Previous Page Next Page 
రాంభరోసా అపార్ట్ మెంట్స్ పేజి 19


    "నీ యాభై ఖర్చు మానుకో- సరిపోద్ది" జవాబిచ్చాడు వాడు.
    "ఇగో ఈ తెలివంతా ఎడ్యుకేషన్ లో ఉండాలె! నీ వయసులో ఉన్నప్పుడు నాకు మొత్తం క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేది మరి నీసంగతేంది? నీకొచ్చిందా? హమీద్ మియా శ్రీనుకి నచ్చజెప్పబోయాడు.
    "అలాగా! అయితే మరి నీ వయసులో రాజశేఖర్ రెడ్డి చీఫ్ మినిష్టరయ్యాడు. మరి నీ సంగతేంటి?"
    హమీద్ మియా షాకయ్యాడు.
    "మమ్మీ......వీళ్ళ లెవల్ ఇంతేగానీ ఫిఫ్టీ ఇవ్వు త్వరగా- లేకపోతే స్కూల్ మానెయ్యాల్సి వస్తుంది"
    కనకం సైలెంట్ గా డబ్బిచ్చేసింది.
    ఆ తరువాత మేమంతా మీటింగ్ పెట్టి పిల్లల విపరీత ప్రవర్తన గురించి డిస్కస్ చేస్తోంటే హనుమంతరావ్ మిసెస్ కనకం హడావుడిగా ఓ కాగితం పట్టుకొచ్చింది.
    "ఇదిగో! మనాడి నోట్ బుక్ లో ఏం దొరికిందో చూశారా? లవ్ లెటర్" అంటూ ఓ కాగితం మాకిచ్చింది.
    అందరం ఆత్రుతగా తీసుకుని చూశాం.
    "హాయ్ నిషీ! మనిద్దరం ఇవాళ స్కూల్ ఎగ్గొట్టి సినిమాకెళ్ళి కిస్ చేసుకుందాం! ఓకేనా? నీ లవర్-శ్రీను"
    అందరం అదిరిపడ్డాం.
    "ఇది టూమచ్ ఉన్నయ్-ఈ సినిమాలు, టీవీ చానెల్స్ మొత్తం పిల్లలందరినీ నాశనం చేస్తున్నాయ్-" అన్నాడు హమీద్ మియా ఆవేశంగా.
    "పిల్లలు ఇంత దారుణంగా చెడిపోతుంటే- మనం చూస్తూ కూర్చోడానికి వీల్లేదు- పదండి స్కూల్ వాళ్ళని నిలదీద్దాం" అన్నాడు విజయ్ యాదవ్.
    వెంటనే అందరం మా వాచ్ మెన్ ఈ మధ్యే కొన్న సెకండ్ హాండ్ కారెక్కి శ్రీను స్కూలుకి చేరుకున్నాం.
    ప్రిన్సిపాల్ తనెదురుగ్గా ఉన్న లాప్ టాప్ లో శిల్పాశెట్టి డాన్స్ తన్మయత్వంతో చూస్తూండటం మా కంటపడింది.
    ఆ డాన్స్ ఎట్రాక్టివ్ గా ఉండడంతో మేమూ చూస్తూండిపోయాం- కొద్దిసేపు.
    అదయ్యాక ఆ ప్రిన్సిపాలూ, మేమూ ఒకేసారి స్పృహలో కొచ్చాం.
    "ఆ! మీరెవరు? ఎప్పుడొచ్చారు, ఎందుకొచ్చారు?" అనడిగాడతను కంగారుగా.
    "అయామ్ శ్రీసూన్ ఫాదర్! సెవెంత్ క్లాసు చదువుతున్నాడు-" అన్నాడు హనుమంతరావు.
    "అలాగా! శ్రీనూ బ్రైట్ స్టూడెంట్! డిసిప్లిన్డ్ బాయ్. అసలు మా స్కూల్లో మేము పిల్లలకి నేర్పే డిసిప్లిన్ ఆంద్రప్రదేశ్ అంతా వెతికినా మీక్కనిపించదు"
    "అవునవును- ఇదిగో వాడి క్లాస్ మేట్ కి వాడు రాసిన లవ్ లెటర్ చదువుతేనే మాకా విషయం అర్ధమయింది-" అంటూ లెటర్ అతనికిచ్చాడు హనుమంతరావు.
    ఆ లెటర్ చదివి ప్రిన్సిపాల్ షాకవుతాడని మేమంతా ఉత్కంఠతో ఎదురుచూశాంగానీ పూర్తిగా డిజపాయింట్ చేశాడు.
    "ఒండర్ ఫుల్! నేను చెప్పలా మీ వాడి స్టాండర్డ్ చూడండి! ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ లేదు. నేను చెప్తూందదే! హైస్టాండర్ద్! మా స్కూల్ ఎడ్యుకేషనే అంతా!"
    మాకు మతిపోయినట్లయింది.
    హమీద్ మియాకి వళ్ళుమండింది.
    "ఏయ్ ప్రిన్సిపాల్! నీకేమయినా తెలివీ ఉన్నయ్? సౌత్ క్లాస్ పడనేవాలా బచ్చా- లవ్ లెటర్ రాస్తున్నయ్- కిస్సింగ్ చేస్తాం అంటున్నయ్- ఇదీ హైస్టాండర్డ్ ఉన్నయ్? నీకు దమాక్ ఉన్నయ్?" అంటూ అరిచేసరికి ప్రిన్సిపాల్ షాకయ్యాడు.
