అరణ్యకాండ
__కొమ్మనాపల్లి గణపతిరావు
వ్యాఘ్ర నఖ తాడిత సంభూత సంకూఢమైన గర్జనకు వ్యవధి వ్యత్యస్త వ్యాకుల నిమీలితమైన కీకారణ్యం ప్రళయ ప్రభంజన తాకిడికి దద్దరిల్లినట్టు ఉలికిపడింది. పులి గాండ్రింపుతో ప్రకృతి ప్రతిధ్వనించి శరాసన ప్రహితశింజనీ నిస్వనము నిఘాదన ఘాతమైనట్టు అడవిలోని సింధూర, జమ్మి, టేకు, ఏగిసి, బండారు ,నల్లమద్ది, తునిసి, కొడిసి వృక్షాలు కలత చెందినట్టు కలవరపడ్డాయి. రాబందుల రెక్కల చెప్పుళ్ళతోను, కంజులకలవరపాటుతోనూ కోతుల కిచకిచలతోనూ, కకావికలైన జింకల కేకలతోనూ అడవి అదిరిపడింది.
బుంగనిండా కరక్కాయల్ని, సారపప్పుని నింపుకున్న నారమ్మ భయంతో దిక్కులు చూసింది భీతిచెందిన లేడిపిల్లలా.
మూడుమైళ్ళ దూరంలో ఉన్న పల్లె, పల్లెలోని పూరిల్లు, ఉయ్యాల్లోని పసికందు వరుసగా గుర్తుకొచ్చి నిలువునా ఒణికింది.
ఏ క్షణంలోనైనా ప్రమాదం ముంచుకొచ్చే సూచనగా అంతవరకూ కల్లోలితమైన అరణ్యంలో అంతలోనే నిశ్శబ్దం అలుముకుంది.
తుఫాను ముందు ప్రశాంతతలాంటి ఆస్తబ్దత ఎంత ప్రమాదకరమైనదో నారమ్మకు తెలుసు.
అంతే__
బుంగని నెత్తిపై పెట్టుకుని గబగబా ముందుకు నడిచింది నారమ్మ.
అటవీ ప్రాంతాల్లోనివసిస్తూ అక్కడ దొరికే జిగురు ,ముష్టి గింజలు, చిల్లిగింజ, విప్పపువ్వు, కుంకుడుకాయలు, కరక్కాయలు, తేనె ,సారపప్పు ,మేడికాయలు, దుప్పికొమ్ములు, నెమలి ఈకలు, తదితర సహజసంపదతో పొట్టపోసుకునే గిరిజనులు వన్యమృగాలన్నా, అవి సంచరించే కీకారణ్యాలన్నా భయపడరు. తరతరాలుగా మార్పులేని జీవన సరళి ఇది. క్రూరమృగాల క్రీనీడల్లో బ్రతుకుల్ని వెళ్ళమార్చటమే వారి దైనందిన జీవితం. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా_అడవుల్లో తిరగటం. ప్రాణాలకు తెగించి తెచ్చుకున్నది దళారీలచేతుల్లో పోసి అందినవాటితో తృప్తిపడటం వారి జీవిత విధానం. దోపిడీకి గురవుతున్న గిరిజనుల ఉత్పత్తులకు సక్రమమైన మార్కెట్ సౌకర్యం లభింపచేయాలని ప్రభుత్వం గిరిజన కార్పొరేషన్ లను ఏర్పాటుచేసిన విషయం సైతం తెలీని నిరక్షరాస్యులు వారు.
సన్నని కాలిబాటగుండా నడుస్తున్న నారమ్మ టక్కున ఆగిపోయింది పొదల్లో చప్పుడు కాగానే. ఆమె శరీరమంతా స్వేదబిందువుల్తో తడిసిపోయింది క్రూరమృగాలైనా, సామాన్యంగా పనికట్టుకుని మనిషిపై పడి ప్రాణాలు తీయమని ఆమెకు తెలుసు.
కాని, ఆమె భయపడుతున్నది సుమారు మూడునెలలుగా అడవిని ఆనుకుని ఉన పల్లె ప్రజల్ని భయంకంపితుల్ని చేస్తూ, ఎందరిప్రాణాల్నో పొట్టన పెట్టుకున్న నరమాంసభక్షకి అయిన పెద్దపులి గురించి.
సాధారణమైన పులి మనుష్యుల్ని తప్పించుకుని తిరుగుతుంది. జింకలు, అడవి పందులవంటి జంతువుల్ని వేటాడి ఆకలిని తీర్చుకుంటుంది. కాని, మనషి మాంసానికి అలవాటు పడ్డ పులి తక్కువ శ్రమతో వేటాడబడే మనిషిపైనే ఏకాగ్రత చూపుతుంది. సునాయాసంగా ఆహారంకోసం మనిషిని చంపుతూ, ప్రతి చావుతో మరింత క్రూరత్వాన్ని నింపుకుని అదే తన జీవిత విధానంగా మార్చుకుంటుంది.
