Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 2

     అ:    భరతము, వేదము, బహుశాస్త్రంబుల
        దండిపండితుడ వీవేనయా            !!వం!!

        1.    కృష్ణ దాటుచును నిష్టాత్ముడవై   
        ఆత్మసన్యాసివై తివయా
        కృష్ణ కధాసుధ యక్షగానముల
        భామ కలాపము నేర్పిన దేవా             !!వం!!

        2.    భాసురమతి భూసురుడవయా
        భరతము నీంద్రుల సాటివై యా
        సత్యము, శౌచము, ధర్మము, శాంతికి
        చదువులు నేర్పిన నొజ్జవయా             !!వం!!

        3.    రాగభావలయ విన్యాసంబుల
        నర్తనమూర్తివి  నీవేనయ్యా
        భరతశాస్త్ర సంస్కృతి దశదిశలను
        వెదజల్లిన మా వేల్పువయా             !!వం!!

        4.    దీక్షబూనియును నృత్య సరళి మా
        బుధులకు  నేర్పిన త్వష్టవయా
        క్షమదమాది సకలాగుణ  సన్నుత
        ఆర్తుని దీక్షితు హృదయాం జలువివె        !!వం!!

       
                                                 భరత సూత్రము

    శ్లో!!    శృంగారరస సందోహం, శ్రితకల్ప మహీరుహమ్,
        శ్రయే శ్రీ నాథమేవాహం, శ్రాంతలోక సుఖావాహమ్!!

    తా!!    శృంగార  వ్యాపారముల కూటమియును. స్వాశ్రితజనుల  కోరిక లీడేర్చు  కల్ప వృక్షమును. సంసారాదితా పత్రయశ్రాంతులగు  జనులకు, శాశ్విత బ్రహ్మానంద మొసంగువాడునగు, లక్ష్మీవల్లభుని నామనోరధ సంపూర్తి కొరకు నాశ్రయించెదను.

                                        నాట్య ప్రధానములు

    శ్లో!!    కంఠేనాలంబయేద్గీతం, హస్తేనార్ధం ప్రదర్శయేత్,
        చక్షుర్భ్యాం  దర్శయేద్భావం, పాదాభ్యాం  తాళమాచెరేత్

    తా!!    నటనముచేయునట్టి  నర్తకిగాని, నర్తకుడుగాని, మొదట గీతమును గానమునుచేసి  యావలగీతార్ధములను  హస్తాభినయములచే  తెలుపవలయును, నేత్రములచే  భావములను తెలుపవలయును, పాదములచే తాళమును నాచరింపవలయును.

    శ్లో!!    యతోహస్త స్తతోదృష్టిర్యతో  దృష్టి స్తతో  మనః
        యతోమనస్తతోభావోయతో  భావస్తతోరసః !!

    తా!!    ఎచ్చట హస్తము చూపబడుచున్నదో, అచ్చట దృష్టినుంచవలయును  దృష్టియున్నచోట  మనస్సు నుంచవలయును, మనస్సున్నచోట  భావముంచవలయును. ఎచ్చట_ఈ నాల్గు కేంద్రీకృతమైయున్నవో  అచ్చట రసము కల్గుచున్నది.

                                 పాదభేదములు, లక్షణములు, వినియోగములు

    1 సమము 2 అంచితము 3 కుంచితము 4 శూచి 5 అగ్రతలసంచారము 6 ఉద్ఘట్టితము  7 ఏకపాదము    8 వినివర్తితము   9 గతాగతము  10 వళితము 11 వైశాఖమండలము, 12 త్రిభంగి  13 అగ్రగము 
14 మర్ధితము  15 పార్ష్ణిగము  16 ఘట్టితము  17 ఘట్టితోత్సేదము   18 తాడితము  19 పార్శ్వగముయని  పాదభేదములు పందొమ్మిది విధములు.

                                     సమపాద లక్షణము _ వినియోగము

    భూమిపైన సమముగా  నిలిపినపాదము "సమపాద" మనబడును, ఇది స్వభావాభినయమందు వినియోగించుదురు.

                                      అంచితపాదలక్షణం _ వినియోగము

    మడమలను నేలపై నుంచి, అంగుళులను  కొంచెము  కుంచించి, అంగుష్టమును  నూర్ధ్వముగా  నెత్తినచో "అంచితపాద"మగును. అతిభ్రమరకాదులకు  వర్తించును. కాలితో తన్నుట. త్రిప్పుట, తిరుగుట, మొదలగు వాటికి వర్తించును.

                                   కుంచిత పాదలక్షణము _ వినియోగము

    కాళ్ళవ్రేళ్ళు  ముడిచి కాలియొక్క మడమలను  యెత్తి  మధ్య  ముడిచినచో "కుంచితపాద"మగును. ఇది చాలాదూరమునడచుటవల్ల  కలిగిన  శ్రమగలవానియొక్క నడకయందు, ఎత్తైన వస్తువులను  గ్రహించుట యందు, వినియోగించును.
    "అతిక్రాంతక్రమే" అని పాఠాంతరము. అతిక్రాంతచారియందు వర్తించును.

                                              శూచిపాదలక్షణము _ వినియోగము

    ఎడమపాదము  స్వాభావికముగా నుంచి, కుడిపాదము యొక్క  బొటనవ్రేలు భూమియందు  మోపి  మిగిలిన పాదమంతయు  నెత్తియుంచినచో  "శూచీపాద" మగును. ఇది నూపురము. (కాలి అందెను)ధరించుటయందు చెల్లును.

                                      అగ్రతల సంచరపాదలక్షణము _ వినియోగము

    కాలియొక్క మడమును  యెత్తి  బొటనవ్రేలును  చాచి మిగిలిన వ్రేళ్ళను ముడిచియుంచినచో నది "అగ్రతల" సంచర "పాదమగును. ఇది ప్రేరేపించుట యందును, స్థానమందు, పీడనము  భూమియందున్న  వానిని  తట్టుటయందు, లేక భూమిని తన్నుటయందును, భూమిపై _నున్న  వస్తువులను  తొలగించుటయందును, రేచికము, (కదలించుట)యందు, తిరుగుట యందు, ముదమునందును  ఈ "అగ్రతల సంచరపాదము" వినియోగించును.   

 Previous Page Next Page