట్ అనుకుంటున్నాను గురూజీ!"
భవానీ శంకర్ అతనికి జవాబివ్వలేదు. సంద్యారాణి పేరు మీద ఆమె నెంబర్ కనిపించకపోవటం వల్ల నెంబర్ ని బట్టి అడ్రస్ వెతకటానికి నిర్ణయించుకున్నాడతను.
రాత్రి పదవుతొండగా విక్రమార్కారావు వచ్చి అతని దగ్గర నిలబడ్డాడు.
"ఓ.కే. కామ్రేడ్! నేను వెళ్ళటానికి రడీయేగాని ఓ కండిషన్ ఉంది"
"ఏమిటి సార్ అది?"
"ఈ డైరక్టరీ ఈ రాత్రికి నా దగ్గరే వుంటుంది."
"అలాగే సార్ - తీసుకెళ్ళండి."
భవానీ శంకర్ డైరక్టరీ తో పాటు తన గదికి నడవసాగాడు. నిద్ర ముంచుకోస్తోందతనికి. అంతకు ముందు రాత్రంతా ఇంచుమించుగా నిద్ర పోనేలేదు. మరోపక్క ఆకలి. గది చుట్టుపక్కలంతా చీకటి దట్టంగా పేరుకుపోయి వుంది. గది ముందు నిలబడి తాళం చెవి కోసం జేబులు వెతికి కీచైన్ బయటకు లాగాడు. తాళం తీసి గది తలుపులు తెరిచి లైట్ స్విచ్ కోసం గోడ తడుముతుంటే వినిపించింది ఎవరో అడుగులు వేసిన చప్పుడు.
చటుక్కున గోడకానుకుని నిలబడి చుట్టూ చూశాడు. కిటికీ పక్కన నీడల్లా కదిలాయ్ రెండు ఆకారాలు. మరుక్షణంలో టార్చిలైట్ కాంతి అతని ముఖం మీద పడింది. టక్కున స్విచ్ వేశాడు భవానీశంకర్ హండ్రెడ్ కాండిల్స్ బల్బు క్షణంలో కాంతిని విరజిమ్మింది గదంతా.
లావుపాటి వ్యక్తీ, సన్నని వ్యక్తీ ఇద్దరూ కిటికీ దగ్గర నిలబడి వున్నారు. సన్నని వ్యక్తీ చేతిలో పిస్టల్ కనబడుతోంది. గదంతా వెతికినట్లు చిందర వందరగా పడివున్న పుస్తకాలు చెబుతున్నాయి.
భవానీశంకర్ చిరునవ్వు నవ్వాడు వాళ్ళవేపు చూసి.
"హలో కామ్రేడ్స్! నేను మొన్న కుట్టించుకున్న సఫారీ సూట్ కాజేయడానికి వచ్చారన్నమాట! అంతేనా?" అడిగాడతను.
వాళ్ళిద్దరూ మొఖాలు చూసుకుని నవ్వుకున్నారు.
"చూశావా - ఎంత చలాకిగా మాట్లాడుతున్నాడో?" లావుపాటి వ్యక్తితో అన్నాడు రెండోవాడు.
"అవునవును! తను చాలా స్మార్ట్ అనుకున్నాడు."
"నన్నడిగితే నేనే గది "కీ" ఇచ్చేవాడిని కామ్రేడ్! యిప్పుడు చూడండి పాపం! అనవసరంగా కిటికీ చువ్వలు వంచి లోపలికి దూకడం చీకట్లో ఆ గుడ్డి టార్చ్ లైట్ వేసుకుని వెతుక్కోవడం ఎంత బాధయిపోయిందో మీకు?"
మళ్ళీ లావుపాటి వ్యక్తీ వేపు చూసాడు రెండోవాడు.
"చూశావా! ఎంత బాగా నటిస్తున్నాడో?" పిస్టల్ గురిపెట్టి వుంటేనే మాట్లాడాడు.
"బ్రహ్మాండమైన నటన నిజంగానే" ఒప్పుకున్నాడు లావుపాటి వ్యక్తీ.
"భట్రాజుల్లా చాలా బాగా పొగుడుతున్నారు కామ్రేడ్! ఇంక బోడి పొగడ్తలు ఆపి ఇక్కడికి ఏం పనిమీద వచ్చారు త్వరగా చెప్పండి. చిరాకుగా అన్నాడు భవానీశంకర్.
"మనం ఏం పనిమీద వచ్చామో చెప్పమని అడుగుతున్నాడు విన్నావా?" అడిగాడు సన్నపాటి వ్యక్తీ.
లావుపాటి వ్యక్తీ తలూపాడు.
"విన్నాను - విన్నాను."
"మరి ఏం సమాధానం చెప్పమంటావు?"
"పిచ్చివాగుడు వాగాకుండా మర్యాదగా మన వస్తువు మనకివ్వమని చెప్పు."
సన్నవాడు ఈసారి భవానీశంకర్ వేపు చూశాడు.
"విన్నావుగా! ఇంక నాటకాలాడటం ఆపి అదెక్కడుందో చెప్పు." అన్నాడు తీవ్రంగా.
"ఏమిటది?" కుతూహలంగా అడిగాడు భవానీశంకర్.
