ఆ రోజు ఫ్లైట్ లో ఆమెతో గంటసేపు గడిపిన తొలి పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ అన్నాడు- "కేవలం ఒక్క సంఘటనతో మా డిపార్టుమెంటు మీద దురభిప్రాయం ఏర్పడటం దారుణం ఆశ్రితా!"
"దురభిప్రాయం ఏర్పడింది మీ డిపార్టుమెంటు మీద కాదు వశిష్ట గారూ!" దాన్ని హేండిల్ చేసే మనుషుల మీద..."
సాలోచనగా చూశాడు.
"మీ డిపార్టుమెంట్ లో అంతా సర్కిల్ ఇన్స్ పెక్టర్ ధనుంజయలే కాదు వశిష్టలూ వుంటారని మొన్న మీరు నాకు హామీ ఇచ్చారుగా? కాని ఏం సాధించగలిగారు?"
అతను ఇబ్బందిగా చూశాడు.
"ఒక్క క్షణంపాటు మనం ప్రిజుడీస్ లేకుండా ఆలోచిద్దాం"
"ముందు ఎదుటి మనిషిలోని పోజిటివ్ ఏంగిల్స్ ని మీ డిపార్టుమెంటు వాళ్ళు గుర్తిస్తే బెటరు వశిష్టా...! నేను కనీసం మీనుంచి కోరుకున్నది అదే..."
ఎందుకో అతడికి చాలా రిలీఫ్ గా అనిపించింది. పరిచయమై ఎంత కాలమైందని... రోజులేగా... అయినా ఆమె నిక్కచ్చిగా సెల్ఫ్ రెలియంట్ గా మాట్లాడ్డం మొదటి రోజునుంచీ ఆకట్టుకుంటూనే వుంది.
అయితే ఇప్పుడామె మాటల సందర్భంలో తనకో ప్రత్యేకతలాంటిది ఆపాదించి తన మనసులోని భావాన్ని ఎక్స్ ప్రెస్ చేసింది. అది వినటానికి బాగుంది. అసలు అతడికే వ్యక్తిగతంగా ఆమెతో మాట్లాడాలనే ఆలోచనే లేకపోతే ఇంతసేపూ ఆమె చురకల్ని భరిస్తూ వుండేవాడు కాదేమో!
అది కూడా కాదు...
తెలివైన అమ్మాయిల్ని అతడు ఇంతవరకూ చాలామందిని చూశాడు కాని, ఆశ్రిత తెలివిలో వాడి మాత్రమే కాదు- ఎదుటి మనిషిని ఆకర్షించగల వేడి కూడా వుంటుంది.
అసలు ఇంత నష్టం జరిగాక ఏ ఆడపిల్లయినా రొటీన్ లోకి రావటము చాలా అరుదైన విషయం.
"ఇదో గొప్ప విశ్లేషణ కాకపోయినా ఖచ్చితంగా మీకో విషయం చెప్పాలి మిస్టర్ వశిష్టా..." నిశ్చలంగా చూసింది ఆశ్రిత. అతడి జవాబు కోసం ఆగలేదామె. "నాకు ప్రమీలనే ఓ స్నేహితురాలు వుంది. స్వతహాగా తెలివైనదే కాని ఒక్కోమారు తన మూడ్ ని బట్టి మనసుని కండిషన్ చేసుకుని ఆలోచిస్తూ వుంటుంది. ప్రమీలకి పక్కింటావిడతో ఓసారి గొడవ జరిగింది. నేనోసారి ప్రమీల ఇంటికి వెళ్ళగానే పక్క ఇంటిని చూపించింది. అక్కడ తాడుమీద ఆరబెట్టివున్న బట్టల్ని చూపిస్తూ కనీసం మురికి పోయేట్టు బట్టలు ఉతకడం చేతగాని ఆడదంతూ పక్కింటావిడ్ని కామెంట్ చేసింది. చాలాసేపు ప్రమీల మాటల్ని విన్నాక మేమిద్దరం ఏ కిటికీలోనుంచి చూస్తున్నామో ఆ కిటికీ అద్దాలకని సుతిమెత్తగా నచ్చచెప్పాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానూ అంటే..."
"మా డిపార్టుమెంటు మురికి అద్దాల్లోనుంచి ప్రపంచాన్ని ఎస్టిమేట్ చేస్తూ వుంటుందని చెప్పాలని..." అర్ధోక్తిగా అన్నాడతను. "అంతేగా... మీకు గుర్తుందో లేదో... తొలిసారి మీరు నాకు ఫ్లయిట్ లో పరిచయమయినప్పుడు మా డిపార్టుమెంటు గురించి నీచంగా మాట్లాడింది నేను..."
గుర్తుచేశాడు అతను.
