Previous Page
విరామం పేజి 23


    "ఒద్దు సర్" అని నవ్వింది, నేనూ నవ్వా.
    "ఒకే..." అని నేవెళ్ళిపోయా.
    సాయంత్రం ఉమని జీపులో యింటికి దిగబెట్టా,
    "స్టటన్ కి చాలా ఈర్ష్యగా వుంది. నేను మీతో అనవసరంగా మాట్టాడకూడదట" ఉమ.
    "ఏవిటి వాడి వుద్దేశం?"
    "మంచి వాడు కాదండీ..."
    "మేం మాట్లాడుతూంటే ఉమ చెల్లెలు పథ్నాలుగేళ్ళది టీ తెచ్చింది.
    "నీ కిదో శ్రమా? నేను."
    "శ్రమేముందండీ.....గాయత్రీ జీపు డ్రైవర్ని లోపలికి రమ్మను. అతనిక్కూడా టీ ఇయ్యి... ఉమ.
    ఆరుగంటలవుతుంది. గదిలో నేనూ ఉమే వున్నాం. అప్పుడప్పుడిద్దరం నిశ్శబ్దమైపోతున్నాం. నా నిశ్శబ్ధం వెనక పెద్ద వుబలాటం వుంది. దాన్ని విచ్చిన్నం చెయ్యాలి.
    "మిస్ ఉమా! నిన్నో సంగతి అడుగుతా. చెప్తావా?"
    ఉమ అలాగే అని తలూపింది.
    "పద్మకేమైంది? ఎక్కడుంది?"
    ఉమా బెదిరిన లేడిలా చూసింది.    
    "కలకత్తాలో యేమైందో నాకు తెలుసు. కమల్ చెప్పేడు.."
    "కమల్! ఓహ్ కమల్! ఆయన్ని నేనెప్పుడూ చూళ్ళేదు. మా అక్క పనిచేసే ఆఫీసు యింటి యజమాని..."
    "అతనే అతను మీ అక్కని చాలా ప్రేమిస్తున్నాడు."
    "మా అక్క శలవల్లోవున్నప్పుడు వుత్తరాలు రాసేవాడు. ఇప్పుడితనెక్కడున్నాడో తెలీదు..."
    "అదంతా ఒక గాథ. అది చెప్తేనీ మనసు బాధపడుతుంది. ఐనా చెప్తా. మరొకప్పుడు. ముందు పద్మ సంగతి చెప్పు. నాకు చాలా ఆతృతగా వుంది."
    "ఉద్యోగం విడిచి అక్క వచ్చినప్పటికి మానాన్నగారి ఆరోగ్యం బాగులేదు. పాపం నాన్నగారికి బ్లడ్ ప్రషరొచ్చింది, అతి మూత్రం కూడా వచ్చింది. అక్క వచ్చింది గాని ఆమె మనసు దెబ్బతింది. ఉద్యోగం లేదుగదా అన్న బెంగకూడా వుంది-నేనప్పటికింకా చదూతున్నా.నాన్నగారి జీతం చాలదు, ఇల్లు చాలాభాగం కూలిపోయింది....."
    "మీ పెదనాన్నగారంత ధనవంతులు కదా, మీకు సాయం చెయ్యలేదా?"
    "అబ్బే, మాకూ వాళ్ళకీ అంత రాకపోకల్లేవండి. మేం బీదవాళ్ళం, బీదవాళ్ళకి బంధువులు సాధారణంగా దూరంగా వుంటారు, అయితే. మా నాన్నగారు పోగానే, మా పెదనాన్నగారే మమ్మల్ని ఆదుకున్నారు. అన్నదమ్ములిద్ధర్లో యేం అభిప్రాయ భేదాలుండేవో మాకు తెలీదు. కాని యిప్పుడు వాళ్ళందరికీ మేవంటే అభిమానవే."
    