సన్నపాటి వ్యక్తీ నవ్వాడు.
"నేను చెప్పలేదూ ఓవర్ స్మార్టు అనీ! ఏమిటదీ అంటూ మనల్నే కొశ్చేన్ చేస్తున్నాడు."
"లావుపాటి వ్యక్తీ ముఖంలో కోపం పెరిగిపోయింది. భవానీశంకర్ వేపు నడుస్తూ భయంకరంగా గర్జించాడు.
"ఇంక నీ అతి తెలివి ఆపి అదెక్కడ దాచావో చెప్పు?"
భవానీశంకర్ ఏ మాత్రం జంకలేదు. అతనికిప్పుడు కొంతవరకూ అర్ధమయిపోయింది. వాళ్ళక్కావలసిన వస్తువేదో తన దగ్గర వుందనుకుంటున్నారు. అదేదో చాలా విలువయినదయి ఉండాలి. కనుక అది దొరికే వరకూ తన ప్రాణానికి ఎలాంటి హానీ చేయలేరు. తను ఆ ఫిస్టల్ వ్యక్తీ గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు.
"ఏమిటది?" అడిగాడు భవానీశంకర్.
సన్నటి వ్యక్తీ అసహనంగా తనూ రెండడుగులు ముందుకొచ్చాడు.
"వీడికి చాలా సరదాగా వున్నట్లుంది. రెండు బుల్లెట్సు ఎక్కిస్తే గానీ దార్లోకి రాడు."
7
"ఇప్పుడే కాదు" అన్నాడు లావుపాటి వ్యక్తీ.
అప్పుడు గమనించాడు భవానీశంకర్ , అతను తనకు చాలా సమీపంగా వచ్చేశాడు. తను మెరుపు వేగంతో ఎటాక్ చేయగలిగితే ఒకే ఒక గుద్దుతో మళ్ళీ లేవకుండా చేయవచ్చు. సరిగ్గా అప్పుడే లావుపాటి వ్యక్తీ ప్రక్కకు తిరిగి రెండో వాడితో మాట్లాడటం కనిపించింది భవానీశంకర్ కు. ఇంక ఆలస్యం చేయకుండా తన శక్తి నంతా ఉపయోగించి అతని ముఖం మీద బలంగా కొట్టాడు. లావుపాటి వ్యక్తీ ఆ దెబ్బకు వెనుక ఉన్న కుర్చీ మీద పడి తర్వాత కుర్చితో సహా నేల మీద పడిపోయాడు. ఈ హటాత్ససంఘటనకు సన్నటి వ్యక్తీ నివ్వెరపోయాడు. భవానీ శంకర్ అతని మీద కూడా వెళ్ళబోయెంతలో తేరుకుని పిస్టల్ ట్రిగ్గర్ మీద వేలు నొక్కాడు.
"అక్కడే నిలబడు - లేకపోతే చస్తావు" అన్నాడు కఠినంగా.
భవానీ శంకర్ నిలబడి పోయాడు. తనేం చేసినా ఫిస్టల్ పేలుతుంది. ఈ పరిస్థితి చూసి కిందపడిన వ్యక్తీ లేచి నిలబడ్డాడు. నిలబడటంతోనే భవానీ శంకర్ మీదకు అతి భయంకరంగా వచ్చేశాడు. అతనిని ఇప్పుడు ఎదుర్కోవడం కష్టమని అర్ధమయిపోయింది భవానీశంకర్ కి. వెనక్కు ఒక్కొక్క అడుగే వేయడం ప్రారంభించాడు. అతను ఒక్కొక్క అడుగే ముందుకి వస్తున్నాడు. సడెన్ గ ముందుకి దూకి అతని ముఖం మీద ఇంకొక్క షాట్ ఇస్తే మరోసారి కింద నుంచి లేవడని నమ్మకం కలిగింది అతనికి. మరుక్షణం అతను గాలిలోకెగిరి ముందుకు దూకి అతని ముఖం మీద కు వదిలాడు పిడికిలిని. లావుపాటి వ్యక్తీ ఇది ముందే ఊహించటం చేత పక్కకు తిరిగాడు అంతే! భవానీ శంకర్ చేయి అతని భుజం పక్క నుంచి గాలిలోకి దూసుకుపోయింది ఆ పరిస్థితి నుంచి మళ్ళీ కూడదీసుకోక ముందే లావుపాటి వ్యక్తీ పిడికిలి అతివేగంగా బలంగా భవానీ శంకర్ మెడ మీద తాకింది. ఆ స్పీడులో భవానీ శంకర్ వెనుక వున్న గోడను కొట్టుకుని కిందపడిపోయాడు. మెడ మీద చాల పెద్ద బరువున్న వస్తువేదో పదినట్లనిపించిందతనికి. ఈలోగా సన్నని వ్యక్తీ భవానీ శంకర్ దగ్గర కొచ్చి పిస్టలు వెనక్కు తిప్పి అతని నెత్తి మీద కొట్టాడు. తల పగిలిపోయినంత బాధ భవానిని మెలికలు తిరిగేట్లు చేసింది. తల మీద గాయం తగిలిన చోట నుంచి రక్తం ప్రవహిస్తోంది.
లావుపాటి వ్యక్తీ రెండో అతన్ని అభినందించాడు.