Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 26

    వాకబు మీద తెలిసిన దేమిటంటే ఇంకా పార్కుకు వెళ్ళడం మానేసి వాళ్ళు ఇళ్ళలో కలుసుకుంటారుట.   
    రాయుడు  ఉండబట్టలేక వాళ్ళ మాటలన్నీ వినిరమ్మనమని లతకు చెప్పాడు. లత వాళ్ళింటికి వెళ్ళి సుహాసినితో మాట్లాడీ ఈ విషయం తెలుసుకుని వచ్చింది. లతను చూసి సిగ్గుపడిన కారణంగా సుబ్బారావు వాళ్ళ మధ్యకు రాలేదుట సుహాసినీ, సుబ్బారావు చెల్లెలు, లతా కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. మధ్యలో సుహాసిని పిలిచినా సుబ్బరావు రాలేదుట.   
    "ఎందుకు పిలిచిందేమిటి?" అన్నాడు రాయుడు.   
    "ఏదో కథ పూర్తి చేయాలిట. సగంలో ఆపేశాట్ట సుబ్బారావు. చాలా ఇంట్రస్టింగ్ గా ఉందిట. కానీ సుబ్బారావు రాలేదు" అంది లత.  
    "నిన్ను కాక గీతను పంపించాల్సింది" అన్నాడు రాయుడు.   
    "సుబ్బారావు నన్ను చూసినా సిగ్గుపడతాడు" అంది గీత.   
    "వీళ్ళిలా ఇళ్ళలో కలుసుకుంటే కష్టమేనే?" అన్నాడు రాయుడు.   
    "వచ్చే ఆదివారం జూకివెళ్ళాలి వీళ్ళు. అందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నాను కూడా!" అన్నాడు రచయిత.   
    "తండ్రి ఆమెను జూకిపంపుతాడో పంపడో?" అన్నాడు రాయుడు.   
    "ఇందుకు మనం సుబ్బారావు చెల్లెలిని ఉపయోగించు కోవాలి!" అన్నాడు రచయిత.   
    రాయుడు సుబ్బారావుని రప్పించి, "ఆదివారం సుహాసినికి జూలో చింపాంజీని చూపించవా?" అనడిగాడు.   
    "వాళ్ళ నాన్నగారు నాతో పంపరేమో!" అన్నాడు సుబ్బారావు.   
    "నీతో అని చెబుతావేమిటి? నీ చెల్లెల్ని పంపించు" అన్నాడు రాయుడు.   
    సుబ్బారావు చెల్లెలు అరుణ అతడిమీద చురుకైనది. ఆమె చాలా తెలివిగా రాయబారం నడిపి ఆదివారం "జూ" కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆ ప్రకారం సుహాసిని అరుణ వనజ కలిసి ఆదివారంనాడు జూ చూడ్డానికి బయల్దేరారు. దారిలో వాళ్ళను సుబ్బారావు కలుసుకున్నాడు. వీరిని కాస్త దూరం నుంచి రామగోపాల్ మోనికా అనుసరిస్తున్నారు.   
    అంతా కలిసి జూలో ప్రవేశించారు. వనజ ఉన్న కారణంగా సుబ్బారావు అట్టే మాట్లాడటం లేదు. వనజ ఏవో కబుర్లు చెబుతున్నది కానీ ఆమె దృష్టి అంతా సుబ్బారావు మీదనే ఉన్నది. అతన్ని ఓరకంట గమనిస్తూ అతను తనను గమనిస్తున్నాడా లేదా అని పరిశీలిస్తూ ఏవేవో కబుర్లు చెబుతోందామె. ఆమెతో ఎక్కువగా అరుణ మాట్లాడుతోంది. సుహాసిని ఏమో ఆలోచిస్తోంది. వీలు దొరికినప్పుడల్లా వనజ అరుణను సుబ్బారావు గురించి అడిగి తెలుసుకుంటోంది.
   