    "అదేంటి సార్! అలా అంటారు- మా స్కూల్ బ్రోచర్ లో ఏముందో ఒక్కసారి చూడండి! స్కూల్ విత్ అమెరికన్ స్టాండర్డ్స్! అంటే ఏంటి? అమెరికా టైప్ ఎడ్యుకేషన్ ని అట్లా అచ్చు గుద్దేస్తామన్న మాట! అమెరికా స్టాండర్డ్ అన్నప్పుడు అంతో, ఇంతో సెక్సూ, డ్రగ్సూ, గన్ ఫైట్సూ ఉంటయ్ కదా-"
    మళ్ళీ షాకయ్యాం అందరం.
    "ఇదేంటి వీడిట్లా రివర్స్ వస్తున్నాడు?" అనీజీగా అడిగాడు హనుమంతరావ్.
    "మనం సైలెంట్ గా ఉంటే వీడు రెచ్చిపోతాడు- మళ్ళీ దులిపేయండి-" సలహా ఇచ్చాడు శంకరమూర్తి.
    "సిగ్గు లేకపోతేసరి! అమెరికా టైప్ ఎడ్యుకేషన్ అనుకున్నాం గానీ ఇలా పిచ్చిపిచ్చి వేషాలేయించే వెధవస్టాండర్డ్ అని మాకేం తెలుసు?" తిరగబడ్డాడు విజయ్ యాదవ్.
    "అమెరికా స్టాండర్డ్ అంటే సపరేట్ గా ఎడ్యుకేషన్ ఒక్కటే రాదండీ! అది పాకేజ్ డీల్! మొత్తం చదువూ, సెక్సూ, ద్రగ్సూ, గన్స్- అన్నీ కలిపి వస్తాయన్నమాట-"
    మాకేం మాట్లాడాలో తెలీలేదు.
    "మన భారత సంస్కృతి మాటేంటి? అది మట్టికొట్టుకు పోవలసిందేనా?" ఆవేశంగా అడిగాడు శంకరమూర్తి.
    ప్రిన్సిపాల్ కొంచెం కంగారుపడ్డాడు. 'భారత సంస్కృతి' అన్న సబ్జెక్ట్ డిస్కషన్ కొచ్చిందంటే చాలు! టోటల్ గా వణికిపోతాడు. ఒకసారి ఏబీవీపి వాళ్ళతో ఆ విషయంలోనే గొడవ పడ్డప్పుడు ఇంచుమించుగా రెండుచోట్ల బాడీలో ఫ్రాక్చర్ అయింది.
    "అహహ! భారత సంస్కృతి చాలా గ్రేటండీ! ఆ మాటెలా కాదంటాను? కాపోతే అమెరికా సంస్కృతి కూడా చాలావరకు మంచిదే కాకపోతే సంస్కృతి అన్నాక ఎక్కడో, ఏదో లోపం ఉండకపోదు కదా!" అన్నాడు ప్రిన్సిపాల్.
    "ఏంటి అమెరికా సంస్కృతి మంచిదా? సిగ్గులేదు ఆ మాటంటానికి వాళ్ళకి, మనకీ నక్కకీ నాగలోకానికీ ఉన్నంతా తేడా ఉంది. తెలుసా?" అరిచాడు హనుమంతరావ్. దాంతో ప్రిన్సిపాల్ కి కోపం వచ్చింది.
    "ఏంటి అమెరికా సంస్కృతి అంత పనికి రానిదయితే పిల్లల్ని పుట్టిన దగ్గర్నుంచీ అమెరికా పంపాలి, అమెరికాలో చదివించాలి. అమెరికాలోనే ఉద్యోగం చేయించాలి అని ఎందుకు కక్కుర్తి పడుతున్నారండీ?"
    ప్రిన్సిపాల్ కొట్టిన దెబ్బకి అందరికీ కళ్ళు బైర్లుకమ్మాయ్-
    "వీడినిలా గెలవటం కష్టం! ఇంకో రూట్లో వద్దాం" అన్నాడు విజయ్ యాదవ్ గుసగుసలాడుతూ-
    "ఏ రూట్లో వద్దాం?"
    "అదే ఇప్పుడు ఇది జరిగింది గనుక సెట్ రైట్  చేయడానికి తనేం యాక్షన్ తీసుకుంటాడో అడుగుదాం-"
    అదే మాటడిగాడు హనుమంతరావ్.
    "అవునయ్యా! ఇప్పుడీ లవ్ లెటర్ గొడవ నీ దృష్టికి తెచ్చాం కదా! నువ్వేం యాక్షన్ తీసుకుంటావ్?" అడిగాడతను.
    "నేనేం యాక్షన్ తీసుకుంటానండీ? యాక్షన్ తీసుకోడానికి నాకేం పవర్స్ ఏడ్చాయ్ గనుక! పిల్లలు ఎన్ని వెధవ పనులు చేసినా సైలెంట్ గా ఊరుకోవాలి కదా! నెత్తిమీద ఓ మొట్టికాయ వేశానని ఓ పిల్లగాడి తల్లిదండ్రులు గూండాలతో వచ్చి మా స్కూలు తగలబెట్టారు. అసలు ఇలాంటి సిట్యుయేషన్ లో మీరయితే ఏం చేస్తారు చెప్పండి?" అంటూ మళ్ళీ మా మీదకే గూగ్లీ విసిరాడు.
    ఆ ప్రశ్నకేం జవాబు చెప్పాలో మాకు అర్ధం కాలేదు- "మేమయితే ఆ కుర్రాడిని నలుగు తగిలిస్తాం! నాలుగు తన్నయినా పిల్లల్ని మంచిదారిలో పెట్టాలనేది మా పాలసీ!"

 Previous Page Next Page