Previous Page Next Page 
క్షమించు సుప్రియా! పేజి 22

   

     "ఊ...."
   
    "వాణ్ణి పనిలోంచి తీసెయ్యాలి. ఈ మధ్య పొగరెక్కువైంది. వాడికి పక్కింటివాళ్ళు మొన్న...."
   
    చెంపమీద ఫట్ మని కొట్టాలన్న ఆవేశాన్ని అతికష్టంమీద ఇంకొ నిముషంపాటు ఆపుకొని, తరవాత నా పక్కమీధకు వచ్చి పడుకున్నాను.
   
                                                               *    *    *
   
    డ్రైవింగ్ సీట్లో కూర్చొని తలుపు వేస్తూంటే అడిగింది, "ఈ రోజు తొందరగా వస్తారా?" అన్న ఆమె ప్రశ్నకు సమాధానంగా నేను అడిగాను.
   
    "సాయంత్రం కళాభారతిలో చిట్టిబాబు వీణా ప్రోగ్రామ్ వుంది. వస్తావా?" కళ్ళలో మినుక్కుమనే ఆశ.
   
    "నే నెక్కడికి వస్తాను? ఆ వీణా సన్నాయిలు తలనొప్పి బాబో"
   
    లాభంలేదు! మా జీవితాలు రైలు పట్టాలు. అవి కనిసం చూడటానికయినా దూరంగా వున్నట్టు కనబడుతూ కలుసుకొంటూ వుంటాయి.
   
    "సరే, అయితే" కారు స్టార్టు చేస్తూ అన్నాను. "తొమ్మిదింటికల్లా వచ్చేస్తాను"
   
    నెమ్మదిగా కదిలింది కారు.
   
    "తొందరగా వచ్చేద్దామనయినా వుండదు ఖర్మ" గొణిగింది.
   
    కారు ఆపి అడిగాను. "ఎందుకు?"
   
    "ఎందుకేమిటండీ అందరూ చూడండి భార్యలతో ఎలా కబుర్లు చెబుతారో!"
   
    స్టీరింగ్ వీల్ మీద నీటిచుక్క జాలిగా చూస్తూంది. నెమ్మదిగా తలెత్తాను. "సరే, అయితే సాయంత్రం తొందరగా వస్తాను. అయిదున్నరకే! ఇంకా ఏడుగంటల టైముంది. మనిద్దరం కామన్ గా మాట్లాడుకొనే ఏ ఒక్క టాపిక్ అయినా దొరుకుతుందేమో ఈ ఏడు గంటల్లో ఆలోచించి వుంచు."
   
    కారు కదిలింది. మెదడులో చేపల కదలికమల్లే ఆలోచనలు.
   
    ఈ కథలో నా తప్పు ఎంతవరకు ఉందని? ఇది ఇలానే కొనసాగితే నేనేమౌతాను? అలక్ నంద నదీతీరంలో భౌతిక సుఖాలన్నీ వదులుకొని నివసించే మునుల్లో చేరిపోతానా? అర్దరాత్రి వరకూ తాగి యింటికి చేరుకొనే ఎస్కేపిస్ట్ నవుతానా? స్త్రీని శారీరకంగా కొనుక్కునే వ్యభిచారినవుతానా?
   
    నా ఆలోచనల్లో లేతదనం పోతూంది. మనసు నల్లబారుతూంది. ఒకప్పుడు ప్రపంచం అంతా ఆనందంగా వుండేది. మనుషులందరూ మంచివాళ్ళే నా పెదవుల మీద ఎప్పుడూ చిరునవ్వే కానీ యిప్పుడు.... ఇప్పుడు..... నేనేమావుతున్నాను.... ఎటు వెడుతున్నాను! వేదాంతం అనే హిమాలయం పైకా! పతనం అనే అధఃపాతాళానికా? ఎటో ఒకవైపు జారి పోవటం మాత్రం ఖాయం.
   
    నా జీవితంలో స్వప్న ప్రవేశించక పోయివుంటే అదే జరిగేది.
   
