లోయ దగ్గరికి నడిచాడు వెనక్కి మరలి.
జీప్ మాత్రం సురక్షితంగానే వుంది.
జీప్ ను చేరుకుంటున్న చైతన్య మైదానం లోంచి పరుగెత్తుకు వస్తున్న గ్రామస్తుల్ని చూశాడు అనుమానంగా.
"సినబగతా కొడుకుని నిన్న మాపిటేల పులి సంపేసింది."
"కుందనపల్లి వరకలకాడ్నించి యీడ్చుకెళ్ళింది" రొప్పుతూ చెబుతున్నారు.
పులితో ప్రత్యక్ష పోరాటానికి సమయం ఆసన్నమయింది.
జీప్ స్టార్టుచేసి ముందుకు పోనిచ్చాడు.
కుందనపల్లి ఏ పక్కన ఎంత దూరాన వున్నదీ వచ్చిన వాళ్ళే స్పష్టంగా చెప్పడంతో సాధ్యమయినంత త్వరలో అక్కడికి చేరుకోవాలనుకున్న చైతన్య ఒక ముఖ్య విషయాన్ని గమనించడం మరిచాడు.
నిజానికి అతడు నిన్న జీప్ ను ఆపింది లోయకు అంచున.
కాని, యిప్పుడు అతడు వచ్చేసరికి జీప్ సుమారు ఇరవై అడుగుల వెనక్కి నెట్టబడి వుంది. ఒకవేళ రివర్స్ చేయడమే జరిగితే జీపుకు బ్రేకులు లేవన్న విషయం చైతన్య తెలుసుకుంటాడని ప్రత్యర్ధులు చాలా తెలివిగా అతడ్ని తప్పుదోవ పట్టించారు.
విల్లీస్ జీప్ గంటకు అరవై మైళ్ళవేగంతో పైకెగురుతూ ధూళి రేపుతూ వెళుతోంది.
ఒకచోట బాట రెండుభాగాలుగా విడిపోయి ఉండటంతో ఏ పక్క వెళ్ళాల్సిందీ ఆలోచించడం కోసం స్లో చేయబోయాడు.
జీప్ ఆగకపోవడంతో గుండె గుభేలుమంది.
ఎలాంటి బాటపైనయినా, ఎటువంటి ఇరుకు ప్రదేశాల్లోనయినా చాలా ఏక్యురేట్ గా, నడపగల చైతన్య ఊహించని పరిణామానికి బిత్తరపోతూ బలంగా బ్రేకు నొక్కాడు మరోసారి.
ఫలితం లేకపోయింది.
ఎదురుగా వున్న మద్దిచెట్టును జీప్ డీకొనేటంతలో అనాలోచితంగా స్టీరింగ్ కుడిపక్కకు తిప్పాడు.
సరిగ్గా అక్కడే చైతన్య మార్గం తప్పిపోయింది.
కుందనపల్లికి వెళ్ళాల్సింది ఎడమవేపుగా.
ప్రమాదాలు అతడికి కొత్తకాదు. కాని ఇలాంటి అనుభవం తొలిసారి తొట్రుపాటుతో ఎదురుగా అవరోధాలుగా నిలుస్తున్న చెట్లను గట్లను తప్పించుకుంటూ జీప్ ను అదుపులోకి తేవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాడు చైతన్య.
పల్లంగావున్న మార్గంలో మరింత వేగాన్ని పుంజుకుంటూ స్పీడ్ మీటర్ నీడిల్ వందను సూచిస్తున్న ఆ క్షణాన చైతన్య ఊహించి వుండడు. మరో వంద గజాల దూరంలోనే డెడ్ ఎండ్ ఉందని, ఈలోగా ఆగకపోతే సుమారు నాలుగువందల అడుగుల లోతుగల అగాధంలోకి జారిపోవడం ఖాయమని.
13
ఉదయం సూర్యుడు బాల్యావస్థను దాటుతూ వెలుగు ముద్దల్ని చిలిపిగా అవనిపై విసురుతున్న సమయాన....
విశాలమైన భవంతిలో....బెడ్ రూమ్ లోని పోమ్ బెడ్ పై బోర్లా పడుకుని, రాస్తున్న లేఖను సగంలోనే చింపి నిస్త్రాణగా దిండుపై తలానించుకుని ఉండిపోయింది ప్రీతి.
సోగకళ్ళలో, అస్పష్టమైన బడలిక, మనసులో భాషతో వ్యక్తీకరించలేని మగత. చిలిపిగా విచ్చుకున్నాయి పెదవులు.
రాత్రి చాలాసేపటివరకూ ప్రయత్నించి పూర్తిచేయలేని ఉత్తరాన్ని మళ్ళీ ఉదయం నుంచీ ఏకబిగిన రాస్తూనే వుంది. కాని, అనుకున్నది రాయలేక రాసింది అనుకున్నదికాక, రాయకుండా ఉండలేక ఎంత మధనపాడుతుందంటే ఎదురుగా చైతన్య వుంటే నిజంగా తన నిస్సహాయతనికి పులిలా పైనబడి రక్కేసేదేమో!
