"మాగజైన్లు కొట్టేస్తారా?"
"అవును మీకు తెలీదా ఆ విషయం?"
"తెలీదు అసలు నేను మాగజైన్స్ చదవనుగా!"
"అదీ సంగతి! అందుకే తెలీదు"
"కానీ మాగజైన్లు కొట్టేయడం అలవాటున్నవాళ్ళు ఇన్విటేషన్ కార్డ్ ఎందుకు కొట్టేస్తారు?" అడిగాడు సింహాద్రి.
"వెరయిటీ కోసం" నవ్వుతూ అందామె.
"తమాషాగా వుందే"
"తమాషా ఏమీ లేదు. ఇన్వి టేషన్ కొత్తపద్దతిలో వేయించారు డాడీ. దానికి మధ్యలో ఎనిమిది పేజీలుంటాయ్"
"ఓహో....ఒండర్ ఫుల్"
"అందుకే అది కూడా ఓ కొత్త మాగజైన్ అనుకుని కొట్టేసి వుంటారు"
"పాజిబుల్" అన్నాడు సింహాద్రి.
"ఇల్లు తేలిగ్గా కనుక్కున్నారా?" అడిగిందామె.
"ఓ! వెరీ ఈజీ! ఎవర్నడిగినా చెప్పేస్తున్నారు"
"అవును! డాడీ చాలా ఫేమస్ ఈ సిటీలో"
"అవును! టూమచ్ ఫేమస్!"
"డాడీ ఇంట్లో లేరు. లేపోతే యిప్పుడే పరిచయం చేసేదాన్ని"
"ఇంట్లో లేరా?" తేలిగ్గా గాలి పీల్చుకుంటూ అన్నాడు సింహాద్రి.
"లేరు"
"ఎక్కడికెళ్ళారు? ఊరు వెళ్ళారా?" ఆశగా అడిగాడు.
"అబ్బే ఊరికి కాదు! వేట కెళ్ళారు!"
"వేట ఏమిటి?"
ఆమె ఆశ్చర్యపోయింది.
"ఏమిటి? మీకు వేటంటే తెలీదా?"
"తెలీదు"
"తెలీపోవడమేమిటి భలేవారే! జంతువుల్ని వేటాడడానికి అడవి కెళ్ళరూ?"
"ఓ.. అదా! ఆ వేట తెలుసు" తల ఊపాడతను.
"కానీ సాధారణంగా మహారాజులే కదా వేటకెళ్ళేది. జానపద కథల్లో చదివాను వేట గురించి!"
"యిప్పుడు అందరూ వేట కెళ్తారులెండి" అందామె చిరాకుగా.
"యింతకూ మీ డాడీ వేటకెందుకెళ్ళారండీ" అడిగాడు చిరంజీవి.
"ఇవాళ నా పుట్టిన్రోజుకదా! అందుకని నాకిష్టమయిన జింకను షూట్ చేసుకొస్తానని అడవి కెళ్ళారు"
"అయితే మీకు జింక చాలా ఇష్టమాండీ"
"బోలెడిష్టం"
"అంటే ఆయన అప్పుడప్పుడూ ఇలా అడవి కెళ్ళి వేటాడుతూంటారాండీ?" అనుమానంగా అడిగాడు సింహాద్రి.
"అప్పుడప్పుడు ఏమిటి? చాలా ఎక్కువగానే వెళ్తూంటారు. వళ్ళు మండిందంటే రోజు వేటాడతారు కూడా?"
చిరంజీవి ఉలిక్కిపడ్డాడు.
"రోజూనా?"
"అవునూ! ఏం?"
"మరేం లేదండీ! ఊరికే అడిగాను" అన్నాడతను గోడకు తగిలించివున్న రకరకాల ఆయుధాలు చూస్తూ.
"అవన్నీ డాడీవి" అందామె ఉత్సాహంగా.
"అలాగా" ఎంత ఆపడానికి ప్రయత్నించినా అతని గొంతులో కొంచెం వణుకు కనిపించింది.
