Previous Page Next Page 
ఏటి ఒడ్డున నీటిపూలు పేజి 2

                                 


    "అక్కా, అమ్మ లేవమంటూంది. రైలుకు వేళై పోతూందిట." కిందనించి మాలతి గట్టిగా కేకపెట్టింది.
    చారుమతికి వెంటనే తన ప్రయాణం గుర్తుకు వచ్చి, పక్క చుట్టి కిందికి వెళ్ళింది. వరండాలో ఏదో రాసుకుంటున్నాడు సూర్యారావు.
    "అమ్మా, చారూ, ఇప్పుడే లేచావా?" అంటూ పలకరించాడు.
    "ఏం నాన్నా, పిలిచావా?" దగ్గిరికి వెళ్ళింది చారుమతి.
    సూర్యారావు ఎందుకో తటపటాయించాడు కాస్సేపు.
    "ఏం లేదమ్మా నువ్వు ఒక్కర్తివీ విశాఖపట్నం వెళ్ళగలవా? భయంలేదు కదా?" సందేహిస్తూ అడిగాడు.
    చారుమతి ఆలోచించింది. తనకు తోడు కావాలంటే ప్రయాణానికి రెట్టింపు ఖర్చు అవుతుంది.
    "నాకేమి భయంలేదు, నాన్నా."
    దిగులు తీరినట్టు ఒక నిట్టూర్పు విడిచాడు సూర్యారావు.
    "నిన్ను పదిగంటలకు మెయిల్లో ఎక్కించి నేను కోర్టుకు వెళతా. తొమ్మిదింటికంతా సిద్ధంగా ఉండు" అని తిరిగి తన పనిలో తల దూర్చాడు. తను పాతికేళ్ళుగా గుమాస్తాగా పనిచేస్తున్న ప్లీడరుగారు చనిపోతే, రెండేళ్ళుగా కొత్త ప్లీడరుదగ్గిర చేరాడు సూర్యారావు. ఈయనదగ్గిర చేరినప్పటినించీ పని ఎక్కువైంది అతనికి.
    ఒక చిన్న పెట్టెలో బట్టలతో, చిన్న బుట్టలో రేవతికోసం శాంతమ్మ కట్టి ఇచ్చిన పిండివంటలతో స్టేషను చేరింది చారుమతి. ఒక్కర్తిని పంపడానికి భయపడుతున్నాడు సూర్యారావు. మెయిల్లో కాకినాడ నించి విశాఖపట్నం వెళ్ళాలంటే చాలా ప్రయాస. కాకినాడనించి ఏ ఊరు వెళ్ళాలన్నా సామర్లకోటలో మారాలి. ఊరు పెద్దదయినా, అన్ని సౌకర్యాలు ఉన్నా, ప్రయాణసౌకర్యాలు, రైళ్ళ సౌకర్యాలు లేక కాకినాడ పౌరులు పెక్కు ఇబ్బందులు పడతారు. కాకినాడనించి తిన్నగా హౌరాదాకా వెళ్ళే బోగీ ఒకటి సామర్లకోటలో మెయిలుకు తగిలిస్తారు. కాని ఆ బోగీలో ఒకే ఒక చిన్న మూడవ తరగతి పెట్టె ఉంటుంది. బోగీ ప్లాట్ ఫారం మీదికి రాకమునుపే కూలీల సాయంతో ప్రయాణికులు ఎక్కేస్తారు. అది ఫ్లాట్ ఫారం మీదికి వచ్చేసరికే కిటకిటలాడుతూ పిప్పళ్ళ బస్తాలా తయారవుతుంది. అందులో ఎక్కిన ప్రయాణికుల అవస్థ వర్ణించలేము! అది పెద్ద నరకయాతన! ఎక్కినవాడు దిగేడు. దిగినవాడు ఎక్కలేడు. లోపల కూర్చున్న పిల్లల, స్త్రీల యాతన మరీ అధ్వాన్నం. లావేటరీకి వెళ్ళాలన్నా వీలవక కళ్ళనీళ్ళపర్యంతం అవుతుంది స్త్రీలకు.
