ప్రసూన రెండు చేతులతో ముఖం కప్పుకుంది.
"నీకేం మతిలేదేంటయ్యా! దాన్నడుగుతావు. సగం చచ్చి అధి కుములుతూంటే- లేని మాటలు సెప్పే పిల్లేనా అధి! అందులో ఇట్టాంటియ్యి-"
సాంబశివం ఆలోచిస్తూ కూచున్నాడు. క్షణ క్షణానికీ అతని ముఖంలో కాఠినయం పేరుకోసాగింది.
రాధమ్మ ప్రసూన దగ్గరకువచ్చి "నా తల్లీ! కాసింత కాఫీయేనా తాగు-" అంది.
ప్రసూన తల్లి చేతులను విడిపించుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది.
ఎంతోసేపటికి హరి వచ్చాడు.....ఆ సమయంలో తన ఇంట్లో సాంబశివాన్ని చూసేసరికి తెల్లబోయాడు. పలకరించబోయి అతని ముఖంలో కాఠిన్యంచూసి ఆగిపోయాడు. పొగలు, సెగలు కక్కుతోన్న రాధమ్మను చూసేసరికి జారిగింది ఊహించుకుని భయంతో కొయ్యబారాడు.
సాంబశివం హరిని చాచి లెంపకాయ కొట్టాడు. ఆ దెబ్బతో తూలిపడిన హరి వెంటనే లేచాడు. "జాగ్రత్త! మరోసారి చెయ్యెత్తావంటే మర్యాద దక్కదు."
"స్కౌండ్రల్! ఏమిటిరా నువ్వు చేసింది?"
"తిట్టకు ఇంగ్లీషు తిట్లు, తెలుగు తిట్లు నీకంటే నాకు చాలావచ్చు. ఏంచేసినా? నాయిష్టం వచ్చింది చేశాను. నువ్వేంచేశావో నేను అడుగుతున్నానా?....."
"ఇడియట్! ఇంతవాడి వయ్యావా? ప్రసూనను ఆ క్లబ్ కి తీసికెళ్ళడానికి ఎన్ని గుండెలురా నీకు?"
"నా కూతురు - నా యిష్టం - - - -"
"ఏం కూశావ్ ? నిన్ను - - -"
"ఏం పోలీసులకు పట్టిస్తావా? పిలు-పోలీసుల్ని - -" విరగబడి నవ్వాడు హరి - - -
"నీ జిమ్మడ - -" మెటికలు విరిచింది రాధమ్మ - -
"ఊరుకోయె! పళ్ళు రాలగలవు -"
విదిలించాడు హరి - -
"నా పళ్ళు రాలగొట్టగల మొగాడివా? నీ పీక నొక్కేయనూ?" పళ్ళు నూరింది రాధమ్మ - -
నిజంగా బెదిరాడు హరి - -
"హరీ! ఎందుకిలాటి దరిద్రపు పని చేశావ్? బుద్ది లేదూ?"
సాంబశివం కంఠం కఠినంగానే ఉన్నా అందులో తీవ్రత కొంచెం తగ్గింది. "బుద్ది! ఎవరికుంది? ఉన్నదేదో ఎవరికి కావలసినట్లు వాళ్ళు ఉపయోగించుకుంటూనే ఉన్నారు. నా బుద్ది నేను ఉపయోగించుకున్నాను. డబ్బు! - డబ్బు కావాలి!"
"షటప్! గెటవుట్!-"
"గె-ట-వు-ట్! పోవాలా?" అలాగే పోతాను. నా పెళ్ళాంబిడ్డల్ని తీసుకుపోతాను."
"హరీ!"
"ఏం నా పెళ్ళాం! నా కూతురు! తీసుకుపోవద్దనటానికి నువ్వెవరు?"
కొన్ని క్షణాలు సాంబశివం మాట్లాడలేదు.
తరువాత నెమ్మదిగా చాలా కరుగ్గా అన్నాడు.
"హరీ! డబ్బు కావాలంటే అడుగు-నాతో ఆటలాడకు?"
"అడిగాను-ఇవ్వనన్నావు-గుర్తుచేసుకో!"
సాంబశివం జేబులోంచి చెక్ బుక్ తీసి ఒక చెక్ చింపి హరిచేతిలో పెట్టాడు.
"నన్ను ఆడించగలనని అనుకోకు! నేను ఇయ్యదలచుకున్నదే ఇస్తాను. నువ్వు కోరిందికాదు....."
చెక్ కంటపడిన హరి ఇంకా పేచీలు పెట్టదలచుకోలేదు. తల ఆడించాడు.
"జాగ్రత్త! మరొకసారి ప్రసూన విషయంలో ఇలాటిదేమైనా జరిగిందంటే......."
పట్టరాని ఆగ్రహంతో మాట పూర్తిచెయ్యలేక కొంతసేపు ఆగిపోయాడు సాంబశివం.......
"రాధమ్మను పసుపుకుంకుమలు లేకుండా చూడటం నాకిష్టం లేదు!" అన్నాడు__
ఉలిక్కి పడ్డాడు హరి....అతడి కళ్ళూ ఎర్రపడ్డాయి__
"మరి నువ్వూ నన్ను కాస్త కనిపెట్టి ఉండు. పాపం, సుశీలమ్మ తండ్రిలేని బిడ్డ కావటం నాకూ జాలిగానే ఉంటుంది....."
ఒక్క ఉదుటున లేచాడు సాంబశివం-పులిలా హరి చొక్కా కాలర్ పట్టుకున్నాడు- కళ్ళలో కళ్ళు పెట్టి "జాగ్రత్త!" అని ఒక్కతోపు తోసి బరబర వెళ్ళిపోయాడు......
సాంబశివాన్ని వెళ్ళిపోనిచ్చి "ఏడిశాడు-" అని బిగ్గరగా నవ్వాడు హరి.....
జరుగుతున్న ప్రతి అంశమూ ప్రసూన గమనిస్తూనే ఉంది. ప్రతి అక్షరమూ వింటూనే ఉంది.
ఏమిటిది తన తండ్రీ, సాంబశివం ప్రాణ స్నేహితులనీ, అందుకే తమ కుటుంబాన్ని సాంబశివం ప్రాణ స్నేహితులనీ, అందుకే తమ కుటుంబాన్ని సాంబశివం ఆదుకుంటున్నాడనీ వింది. ఇదేమి స్నేహం! ఇద్దరూ పోట్లకుక్కల్లాగా.....కసితో ద్వేషంతో ఒకదానిని మరొకటి కాటు వెయ్యడానికి చూసే కాలనాగుల్లా ఉన్నారు.....
ఎలాంటి వాతావరణం మధ్య కూరుకుపోయింది తను? ఆ తల్లి! ఈ తండ్రి! ఎటూ అర్ధం కాకుండా సాంబశివం......
మోహన్! దూరాన తళుకుమనే తారలా అతని తీయని స్మృతి! సంభవమేనా? ఈనాటి సంఘటన తరువాత...