Previous Page Next Page 
పన్నీటి కెరటాలు పేజి 22


                       12

    రా కేంద్రం నుంచి R.K అధికారి చక్రపాణి పరమేశ్వరీ ఆలయం కేసు పరిశోధించటానికి అనుపమసర్కార్ ని నియమించాడు.
    అనుపమసర్కార్ చాకు లాంటిది. వివేకం, చాకచక్యంతో కేసును పట్టేస్తుంది. తక్కువ వయసులోనే రాకేంద్రందాకా వెళ్ళగలిగింది.
    అనుపమసర్కార్ ఒక కేసును చేపట్టిందంటే ఆ కేసు అంతుచూసి విజయం సాధిస్తుంది. ఫెయిల్ కావటమంటూ ఇంతవరకూ జరగలేదు.
    R.K. అధికారి బాగా ఆలోచించే ఈ కేసును అనుపమసర్కార్ కి అప్పగించాడు.
    అనుపమసర్కార్ ఒక అసిస్టెంటును మాత్రం తీసుకుంది తన చేతి కిందకి. మందీమార్బలంతో బయలుదేరలేదు కొన్ని పరికరాలతో తప్ప. వెంటనే వేషం మార్చటం, రంగంలోకి దిగటం జరిగింది.
    ఈ రోజు వరకు పోలీసులకి పట్టుబడని ఆర్ష్ ముఠాని పెంచుకున్నాడు, దొంగల నాయకుడు అయ్యాడు. అతని ముఠా చాలా పెద్దది. మంచిగాని, చెడుగాని చాలా కామ్ గా జరిగిపోతాయి.
    ఆర్ష అంతరంగం ఎవరికీ తెలియదు. కొత్తకేసు చేపట్టినప్పుడు తనవాళ్ళతో వాళ్ళకే పోటీపెట్టి ఎవరు గట్టిగా పోరాడగలిగితే.... ఎవరు తొందరగా ముందుకు వస్తే....వాళ్ళకి కేసు అప్పగిస్తాడు.
    పరమేశ్వరీ ఆలయం కేసులో లంబా, కురైపతి పోటీ పడ్డారు. చాకచక్యంగా కురైపతి ముందుకు వెళ్ళగలిగాడు. కేసుని చేతిలోకి తీసుకున్నాడు. చేపట్టిన కార్యం సాధించలేక ఏకంగా పరలోకానికే ప్రయాణమయిపోయాడు.
    ఇదే కేసు__
    మరోసారి లంబా చేతికి అందుబాటులోకి రాబోయింది. ఆ సమయంలో మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చునేసరికి సాదహ్న ముందుకు వచ్చేసింది. క్విక్ గా నిర్ణయం తీసుకుని.
    ఆర్ష వెంటనే పరమేశ్వరీదేవి ఆలయం కేసును సాధనకి అప్పగించాడు.
    లంబాకి ఇది కోపకారణం అయింది. అవమానంగా కూడా భావించాడు, కసి పెంచుకున్నాడు.
    అది వేరే విషయం అప్రస్తుతం.
    అనుపమసర్కార్ పోలీసు మనిషి, అన్ని అధికారాలూ వున్న సి. ఐ.డి.
    సాధన దొంగలముఠాలో వున్న మనిషి. వాళ్ళు ఏర్పరుచుకున్న అధికారాలు తప్ప న్యాయమైన అధికారాలు లేవు.
    అనుపమసర్కార్ మహామేధావి. పరిశోధనలోకి దిగిందంటే సముద్రంలో పడిన సూదిని కూడా వెతికి తీసుకురాగలదు. ఇంతవరకూ ఏ కేసులోనూ ఫెయిల్ కాలేదు.
    సాధన పదునైన చాకులాంటిది. నీటిలో మొసలిలాంటిది. కేసులో దూరిందంటే వుడుంపట్టుపట్టి సాధించి తీరుతుంది. అవలీలగా హత్యలు చేయగలదు. ఇంతవరకు ఏ కేసు ఫెయిల్ కాలేదు.
    అనుపమసర్కార్ సి.ఐ.డి.
    సాధన దొంగల ముఠా మనిషి.
    ఇద్దరూ ఆడవాళ్ళే.
    ఇప్పుడు ఒకే కేసులో ఇద్దరు ఫిరంగి గుండులాంటి లేదీలు తలపడుతున్నారు.
    ఇరువురు వారివారి కేసుల్లో ఫెయిలయింది ఎప్పుడూ లేదు.
    ఇహ ఇప్పుడు....జయాపజయాలు....విజయం ఎవరిని వరిస్తుంది అన్నది వేచిచూడాల్సిన విషయం.
    పరమేశ్వరీదేవి ఆలయం కేసు సాధించటానికి ఎవరిదోవన వారు అనుపమసర్కార్, సాధన బయలుదేరారు.
    వీళ్ళిద్దరూ గాక___
    మూడో మనిషి కూడా రంగంలోకి దిగాడు.
    ఆ మూడో మనిషి ఎవరో కాదు__
    ఇన్ స్పెక్టర్ వర్ధనరావు.