    సూర్యారావు, చారుమతి స్టేషనుకు వచ్చేసరికే ఆ మూడవ తరగతి పెట్టె నిండిపోయి మనుష్యులు వేళ్ళాడుతున్నారు. చేసేదిలేక వేరే పెట్టెలో కూర్చుంది చారుమతి.
    "నువ్వేం భయపడకు నాన్నా! సామర్లకోటలో జాగ్రత్తగా దిగి మెయిల్లో ఎక్కుతానులే, నేనేం చిన్నదాన్నా? పగలు ప్రయాణమేగా!" అంది చారుమతి, తండ్రి దిగులు చూసి.
    అయినా సూర్యారావుకు తృప్తి కలగలేదు. భారంగా, దిక్కుతోచనివాడిలా నుంచున్నాడు. కాసేపు ఉండి, "నేనలా రైలంతా చూసి వస్తానమ్మా, ఎవరేనా చూసినవాళ్ళు కనిపిస్తారేమో? నీకు సాయంగా ఉంటారు" కాని వెనకపెట్టెల వైపు నడిచాడు.
    'ఎందుకు నాన్న ఇంత దిగులుపడతాడు?' జాలిగా నవ్వుకుంది చారుమతి.
    బండి ఇక రెండు నిమిషాలలో కదలబోతూంది అనగా సూర్యారావు ఒక నూతన వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చాడు. అతని వెనకే కూలీ ఒక సూట్ కేసూ, హోల్డాలు పట్టుకువచ్చి చారుమతి ఎదురుసీటులో పెట్టాడు.
    "ఈమేనండీ మా అమ్మాయి, చారుమతి. ఒక్కత్తే విశాఖపట్నం వెళుతూంది. ఒంటరిగా ఇదే మొదటిసారి ప్రయాణం. మరేం లేదు, సామర్లకోటలో బండి మారినపుడు మీరు కొంచెం సహాయం చేస్తారుగా?" సూర్యారావు చారుమతిని పరిచయం చేశాడు.
    "మీ రింతగా చెప్పాలా, గుమాస్తాగారూ! ఆ మాత్రం సహాయం చెయ్యలేనా? మీరేం దిగులు పడకండి. అమ్మాయిని క్షేమంగా విశాఖపట్నం చేర్చడం బాధ్యత. ఇక మీరు నిశ్చింతగా ఇంటికి వెళ్ళండి." నవ్వుతూ అన్నాడు అతను.
    చారుమతి తెల్లబోయి 'ఎవరా ఇతను?' అనుకుంటూ చూసింది. అతనికి ముఫ్ఫై ఏళ్ళు ఉండవచ్చు. కొద్దిగా లావుగా ఉన్నాడు. పొడుగైనా, లావుమీద కొంచెం పొట్టిగా కనిపిస్తున్నాడు.
    "ఈయన రాధాకృష్ణ గారమ్మా! మా ప్లీడరు గారి అబ్బాయి. ఈయనకూడా ఈమధ్యే లా పాసై ప్రాక్టీసుపెట్టారు." చారుమతి సందేహాలు తీర్చాడు సూర్యారావు.
    గార్డు విజిల్ ఊదాడు. రైలు కదిలింది.
    "అమ్మా, జాగ్రత్త. వెళ్ళగానే ఉత్తరం రాయి. రాధాకృష్ణగారు సామర్లకోటలో సహాయం చేస్తారు. భయపడకు." సూర్యారావు మాటలు రైలుశబ్దంలో కలిసిపోయాయి. కనిపించేంతవరకు తండ్రిని చూస్తూ చెయ్యి ఊపింది చారుమతి.