           
                                                                     *    *    *
   
    గ్రీన్ రూమ్ లో అభినందించటానికి వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరే వెళ్ళిపోసాగారు. క్షణంలో గది ఖాళీ అయింది. ఒక్కక్షణం ఒకమూల మౌనంగా నిలబడి వున్నాను. బయట మనుషుల అలికిడి లీలగా వినిపిస్తూంది.
   
    మేకప్ తుడుచుకోవటం పూర్తయి, బయటకు రాబోతూ, నన్ను చూసి విస్మమయంతో ఆగి- "మీరు...." అర్ధోక్తిలో ఆపివేసింది.
   
    మాట్లాడలేదు నేను.
   
    మాట్లాడాలనిపించలేదు.
   
    ఆ కల ఎక్కడ కరిగిపోతుందో అన్న భయంతో అలాగే తదేకంగా చూస్తూండిపోయాను. అలా చూడటం తప్పనీ, నాకూ పేళ్ళయిందనీ, ఒక బాధ్యతాయుతమైన అంతస్తులో ఉన్నాననీ నాకప్పుడు గుర్తుకురాలేదు. సన్నటి తీవెలా వున్న శరీరాన్నే చూస్తున్నానో -పిడికిలిలో ఇమిడిపోయే నడుమునే గమనిస్తున్నానో - కలువరేకుల్లాంటి కళ్ళలోకే చూస్తున్నానో -ఏమీ తెలియటం లేదు. నా చూపులు కలిసేచోట శూన్యం తప్ప ఇంకేమీ కనపడటం లేదు. ఒక అలౌకికమైన స్థితి అది.
   
    "ఏమిటి -మాట్లాడరా?" అంటూంది ఆమె.
   
    ఆ నుభూతినుంచి బయటకెలా రాను?
   
    లేత మామిడి చివురుల్ని ఆరగించి కమ్మగా కూసే కోయిల కూతని వసంతంలో విన్నప్పటి అనుభూతి! యుగ యుగాలుగా ఎదురుచూసింది, ముందు ప్రత్యక్షమైన ఆనందం..... కలో, నిజమో తెలుసుకోలేని దిగ్భ్రమ.....అతికష్టంమీద నన్ను నేను స్పృహలోకి తెచ్చుకోగలిగాను.
   
    "ఏం మాట్లాడాలో తెలియటం లేదు" అన్నాను "నిజానికి మీ నాట్యం చూసి అభినందించాలని వచ్చాను. కానీ మీ అందం చూసేక మాట రానని మారాం చేస్తోంది."
   
    ఆమె మొహం మీద విసుగులాంటి భావమేదో లీలామాత్రంగా కనబడింది. అందులో ఆశ్చర్యం ఏమీలేదు. ఆమె అందాన్ని స్వంతం చేసుకోవటం కోసం చాలామంది మగవాళ్ళు రకరకాల పొగడ్తలతో ఆమెను చేరుకోవటానికి ప్రయత్నించి ఉండవచ్చు కానీ నేను-
   
    ఎంతోకాలంగా ఎదురుచూచినా పెన్నిధి దొరకబోయి. చేతుల్లోంచి జారిపోతున్న వేదన ఒక్కసారిగా మనసుని దిగులుతో ముంచెత్తి వేసింది ఏదోలా మాటలు పెంచుకొని, పరిచయాన్ని నిలుపుకోవటం నాకు చేతకాహ్డు చాలా మితభాషిని నేను.
   
    తలవంచుకొని నెమ్మదిగా వెనుదిరిగాను.
   
    మ్లానమైన నా మొహంలో కనబడిన విషాదరేఖ ఏదో ఆమెని కదిలించి వుండాలి. "చూడండి" అంది. ఆగి వెనక్కి తిరిగాను.
   
    "మీ పేరు?"
   
    "అనిల్ దేవ్!"
   
    ఆమె కళ్ళల్లో ఏదో లీలగా ఆశ్చర్యం కనబడింది. "మీరూ...." అంది ఏదో జ్ఞాపకం తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నట్టు "పొట్రేట్ పెయింటర్ దేవ్ కదూ?"
   
