Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 21


    "ఆ రోజులు వేరు- ఈ రోజులు వేరండీ! అప్పుడు గృహహింస చట్టం లేదు- ఇప్పుడు కొడుకుని కొట్టినా, కూతుర్ని కొట్టినా, భార్యను కొట్టినా మూడేళ్ళు పడిపోద్ది" అంతవరకూ సైలెంట్ గా ఉన్న కనకం విరుచుకుపడింది.
    "ఏమయ్యా...... తల్లిదండ్రులు పిల్లల్ని సరదాకో, పిచ్చెక్కో కొడుతుంటారా? తప్పు చేస్తేనే కదా కొట్టేది? వాళ్ళు తప్పులు చేస్తూంటే మందలించకుండా, కొట్టకుండా వదిలేస్తే పెద్దవాళ్ళయ్యాక ఏమవుతారు? దొంగలు, గూండాలు, మర్డర్లు, రాజకీయనాయకులు రేపిస్ట్ లుగా తయారవరా? దేశంలో అలాంటి పౌరులు ఉండాలని ప్రభుత్వం ఉద్దేశమా?"
    ఎస్.ఐ. కేం జవాబు చెప్పాలో తెలీలేదు.
    "చూడమ్మా! మీ సంగతీ దేశం సంగతీ మాకనవసరం! మాక్కావలసింది చట్టాలు అమలు చేయటం! అతిక్రమించినోళ్ళను కోర్టులో నిలబెట్టటం అంతవరకే! "ఆ చూడు మిస్టర్ నాకొకటి చెప్పు! నువ్ మీ అబ్బాయిని కొట్టావా లేదా?"    
    "వాడు చేసిన పనులకు కొట్టక ముద్దు పెట్టుకుంటారా?"
    "అంటే కొట్టినట్లు ఒప్పుకుంటున్నావ్. యు.ఆర్ అండర్ అరెస్ట్ పద, స్టేషన్ కి"
    "నో! అతన్ని అరెస్ట్ చేయడానికి మేమొప్పుకోం" అన్నాడు శంకరమూర్తి.
    "అయితే వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేయండి"
    "నై హమ్ భీ అరెస్ట్ కో ప్రొటెస్ట్ కర్ తే!" అన్నాడు హమీద్ మియా షైనీ లేడీస్ బాచ్ నినాదాలు మొదలెట్టింది.
    "పోలీస్ జులుం నశించాలి"
    "గృహహింస చట్టం ఎత్తేయాలి"
    "కుటుంబ వ్యవస్థ- వర్ధిల్లాలి- వర్ధిల్లాలి"
    "గుడ్డిచట్టం...... డౌన్ డౌన్"
    ఈలోగా ఎస్.ఐ. ఎప్పుడు పై అధికారులకు ఫోన్ చేశాడో తెలీదు. రెండు లారీలు, లాఠీలు, టియర్ గాస్ షెల్ప్ తో పోలీసులు మా అపార్ట్ మెంట్స్ ని చుట్టుముట్టారు.
    అపార్ట్ మెంట్స్ లోని వాళ్ళందర్నీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి దింపారు.
    అక్కడ ఉన్న పోలీస్ అధికారి, "చూడండి! మీరందరూ మా విధి నిర్వహణకు అడ్డు తగులుతున్నారు. హనుమంతరావ్ నేరానికి పాల్పడ్డాడు. అతన్ని కోర్టులో నిలబెట్టటం మా డ్యూటీ! అడ్డుపడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టాల్సి వస్తుంది" అన్నాడు.
    షైనీ మళ్ళీ నినాదాలు అందుకుంది. "హనుమంతరావ్ ని వదిలివేయాలి. గృహహింస చట్టం అవతల పారేయాలి"
    కాసేపటి తర్వాత హమీద్ మియా, నేను, శంకరమూర్తి, మొహిందర్, విజయ్ యాదవ్ మాట్లాడుకుంటుంటే ఒక సబ్, ఇన్ స్పెక్టర్ మా దగ్గరకొచ్చాడు.
    "హనుమంతరావ్ మీకు క్లోజా సార్?"
    "అవును!"
    "అతన్ని వదిలేయమని మీరు చెప్తే వదిలేస్తాం సార్"
    మాకు ఆశ్చర్యంతోపాటు ఆనందం, గర్వం కూడా కలిగాయ్.
    "చూశారా! మన ఐకమత్యానికి పోలీస్ లు కూడా వెనక్కు తగ్గాల్సిందే" అన్నాడు మొహిందర్ సింగ్.
    "అవున్సార్! ప్రజలకు వ్యతిరేకంగా పని చేయటం మాకూ కష్టం సార్. ఇష్టం కూడా ఉండదు"
    "అంటే పోలీసుల్లో కూడా ఇలా రేషనల్ గా ఆలోచించే వారుంటారన్నమాట!" అన్నాడు విజయ్ యాదవ్.
    "ఎందుకుండరు సార్! అయితే ఒక రిక్వెస్ట్" అన్నాడు ఎస్.ఐ.
    "ఏమిటది?" అడిగాను.
    "హనుమంతరావ్ మీద కేస్ రిజిస్టర్ అయింది కాబట్టి విత్ డ్రా చేయడం చాలా కష్టం. అందుకని పదివేలిస్తే వదిలేస్తాం"
    అందరం ఉలిక్కిపడ్డాం.
