Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 20

    విస్సు పిడికిళ్ళు బిగుసుకున్నాయి "తెలివిగా తప్పించుకున్నావ్ కృషి"    
    "యస్.... నాకు డబ్బు మాత్రమే కాదు తెలివీ వుందని నువ్వు గ్రహించితే బెటరు."    
    "నీ డబ్బు నీ తెలివినీ కలిపి మరీ ఓడించగలిగే తెలివి నా దగ్గరా వుంది కృషి - ఆ విషయం నీకు త్వరలోనే తెలియచెబుతాను"    
    "నువ్వు ఓడించడానికి నేను మామూలు జీకెబుక్ చదివి పోటీకి సిద్దపడే రాజేష్ ని కాను."    
    "అలాగా" వ్యంగ్యంగా అన్నాడు.    
    "ఏం....అనుమానమా"    
    "నిరూపించుకోగలవా"    
    రెప్పలార్పకుండా చూసింది "నిన్ను నువ్వు చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటున్నావ్ కదూ"    
    "కబుర్లు చెప్పడం కాదు కృషి" నిశ్చలంగా అన్నాడు. "దమ్ముంటే వేదిక మీద నా ముందు నిలబడి పోటీకి సిద్దంకా"    
    "నేను చాలా ఖరీదైన ఆడపిల్లని"    
    "ఖరీదు నిర్ణయించేది కాల్ గర్ల్స్."    
    కృషి కోపం తెచ్చుకోలేదు. "నా గురించి నువ్వలా నీచంగా ఆలోచించినా నాకు అభ్యంతరం లేదు. మిస్టర్ విశ్వనాథ్ కాల్ గర్ల్స్ క్కూడా వేర్వేరు స్థాయిలు వుంటాయనుకుంటా కదూ కాబట్టే ఇప్పుడు పందేనికి ఎన్ని లక్షలు పెట్టుబడి పెడతావని అడుగుతున్నాను."    
    "నేను గెలిస్తే నీ నుంచి కోరేది డబ్బుకాదు."    
    "మరి"    
    "నీతో ఓ రాత్రి సుఖం స్పష్టంగా విను.... నేను ఏ రాత్రికావాలీ అంటే ఆ రాత్రి నువ్వు నాతో గడపాలి. గడపడమూ అంటే తోడు వుండడమేగా అంటూ లాజిక్ ప్రదర్శించకు - గడపడమూ అంటే నాతో సెక్స్ సుఖానికి అంగీకరించడం"    
    కృషి మొహం జేవురించిపోయింది.    
    "ఏం కంగారుగా వుందా"    
    "లేదు విస్సు - చాలా ఖరీదైన కోర్కెకి సిద్దపడ్డావు. కాబట్టి నేను నీతో క్విజ్  కాంపిటీషన్ లో ఓడితే నువ్వడిగిన దానికి సరేనంటున్నాను. మరి నువ్వోడితే ఏం చెల్లిస్తావు అని అడుగుతున్నాను"    
    "వాచ్ మెన్ గా వుండమన్నావుగా"    
    "కేరక్టర్ లేనివాడు వాచ్ మెన్ గా వుండటానికిని నేనిష్టపడను విస్సూ...." క్షణం ఆగి అంది. "నువ్వోడితే నాకు అయిదు లక్షలివ్వాలి."    
    ఉలిక్కిపడ్డాడు.    
    "ఏం కంగారుగా వుందా" అతడన్న మాట అతడికే అప్పచెప్పింది "నా డబ్బు మీద నా తెలివి మీదనే గాక నా శరీరం మీద కూడా గెలుపు కోరుకుంటున్నావుగా. చెప్పు అయిదు లక్షలు పెట్టుబడి పెట్టగలవా. కష్టమనుకుంటా కదూ. మోసం చేసి వందా వెయ్యీ సంపాదించే నీకు అంత డబ్బు కూర్చుకోవడం!"    