"తిరిగొచ్చేసరికి పులిలా వాడి గోళ్ళను పెంచుకుంటావు కదూ!" మృదువుగా నవ్వుతూ, వెళ్ళిన చైతన్య గుర్తుకొస్తుంటే ఒడలు జివ్వు మంటోంది. దిండుకింద దాచిన అతని ఫోటోని ఏకాగ్రతగా చూసింది.
"ప్రేమలేఖ రాయడమంటే వ్యాసరచన పోటీల్లో పేజీలు నింపి ప్రైజలు కొట్టటం కాదు.కోరుకున్న మనిషి గుండెలో అర్ధవ్యాసంలా నిండి అనుభూతుల్ని అందంగా పేర్చడం" ఒకనాడెప్పుడో తను రాసిన ప్రేమలేఖను ఎగతాళి చేస్తూ చైతన్య అన్న మాటలు గుర్తుకొచ్చాయి.
'నువ్వో మూగమనిషివి. అందుకే నీకు మనసులోని మాటని విప్పి చెప్పే శక్తిని కోల్పోతూ నీ సహవాసంలో నేనూ మూగదాన్నయిపోతున్నాను.' ఉడుకుమోత్తనంగా అనుకుంటూ మళ్ళీ పాడ్ ను అందుకుంది.
'ఈసారి ఎలా రాస్తానో చూడు' అనుకుని మళ్ళీ రాయడం మొదలుపెట్టింది.
రాత్రి నుంచీ రాసినవి రాసినట్టే మిగిల్చితే ఓ చిన్న ప్రేమకావ్యం అయ్యుండేది.
చైతన్య ఫోటోలోనికి చూస్తూ పరిసరాలను మరిచిన మమేకంతో మళ్ళీ కాగితాలపై గుండె గళాన్ని కలంగా మార్చి ఏకబిగిని రాసింది ఆగకుండా.
ఆమె కళ్ళలో ఏదో సంతృప్తి.
వివక్త హృదయ శతహ్రహోద్బవ ప్రవల్హిక జ్యోత్స్నాభిషిక్త అభిహితమైన ఒప్పారు వాక్యాల సరళి హృదయాంతరాళాల్లో సన్నని అలలా కదిలి మైమరపించింది.
"ప్రియమయిన నా చైతన్యకు,
నిను చూడని ప్రతిగంటా జేగంటగా మారి నా మనోమందిరంలో నినదిస్తూ నీ స్మృతి మృతిలేని క్షణాల్ని నా ముందు పరచి అల్లరి చేస్తోంది. ఆరడి పెడుతోంది ఎప్పుడు తిరిగొస్తావో తెలీని భయం. కాలానివే నువ్వయి గుండెకి గాలంవేసి గోలచేస్తున్న మనసుకు ఎప్పుడు ఊరట కలిగిస్తావోనన్న నిరీక్షణ. నీకేం! ఎదురుగా ఉన్న వేళ నన్ను చూసి చిలిపిగా మనసును నలిపేస్తావు తప్ప దూరంగా వెళ్ళిన తర్వాత నన్నెక్కడ గుర్తుచేసుకుంటావు? అంత తీరికెక్కడిది, పాపం ఎప్పుడూ నా సొద తప్ప నా గురించి నీకెందుకు పడుతుంది. పురివిప్పిన సంధ్యాదేవిని పెనవేసుకున్న వెలుగురేఖలు ఆమెను తమలోనే ఐక్యం చేసుకుని ఏకత్వంలో ఆమె ఉనిక్కో సార్ధకతని కలిగిస్తున్నాయి. నువ్వుమాత్రం_ ఎంచక్కా ప్రకృతి కన్యను చూస్తూ పులకిస్తూ ఈ ప్రీతిని మరిచి బహుప్రీతిగా ఛీప్ లోనో షికార్లకు బయలుదేరుతుంటావు.
కాని, నిన్నెలా మరువను నేను!
సరిగ్గా ఇప్పుడేం చేస్తున్నావు?
నీ నిరీక్షలో గడిపే....
నీ ప్రీతి."
"బ్యూటిఫుల్" అన్నారెవరో!
అమాంతం చదువుతున్న ఉత్తరాన్ని బ్లౌజ్ లో దాచేసుకుంది ప్రీతి.
వెనక నవ్వుతూ నిలబడి వుంది నమ్రత.
సిగ్గుతో ప్రీతి చెంపలు సింధూరవర్ణాన్ని నింపుకున్నాయి.
"గుండెగోడును మళ్ళీ గుండెలో దాచేసుకున్నావేమే!" అంది నవ్వుతాలుగా.
"ఛీ....నోర్ముయ్!"
"యూ లేజీ గాళ్! కాలేజీకి టైమయింది. ఆ లేఖలోని శోకాన్ని ఏ కాకమ్మకైనా అందించి అన్నయ్యకి పంపితే డోకాలేకుండా పీలక వరకూ కలత చెంది పరుగున వస్తాడు. అప్పుడు ఆ బ్లౌజ్ లోని లేఖకి బదులుగా అన్నయ్యనే దాచుకుని....
"ఛీ....పాడు!" అంది, నమ్రత మాటలకి మరింత సిగ్గుపడుతూ.