    'నాన్న ఎంత చిక్కిపోయాడు! వయస్సుకంటే ముసలివాడిలా కనిపిస్తున్నాడు. నేను ఉద్యోగంలో చేరగానే పని సగం తగ్గించుకోమని చెప్పాలి.' మనస్సులో తండ్రిని గురించి బాధపడింది. తండ్రి అంటే ఎంతో ప్రేమ, జాలి చారుమతికి. అతనికి కావాలంటే తగని ఆపేక్ష. వాళ్ళకోసమని శక్తికి మించిన పని చేస్తాడు. ఎంత పని చేసినా, నిజాయితీ పరుడైన సూర్యారావు సంపాదన ప్లీడరు గుమాస్తాగా ఏమాత్రం? అతని సంపాదనలోనే ముసలితల్లీ, భార్యా, అయిదుగురి పిల్లల పోషణ గడవాలి. అతను ఎప్పుడూ మోయలేని బరువు మోస్తూ కుంగి పోయినట్లు ఉంటాడు.
    తండ్రిని గురించిన ఆలోచనలతో కిటికీదగ్గిరే పరాకుగా కూర్చున్న చారుమతి, సామర్లకోట స్టేషను చూసి, 'అరే! అప్పుడే వచ్చేసిందా!' అనుకుని ఆశ్చర్యపోయింది.
    రాధాకృష్ణ తన సామానుతోబాటు చారుమతి సామానుకూడా కూలీచేతికి ఇచ్చాడు. ఇద్దరూ ఇవతలి ప్లాటు ఫారంనించి అవతలి ఫ్లాటుఫారం మీదికి మారారు. సామాను ఆడవాళ్ళ వెయిటింగ్ రూములో పెట్టించి, "మీ రిక్కడే కూర్చోండి. మెయిల్ ఎంత లేటో కనుక్కునివస్తాను" అని వెళ్ళాడు అతను.
    "రెండు గంటలు లేటుట!" అన్నాడు కాసేపయినాక వచ్చి.
    "అబ్బ" అంది విసుగ్గా చారుమతి.
    "కాంటీను కు వెళ్ళి కాఫీ తాగుదాం, రండి" అన్నాడు అతను.
    అప్పుడే పరిచయమైన అతనితో వెళ్ళడానికి సంశయించింది చారుమతి.
    "మీరు వెళ్ళండి. నే నిక్కడే కూర్చుంటాను" అంది.
    "ఫరవాలేదు, రండి. వైజాగ్ దాకా మళ్ళీ ఏం దొరకవు" అంటూ బలవంతంచేశాడు అతను.
    కాంటీన్ కాళీగానే ఉంది.
    "రెండు వడలు, రెండు కాఫీ" అని సర్వరుకు చెప్పి, టేబిల్ మీద రెండు చేతులూ ఆన్చి ముందుకు వంగి కూర్చున్నాడు రాధాకృష్ణ. చారుమతి మొహమాట పడుతూ కూర్చుంది.
    "మీ పేరు ఏమిటి? మీ నాన్నగారు ఏదో కొత్తపేరు చెప్పారు. మరిచిపోయాను." నిశ్శబ్ధాన్ని భంగం చేస్తూ అడిగాడు.
    "చారుమతి."
    "బాగుందండీ మీ పేరు."
    "మా నాన్న ఆడపిల్లల పేర్లు మాత్రం మంచివి పెట్టారు. రేవతి, భానుమతి, చారుమతి, మాలతి, భగవతి-మా పేర్లు."
    "ఏమిటేమిటీ! మీరు అయిదుగురు అక్కచెల్లెళ్ళా? సూర్యారావుగారికి ఇంతమంది పిల్లలని ఇన్నాళ్ళు నాకు తెలియనే తెలియదు." ఆశ్చర్యంగా అన్నాడు రాధాకృష్ణ.
    "నాకో అన్నకూడా ఉన్నాడు. పేరు శంకరం."
    "ఏం చేస్తున్నాడు?"
    "బి.ఎ. ఆఖరి సంవత్సరంలోకి వచ్చాడు. నా కంటే వాడు ఒక్క సంవత్సరమే పెద్ద."
