Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 22

   

       రావు కోపం తెచ్చుకోలేదు. "ధరణీ, ఆవేశం అదుపులో ఉంచుకొని ఒక్కసారి ఆలోచించు. దాదాపు పదిహేను వందలు శాలరీలో జంప్. ఇంకా అనేక ఎలవెన్సులు! పిచ్చివాళ్ళయితే తప్ప ఇలాంటి అవకాశాలు వదులుకోరు" అన్నాడు.
   
    "నా ప్లేస్ లో మీ అమ్మాయి ఉన్నా ఇదే రకమైన సలహా ఇచ్చేవారా?" అడిగింది.
   
    రావు ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. "ఊరుకంటున్నాను అనేగా మితిమీరిపోతున్నావు!" అన్నాడు కోపంగా.
   
    "మీరూ అంతేగా?" కామ్ గా అంది.
   
    "నేను తలుచుకుంటే నిన్ను..." అంటూ ఏదో ఆవేశంగా అనబోయి తమాయించుకుని "నీ ఆవేశమే నన్ను ఎక్కువగా ఆకర్షిస్తోంది ధరణీ! అస్సలు తెచ్చుకుందామన్నా నీ మీద కోపం రావడంలేదు. ఇంటికి వెళ్ళి, చన్నీళ్ళతో స్నానం చేస్తూ ఇంకొక్కసారి కూల్ గా ఆలోచించు. అప్పుడు చెప్పు! నేను వెయిట్ చేస్తాను" అన్నాడు సానునయంగా.
   
    "మరొక్కసారి ఇలాంటి టాపిక్ తీసుకొస్తే ఈ మర్యాదకూడా దక్కదు. మీరే ఇంటికి వెళ్ళి శరీరం, మనసూ శుభ్రపరచుకుని ఆలోచించండి. ఉద్యోగం కోసం వచ్చే ప్రతి ఆడపిల్లా అంగడిలో అమ్మకానికి పెట్టిన బొమ్మకాదు!" అని ధరణి కామ్ గా బయటికి వెళ్ళిపోయింది. రావు బాధపడలేదు.
   
    'అమ్మకానికి పెట్టిన బొమ్మలు నాకెందుకూ? ఎవడింట్లోనో భద్రపరచుకున్న ఆర్ట్ పీసెస్ సొంతం చేసుకోవడం థ్రిల్లింగ్ గా వుంటుంది కానీ!' అనుకొన్నాడు అటే చూస్తూ.
   
    ధరణికి బస్ లో కమల కనిపించింది. "మా వేలు విడిచిన మామగారి బట్టలు చాకలాడు చింపిసి తెచ్చాడు. కళ్ళజోడు గూట్లోంచి కిందపడి విరిగిపోయింది. కూరల్లో కారానికి కడుపు మండిపోయింది" అని పకపకా నవ్వింది. ఆమె కళ్ళు మెరుస్తున్నాయి.
   
    ధరణి ఆమెవైపు అభినందనపూర్వకంగా చూసింది. సమస్య ఎంత సులభంగా తేలిపోయిందీ! ఇదే సమస్యని కొండంతలు చేసుకుని నిరంతరం దిగులు పడేవాళ్ళూ వున్నారు.
   
    ఆమె మౌనాన్ని మరోలా అర్ధం చేసుకుని కమల "ఏమైంది ధరణీ?" అని అడిగింది.
   
    "ఏం లేదు. బాగానే వుంది" అంది ధరణి- రావు గురించి ఆలోచిస్తూ.
   
    "థాంక్స్ ధరణీ! నీ సలహావల్ల నాకు చాలా రిలీఫ్ దొరికింది" అంది కమల.
   
    "నాదేం ఉందీ. నీ ఆత్మస్థయిర్యమే సమస్యలోంచి బయట పడేసింది" నవ్వింది ధరణి.
   
    "నువ్వు అదోలా కనిపిస్తున్నావు. ఏదైనా ప్రాబ్లెమా? నా సహాయం ఏవైనా అవసరమా?"
   
    ధరణి తల అడ్డంగా ఊపి "అలాంటిదేం లేదు. వచ్చినప్పుడు తప్పకుండా నీ సహాయం తీసుకుంటాను" అంది.
   
    "ష్యూర్. ఏమడగాలన్నా మొహమాటపడకు!"
   
    ఇద్దరూ బస్ దిగి తమ తమ ఇళ్ళవైపు నడక సాగించారు.
   
    ధరణిని చూడగానే పూజా, అభీ "మమ్మీ వచ్చింది..... మమ్మీ వచ్చింది" అంటూ పరిగెత్తుకుని వచ్చారు.
   
    ధరణి రెండు చేతులూ జాపి ఇద్దర్నీ దగ్గరకు తీసుకుంది.
   
