"ఏదో ఒకటి చేసేవాడు. ఇప్పుడదంతా ఎందుకు? అసలే అలసటతో ఇంటికి వచ్చిన మనిషిని పట్టుకుని అలాంటి ప్రశ్నలు అడుగుతావేం?" బామ్మ విసుక్కుంది. విశాల మొహం మాడ్చేసింది అప్పటికే.
సునీత విశ్వంవైపు చూసింది. ఆ సంభాషణలో భాగం పంచుకునే ఉద్దేశం లేనట్లు పేపర్ లో తల దూర్చేశాడు. సునీత అక్కడ కూర్చోలేక లోపలకు వెళ్ళిపోయింది. ఒక పురుషుడి వ్యక్తిత్వాన్ని, లౌక్యం తెలిసిన భార్య ఎలా కొద్ది కొద్దిగా చంపెయ్యగలదో ఆమెకి ఆ క్షణం అర్ధమైంది.
* * *
ప్రపంచ దేశాలన్నింటిలోనూ పెళ్ళి అనే వ్యవస్థ దాదాపు ఒకే కాలంలో ప్రారంభమయిన, ఆసియా, కొన్నియూరపు దేశాలలో అదింకా బలంగా, పూర్తిగా కొనసాగటానికి కారణాలు అనేకం కనిపిస్తాయి. భారతదేశంలో మతపరమైన నమ్మకాలు అతి ముఖ్యమయిన పునాది అయిపోయాయి.
"పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి. ఎవరెవరు భార్యాభర్తలు కావాలో అక్కడే నిర్ణయింపబడుతుంది. మన చేతుల్లో ఏమీలేదు" ఇది వేదాంతం.
రాజకీయాలలో "కాన్సెన్స్ స్" అనే పదం ఎక్కువగా వినిపిస్తుంటుంది. పదిమంది వ్యక్తులు ఒక పార్టీని పెట్టినప్పుడు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్లో కొన్నింటిని సమకూర్చుకుని ఒక ఒప్పందానికి వస్తారు. సాధారణంగా కొద్దిరోజులు గడిచేటప్పటికి అందులో బలహీనుల అభిప్రాయాలు మరుగున పడిపోయి బలవంతుల మాటలు రూల్సుగా సంతరించుకు పోతాయి.
విజ్ఞానశాస్త్రంలో ఒక ప్రయోగం మనం చిన్నతనంనుంచీ చూస్తున్నాం రంగురంగుల చక్రాన్ని వేగంగా తిప్పితే ఒకే ఒక తెలుపురంగు కనబడుతుంది. చక్రం ఆగినప్పుడుగాని అందులో రంగులు బయటపడవు. ఈ ప్రయోగాన్ని కనిపెట్టిన సర్ సి.వి.రామన్ భారతీయుడే. బహుశా తనచుట్టూ వున్నా కుటుంబాలను పరిశీలించినప్పుడు అతడికీ అయిడియా వచ్చుంటుంది.
ఈ కుటుంబ వ్యవస్థ, పై రంగాలన్నింటినించి సూత్రాలను సమీకరించుకున్న ఒక కాన్సెన్స్ స్!!! పైకి స్వేచ్చంగా ప్రేమభిమానాలతో నిర్మించబడ్డట్లే కనిపిస్తుంది. ఒక్కసారి లోతుకు వెళితేగాని ఎవరెవరు యెంత ఆహుతి అయిందీ బయటపడదు. విశ్వం, విశాల దాంపత్యం ఎక్సెప్షనేం కాదు.
విశ్వం ఒక నిర్దుష్టమయిన ఆదర్శానికీ, అభిప్రాయానికీ కట్టుబడి పెరగలేదు. అతడిలో పుస్తకాలు చదివి సంపాదించుకున్న జ్ఞానం వుంది. కాలేజీ చదువు నేర్పిన తెలివి వుంది. అనుభవం నేర్పిన లౌక్యం వుంది. అన్ని రకాలుగా విజ్ఞానవంతుడయిన అతడిలో ఆ తెలివితేటలను, జ్ఞానాన్ని గ్రహణం పట్టే పిరికితనం అనే బలహీనత వుంది. ప్రాక్టికాలిటీకి అనుగుణంగా తన వాదనలను మార్చుకునే అమాయకత్వం (?) వుంది.
అప్పటికీ, ఇప్పటికీ అతడిలో మారని గుణం ఏదైనా వుంటే అది సంభాషణా చాతుర్యం తనలో దాగిన విజ్ఞానాన్ని గుప్పించి ఎదుటివాళ్ళను ఆకట్టుకునే ఆ గుణం చాలా మందిని అతడివైపు ఆకర్షించేట్లు చేసింది. అయితే అతడిలోని ఈ ఎస్సెట్ కేవలం మాటలవరకే పరిమితం. అసలు సిసలయిన అల్ట్రూయిస్ట్ అనే పదానికి అర్ధం తెలియకపోవచ్చు.)