    "మిస్ కృషి" అహం దెబ్బతిన్నట్టుగా చూశాడు "మైండ్ పవర్ - అదే మేధస్సు నీ ఒక్కదాని సొత్తే కాదుగా - నీ షరతులకి నేను అంగీకరిస్తున్నాను"    
    "మరోసారి ఆలోచించు"    
    "ఆలోచించాల్సిన అగత్యం లేదు."    
    "అయితే ఈ నెల పదిహేనో తేదీన అంటే సరిగ్గా పది రోజుల్లో మనం కాంపిటీషన్ కి సిద్దపడుతున్నాం. ఓ.కె."    
    "సరే"    
    "తర్వాత యిస్తాననడం కాదు. పోటీకి ముందే అయిదు లక్షల చెక్కు క్విజ్ మాస్టర్ కి ఇవ్వాలి" స్పష్టం చేసింది.    
    వెళ్ళిపోయాడు విస్సు-    
    అప్పటికి సమస్య నుంచి తెలివిగా గట్టెక్కడమే గాక ఇక ముందు సైతం తనతో పోరాటానికి సిద్దపడకుండా జాగ్రత్తపడ్డాననుకున్న కృషి పొరపాటు పడిందిక్కడే...    
    విస్సు సరాసరి రామనాథ చౌదరి దగ్గరికి వెళ్ళాడు.    
    ఓ శత్రువుకి శత్రువు స్నేహితుడవుతాడన్న తర్కాన్ని నమ్మిన విస్సుని నిరుత్సాహపరచలేదు చౌదరి-    
    ప్రతిష్ట పరపతి అనే జోడు గుర్రాలపై స్వారీ చేసే ఉపాధ్యయకి ఒక్కగానొక్క వారసురాలైన కృషిని శరీరం పెట్టుబడి పెట్టమనడం స్థాయికి దిగజార్చగలిగిన విస్సు అటే చాలా గౌరవం ఏర్పడింది.    
    "నా సంగతి అటుంచి" అయిదు లక్షల్ని పెట్టుబడిగా అడిగిన విస్సు గురించి మరింత తెలుసుకోవాలన్నట్టుగా అడిగాడు చౌదరి "నీకు కృషి మీద ఇంట్రస్టేమిటి"    
    ఉలిక్కిపడ్డాడు విస్సు.    
    కేవలం తనకే పరిమితం కావాల్సిన ఓ నిజాన్ని ఇంతకాలం తర్వాత చౌదరి తెలుసుకోవాలనుకుంటున్నాడు "ఇంట్రస్టు కాదు చౌదరిగారూ- పగ..."    
    దిగ్భ్రాంతిగా చూశాడు చౌదరి కొత్త విషయం వింటున్నట్టుగా.    
    "అవును...నేను కృషితో పరిచయం పెట్టుకున్నది నా పగ సాధించడానికే చౌదరిగారూ...చనిపోయిన నా తండ్రి, పిచ్చిదైన నా తల్లి నాకు ప్రేరణ అందిస్తుంటే చదువుతున్న చదువుని మధ్యలో ఆపి వెనక్కి వచ్చేశాను. నా కుటుంబం ఇలా చిన్నాభిన్నం కావటానికి ఉపాధ్యాయ కారణమని తెలిసి తెలివిగా ఆ కుటుంబంలో అడుగుపెట్టాలని మరో మార్గంలేక కృషితో చిత్రంగా పరిచయాన్ని ప్రారంభించాను"    
    "ఎంతవరకూ చదివావు"    
    "పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పి హెచ్ డి చేస్తూ మధ్యలో ఆపేశాను."    
    ఆ మాట వింటూనే చౌదరికి చెమట పట్టింది. తనముందు నిలబడ్డ వ్యక్తి సామాన్యుడు కాదని తెలిసిన తొలి క్షణమది....పోరాటానికి ఆయుధాలు, వాటిని సమకూర్చుకోవటానికి డబ్బు అవసరమనిపించి ఈ మార్గంలో అడుగు పెట్టాడు కాని విస్సు సామాన్యుడు కాడు...ఉపాధ్యాయ కుటుంబంలో అడుగుపెట్టి ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేయగల సమర్ధుడు. అది సాధ్యం కాకపోతే ఏ ఐ.ఏ.యస్సో పాసై కలెక్టరు కాదగ్గవాడు. తనకి కలెక్టర్లు సాహచర్యం అవసరం లేదు. తెలివైన నేరస్తుడు కావాలి.    