    "మరి మిమ్మల్ని వేరుంచేరేం?"
    "ఇదే మంచిదండీ. కలిసుంటే కలత లొస్తాయి, కొమిల్లాలో యిల్లు అద్దెకిచ్చేం..."
    "ఔను, నేనాయింటి కెళ్ళా..."
    "నిజం? ఎలా తెలిసింది? మా యిల్లు బాగుందా? కొబ్బరి చెట్టుందా? పెరట్లో చెట్లు బావున్నాయా?"
    ఆమెకి కళ్ళంట నీళ్ళొచ్చేయి. ఉన్న వూరు, కన్నతల్లి అన్నారు.
    "మీ యిల్లు చాలా బావుంది ఉమా! పెరట్లో చెట్లు చూళ్ళేదు గాని వీథి వెంపు కొబ్బరి చెట్టు నిక్షేపంలా వుంది, పిక్కా ఢిల్లీ దగ్గిర వీథి వెంపు కొబ్బరి చెట్టున్న యిల్లు మీదే."
    ఔను! మీకెలా తెలుసు?" ఆమె యేడుస్తూ అంది.
    "ఏడవకు. పద్మ చెప్పింది. ఉమా! అక్క సంగతి చెప్పవా?"
    "అక్క యెప్పుడూ దిగులుగా వుండేది. వీథిలో కెళ్ళేది కాదు. కమల్ దగ్గర్నించి వుత్తరాల్లేవు. అంచేత మరీ బెంగగా వుండేది. దీనికి తోడు తలమీద పిడుగుపడ్డట్టు ఆమె తల్లి కాబోయే సూచనలగుపించేయి, లేడీ డాక్టరుచేత తనిఖీ చేయిస్తే ఆమె అదే నిర్ధారణ చేసింది,
    అక్క మొదలు నరికిన చెట్టులా కూలి పోయింది. నాన్నగారికి ఆ సాయంత్రం రక్తం పోటు హెచ్చిపోయింది. పక్షవాతం వచ్చి కుడి పార్మ్యం అంతా పడిపోయింది.
    ఈ వార్త తెలిసిన వెంటనే మా అన్న లొచ్చేరు. అంటే రంగూన్ ట్రేడింగ్ కో వాళ్ళు. నాన్నగారికి వైద్యం ఏర్పాటు చేసేరు. అక్క మతిపోయిన దానా తిరుగుతోంది. అంచేత ఒక వంట మనిషిని యేర్పరచేరు. ప్రతి నెలా డబ్బుకూడా యిస్తూండే వారు.
    అక్కకి గర్భస్రావం కలగడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యేయి ఏడో నెలలో నాన్న గారు చనిపోయేరు. మేవంతా యిక్కడి కొచ్చేసేం.
    అక్క ఆస్పత్రిలో పురుడైంది. అసలే మతి లేని మనిషి. అందులో పురుడు కష్టమైంది. పెద్ద ప్రాణానికి నష్టమొస్తుందని జడిసి ఆపరేషను చేసి బిడ్డనితీశారు. బిడ్డకి ప్రాణంలేదు, అక్కకి మతిలేదు.
    పెదనాన్నగారావిన్ని సీతాకుండో లో వుంచేరు. అది మారుమూల పల్లె. గాలి మంచిది. అదీ అక్క సంగతి."
    పద్మ కథవిని నా పళ్ళు నీరు విడిచి పోయింది, ఆ పిల్ల మనసు గాజుకుప్పెలా నాజూకైనది. రాక్షసుడు ఫిష్ ఫూల్ చేసిన దురంతానికి బలైపోయింది,
    తండ్రి గతించినా, అక్కకి మతిపోయినా, సంసారం అవమానం పాలైనా, స్థాన భ్రష్టత్వం కలిగినా, పాపం చిన్నది ఉమ ధైర్యం కూడగట్టుకుని, యింటికి పెద్దదై సంసారం బరువు తన మీద పెట్టుకుంది.
    పరిస్థితుల ప్రభావం మహాచెడ్డది. దాని దాడికి ఒక వ్యక్తేకాదు. దేశమే కాదు, ఒకొక్కప్పుడు ప్రపంచమే తల వొగ్గాలి.
    మర్నాడు సాయంత్రం నా స్నేహితులు కొందరు భోజనానికొస్తున్నారని, భోజనం యేర్పాట్లు చెయ్యమని లహరీతో చెప్పా. లహరీ మంచి ఏర్పాట్లు చేసేడు. కాని ఎవరొస్తున్నారో అతనికి తెలీదు. ఏరియా ఆఫీసు నించొస్తున్నారని మాత్రం చెప్పా.
    అరున్నరకి ఉమ, చెల్లెళ్ళు వచ్చేరు, వాళ్ళని చూసి లహరీ ఆశ్చర్యపోయేడు. వాళ్ళని ట్రైనింగు రూములోకి తీసుకెళ్ళా.
    "మిస్ ఉమ! ఇతను నా స్నేహితుడు బైధ్యనాద్ లహరీ! లహరీ! ఈమె ఆ ఆఫీసు టైపిస్టు మిస్ ఉమ" అని పరిచయం చేశా. ఉమ "నమష్కార్" అంది. లహరీ బొమ్మలా నిలబడిపోయేడు.