    అంత డేరింగ్ గా మా కమిటీ వాళ్ళనే లంచం అడుగుతాడని అనుకోలేదు.
    "అంటే లంచం అడుగుతున్నారా."
    అతను నవ్వాడు.
    "దాన్ని మేము లంచం అనం సార్! చట్టాల వల్ల ప్రజలు అన్యాయమైపోకుండా, సాయం చేసి, రక్షించే ఫీజు అంటాం!"
    హమీద్ మియాకి కోపం ఆగలేదిక.
    "దేఖో బాబూ! హమ్ రిశ్వత్ కే ఖిలాఫ్ హై! ఇంకోసారిలా అడిగితే మా కాలనీలో ఉన్న తుగ్లక్ ఛానెల్ జర్నలిస్ట్ ని పిలుస్తాయ్. అతను నీ సంగతి లైవ్ టెలికాస్ట్ కర్ తే హై"
    మమ్మల్ని చూసి జాలిపడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది అతని మొఖంలో.
    అది కూడా సిన్సియర్ గా జాలిపడటం.
    "జర్నలిస్టులలో చాలామంది మాతో కలిసి మెలసి ఉంటారు సార్. ఆ విషయం మీకు తెలీదు. మేమంతా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి పనిచేస్తాం సార్"
    అప్పుడే మా అపార్ట్ మెంట్స్ లో ఉండే తుగ్లక్ ఛానెల్ జర్నలిస్ట్ కెమెరామెన్ తో అక్కడికొచ్చాడు.
    "నమస్తే అన్నా" అన్నాడు సబ్ ఇన్ స్పెక్టర్ కి సెల్యూట్ కొడుతూ.
    "నమస్తే..... వీళ్ళంతా మీ అపార్ట్ మెంట్స్ వాళ్ళేనంట కదా! జరంత సముదాయించరా భయ్. భేవకూఫ్ లెక్కున్నారు" మేమందరం వినేటట్లు చెప్పి వెళ్ళిపోయాడతను.
    "ఏం జరిగింది?" మమ్మల్నడిగాడతను.
    లంచం సంగతి చెప్పాం.
    వాడు పగలబడి నవ్వాడు.
    "నిజంగానే మీరు పాగల్ గాళ్ళన్నా! సత్యం కంప్యూటర్సోడు కొన్ని వేలకోట్లు ఫ్రాడ్ చేశాడు. అదీ ఎట్లా? ప్రభుత్వాధికారులకీ, బ్యాంక్ అధికారులకీ, ఇన్ కమ్ టాక్స్ అధికారులకీ, పోలీసులకూ, రాజకీయనాయకులకూ, మినిష్టర్లకూ...... ఒకళ్ళకనేంటి వందలమందికి తినిపించాడు. ఫ్రాడ్ మరీ ఎక్కువయిపోయి ఇప్పుడు దొరికిపోయాడు! వాడిని రక్షించడానికి మళ్ళీ అందరికీ లంచాలివ్వాలి. ఇది యూనివర్సల్ ప్రొసీజర్. ఎంత గొప్ప మొనగాడయినా ఈ ప్రొసీజరు ఫాలో అవాల్సిందే! నా మాట విని పదివేలు పారేసి మనవాడిని విడిపించుకుపోండి!" అంటూ సలహా ఇచ్చాడు.
    మా అందరికీ కోపం నసాళానికంటింది.
    "చూడ్రా! నువ్ చెప్పిన సలహాకి నిన్ను మర్డర్ చేశామనుకో! ఏం జరుగుద్దంటావ్!" అడిగాడు విజయ యాదవ్.
    "లోపటయిపోతారు"
    "అడ్డమయినోడికీ లంచాలిస్తే శిక్ష తప్పించుకోవచ్చు కదా"
    "చెప్పాల్సిందేదో మీ మంచికే చెప్పా"
    "మంచిక్కాదురా! పోలీసులకిచ్చేదాంట్లో నీ కమీషన్ నువ్ కొట్టడానికి"
    "ఇంతకూ ఇప్పుడేంచేద్దాం" అన్నాడు శంకరమూర్తి.
    "ఛస్తే మనం లంచం ఇవ్వకూడదు. లాయర్ని పట్టుకుని బెయిల్ మీద బయటకు వచ్చేట్లు చూద్దాం! తర్వాత కోర్టులో కేస్ ఎలా ప్రొసీడవుతుందో చూద్దాం! లాయర్ని పెట్టడానికి మన అసోసియేషన్ ఫండ్స్ వాడదాం"
    "హనుమంతరావ్ కోసం అసోసియేషన్ ఫండ్స్ వాడవచ్చంటావా?"
    "ఇది హనుమంతరావ్ ఒక్కడికే సంబంధించిన విషయం కాదురా భాయ్! ఇవాళ హనుమంతరావ్ కయింది..... రేపు మనకెవకైనా జరుగుద్ది. మనందరినీ అరెస్ట్ చేస్తే పిల్లల్నెవరు చూస్తారు?" అంటూ కొత్త పాయింట్ లేవదీశాడు మొహిందర్.   

 Previous Page Next Page