Previous Page Next Page 
ది సెల్ పేజి 2


    నా రూమ్ లో ఐరన్ బీరువాలు రెండు గోడకి చేర్చి ఉన్నాయి. వాటిని కొంచెం  ముందుకు లాగితే కాస్తకుదురుగా వుంటుంది. కూర్చోవటానికి బాగానే ఉంటుంది. ఒక టేబిల్, కుర్చీ వేయటం వలన నాకు వచ్చే నష్టం ఏమిలేదు. కాని ఆమె అక్కడ కూర్చోవటానికి ఇష్టపడుతుందో లేదో! సౌజన్య అంగీకారం తెలుసుకోవాలని అడిగాను.
    "సౌజన్యగారు....ఇక్కడ నీకు ఇబ్బందిగా ఉంటే నా రూమ్ లో నీ టేబిల్, చెయిర్ వేయిస్తాను..."
    "అబ్బే ఫరవాలేదండి....ఇక్కడ బాగానే ఉంది." కంగారుగా ఆమె అన్నమాటల్లో ముహమాటం ఎక్కువగా ఉంది.
    అయినా ఆమెకి ఇష్టం లేకపోతే నేనేం చేయగలను.
    "ఇట్స్ ఆల్ రైట్...." నా అభిమానం దిబ్బతిన్నందుకు విసురుగా అనేసి నా రూమ్ కి వెళ్ళిపోయాను.
    
