Previous Page Next Page 
మణిదీపం పేజి 25

    "ఎవరంటే మనమే. వాళ్ళపట్ల మన దృక్పధం మార్చుకోగలిగితే వాళ్ళకు బాధేముంటుంది? తండ్రి పేరు చెప్పుకోలేకపోవడం ఆ బిడ్డనేరం కాదుగా?" సూటిగా ప్రశ్నించాడు అరవింద్. మళ్ళీ అతడే అన్నాడు-

    "సమాజం అంటే మీరు, నేను, మనమందరమేగా? అసలు వాళ్ళను అక్రమ సంతానం అని ఎందుకనాలి? కాంచన విషయమే తీసుకోండి. అతడికి భార్యబిడ్డలున్నందువలన అతని పేరు బజారుకీడ్వలేదు. ఒక మగాడికి ఇద్దరు భార్యలుండడం చట్టబద్దంకాదు కాబట్టి అతడిని పెళ్ళి చేసుకోలేదు. అంతమాత్రాన అది అక్రమ సంతానమని ఎందుకనాలి?"

    "భార్యాబిడ్డలున్నవాడితో సంబంధం పెట్టుకోడానికి దీనికి బుద్ది వుండక్కరలేదా? దీని చదువు, సంస్కారం చట్టబండలయ్యాయా?"

    "స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే ఆకర్షణ చాలా చిత్రమైంది. ఆ ఆకర్షణలో పడ్డవాళ్లకు చదువులు, పదవులు ఏవీ అడ్డురావు."

    "చూస్తే మీకు వివాహవ్యవస్థ పట్ల కూడా నమ్మకం లేనట్టుందే?"

    "ఫ్రాంక్ గా చెప్పాలంటే-లేదు."

    "మైగాడ్ మీరు సంప్రదాయవాదులనుకున్నాను"

    "కాంచనని సమర్ధించాక కూడానా?"

    "నాకు అదే ఆశ్చర్యంగా వుంది. మన వివాహవ్యవస్థలోని సుస్థిరాతను ఫారినర్స్ కూడా మెచ్చుకొంటుంటే"

    "పశువుల్లా కట్టుగొయ్యకు కట్టేస్తే ఎవరైనా సుస్థిరంగా వుంటారు. కట్టుగొయ్య లాంటిదే వివాహ వ్యవస్థ. దాన్ని చూసి గర్వించాల్సింది ఏముంది?"

    "నేనిక మీతో మాట్లాడను. నాకు చాలా కోపం వస్తూంది మీ మాటలు వింటుంటే."

    "కోప్పడితే ఎలా? నా అభిప్రాయం తప్పని నిరూపించాలిగాని"

    "తప్పు కాకపోతే మరేమిటి? వివాహం కట్టుగొయ్యకాదు. నీడనిచ్చే గొడుగు. హంతకులు, దొంగలు ఎక్కువగా తండ్రెవరో చెప్పుకోలేనివాళ్ళ నుండే వస్తారు."

    "వివాహబంధం అన్న గొడుగుక్రింద వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ వుండే వాళ్ళ పిల్లలకి వికృత మనస్తత్వం, తిరుగుబాటు ధోరణి తక్కువగా ఏర్పడదు. ఎక్కువగా కలహించుకొనే తల్లిదండ్రులున్నపిల్లల్ని సంఘవిద్రోహశక్తులుగా మారడానికి తక్కువ అవకాశాలు లేవు. ఒక మనిషి సంఘ విద్రోహి కావడానికి బాస్టర్డే కానక్కరలేదు."

    "నేను మిమ్మల్ని మాటలతో గెలువలేకపోవచ్చు. కాని, మీ అభిప్రాయం చాలా తప్పు. పవిత్రమైన వివాహబంధం లేకుండా పిల్లల్ని కనడం చాలా తప్పు."