    అభి తల్లి రెండు బుగ్గలమీద ముద్దులు పెట్టాడు. ఆ తరువాత పెదవులమీద పెట్టాడు.
   
    "ఏయ్.. ఇదేవిటి?" ధరణి నవ్వింది.
   
    "కొత్తగా నేర్చుకున్నాను" అభి చెప్పాడు.
   
    "తప్పుకదూ!" చిరుకోపంగా వాడి చెవి మెలి తిప్పింది ధరణి.
   
    "తప్పేం ఉందీ? శాటిలైట్ వాళ్ళు నేర్పిస్తున్నారు" వెనుక నుండి వచ్చి నవ్వుతూ అన్నాడు శ్రీధర్.
   
    "బాగానే ఉంది! తండ్రీ పిల్లలూ సరిపోయారు" లోపలికి నడిచింది ధరణి.
   
    చందూ తలకి ఓ బట్ట చుట్టుకుని కనిపించాడు. "ఏవైందిరా? తలనెప్పా?" కంగారుగా అడిగింది.
   
    "కాదక్కా! వంట చేస్తున్నాను".
   
    "ఇంకా మనం తిన్నట్లే! పూజా, అభీ పదండి హోటల్ కి పోదాం" అన్నాడు శ్రీధర్.
   
    "డామ్ ఇన్ సల్టింగ్ మాట్లాడ్తున్నావు బావా! నా పాకశాస్త్ర ప్రావీణ్యం నీకు తెలీదు!" బుంగమూతి పెట్టి అన్నాడు చందూ.
   
    "ఆపండి! ఆడది ఉద్యోగం చెయ్యడం, మగాడు వంట చేయడం వింతగా చెప్పుకునే రోజుల్లో లేము మనం!" విసుగ్గా అనేసి లోపలికి వెళ్ళిపోయింది ధరణి.
   
    ధరణి అంత విసుగ్గా ఉండటం ఆశ్చర్యంగా చూశాడు శ్రీధర్. కొడుకు ప్రవర్తనవల్ల ఆమె మూడ్ పాడయి వుంటుందని అతడు వూహించలేకపోయాడు.
   
    స్నానం చేసి తెల్లని వాయిల్ చీర కట్టుకుని, తల తుడుచుకుంటూ బయటకొచ్చిన ధరణికి అక్కడ కనిపించిన దృశ్యం ఎంతో ఉల్లాసం కలిగించింది.
   
    హాల్లో మధ్యగా టేబుల్ వేశారు. దానిమీద వండిన పదార్ధాలూ, కోసిన పచ్చికూరగాయ ముక్కలూ, పండ్లూ వుంచారు. టేబుల్ మీద ఓ అట్టమీద 'కెన్ వీ లాఫ్ అండ్ ప్లే' అని రాసి ఉంచారు. శ్రీధర్, చందూ, పిల్లలూ నోళ్ళకి స్టిక్కర్స్ అతికించుకుని కూర్చుని వున్నారు.
   
    ధరణి అందర్నీ ఓసారి పరికించి చూసింది. అందరూ చాలా సీరియస్ గా వున్నారు.
   
    "అబ్బా! ఇల్లు ఎంత ప్రశాంతంగా వుందీ?" ఆనందంగ అంది ధరణి.
   
    ఎవరూ మాట్లాడలేదు.
   
    "చందూగాడి లొడ లొడ వాగుతూ, మావారి నసా, పిల్లల అల్లరి ఏదీ లేదు. అరె! అసలు ఇది నా ఇల్లేనా? నో! ఇది ఇల్లుకాదు. హెల్!" అంది.
   
    అయినా ఎవరూ నోటిమీద నుండి స్టిక్కర్స్ తియ్యలేదు.
   
    ధరణి టేబుల్ మీదున్న బోర్డుమీద 'కెన్ వీ' అన్న అక్షరాలు పెన్ తో కొట్టేసింది. 'లాఫ్ అండ్ ప్లే'! మాత్రం మిగిలాయి.
   
    పూజా, అభీ కళ్ళల్లో ఆనందం మెరిసింది. చందూవైపు చూశారు. చందూ శ్రీధర్ వైపు చూశాడు. శ్రీధర్ సీరియస్ గా న్యూస్ పేపర్ చేతిలోకి తీసుకున్నాడు.
   
    ధరణి ఇంక లాభంలేదని గొంతు సవరించుకొని "మీకో కథ చెప్తాను వినండి. మధ్య మధ్యలొ అడ్డుపడకుండా ఎంచక్కా స్టిక్కర్స్ అంటించేసుకున్నారుగా మీ నోళ్ళకి! నా చిన్నప్పుడూ.... అంటే మరీ అంత చిన్నప్పుడు కాదనుకోండీ, నాతో ఓ అబ్బాయి స్నేహం చేసేవాడు" అంది.
   