    చికో మాతో కలిసి భోం చేసేడు. లహరీ కి పద్మ సంగతి అప్పుడే తొలిసారి చెప్పా. ఫిష్ ఫూల్ జరిపిన అత్యాచారం మాత్రం చెప్పలేదు. తండ్రికి జబ్బు చెయ్యడం వల్ల వుద్యోగం మానె సిందని, అతని మరణం ఆమె మనసుని తీవ్రంగా గాయపరిచిందని చెప్పా.
    పద్మని చూడ్డానికి పై ఆదివారం అంతా కలిసి సీతాకుండో వెళ్ళడానికి నిశ్చయించేం.
    లహరీ ఉమని, చెల్లెళ్ళనీ వాళ్ళింటికి దిగ బెట్టీ వచ్చేడు.
    లహరీ! నువ్వు ఉమని ప్రేమిస్తున్నావా?"
    "ఔను..."
    "పెళ్ళి చెసుకుంటావా?"
    "ఔను..."
    "బాగా ఆలోచించు. నీకు అన్నలున్నారు. వదినలున్నారు. ఎన్నో అడ్డంకులు రావచ్చు."
    "లేదు జమదార్ సాబ్! నేను ఉమని తప్పకుండా వివాహమాడతా. నేనామెని గాఢంగా ప్రేమిస్తున్నా.
    అప్పుడు లారీకి పద్మ అసలు సంగతి చెప్పా. లహరీ దిమ్మెరపోయేడు.
    "కమల్ ఎక్కడున్నాడు..."
    "ఢాకాలో- బేస్ ఆస్పత్రిలో సివిలియను క్లర్కుగా వున్నాడు"
    "అతనొస్తే పద్మకి నయమౌతుందేయో..."
    "బహుశా, రేపుత్తరం రాస్తా పై ఆదివారం రమ్మని. మనం అంతా సీతాకుండో వెళదాం."
    "ఇప్పుడతను బైట పడొచ్చా...
    "బైట పడొచ్చా అంటే యుద్ధం ముగిసింది. పోలీసులు పాత కేసుల్నంత పట్టించుకోక పోవచ్చు. ఇంతకీ అతనిమీద పోలీసు కేసు అయిందో లేదో తెలీదు. అనుమానం కొద్దీ పరారి అయిపోయేడు. కాని ఈ ఆహుజా కేసుంటుంది. అందులో కూడా అతనిమీద ఛార్జీలున్నాయో లేవో. వారంటు జారీ చేశారో లేదో. పోతే మిలిట్రీలోంచి పరారి అయిన కేసుమాత్రం తప్పకుండా వుంటుంది. అతనే ఎడ్రసిచ్చేదో ఆ జిల్లా పోలీసు సూపరెంటు పేర రిపోర్టు వెళుతుంది. అతను తప్పు అడ్రసిచ్చేడు. ఇంతకీ యుద్ధం అయిపోయింది. పరారీ కేసులు బుట్ట దాఖలా అయిపోతాయి. కాని నువ్వు ఉమని మోసం జేస్తే. అసలే కుంగిపోయిన వాళ్ళ సంసారం మీద మరోదెబ్బ కొట్టిన వాడి వవుతావు..."
    "లేదు లేదు. ప్రమాణం చేసి చెప్తున్నా. ఉమ నాది, నేను ఉమ వాణ్ణి."
    "సరే..."
    మర్నాడు సాయంత్రం సేన్ యింటికి వెళ్ళా. సీనియర్ సేన్ తో పద్మ, ఉమల సంగతంతా చెప్పా. ముసలాయన వోపిగ్గా అంతా విన్నాడు.
    "పద్మ కమల్ కలిస్తే. కలిసి కొన్ని రోజు లుంటే. పద్మ మళ్ళీ మనిషవుతుందని నా నమ్మకం..."
    "పద్మని కమల్ ఈ పరిస్థితిలో వివాహ మాడతాడా?"
    "తప్పకుండా- ఆమెకోసం అతను తపించి పోతున్నాడు."
    పై ఆదివారం అతనొస్తాడు. నేను, అతను. లహరీ మీ యింటికొస్తాం. మనం అంతా కలిసి సీతాకుండో వెళదాం. కమల్ ని చూస్తే పద్మలో కొంత మార్పొస్తుందని నా అంతరాత్మ చెపుతూంది, మీరు కాస్త దీనికి పూనుకోవాలి..." నేను ప్రాధేయంగా అన్నా.
    "మైడియర్ జమదార్ సాబ్. వీళ్ళంతా నా వాళ్ళు. నువ్వింతలా చెప్పాలా. నా శాయశక్తులా పాటుపడి ఈ రెండు వివాహాలూ చేయిస్తా..."
    "వీళ్ళంతా మీ వాళ్ళే....నిజమే కాని నా వాళ్ళుకూడా .... "గొంతు బొంగురుపోయి అన్నా..."
    "తెలుసు. నాకు తెలుసు. మనం అంతా ఒక కుటుంబం..."
    నా మనసు తేలిక పడింది.
    