    "మీరేం చదువుతున్నారు?"
    "నా చదువు ఆగిపోయిందండీ. ఎస్. ఎస్. ఎల్. సి. పాసయ్యాను. ట్రెయినింగ్ పూర్తి చేశాను."
    "అదేం, మీరు కాలేజీలో ఎందుకు చేరలేదు? పై చదువుల మీద ఆసక్తి లేదా?"
    "ఎందుకు లేదు? కాలేజీలో చదివి డిగ్రీ తీసుకోవాలని నా కెంతో కోరిక. ఎస్. ఎస్. ఎల్. సి. లో నేను మా స్కూలుకు ఫస్టు వచ్చాను. అయితేనేం? అందరికి అన్ని కోరికలూ తీరుతాయా?" చారుమతి బాధగా అన్నది.
    రాధాకృష్ణ నొచ్చుకున్నాడు.
    "మీ కింత తెలివితేటలు ఉండీ చదువుకునే అవకాశం లేకపోవడం చాలా అన్యాయం. మీ నాన్నగారు ఎలాగో కష్టపడి మిమ్మల్ని చదివించవలసింది."
    "మా అన్నని చదివించడానికే మా నాన్నగారుఎంతో కష్టపడుతున్నారు. మా రేవతక్క పెళ్ళికి చేసిన అప్పు తీరలే దింకా. ఇక ఆడపిల్లలని కూడా కాలేజీలో ఎక్కడ చదివించగలరు?"
    రాధాకృష్ణ ఏదో ఆలోచిస్తూ అన్నాడు: "నాకు ఇన్నాళ్ళూ మీ సంగతులు ఏమీ తెలియవు. సూర్యారావుగారు రోజంతా మా నాన్నగారిదగ్గిర పని చేసినా, ఇంటి సంగతులు ఏమీ చెప్పరు."
    "తెలిసిమాత్రం మీరు చెయ్యగలిగింది ఏముంది?" ఎవరి బాధలు వాళ్ళు పడాలి అన్న ధ్వనితో అంది చారుమతి.
    ఇంతలో వడ, కాఫీ వచ్చాయి. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయి, అవి ముగించి బయటికి వచ్చారు ఇద్దరూ.
    ఆడవాళ్ళ వెయిటింగ్ రూములో చారుమతిని కూర్చోబెట్టి అలా తిరిగి రావడానికి వెళ్ళాడు రాధాకృష్ణ.
    వెయిటింగ్ రూము బయటే పిల్లని చంకనెత్తుకుని ఒకావిడ నిలబడిఉంది. చూడడానికి కోనసీమ స్త్రీలా ఉంది. బండారులంక ఎర్ర జరీచీర, జరీఅంచున్న తెల్లరవిక, మెడలో బరువు...చంద్రహారం, జడనిండా పూలు, కాళ్ళకి పసుపూ. ఆవిడ చారుమతిని చూస్తూనే అడిగింది:
    "అత్తగారింటికా, పుట్టింటికా వెళ్ళడం?"
    ప్రశ్న విని తెల్లబోయింది చారుమతి. "మా అక్కావాళ్ళ ఇంటికి."
    "మీ ఆయనా?"
    "కాదు." అక్కడ నుంచోకుండా రూము లోపలికి వెళ్ళిపోయింది చారుమతి.
    'పైవాళ్ళ విషయాలలో ఇంత కుతూహలం ఎందుకో?' అని విసుక్కుంది. కాని ఆమె ప్రశ్నతో పరాయిమగవాడితో చనువుగా తిరగకూడదనే ఆలోచన ఉదయించింది చారుమతిలో.