                             * * *   
    రోజులు యాంత్రికంగా దొర్లిపోతున్నాయి. డ్రాయింగ్ బ్రాంచిలోంచి సూటిపోటీ మాటలు వినిపిస్తునే ఉన్నాయి.
    సౌజన్య గురించి వాళ్ళు అసహ్యంగా మాట్లాడు కోవటం సహించలేక పోతున్నాను. అప్పటికి రెండు మూడుసార్లు ఆఫీసు అవర్స్ లో నిశ్శబ్దం పాటించమని నోటీసు పంపాను. పంపిన రెండురోజులు బాగానే ఉన్నారు. తరువాత మళ్ళీ మామూలే. ఆఫీసర్ గా వాళ్ళని కంట్రోల్ చెయ్యలేక పోతున్నానేమో అనిపించింది. నేను వచ్చినప్పటినుంచి అబ్జర్వు చేస్తున్నాను. స్టాఫ్ చాలా చురుగ్గా, పనిచేస్తున్నారు. ఏ తప్పు దొరకటంలేదు. పని బాగా చేస్తున్న వాళ్ళని ఏమి అనలేక పోతున్నాను.
    సౌజన్యకి అన్యాయం జరుగుతోందనిపిస్తుంది. పరిష్కారం ఆలోచిస్తున్నాను.
    ఓ వాడు విసురుగా తలుపు తోసుకుని సౌజన్య నా గదికి వచ్చింది. ఆమె ప్రవర్తనకి ఆశ్చర్యపోయినా తేరుకుని, "రా సౌజన్యగారూ! కూర్చోండి..." అని కుర్చీ చూపించాను.    
    ఆమె కూర్చోలేదు. ఓ కాగితం నా చేతికిచ్చి వెనుదిరిగింది.
    దాంట్లో సబ్జెక్ట్ చూసి నా మనస్సు చివుక్కుమంది. క్షణకాలం చలించిపోయాను. నేను ఆఫీసరనన్న మాటే మరిచిపోయి, "సౌజన్యా..." అని గట్టిగా పిలిచాను. వెళ్ళుతున్నామె ఆగిపోయింది.
    నా కేక ఎంత దూరం వినబడిందో గాని డ్రాయింగ్ రూమ్ లో గుసగుసలు ఆగిపోయాయి.
    ".....సౌజన్యా ప్లీజ్ కూర్చో" కూర్చోమని మళ్ళీ రెట్టించాను.
    ఏమనుకుందో ఏమో వచ్చి కూర్చుంది.
    ".....సౌజన్యా, ఎందుకీ నిర్ణయానికి వచ్చావు?" ఆమె ఏమి చెప్పలేదు.
    తలెత్తింది. ఆమె కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. కన్నీరు ఉబికివస్తోంది.
    ఆమె అంతగా బాధపడటానికి కారణం ఏమిటో ఆ నిర్ణయానికి ఎందుకు వచ్చిందో తెలియక....
    "సౌజన్యా నిన్ను నేనేమన్నా కష్టపెట్టానా?" సౌమ్యంగా అడిగాను.
    ఆమె ఏడుపు మరింత ఎక్కువయింది. దుఃఖం కట్టలు తెంచుకుంది. వెక్కి వెక్కి ఏడుస్తోంది.
    "ఛ ఛ! చిన్నపిల్లలా అదేమిటి?.... నీ కొచ్చిన కష్టమేమిటో చెప్పు.....నేను ఆఫీసరుగా కాక నీ శ్రేయోభిలాషిగా అడుగుతున్నాను. ఏమిటో చెప్పు."
    "నేనిక్కడ ఉద్యోగం చెయ్యలేను సార్. సూటిపోటీ మాటలతో క్షణక్షణం చంపేస్తున్నారు. నా రిజిగ్నేషన్ త్వరగా యాక్సెప్ట్ చేయండి ప్లీజ్ ...." బావురుమంది.
    ఆ క్షణంలో సౌజన్య నా కంటికి పసిపిల్లలా కనిపించింది. ఆమెను దగ్గరకు తీసుకొని ఊరడించాలనిపించినా, కానీ ఆమె వయసు, నా హోదా గుర్తుకు తెచ్చుకుని ఆగిపోయాను.
    "సౌజన్యా! పరిస్థితులకు భయపడి పిరికిగా పారిపోతావా! అసలా పరిస్థితి ఎవరు కల్పించారో ఆలోచించావా? వాళ్ళు నిన్ను సూటిపోటీ మాటలతో బాధ పెట్టడానికి కారణం నీ ప్రవర్తన కాదా!.....
    సూటిగా అడుగుతున్నానని ఏమీ అనుకోక సమాధానం చెప్పు ....
    నువ్వు ప్రేమించినతను దూరమయ్యాడనేగా నువ్వు బాధపడుతున్నది."
    సౌజన్య ఏమీ చెప్పలేదు, మౌనంగా ఉండిపోయింది. "జవాబు చెప్పవేం సౌజన్యా....." మళ్ళీ అడిగాను. తల దించుకుంది. "మౌనమే నీ జవాబైతే ఇంక నిన్నేమీ అడగను.....ఒక్కమాట. ప్రేమ విఫలమే నీ బెంగకు కారణం అయితే లోకం హర్షించదు..... మనం సంఘజీవులం. మన బాధ పైకి కనిపించనీయకూడదు.... అదే జరిగితే ఎగతాళి పాలౌతాం. ఏటికి ఎదురీదే ఈ జీవితం-ఇతర్లని చూసి నువ్వు తలవంచుకోవటం కాదు. వాళ్ళు నిన్ను చూసి తల వంచుకునేలా నడుచుకో ....
    ఇకనుంచి నీ సీటు నాదగ్గరే! ఇంకేం అడ్డు చెప్పకు" అని రిజిగ్నేషన్ లెటర్ ను చించి బాస్కెట్ లో పడవేశాను. ఫ్యూన్ ని పిలిచి చెప్పాను.
    సౌజన్య చూస్తుండగానే నిముషాలమీద ఆమె టేబిల్, చెయిర్ నా రూంలో వేశాడు ఫ్యూన్. డ్రాయింగ్ బ్రాంచ్ అంతా విస్తుపోయింది. ఏదో అనబోయారు.
    నోళ్ళు నొక్కుకుపోయిన వాళ్ళు నన్ను "బాగుంది సార్! ఆమెకి ఇక్కడ మెరుగ్గా ఉంటుంది...." తప్పదన్నట్టు ముఖస్తుతికి అన్నారు.
    నా హృదయం తేలికయింది. పెద్ద సమస్య తీరి పోయిందని ఆనందించాను.
    