ఆమె మరేదో అనబోతుంటే వారిస్తూ అన్నాడు "అప్పుడు మీరెలా రియాక్టయినాగాని ఇప్పుడు మీరుకూడా మీ మూడ్ ని బట్టి మీ స్నేహితురాలిలాగే మా డిపార్టుమెంటుని కామెంట్ చేస్తున్నారు."
"ఇది కామెంట్ చేయడం కాదు మిస్టర్ వశిష్టా! చట్టంమీద పెంచుకున్న అపురూపమైన నమ్మకం సన్నగిల్లి పోతుంటే తప్పనిసరై చేస్తున్న విమర్శ"
"కాని అది నిజం కాదేమో ఆశ్రితా" నచ్చచెబుతున్నట్టుగా అన్నాడు. "నా డిపార్టుమెంటులో కాలుష్యం వుండటం నిజమే! కాని అది మీరనుకున్నంతగా కాదన్నది నా అభిప్రాయం"
"విమర్సని మీరు అంగీకరించలేకపోతున్నారు"
ఆమె సీరియస్ నెస్ ని డైల్యూట్ చేయాలనిపించింది అతనికి.
"సైకాలజిస్టులు చెప్పేదాన్ని బట్టి విమర్శకి మూడు కారణాలు వుంటాయి. మొదటి కారణం- విమర్శ ద్వారా మనల్ని మనం ఎలివేట్ చేసుకోవాలనుకోవటం, రెండోది-మరొకరి ఆలోచనల్ని ఆమోదించగలిగే హృదయం లేకపోవడం, మూడోది- మనకి నచ్చనిది మరెవరికీ నచ్చకూడదనే భావంతో మన అభిప్రాయాన్ని రుద్దాలని ప్రయత్నించడం..."
"ఇందులో నేను ఏ కోవకి చెందిన క్రిటిక్ నని మీ అభిప్రాయం."
ఆమె గొంతులో నిజానికి కాఠిన్యం లేదు.
కాని అతడు ఆమె ప్రశ్నతో ఖంగుతిన్నాడు.
జవాబు చెప్పేవాడే! కాని చెప్పకూడదనుకున్నాడు. ఆమె ప్రస్తుత మానసిక స్థితిలో అలా ఆలోచించడం తప్పు కాదనుకున్నాడో, లేక మరింతగా చొరవ తీసుకునే చనువే లేదనుకున్నాడో నిశ్శబ్దంగా వుండిపోయాడు.
"ఎ పర్సన్ హేజె రైట్ టు క్రిటిసైజ్ హూ హేజ్ రైట్ టు హెల్ప్ అన్నాడు అబ్రహంలింకన్..." మృదువుగా నవ్విందామె. "మీ డిపార్టుమెంటుని నేను ఉద్దరించగలనని అనుకోవడంలేదు. కేవలం మీతో చెప్పాలనిపించింది."
ఇక మాట్లాడేదేమీ లేదన్నట్లుగా లేచిందామె.
ఆ క్షణంలో నిజానికి ఆమె అంతకంటే వివరంగా మాట్లాడలేకపోయిందీ అంటే కారణం.... వశిష్ట తను అనుకున్న ఫలితాన్ని రాబట్టలేక పోయాడన్న ఆలోచన..... చాలా ఆశించింది అతడినుంచి కాని సాధించలేకపోయాడు. ఎందుకిలా జరిగినాగాని చాలా అసంతృప్తిగా వుందామెకి.
అసలు అతడు సవ్యసాచి కొడుకన్న విషయం తెలియగానే తను ఫలితం తనకు అనుకూలంగా వుండదని గ్రహించి వుండాల్సింది కాని ఎందుకో చురుకుగా కనిపించే వశిష్ట మీద కాస్త నమ్మకం ఏర్పడింది.
అందుకే చట్టపరిధిలోనే కొన్ని సమస్యల్ని డీల్ చేయడానికి అతడి సహాయాన్ని కోరింది.
ఒకవేళ అతడో పోలీసాఫీసర్ గా మాటిచ్చి వుంటే ఆలోచించేది కాని స్నేహితుడిలా హామీ యిచ్చాడు.
"ఏం చేద్దామనుకుంటున్నారు?" అడిగాడతను.
అదీ ఓ స్నేహితుడి పరామర్శలానే వుంది. అసలు ఈ వ్యక్తితో ఇప్పుడు అవసరం తీరిపోయిందని అనుకోవాల్సిన సమయంలో తన మనసులోని భావాన్ని ఏకరువు పెట్టడం ఆమెకీ ఇష్టంలేదు. కానీ నిగ్రహించుకోలేకపోయింది.
ఏదో చేస్తాడనుకున్న మనిషి చేయలేని నిస్సహాయత ప్రకటిస్తే తనలో ఏర్పడాల్సిన వితరణ్ణి దాటి అతడి ప్రశ్న చలిగాలిలో నిలబడ్డ తనకు ఓ వెచ్చటి మనోస్పర్శలా అనిపిస్తుంటే ముందు నవ్వింది నిర్వేదంగా.