తననెంతగానో చదువుకొమ్మని ప్రోత్సహించిన భర్త ఆమాట తల్లిదండ్రుల అనుమతితోనే చెప్పాడు. వాళ్ళకేమాత్రం ఇష్టంలేదని అనుమానం వున్నా "నీ యిష్టం అమ్మనడుగు. తను సరేనంటే నాకే అభ్యంతరమూ లేదు" అనేసేవాడు. తల్లీదండ్రీ వున్నంతకాలం వాళ్ళనీడలో పెరిగిన అతడిని వాళ్ళు పోగానే తన కొంగుచాటుకు లాక్కుంది విశాల. అన్నాళ్ళూ "ఇది చెయ్యాలని నా కిష్టమే కాని అమ్మా నాన్నా బాధపడతారు కాబట్టి నేను చెయ్యలేదు" అనే అతడు ఇప్పుడు "నాకిష్టమే గాని నేనలా చేస్తే విశాల బాధపడుతుంది. ఎందుకు లేనిపోని రప్చర్, సర్దుకుంటే పోతుంది" అనడం మొదలుపెట్టేవాడు. అతనిలోని పిరికితానాన్ని ప్రోత్సహించి పూర్తిగా తనమీద ఆధారపడేటట్లు చేసుకుంది విశాల. ఇరవై నాలుగ్గంటలూ అతడిని రక్షించుకునే ఆలోచనలో వుండి పిల్లలను నిర్లక్ష్యం చేసేసింది.
విశ్వానికి తలకు నూనె రాసుకోవడం ఇష్టం వుండదు. కాని విశాల చెప్పగానే బుద్దిగా కూర్చుని రాయించుకుంటాడు. స్నానానికి నీళ్ళు తోడుకోవడం చాతకాదు కాబట్టి తనిష్టమయినప్పుడు స్నానం చెయ్యలేడు. ఇంటి విషయంలో స్వయం నిర్ణయం చేసుకునే శక్తి లేనేలేదు. నెలకు మూడువేలు సంపాదించుకువచ్చి భార్య చేతిలో పెడతాడు. ప్రాణస్నేహితుడికి అవసరానికి ఓ వందరూపాయలు సర్ధాలంటే భార్యనడగడానికి సందేహిస్తాడు. తనకు వచ్చే ఎక్స్ ట్రా డబ్బు భార్యకు తెలియకుండా దాచుకుని స్నేహితులకోసం ఖర్చు పెడుతుంటాడు. అతడు కావలసిన దానికన్నా ఎక్కువే సంపాదిస్తాడు. బోలెడు ఆస్తికూడా వుంది. కాని ఆర్ధికంగా స్వతంత్రుడు కాడు. "ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు" అని శాసించే వాళ్ళు లేరు. అయినా అతడికి వ్యక్తి స్వాతంత్ర్యం లేదు. విశాలకు అదే అడ్వాంటేజి. బయటకు కనిపించని విధంగా విశ్వాన్ని తన గుప్పెటలో పెట్టుకోగలిగింది.
తను తన భర్తను ప్రేమించినంతగా ప్రపంచంలో మరే భార్యా తన భర్తను ప్రేమించలేదని ఆమె ప్రగాఢ విశ్వాసం. ఆమె దృష్టిలో ప్రేమ అంటే అతనికి శారీరకంగా ఎలాంటి శ్రమా యివ్వకపోవడం మాత్రమే. అతను కూడా తనను అంత గాఢంగా ప్రేమించాలంటే అతడి అహాన్ని అప్పుడప్పుడూ సంతృప్తి పరుస్తుండాలి.
విశాలలో మరోరకం గుణం కూడా వుంది. చూడముచ్చటగా వున్న తన సంసారాన్ని చూసి ఊళ్ళో జనం అంతా అసూయతో రగిలిపోతుంటారని ఆమె అభిప్రాయం. తన ఇంట్లో జరగకూడని ఏ సంఘటన జరిగినా అది ఎదుటివాళ్ళ మీద రుద్దేస్తుంటుంది.
"ప్రొద్దుట కొత్తచీర కట్టుకుని ఆఫీసుకి వెళుతుంటే ఎదురింటి కామాక్షి రెప్పవేయకుండా చూసింది అంతే! ఆఫీసులో కుర్చీ మెకు తగిలి కొత్తచీర కాస్తా చిరిగిపోయింది".
"మావారికి ఒకటే తలనొప్పి, వాంతులు ఆఫీసుకి కూరలు, పచ్చళ్ళతో క్యారియర్ పంపుతాను గదూ తిండికి లేని మొహాలన్నీ అదే పనిగా చూస్తుంటారు కాబోలు".
"పక్కింటి విశాలాక్షి ప్రొద్దుట బాబుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటుంటేనే అనుకున్నాను. ఇవ్వాళ వాడికి జ్వరం వస్తుందని....దాని కళ్ళలో అన్నీ దుష్టశక్తులే".