    "మీకు పెళ్ళి పవిత్రమైనట్టు వాళ్ళకి ప్రేమ పవిత్రం"

    "ఇంత చెబుతున్నారు! మీరు కాంచనని చేసుకొని ఆ బిడ్డకి తండ్రి లేని లోటు తీర్చొచ్చుకదా?" మంటగా అంది అర్చన.

    "పెళ్ళికి ముందు కాంచన నిజాయితీగా చెప్పివుంటే ఆ పనే చేసేవాడినేమో! కాని, కాంచన నిజాయితీ కోల్పోయింది."

    "ఇంత విశాల హృదయులు కాంచన తప్పును గుట్టుగా గుండెలో దాచుకొని పెళ్ళాడివుంటే యింత రభస జరిగేది కాదుగా? కాంచన అంతమందిలో నవ్వులపాలయ్యేదికాదు! మా మామయ్య అలా తల దించుకొనే పరిస్థితి వచ్చేది కాదు. మీ అమ్మగారికి కోడలొచ్చిందన్న సంబరం మిగిలేది."

    "మనిషి పవిత్రం కాకపోయినా మనసైనా పవిత్రం కాకపోతే ఎలా చేసుకోగలను? ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి జీవించడానికి పెళ్ళే అక్కరలేదు. పరస్పర విశ్వాసం, నిజాయితీ, ఒకరిపట్ల మరొకరికి సదవగాహన అవే లేకపోయాక ఆ బాంధవ్యానికి అర్ధమేముంది?"

    "ఏమిటో మిమ్మల్ని అర్ధం చేసుకోలేకపోతున్నాను. అర్ధం చేసుకోవాలంటే నేనింకా ఎదగాలో, లేక బుర్ర బద్దలు కొట్టుకోవాలో అర్ధం కావడంలేదు."

    "ఏమీ చేయొద్దు. ముందే అది పవిత్రం ఇది పవిత్రం అంటూ ఒక అభిప్రాయం ఏర్పరచుకొని ఆలోచించవద్దు. ఏది ఎందుకు పవిత్రమైనదీ ఆలోచించండి. ఇద్దరు యువతీ యువకులు పెళ్ళి చేసుకోగానే పెళ్ళికి పవిత్రత రాదు. మనసా వాచా ఒకరిలో ఒకరు కలిసిపోయి జీవించినప్పుడే ఆ పెళ్ళికి పవిత్రత వస్తుంది. అది పెళ్ళే కానక్కరలేదు. వట్టి బంధమైనా పవిత్రత వస్తుంది."

   
                                *    *    *    *


    "ఇది అరవిందుడి కథ. ఇది విన్న తరువతః నీకేమనిపిస్తూంది?" అడిగింది అర్చన, కథ చెప్పడం ముగించి.

    "నాకింకా బలంగా అనిపిస్తూంది ఆయన్నే పెళ్ళాడి తీరాలని. 'గిరిజా కళ్యాణం' స్టోరీ తెలిపే వుంటుందిగా, ఆంటీ? శివుడి తపస్సు చెడి, మనసు చెదిరి గిరిజను పెళ్ళాడాలని సర్వదేవతలూ కుమ్మక్కయి వసంతుడినీ, రతీమన్మధులనూ పంపుతారు. గిరిజాకళ్యాణంలో ఆ ఘట్టం ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి, ఆంటీ! మీరంతా నాకు సహకరిస్తే ఈ అరుణోదయ కళ్యాణం అరవింద్ తో జరుగుతుంది."

    "అతడిని మళ్ళీ పెళ్ళి విషయం కదిపే సాహసం మాకెవరికీ లేక నిస్సహాయంగా ఊరుకొన్నాంగానీ అతడో ఇంటివాడు కావడం మాకంతా సంతోషప్రదం. ముఖ్యంగా అతడి తల్లిదండ్రులు మహదానందపడతారు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకొంటారు"

   
                                                                 *    *    *    *
   

 Previous Page Next Page