    "నీ కుటుంబం చిన్నాభిన్నం కావడమంటే" అడిగాడు చౌదరి.    
    "ఉపాధ్యాయ ఫ్యాక్టరీలో యూనియన్ లీడర్ గా వుంటూ హత్య చేయబడ్డాడు నా తండ్రి".   
    "పేరు"    
    "మోహన్ గాంధీ"    
    పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు చౌదరి.    
    నిరాహారదీక్ష శిబిరంలో కూర్చుని హత్య చేయబడ్డ మోహన్ గాంధి కొడుకు విస్సు...    
    నుదుట పట్టిన చెమటని తుడుచుకుంటూ అన్నాడు "నీ పట్టుదలని అభినందిస్తున్నాను విస్సూ. నీకు పెట్టుబడిగా ఐదు లక్షలు నేనిస్తాను."       
    క్షణం ఆగి అన్నాడు విస్సు "ఒకవేళ నేను ఓడితే..."    
    "నువ్వు తీర్చనక్కరలేదు విస్సూ" సాలోచనగా అన్నాడు ఆయన. "ఒక నిజాయితీ పరుడయిన వ్యక్తికి కొడుకువైన నువ్వు ఓడే ప్రసక్తిలేదు విస్సూ. ఒకవేళ ఓడావనుకో డబ్బుకి బదులు నువ్వేం చేయాలో నేను చెబుతాగా."  
    హామీ యిచ్చి పంపిన ఆయన ప్రశాంతంగా నవ్వుకున్నాడు.    
    లేనివాడికి పేదరికమే శత్రువైతే, ఉన్నవాడికి ప్రతి పేదవాడూ శత్రువే....అందులోనూ పగతోబాటు తెలివీ వున్నవాడు ప్రత్యర్ధి ఐతే ఇక ఆ పోరాటం చూడముచ్చటగా వుంటుంది.   
    నిన్నగాక మొన్న కృషి గెలుపుతో గాయపడివున్న చౌదరి పెదవులకి అంటుకున్న రక్తాన్ని నాలుకతో నాకే పులిలా క్షణం రిలాక్సయి ఆ తర్వాత కృషికి ఫోను చేశాడు.    
    "హల్లో" కృషి కంఠం వినిపించింది.    
    "నేనే" నవ్వేడు చౌదరి తోడేలులా "మరేం లేదు కృషీ....ప్రతిసారీ నువ్వు ఫోను చెయ్యడం నచ్చక ఈ సారి నేనే ముందు శ్రద్ద తీసుకున్నాను."    
    "చెప్పు"    
    "నీ మీద యుద్ధం ప్రకటించిన విస్సుకి నేను పెట్టుబడిగా డబ్బివ్వబోతున్నాను."    
    క్షణం ఆగి అంది ఆమె. "అంటే మరోసారి ఓడిపోతున్నావన్నమాట"   
    "ఓడినా ఈ సారి నేనే గెలుస్తాను కృషీ" నిగూఢంగా అన్నాడు.   
    "నీ మీద నీ కెంత నమ్మకం!"    
    "నమ్మకమంటూ లేకపోతే యుద్దభూమిలో అడుగు పెట్టలేము. పైగా నా తోక తొక్కావుగా...కాటుకి సిద్దంగా వుండు" ఆయన ఫోను క్రెడిల్ చేశాక కొన్ని క్షణాలదాకా తేరుకోలేకపోయింది."
    విస్సూ పూర్తిగా చౌదరి మనిషైపోతున్నాడు.    
    ఎందుకు ఇంత మొండితనాన్ని ప్రదర్శిస్తున్నాగాని నేర ప్రపంచంలో కూరుకు పోతున్నాడు.    
    ఇక పోటీ తప్పదని తెలీడంతో ప్రిపరేషన్ ప్రారంభించింది కృషి ఆ రాత్రే...    
    ఓటమి కన్నా ఇలా ఓడిపోవడం ఆమెకు నచ్చని విషయం.    