                                       22

    కల్నల్ జేమ్సు కి కలకత్తా బ్రిగేడా ఫీసుకి బదిలీ అయిపోయింది. శనివారం టెలిగ్రామొచ్చింది. ఏరియా ఆఫీసు సంతోషంలో ములిగి తేలింది. అంతా తృప్తిగా నిట్టూర్చేరు. కల్నలు సోమవారం బ్రిగేడాఫీసులో చేరాలి. ఒంటిగంటకి అందరితో కరచాలనం చేసేడు. నాతో చేస్తూ "జమదార్ సాబ్! త్వరలో కలు ద్దాం" అన్నాడు. కలియడం, విడిపోడం మామూలే గనక అతని మాటల్లో అంతరార్ధం గ్రహించడానికి నేను యత్నించలేదు. కానీ కెప్టెన్ న్యూసమ్ మొదలైన వాళ్ళు దాన్ని గురించి కొంత చర్చించేరు.
    మంగళవారం ఎయిర్ మెయిల్ లో నాకూ రాఖీకొచ్చింది. నన్ను కూడా బ్రిగేడ్ హెడ్ క్వార్టర్సుకి బదలాయించేరు. నేను శనివారం నాడక్కడ హాజరుకావాలి. వ్యవధిలేదు. వెంటనే ప్రయాణం.
    ఉమ ఆఫీసులో యేడ్చింది, నేనామె నోదార్చా! పేద సేన్ గారితో చెప్పి ననదంతా చెప్పా,
    నా బదిలీ సంగతి విని లహరీకి మూర్చ వచ్చి నంతపనయింది. లహరీ నన్నొక స్వంత అన్నలా చూసుకుంటున్నాడు. అతను నా దగ్గర కొచ్చినప్పుడు సిపాయి, వృత్తిలో మూడోగ్రేడు క్రమంగా అతన్ని నాతో పమానం చేశా. మొదటి గ్రేడుకి ఎత్తా, నాకు ప్రొమోషనొచ్చి నప్పుడు సంతోషం పట్టలేక లహరీ ముందుకీ వెనక్కి పదిసార్లు మార్చిచేసి పదిసార్లు సెల్యూట్ చేశాడు.
    "లహరీ? నేను యెల్లుండి కలకత్తా బైల్దేరు తున్నా. కమల్ వస్తాడు. నువ్వతన్ని సేన్ గారి దగ్గరికి తీసువెళ్ళు. మీరంతా సీతాకుండో వెళ్ళండి. నేను తిరిగి పద్మానది దాటి యిటు రాననుకుంటా. మనం తిరిగి ఈ సర్వీసులో, కాదు ఈ జీవితంలోనే కలియవేమో. అసలు మన దేశపరిస్థితే మారిపోవచ్చు: భారం అంతా నీది నువ్వు ఉమని దగా చేయకు. కమల్ పద్మ సుఖంగా వుండాలి. అదే నా కోరిక...
    ఉద్రేకంతో అతని మొహం బిగుసుకు పోయింది. లహరీ నాతో స్టేషను కొచ్చాడు. ఒద్దంటున్నా ఉమకూడా వచ్చింది. మనసుల్లో బాధచేత మేమేం మాట్లాడుకోలేక పోయాం. ఉమ ఉండుండి కన్నీళ్లు పెట్టుకుంటోంది.
    రైలొచ్చింది. నా సామాన్లు కంపార్టు మెంటులో పెట్టాం.
    గార్డు విజిలూ దేడు. గంటమోగింది, రైలు కూసింది.
    "ఓకే లహరీ!" అని చేతులు జాపా.
    లహరీ నా గుండెలకి హత్తుకుపోయేడు. ఇద్దరం శాశ్వతంగా విడిపోతున్నందుకు చంటిపిల్లల్లా యేడిఛాం. ఉమ మొహం అటు తిప్పు కుంది.
    రైలు వెళ్ళిపోతూంది. నేను గుమ్మంలోంచి వంగి "కహరీ! మర్చిపోకు" అన్నా. అతనలాగే అన్నట్టు తలూపేడు. వాళ్ళిద్దరూ కనిపించేవరకూ చూస్తున్నా.
    పద్మానది మీంచి లాంచి వెళ్ళిపోతూంది, ఆవాళ పౌర్ణమి.
    అన్నీ తెలిసిన పద్మ చంటిపిల్లలా వెల్లకిలా వొళ్ళో పడుకుని చంద్రుడి వేపు చూస్తూ ఏమీ తెలియనిదానిలా నవ్వుతూంది.

 

                                                  :----సమాప్తం----:

 Previous Page