ఆఫీసులో ఆ కుర్చీ మేకుకి చుట్టుకుని అప్పటికి డజను చీరలు చిరిగాయి. విశ్వం ప్రతిరోజూ అలాంటి భోజనమే చేస్తున్నా ఏ ఒక్కరోజయినా అతడికి భోజనం అరగకపోవడానికి కారణం, ఆ రోజు క్యారియర్ ఫ్యూన్ కిచ్చేసి అతడు ప్రక్కనున్న మిలటరీ హోటల్లో చికెన్ బిర్యానీ తినడం విశాలాక్షి ప్రతిరోజూ బాబుని ముద్దు చేస్తూనే వుంటుంది. కాని స్కూల్లో వాడు బండిలో కొనుక్కున్న ఐస్ ఫ్రూట్ తినడం వల్ల వచ్చింది జ్వరం.
ఈ కారణాలన్నీ విశ్వానికి తెలియకపోవు. కాని అడగడు. హేతువాదాన్ని, తర్కాన్ని గురించి వాదించే అతడు బామ్మ దిష్టి తీయాలనగానే వచ్చి బుద్దిగా కూర్చుని తీయించుకుంటాడు. ఏదో ఒక కారణంచేత ఎవరికో ఒకరికి రోజూ ఆ యింట్లో దిష్టి తీయబడుతూనే వుంటుంది. అవతలివాళ్ళకి మన పనులు ఆనందాన్ని ఇస్తున్నప్పుడు వాటిని చేయటంలో తప్పేముంది? అన్నవాదన దానికి తిరుగులేదు. అయితే విశ్వం, జయల సంబంధం బయట పడ్డప్పుడు విశాల కొద్ది నిమిషాలు స్థబ్దురాలై నిలబడిపోయింది. విశ్వం తనను కాదని మరొకరితో వ్యవహారం సాగించగలడని, అతడిలో అంత ధైర్యం వుందనీ, ఆమె కల్లో కూడా ఊహించలేదు. అతడు ఊరెళ్ళి నప్పుడు పుస్తకాలు సర్దుతుండగా కనపడ్డాయా ఉత్తరాలు. కొద్ది నిమిషాల్లోనే ఆమె తేరుకుంది. బామ్మతో సంప్రదింపులు జరిపింది. అదంతా జయ పన్నిన కుట్ర అని ఇద్దరూ ఏకగ్రీవంగా తీర్మానించేశారు. విశ్వం ఊర్నుంచి తిరిగి వచ్చేలోగా ఆమెకు బుద్ది చెప్పాలని నిర్ణయించుకుని వెళ్ళి, ఆ పని విజయవంతంగా పూర్తిచేసుకు వచ్చింది విశాల. విశ్వానికి ఆ విషయం తెలిస్తే ఏమన్నా అంటాడన్న భయం లేదామెకు. తను ఆ ప్రస్తావన తెస్తుందని అతడే భయపడుతుంటాడని ఆమెకు తెలుసు.
"పడగ్గదిలో అతడికి కావలసిన సుఖం ఇవ్వడం లేదేమో! అందుకే అందరి వెంటా పడుతున్నాడని" మందలించింది బామ్మ మగవాణ్ణి గుప్పెట్లో పెట్టుకోవడానికి అసలయిన ఆయుధం సెక్సేనని ఆవిడ పెళ్ళయినప్పటినుండీ విశాలకు బోధిస్తూనే వుంది. బామ్మ సలహా మేరకు ఆమె విశ్వానికి ఏమీ జరగనట్లే స్వాగతం చెప్పింది. ఊపిరి సలపకుండా ప్రేమలో ముంచెత్తిందారోజు. ఎన్ని ప్రశ్నలతో ఎన్ని రకాలుగా వేధిస్తుందోనని భయపడుతూ వచ్చిన విశ్వం ఆమె ప్రవర్తనకు ముగ్ధుడయిపోయాడు. కన్వీనియంట్ గా జయను దూరం చేసుకున్నాడు.
విశాల బామ్మకు ఇంటికి బంధువులు వచ్చి వుండిపోవడం ఇష్టం వుండదసలు. ఆ భార్యభర్తల ఆనందానికి వాళ్ళు అడ్డు వస్తారనే అనుకుంటున్నది. సునీత వస్తున్నదని తెలియగానే విశ్వంలో కనిపించిన హుషారు చూసి మరేం మాట్లాడలేకపోయారు సునీత ఆ యింటి ఆడపడుచు లాంటిదని వారికి తెలుసు. అందుకే ఆమెను సంతోషంగా ఆహ్వానించారు. కాని సునీత ప్రతి విషయంలోనూ కలుగజేసుకోవడం, విశ్వాన్ని విమర్శించడం చూస్తుంటే విశాలకు ఒళ్ళు మండిపోయేది.
సునీతకు ఆ అనుమానం రానే వచ్చింది. కాని విశ్వంమీద ప్రేమ ఆమెను విడిగా వెళ్ళడానికి సందేహించేలా చేసింది. ఇప్పుడా ఇంట్లో వుండాలన్న ఉత్సాహం తగ్గిపోయిందామెలో కాని ఆ ఇంటిలోంచి ఆమె వెళ్ళవలసిన అవసరం త్వరలోనే వచ్చింది.
* * *