ఫారెస్టు విభాగానికి ఓ ప్రశ్నగామారిన పులిని ప్రభుత్వం ఏనాడో మేనీటర్ గా నిర్ధారించి, దాన్ని తుదముట్టించాలని బహుమతుల్ని ప్రకటించింది. అనుభవజ్ఞులైన వేటగాళ్ళను ఆహ్వానించింది. చాలామంది సాహసించలేకపోయారు. సాహసించినవాళ్ళు సాధించలేకపోయారు. దానిక్కారణం మనిషంటే భయంపోయిన మేనీటర్ మామూలు పులిలా కాక వేటగాళ్ళ ఎత్తుల్ని మించి యుక్తి ప్రదర్శించటమే!
సుమారు ఎనభై వేల హెక్టార్ల విస్తీర్ణంతో, సముద్రమట్టానికి రెండువేల అడుగుల ఎత్తున వ్యాపించి ఎందరికో జీవనాధారం కాగలిగిన ఫాడేరు అడవి ఈనాడు ప్రొహిబిటెడ్ జోన్ గా మారిపోయింది. ఈశాన్యాన బారులు తీరిన కొండలతోను, దక్షిణాన దట్టంగా పెరిగిన వెదురు పొదలతోను ఆగ్నేయ దిశలో అందంగా పరుచుకుని ఉన్న టేకు, దేవదారు, సింధూర, యూకలిప్టస్ వృక్షాలతోను, నడుములోయలతో, చీలిన గుట్టలతో నిన్న మొన్నటివరకూ ఎంతో ఆహ్లాదకరంగా దర్శనమిచ్చిన ఆ ప్రకృతి ఈనాడు మృత్యుగహ్వారమై ఎందరి అరణ్యరోదనలకో, మరెందరి కన్నీళ్ళకో ఆలవాలమైపోయింది.
అడవిని నమ్ముకుని బ్రతకడమే అలవాటైన పల్లె ప్రజలకు పులి ఓ పెద్ద అవరోధమైంది పిల్లల్ని పోగొట్టుకున్న తల్లి దండ్రులు కడుపు కోతకి, పసుపుకుంకుమల్ని కోల్పోయిన స్త్రీల గుండెమంటకి కారణమైన పులికి భయపడిన గిరిజనులు అడవిలో అడుగు పెట్టలేక పోతున్నారు. ధైర్యంచేసి అడుగు పెట్టినవారు ఇంటికి చేరేవరకూ మరో రోజు గురించి ఆలోచించలేకపోతున్నారు.
సంధ్య చీకట్లు మసురుకోకముందే తలుపులు బిడాయించుకుని బిక్కుబిక్కుమంటూ గుడిసెల్లో దిక్కుతోచని వారిలా బ్రతకటం అలవాటు చేసుకున్నారు.
అర్ధరాత్రివేళ ఒక ఎండుటాకు నలిగిన చప్పుడైతే మృత్యుకరాళ దంష్ట్ర మధ్య ఏ నిర్భాగ్యుడి జీవితమో అంతమవుతోందన్న సందిగ్ధం.
దూరాన పాలపిట్టకూత వినిపిస్తే ఏ క్రూరమృగానికో ఓ పసికందు బలై పోతూ చేస్తున్న ఆర్తనాదమన్న భ్రమ.
ఆకాశంలో దూసుకుపోయే తీతువు అరుపులు విని తెల్లారేసరికల్లా ఏ బ్రతుకు తెల్లారిపోతుందోనన్న సంశయం.
నిజానికి ఆరోజు కూడా నారమ్మ అడవిలో అడుగు పెట్టే సాహసం చేసేదికాదు కాని, అప్పటికి పదిరోజుల క్రిందటే ఇంటిలోని సాదుబియ్యం నిండుకున్నాయి. డిప్పలో దాచుకున్న జీలుగు కల్లు ముందు రోజువరకూ సర్దుకువచ్చిన మొగుడు రంగయ్య సత్తువలేనట్టు ముసుగుదన్ని పడుకున్నాడు.
కడుపులో ఆకలి రక్కసి నర్తిస్తున్న నారమ్మ కలవరపడలేదు. కాని, ఆమె కడుపు నిండకపోవటంతో పాలు ఊరక పొత్తిళ్ళలోని పసిబిడ్డడొక్క ఆర్చుకుపోతుంటే కలత చెందింది .గుక్కెడు గంజినీళ్ళయినా తాగితే పసికందుకు పాలు దొరికి ప్రాణాలు నిలబడతాయన్న ఆశతో మొగుడు వద్దంటున్నా అడవికి బయలుదేరింది.
ఇంతలో పులిరక్కసి పెనుభూతంలా పెట్టిన పొలికేక!
వెదురుపొదల్ని దాటుతూ ఉరికురికి వస్తోంది నారమ్మ దిగజారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకుంటూ, అరికాలులో గుచ్చుకున్న తుమ్మముల్లు నలుపుతుంటే బాధను నిగ్రహించుకుంటూ.
నిస్త్రాణగా ఒళ్ళు తూలిపోతోంది. నీరసంతో ఎక్కడ కూలిపోతానో అన్న బాధతో రొప్పుతూ నడుస్తున్న నారమ్మ టక్కున ఆగిపోయింది.
సరిగ్గా అప్పుడే_ఒక్క అరక్షణం క్రిందటే రెల్లు పొదల మాటు నుంచి ముందుకొచ్చి నిలబడింది పెద్దపులి!
గగుర్పాటుతో నారమ్మ ఒళ్ళు జలదరించింది.