    ఆ మరుసటి రోజు ఉదయమే ఇంగ్లీషు డైలీలో ఓ అనౌన్స్ మెంటు చూసింది కాకతాళీయంగా.    
    మొత్తం పేజంతా ఆక్రమించిన ఆ అనౌన్స్ మెంట్ చౌదరీ లేబరేటరీస్ పబ్లిక్ ఇష్యూకి సంబంధించింది.    
    అక్కడ చౌదరి అనే పేరే కనిపించి వుండకపోతే కేజువల్ గా పేజి మరల్చేదే...    
    ఆసక్తిగా ప్రమోటర్స్ వివరాలు చదివింది ఆమె అంచనా తప్పు కాలేదు. ప్రమోటర్స్ లిస్టులో మొదటి పేరు రామనాథ చౌదరీదే. సుమారు కోటిన్నర ఈక్విటీ షేర్స్ అమ్మకం కోసం షేర్ హోల్డర్స్ గా ప్రజల్ని ఆహ్వానిస్తూ వారం రోజుల్లో ఇష్యు క్లోజవుతుందని వివరించబడి ఉంది.    
    ఇష్యూ హైలెట్స్ ని ఏకాగ్రతగా చదివింది.    
    A SENSATIONAL INNOVATION OF "PROCALCIATE"   
    స్త్రీల మెనుస్ట్రేషన్ పీరియడ్ లో కడుపునొప్పి మానసిక వైకల్యాన్ని నివారించడానికి ఉపయోగించే కాల్షియం డ్రగ్ PROCALCIATE...ఇంకా చాలా వివరాలున్నాయి. అన్నింటికన్నా ఆమెను అమితంగా ఆకట్టుకున్న విషయం చౌదరి లేబరేటరీస్ లో తయారయ్యే PROCALCIATE నూరుపాళ్ళు అమెరికా ఎగుమతికి నిర్దేశించబడినది.   
    చౌదరి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభించి మరో ఆరు నెలల్లో అరుదయిన ప్రోడక్ట్ తో మార్కెట్ లో అడుగుపెడుతున్నాడు.    
    ప్రత్యర్ధి విషయంలో అవసరానికి మించిన శ్రద్ద చూపించడం వ్యాపార లక్షణం ఒక్కటే కాదు యుద్దనీతి కూడా...    
    ప్రభుత్వంలో చాలా పలుకుబడి గల చౌదర్నీ మాత్రమే గాక అలాంటి వాడికి కొమ్ము కాసే ప్రభుత్వ చిత్తశుద్దినీ శంకిస్తున్నట్టుగా వెంటనే న్యూయార్క్ కి ఫోన్ చేసింది.    
    తన మిత్రుడు న్యూ డీల్ కన్సల్టెన్సీ అధిపతి మిస్టర్ సీగల్ లైన్ లోకి వచ్చాడు.    
    "కృషి ఫ్రం ఇండియా..."   
    "వాటే సర్ ప్రయిజ్...అమెరికాని మరిచిపోయారు" సీగల్ అభిమానాన్ని ప్రకటించాడు.    
    "మరిచిపోతే మీకు ఫోన్ చేసేదాన్ని కాదు మిస్టర్ సీగల్" క్షణం ఆగి అంది "మీరో సహాయం చెయ్యాలి"    
    "ఆదేశించు మిస్ కృషీ"   
    "ఇండియా నుంచి ఫార్మాస్యూటికల్స్ ని మీ కంట్రీ దిగుమతి చేసుకోవాలీ అంటే మీ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ లైసెన్సు కావాలిగా" చౌదరి లేబ్స్ వివరాలు తెలియజేసి "మీ FDA లైసెన్సు ఇచ్చిందో లేదో కనుక్కొని తెలియచేయగలరా..."    
    "మా ఎఫ్ డి యె పొలిటికల్లీ మోటివేటెడ్ బాడీ కాబట్టి లైసెన్సు సంపాదించడం కష్టం కాదు ఎనీ హౌ తెలుసుకొని చెబుతాను"

 Previous Page Next Page