    అంతకు పదిరోజుల క్రితమే నా ఫోటో సన్ డే లో పడింది. తలూపాను. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం సంతోషం చోటు చేసుకున్నాయి. "ఓహ్! ఎంత అదృష్టవంతురాల్ని!" అప్రయత్నంగా తనను తను అనుకొంటూన్నట్టు పైకి అంది.
   
    "ఎందుకు?"
   
    "వన్ ఆఫ్ ది టాప్ పెయింటర్స్ ఆఫ్ ది కంట్రీ కమింగ్ టు కంగ్రాచ్యులేట్ మీ" ఆమె క్షణంలో వెయ్యవ వంతు నా కళ్ళలోకి చూసి తల దించుకుంది. ఆమె అందాన్నంతా ఫ్రేములో బంధించుకోవాలని అయిదు నిమిషాల క్రితం నేను చూసిన చూపులానే వుంది అది.
   
    ఆర్తితో కూడిన చూపు !
   
                                *    *    *
   
    "నాలో ఈ పెయింటింగ్ అనే ఆర్ట్ లేకపోతే మన పరిచయం యిలా పెరిగి వుండేది కాదు."
   
    నవ్వింది "ఏం?"
   
    "ఆ రోజు మొదటి మాటతోనే వెళ్ళిపోయేవాణ్ణి."
   
    ఆమె క్షణం ఆలోచిస్తూ వుండిపోయింది. "అలాంటి చిన్న చిన్న అపాయాల నుంచి రక్షించుకోవటం అందమైన స్త్రీ వయసుతోపాటే నేర్చుకొంటుంది."
   
    "నాతో స్నేహం అపాయకరమా?" అల్లరిగా  నవ్వ బోయాను. స్వప్న నవ్వలేదు. "ఐ సబ్మిట్ టు యూ దేవ్" అంది. ఆమె కంఠంలో ఏదో అస్పష్టమైన అస్థిరత్వం స్పందిస్తూంది. "ప్రేమ ఎందుకు ఉద్భవిస్తుందో నాకు తెలీదు మీ వ్యక్తిత్వాన్ని చూశా? అందాన్నా.... మీలో వున్న కళనా - ఉహు ..... నాకున్న అనుభవం సరిపోదు జవాబు చెప్పటానికి కానీ ఒకటి మాత్రం నిజం. ఐ...... ఐ...." ఆమె కంఠం వణికింది...... "ఐ లవ్....యూ దేవ్"
   
    ఆమె చేతిమీద చెయ్యి వేశాను.
   
    కళ్ళు లేనివాడు దారితప్పిన ఇంకో కళ్ళు లేనివాడికి చెయ్యి అందించేటప్పటి జాలి అది. ప్రేమ జాలితో ప్రారంభమై, ఆకర్షణతో పెరిగి, అనురాగంతో బలపడి, కోర్కెతో పరిపూర్ణత్వాన్ని పొందుతుంది.
   
                                                                   *    *    *
   
    స్వప్నతో పరిచయమయ్యాక ఎక్కడలేని ఉత్సాహం ప్రవేశించింది నాలో. ఎప్పుడో మానివేసిన టెన్నిస్ ఆట మళ్ళీ ప్రారంభించాను. నిర్లిప్తత పారిపోయింది. చిత్రమేమిటంటే ఇప్పుడు మహాలక్ష్మి కూడా నాకు స్నేహితురాలిగా కనబడుతూంది. ఒక విధమైన ట్రాన్స్ అది. అంతా ఆనందమే.
   
    ఎన్నెన్ని కబుర్లు!
   
    కిట్స్ నైటింగేల్ నుంచీ అయినెస్కో అబ్సర్డ్ థియరీ వరకూ.
   
    స్వప్నలో నాకు బాగా నచ్చిన విషయం- పెదవులపై ఎప్పుడూ చెదిరిపోని స్వప్నలో నాకు బగా నచ్చిన విషయం- పెదవులపై ఎప్పుడూ చెదిరిపోని చిరునవ్వు ప్రపంచాన్ని శాసించగల నవ్వు అది.

 Previous Page Next Page