                               *    *    *

    రాధాకృష్ణ ఇచ్చిన పత్రిక చదువుతూ కూర్చున్న చారుమతి ప్రయాణికులు సామానులు తీసుకుని పరిగత్తడం, రైలు ఫ్లాట్ ఫారంమీదికి రావడం ఒక్కమూల గమనించి, కంగారుపడుతూ తను లేచింది. రాధాకృష్ణ కూలీని వెంటబెట్టుకునివచ్చాడు. పెళ్ళిళ్ళ రోజు లవడంవల్ల రైల్లో ఎక్కడా ఖాళీ లేదు. ప్రతి మూడవ తరగతి పెట్టెదగ్గిరా ఎక్కేవాళ్ళకి, దిగేవాళ్ళకి మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతూంది. "దిగనియ్యవయ్యా, ఖాళీ అవుతుంది" అంటాడు దిగేవాడు. "ఎక్కనియ్యవయ్యా, రైలు కదిలిపోతూంది; టైమైపోతూంది" అంటాడు ఎక్కేవాడు. ఇద్దరూ ద్వార బంధందగ్గిరినుంచి అంగుళమైనా కదలకుండా పై వాళ్ళకి జాగా ఇవ్వరు. ఈ కొసనుంచి ఆ కొసదాకా రైలు చూసిన తరవాత చారుమతి, "ఈ రోజు ఈ రైల్లో ఎక్కలేం. తిరిగి కాకినాడ వెళ్ళిపోదాం" అంది.

 

                                       
    రాధాకృష్ణ ఒక మొదటి తరగతి పెట్టెదగ్గిర ఆగి, కూలీతో "సామాను ఇందులో పెట్టు. అమ్మాయి గారిని ఎక్కించు. నేను టిక్కెట్లు మార్చుకువస్తాను" అని చెప్పి, చారుమతి టికెట్ కూడా తీసుకుని పరిగెత్తాడు.
    చారుమతి అయోమయంగా నుంచుంది. అది చాలా చిన్న పెట్టె. రెండు బెర్తులు మాత్రం ఉండి ఇద్దరు  మనుషులకని నిర్ణయించబడింది. కాని ఈ రోజు అందులో నలుగురు పెద్దమనుషులు కూర్చుని ఉన్నారు.
    రైలు కదులుతూఉంటే రాధాకృష్ణ వచ్చి ఎక్కాడు. అయోమయంగా తలుపుదగ్గిరే నిలబడి ఉన్న చారుమతిని చూసి, "అదేం, కూర్చోలేదేం?" అంటూ సీటుకోసం చూశాడు. అది గమనించి, పెద్ద మనుషులు కిటికీదగ్గిర వీళ్ళకు కొంచెం జాగా చేసి తాము సర్దుకున్నారు.
    చారుమతి పక్కనేకూర్చున్న రాధాకృష్ణ తగిలినప్పు డల్లా తేళ్ళు, జెర్రులు ఒంటిమీద పాకినట్లు భయపడుతూ కిటికీకి అంటుకుపోయి కూర్చుంది.
    తండ్రి తనచేతికి పదిహేను రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు ఈ మొదటి తరగతి టికెట్ కు ఎంత దబ్బు ఇవ్వాలో? మళ్ళీ తిరుగుప్రయాణం ఎలాగో? ఈ అవస్థలు లేకుండా కాకినాడ తిరిగివెళ్ళిపోవలసింది. ప్రయాణం తలుచుకున్నకొద్ది రాధాకృష్ణ మీద చికాకు కలిగింది. తనని అడగకుండా, పెట్టకుండా మొదటి తరగతికి టికెట్ మార్చడం ఏమిటి? తన పక్కన కూర్చోడం!
    తుని స్టేషన్ వచ్చింది. నలుగురు పెద్ద మనుషులు దిగిపోయారు. రాధాకృష్ణ వెంటనే లోపలినించి తలుపు వేసి గడియ బిగించి, "అమ్మయ్య! కొంచెం ఊపిరి పీల్చుకోవచ్చు. ఇంక ఎవ్వరూ ఎక్కకుండా ఉంటే బాగుండును" అన్నాడు ఒళ్ళు విరుచుకుంటూ.

 Previous Page Next Page