    శ్రీధర్ న్యూస్ పేపర్ లోంచి తలఎత్తి చూశాడు. అతని కళ్ళల్లో ఈర్ష్య కదలాడింది.
   
    "ఒకరోజు ఇద్దరం ఆడుకుంటూ ఆడుకుంటూ చాలాదూరం వెళ్ళిపోయాం. చీకటి పడిపోయింది! చీకటంటే....ఇలా అన్నమాట!" ధరణి లేచి లైట్ ఆర్పెసింది.
   
    చీకట్లో పూజ చేతిని అభి భయంగా పట్టుకున్నాడు.
   
    "ఒకటే ఈదురుగాలి... నక్కల ఊళలు అంటే తెలుసా? ఇలా ...." ధరణి గట్టిగా ఊది వినిపించింది. పిల్లలు భయపడిపోయారు.
   
    అభి పూజ దగ్గర్నుండి శ్రీధర్ ఒడిలోకి వచ్చేశాడు. "ఆ చీకట్లో నేనూ ఆ అబ్బాయీ.....చెయ్యీ చెయ్యీ పట్టుకుని నడుస్తున్నాం..... ఇంతలో ఓ పెద్దకేక వినిపించింది. వెనక్కి తిరిగి అటుచూసి ఆ అబ్బాయి భయంతో పెద్దగా అరిచి నన్ను పట్టేసుకుని నా మెడమీద తల దాచేసుకున్నాడు!" అంది ధరణి.
   
    శ్రీధర్ ముందుకి వంగాడు. అతని కళ్ళల్లో మార్పు కనిపిస్తోంది.
   
    "ఆ అబ్బాయి తల నిమిరి ముద్దు పెట్టుకున్నాను...." అంది ధరణి.
   
    శ్రీధర్ స్టిక్కర్ పీకేసుకుని "చంపేస్తాను వాణ్ణి...." అని అరిచాడు.
   
    ధరణి ఆపలేదు. "ఆ అబ్బాయికి భయం తీరలేదు. వెనకాల కనిపించిన ఆకారాన్ని చూసి చెడ్డీ తడిపేసుకున్నాడు" అని నవ్వడం మొదలుపెట్టింది.
   
    "నేనేం చెడ్డీ తడుపుకోలేదు!" చందూ స్టిక్కర్ లాగిపారేసి అరిచాడు. అతడు ఎందుకు అలా అరిచాడో పిల్లలకి అర్ధం కావటానికి ఒక్క నిముషం పట్టింది. అక్కడి వాతావరణం వెంటనే మారిపోయింది. పూజ చప్పట్లు కొడ్తూ నవ్వసాగింది.
   
    శ్రీధర్ తేలిగ్గా నిట్టూర్చాడు.
   
    "ఇంతకీ ఆ ఆకారం ఏమిటమ్మా?"పూజ ఆసక్తిగా అడిగింది.
   
    "మా నాయనమ్మది! ఆవిడంటే మీ మావయ్యకి చాలా భయం. ఇంటికి తీసుకెళ్ళి బడితెపూజ చేసిందిలే!" పూజ బుగ్గ నిమురుతూ అంది ధరణి.
   
    శ్రీధర్ చేతులు కడుక్కోవటానికి బాత్ రూమ్ లోకి వెళ్ళాడు. తువ్వాలు అందిస్తూన్న భార్యతో - "ధరణీ! నవ్వులాటకి కూడా అలాంటి కథలు చెప్పకు" అన్నాడు.
   
    ధరణి అతని తల చెరిపేస్తూ "అంటే మీరే అందరికన్నా ముందు నన్ను ముద్దు పెట్టుకున్నారనా మీ ఉద్దేశ్యం?" అంది.
   
    "అదిగో మళ్ళీ....." కోపంగా చూశాడు శ్రీధర్.
   
    ధరణి వేళ్ళు ముడుస్తూ "మా అమ్మా, నాన్నా, నాయనమ్మా, తాతయ్యా, బడిలో మాస్టారూ..." అని ఆగిపోయింది.
   
    "అవన్నీ నాకు ఓ.కే! వయసు చెప్పకుండా ఇందాకటిలా అదరగొట్టకు. భరించలేను" సిన్సియర్ గా అన్నాడు శ్రీధర్.
   
    ధరణి మాత్రం కాస్త ఆలోచనలో పడినట్లుగా ఉదాసీనంగా మారిపోయింది.
   
    "అక్కా, బావా రావాలీ" కంచంమీద చెంచాతో టకటకాకొడ్తూ అరిచాడు చందూ-ముందు గదిలోంచి.

 Previous Page Next Page