"అవును! డాడీకి 'గన్స్' అంటే ఎంతో ఇష్టం. ఏ కొత్త మోడల్ వచ్చినా కూడా కొనేస్తూంటారు"
"కానీ ఎందుకండీ అలా కొనడం అనవసరంగా"
"అది డాడీ హాబీ"
"ఓ... అలాగా హాబీ అన్నమాట. అంటే ఫోటోగ్రఫీ సంగీతం, స్టాంపులు సేకరించడం అలాంటి హాబీ కదండీ!"
"ఎగ్జాక్ట్ లీ! అంతేగాదు. అవన్నీ వారానికోసారి ప్రయోగిస్తేగాని డాడీకి మనశ్శాంతిగా వుండదు"
"వారానికో రోజాండీ"
"అవును"
"అంటే రోజూ వేట- వారానికోరోజు గన్స్ తో షూటింగ్! అంతేనాండీ?"
"మరీ రోజూ కాదనుకోండి. ఓ రోజు అటూ ఇటూగా కానీ వేటలో ఏ జంతువూ దొరక్కపోతే మాత్రం భలే కోపంగా వుంటుందాయనకు. ఆ రోజంతా మనం దూరంగా వుండకపోతే మననే కాల్చిపారేస్తారు"
"ఆ. మననా?"
"మననంటే- మరీ మనను కాదనుకోండి! ఇంకెవరి నయినా! ఆ... మీరు కూర్చుని ఈ మాగజైన్స్ చూస్తూండండి. మేడమీద రూమ్ రడీ చేయించేస్తాను. వంటవాడు మీకు కాఫీ తెచ్చిస్తాడు..."
"ఇప్పుడు కాఫీ అదీ- మీకు శ్రమ కదూ?"
"శ్రమ నాదెలా అవుతుందండీ! వంటవాడిది. నేనీలోగా ఈ నవల చదివేస్తాను. ఇంక వందపేజీలే వుంది"
"ఎవరిదండీ ఆ నవల? నాదేనా?"
"అబ్బే మీది కాదండీ! ఇంకో రైటర్. ఇతను కూడా హిప్నాటిజం మీద భలే రాశాడు. వస్తానండి. మాంచి సస్పెన్స్ లో ఉన్నాను" అంటూ లోపలకు పరుగెత్తిందామె.
"ఇల్లు బ్రహ్మాండంగా వుంది కదురా?" అడిగాడు చిరంజీవి హాలంతా కలయజూస్తూ.
"ఆ గోడకున్న ఆయుధాలు తప్పుతే మిగతాదంతా బాగానేవుంది" వప్పుకున్నాడు సింహాద్రి.
"ఫర్నిచర్ కూడా ఒండర్ ఫుల్ గా వుంది"
"వీళ్ళ డాడీతో మనకేమీ ప్రమాదం వుండదుకదా?" అనుమానంగా అన్నాడు సింహాద్రి.
"ఛట్. మనకేం భయంరా! నువ్వు గ్రేట్ రచయిత ధనుంజయ్ వని తెలిసిందంటే ఆయనే నీ కాళ్ళమీద పడిపోతాడు"
"కాళ్ళమీదెందుకు పడడం?"
"అదంతేరా! ఈ మిలటరీవాళ్ళకి లిటరేచరంటే అంత ప్రాణం. సర్వీసంతా ఈ సాహిత్యం వగైరాలకు దూరంగా ఎక్కడో బోర్డర్స్ లో వుంటారు కదా! అందుకని ప్రేమ మరీ ఎక్కువన్నమాట! మన శ్యాంప్రసాద్ గాడి చిన్నానన్న అంతే గదా! రిటైరయ్యాక తన అభిమాన రచయితను కలుసుకుని పిస్టల్ లో కాల్చిపారేశాడు"
సింహాద్రి ఉక్కిరిబిక్కిరయ్యాడు.
"కాల్చిపారేశాడా?"
"అవును! కానీ ఆ రచయిత ప్రాణం పోలేదు లే! వారం రోజుల్లో తనే బోలెడు డబ్బు ఖర్చు చేసి ఆ గాయం మానిపించేశాడు"
అయినా అతనికి సంతృప్తి కలగలేదు.