                            * * *
    
    సౌజన్యతో నూతనోత్సాహమే కాక చాలా మార్పు కూడా వచ్చింది. ఆమెలో చెలాకీ, హుందా వచ్చాయి. తలెత్తి ఠీవిగా తిరుగుతోంది. ఆమె కళ్ళకి వెలుగొచ్చింది. నాకన్నా ముందుగానే ఆఫీసు వచ్చి చిరునవ్వుతో నన్నాహ్వానించేది.
    సౌజన్య వస్తుంటే డ్రాయింగ్ బ్రాంచ్ లో ఆమె పై గుసగుసలు ఠపీమని ఆగిపోయేవి.
    సౌజన్యతో మాట్లాడటమే ఓ వరంలా ఉంది ఆఫీస్ స్టాఫ్ అందరికి. ఇష్టం ఉన్నా లేకపోయినా అందరూ ఆమెతో చాలా ఆప్యాయంగా మాట్లాడుతున్నారు ఎందుకని?
    ఇప్పుడు సౌజన్య ఆఫీసర్ కి సన్నిహితురాలు. వాళ్ళ గురించి తను ఏదైనా చాడీలు చెప్పుతుందేమోనన్న భయంతో వాళ్ళు కపటంతో ప్రవర్తిస్తున్నారు.    
    ఆవాళ ఉదయం నాకు ట్రాన్స్ ఫర్ ఆర్డర్లు వచ్చాయి నా మనసంతా అదోలా అయిపోయింది.
    ఆరునెలలులోనే ట్రాన్ఫర్ ఎందుకొచ్చిందో అర్ధమయింది.
    అప్పటికే హెడ్ క్వార్టర్స్ నుంచి నా సహాద్యోగులు ఇలా జరగాబోతోందని నాకు చాలా ఉత్తరాలు రాశారు.
    నా సిన్సియారిటీ నా క్యారెక్టర్ మీద నాకు నమ్మకం ఉంది. ఇంక ఇతర్ల నమ్మకాలతో పని లేదని రాశాను. మొదటి నుంచి నా మొండితనం తెలిసిన మిత్రులు ఏసహాయం చేయలేక ఊరుకున్నారు.
    ఇలా ఎందుకు జరిగిందని సౌజన్య నన్ను అడగనూలేదు. నేను చెప్పనూలేదు. కారణం మా యిద్దరికి తెలుసు.
    స్టాఫ్ నా మీద అంతకన్నా ఎక్కువ ప్రతీకారం చెయ్యలేదు. వాళ్ళు పెట్టిన పిటిషన్స్ ఫలితంగానే నన్ను అర్ధంతరంగా ట్రాన్స్ ఫర్ చేశారు.
    ఆరోజు సాయంత్రం నేను రిలీవ్ అయ్యి వెళ్ళి పోతున్నాను. నా కెవ్వరూ ఫేర్ వెల్ పార్టీ ఇవ్వలేదు. నేను జాయిన్ అయినప్పుడు వాళ్ళు చూపిన ఆప్యాయత ఎలాంటిదో ఇప్పుడు బాగా అర్ధమయ్యింది. పార్టీ ఇవ్వలేదన్న బాధ నా కిప్పుడు లేదు.
    స్టాఫ్ లో ఏ ఒక్కరూ నన్ను పలకరించలేదు. అయినా నేను ప్రతి సీటు దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరికి షేక్ హాండ్ ఇచ్చి నా ఫార్మాలిటీస్ పూర్తి చేశాను.
    సౌజన్య కనిపిస్తుందేమో నని చూశాను. ఆ రోజామె రాలేదు. శెలవు పెట్టినట్లు తెలిసింది.
    కనీసం ఆ సమయంలో ఆమె లేకపోవడంతో నాకేదో లోటుగా అనిపించింది.
    అసలు ఆఫీస్ స్టాఫ్ కి నేనేం అన్యాయం చేశాను? ఓ అబలని వాళ్ళ సూటిపోటి మాటల నుంచి రక్షించాను. అదే అపరాధమయితే వాళ్ళు విధించే శిక్షకి సిద్దంగా వున్నాను. కాని వాళ్ళు నాపట్ల చూపిన విముఖతని మాత్రం హర్షించలేక పోయాను.
    ఎంతో ఉత్సాహంతో ఆవూరు వచ్చిన నేను, బరువు గుండెతో ఆవూరు వదిలేను. పరధ్యానంగానే ట్రయిన్ ఎక్కాను.
    గార్డు పచ్చజెండా వూపాడు. నాలో ఇంకా ఆశ చావలేదు. సౌజన్య తప్పకుండా వస్తుందనిపించింది. మా స్నేహం మీద నా కానమ్మకం ఉంది.
    ట్రయిన్ కదులుతుండగా చివరి సారిగా చూశాను.
    సౌజన్య పరుగెత్తుకుంటూ వస్తూంది. ఆమె చేతిలో ఎర్రగులాబి వుంది. ట్రయిన్ వేగం ఎక్కువవ్వటంతో సౌజన్య పరిగెత్తలేక ఆగిపోయింది.
    ఆమె కళ్ళలో ఉబికివస్తున్న కన్నీళ్లు నాకు కనిపిస్తున్నాయి. ఆరు నెలల పరిచయం ఏదో తెలియని బంధాన్ని మామధ్య ఏర్పరిచిందేమో! ఏదో చెప్పాలని "సౌజన్యా" అని గట్టిగా పిలిచాను. కాని అదామెకి వినపడలేదు. ఫ్లాట్ ఫారం గోలలో కలిసిపోయింది.
    నా కన్నీళ్ళ పొరల కావల దూరమవుతున్న సౌజన్య మసక మసగ్గా కనిపించింది.
    
                            * * *

 Previous Page Next Page