    జూలో అడుగుపెట్టగానే - "ముందు చింపాంజీని చూద్దాం" అంది సుహాసిని. ఆమె అలాగనగానే వనజ ఫక్కున నవ్వి, "నీకు చింపాంజీ అంటే మరీ అంత మక్కువేమిటే బాబూ!" అంది.   
    చాలామంది జనం ఒక విపుగా వెడుతూంటే వారిలో ఒకావిడను ఆపి - "ఏమండీ- మీరు చింపాంజీని చూడటానికి వెడుతున్నారా?" అనడిగింది సుహాసిని. ఆవిడ హడావుడిగా వెళ్ళిపోతూనే - "చింపాంజీనేం చూస్తామండీ - ఆఫ్రికా నుంచి ఏదో మూడు కాళ్ళ జంతువు వచ్చిందట. చూడ్డానికి వెడుతున్నాం" అంది.   
    "అయితే మనమూ అటే వెడదాం" అంది అరుణ.   
    "వద్దు. చింపాంజీనే చూద్దాం" అంది సుహాసిని.  
    సుబ్బారావు నలుగురినీ అడిగి చింపాంజీ వైపే దారి తీశాడు. అక్కడికి చేరుకోగానే కనబడిన దృశ్యం అందర్నీ ఆశ్చర్యపరిచింది.   
    బోనులో చింపాంజీ ఒకటి ఉంది. అది పాంటు. షర్టు వేసుకుని ఉంది. డానికి ఎదురుగా ఉన్న ఒక చెట్టుక్రింద కాస్త పక్కగా ఓ అందమైన అమ్మాయి, ప్రభాకరం నిలబడి వున్నారు. వాళ్ళిద్దరూ ఉత్సాహంగా ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ వచ్చే పోయే వాళ్ళను గమనించడం లేదు. ప్రభాకరం వేసుకున్న దుస్తులు, చింపాంజీ వేసుకున్న దుస్తులు ఒకేరకంవి.   
    సుహాసిని బోనులోని చింపాంజీనీ, బోను బయట ప్రభాకరాన్నీ మార్చి మార్చి చూసింది. ఇద్దరూ ఇంచు మించు ఒకేలాగా కనిపించారామెకు. కొద్ది క్షణాలయ్యేసరికి ఆమెకు ప్రభాకరం బోనులోంచి తప్పించుకు వచ్చిన పెద్ద చింపాంజీలా కనబడ్డాడు.   
    అందమైన సుహైస్ని జూలో అడుగుపెట్టగానే కొందరు యువకుల కళ్ళు ఆమె మీద పడ్డాయి. వాళ్ళు కూడా ఆమె ఎటు వెడితే అటు వెడుతున్నారు. వాళ్ళు ప్రభాకరాన్ని చూసి "హేయ్ చింపాంజీ" అంటూ కేకలుపెట్టారు. ప్రభాకరం ఆ కేకలు తననుద్దేసించినవేనని అనుకోలేదు. అతనా అమ్మాయితో కబుర్లు చెబుతూనే వున్నాడు. కుర్రాళ్ళలో ఒకడు ముందుకు వెళ్ళి ప్రభాకరాన్ని సమీపించి "ఏమండీ, నాకో సాయం చేయగలరా?" అన్నాడు.   
    ప్రభాకరం ఉలిక్కిపడి "ఎవరు మీరు?" అన్నాడు.   
    "మీ జంట బాగుంది. ఒక్క ఫోటో తీసుకుంటాం" అన్నాడు యువకుడు.   
    ప్రభాకరం సంతోషంగా ఒప్పుకున్నాడు. అతనింకా సుహాసినిని చూడలేదు. యువకుడు కెమేరా అడ్జస్టు చేసుకుంటూ ప్రభాకరాన్ని అటు కదలమని, ఇటు కదలమని నెమ్మదిగా బోనుదాకా పంపించాడు. బోనులోపల చింపాంజీ, బోను బయట ప్రభాకరం అతడికి కాస్త పక్కగా అమ్మాయి వున్నారు.   
    యువకుడు కొంచెం నవ్వమనీ కాలు కదపమనీ, చెయ్యి సరిచేసుకోమనీ సూచనలిస్తూంటే ప్రభాకరంతోపాటు బోనులోని చింపాంజీ కూడా ఆ సూచనలు పాటిస్తోంది. చూసేవారికి ఆ దృశ్యం ఎంతో బాగుంది, సరదాగా ఉంది. అలా పోతున్న వాళ్ళు కొందరు అక్కడ ఆగి మరీ ఈ చోద్యం చూస్తున్నారు. ప్రభాకరానికి జరుగుతున్న మోసం అర్ధం కాలేదు. అతడు ఆ పిల్ల కలిగించిన మైకంలో ఉన్నాడు. సుహాసిని అతడి కళ్ళబడకుండా మనుషుల వెనుకగా నిలబడింది. ప్రభాకరం క్రాపు సవరించుకుంటూంటే - చింపాంజీ కూడా క్రాపు సవరించుకుంటోంది. ఇదంతా జనానికి వినోదంగా వుంది.   
    "ఏయ్, చింపాంజీ బోన్లోంచి బైటపడింది" అని ఎవరో అరిచారు.   
    అంతే - అక్కడ తొక్కిసలాట ప్రారంభమైంది. చింపాంజీ, చింపాంజీ అంటూ ఒకరిద్దరు యువకులు ప్రభాకరం వెంటబడ్డారు. ప్రభాకరం రియాక్టయ్యాడు. అతను వారి మీదకు చెయ్యెత్తాడు. చింపాంజీ, చింపాంజీ అంటూ మరి కొన్ని కంఠాలు అరిచాయి. ప్రభాకరానికి చచ్చేటంత అవమానమయింది. అవమానంకంటే కోపమే ఎక్కువయిందతనికి. అతను ఓ కుర్రాణ్ణి సాచి లెంపకాయ కొట్టాడు. దాంతో నలుగురు కుర్రాళ్ళు అతడి మీదకు వెళ్ళారు. స్వతహాగా ప్రభాకరం పిరికివాడు. నలుగురొక్కసారి మీదకు వచ్చేసరికి అతడిలోని పిరికితనం విజ్రుంభించింది. అతడు పరుగు లంకించుకున్నాడు.   
    "హేయ్ , చింపాంజీ పారిపోతోంది" అంటూ కుర్రాళ్ళతడి వెంటబడ్డారు. కొందరు నిజంగా చింపాంజీ పారిపోతోందనే అనుకున్నారు. బోనులో ఉన్న చింపాంజీ బట్టల్లాటివే ప్రభాకరం వేసుకుని ఉండటం కొంత కన్ ఫ్యూజన్ కు దారితీసింది.

 Previous Page Next Page