                            13

    పోలీస్ స్టేషన్___
    ఇన్ స్పెక్టర్ వర్ధనరావుకి మనసు సరిగాలేక లేచి పచార్లు మొదలుపెట్టాడు.
    కొద్దిసేపు పచార్లు చేసింతరువాత చిరాకు వేసింది. చిరాకు ముఖాన్ని ఏమాత్రం మార్చకుండా వెళ్ళి కుర్చీలో కూర్చుండిపోయాడు. నెత్తిన వున్న హ్యాట్ చేతిలోవున్న లాఠీని విసురుగా బల్లమీద పడేశాడు. ఆ తర్వాత నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్నాడు.
    కానిస్టేబుల్ అహోబిలం లోపలికి వచ్చాడు. అయ్యగారి నెత్తిన చేతులు ఉండటం చూసి.... ఈ ఫోజులో వున్న ఈయనగారిని పలకరించటం చాలా ప్రమాదమే అయినా ఇప్పుడు పలకరించక తప్పదు.
    'సార్!' అన్నాడు అహోబిలం ఓపక్క భయపడుతూనే.
    సీరియస్ గా ఆలోచిస్తున్న ఇన్ స్పెక్టర్ వర్ధనరావు వినిపించుకోలేదు.
    ఈతఫా కాస్త గట్టిగా 'సార్!' అని పిలిచాడు అహోబిలం.
    ఇన్ స్పెక్టరు వర్ధనరావు చిరాకు ముఖం ఏమాత్రం మార్చకుండా తలెత్తి చూశాడు.
    'సార్!' అన్నాడు మరోసారి అహోబిలం.
    "నేను సార్ నే. ఎన్నిసార్లు సార్ అని పిలుస్తావు! విషయమేమిటో చెప్పు. చిరాకుపడుతూ అడిగాడు. అహోబిలం వైపు కొరకొర మంటూ కూడా చూశాడు. సీరియస్ గా ఆలోచించేటప్పుడు ఈ అడ్డంకి ఏమిటని వర్ధనరావు మరో చిరాకు.
    "సైకిల్ తాలూకు ఆయన__
    అహోబిలం చెప్పేది సాంతం వినకుండానే 'దొంగనాకొడుకుని తొయ్ కటకటాల్లోకి' అన్నాడు వర్ధనరావు.
    "అది కాదండి!"
    "మరి ఏది?"
    "రాంబాబు అనే ఆయన సైకిల్ పోయింది కదండీ. మనం రిపోర్టు కూడా తీసుకున్నాము....
    "తీసుకున్నాము కదా పొమ్మను. ఇంకా ఎందుకు మన చూరు పట్టుకుని వేళ్ళాడటం?"
    "అదికాదు సార్!"

 Previous Page Next Page