ఆమెను ఎగాదిగా చూశాడు ఆయన. "అమ్మాయ్!" అన్నాడు ఆర్ద్రంగా.
"నేను ఇరవై ఎనిమిదేళ్ళుగా గవర్నమెంట్ చాకిరీ చేస్తున్నాను. ఎంతో జీవితం చూశాను. కాస్త పరిధిలోనే ఎన్నెన్నో రాజకీయాలూ, తడిగుడ్డలతో గొంతులు కొయ్యడాలూ, అవినీతి, అన్యాయం...ఫ్యూను పోస్టుకి కూడా ప్రముఖుల రికమండేషన్లూ... ఎన్నెన్నో చూశాను తల్లీ! కానీ నీతికోసం నిలబడే నీలాంటి వాళ్ళని మాత్రం చాలా తక్కువ చూశానమ్మా. మేగాడ్ బ్లెస్ యూ! నువ్వు ఎన్నుకున్న మార్గంలో నువ్వు నమ్మిన దారిలో ఎప్పుడూ తప్పటడుగు వెయ్యకుండా ఇలాగే దేవుడు నిన్ను నడిపించాలని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్!"
"థ్యాంక్యూ సర్!"
ఇంటికొచ్చేసరికి, తనకోసం ఎదురుతెన్నులు చూస్తున్న బాలూ కనబడ్డాడు.
"డ్యూటీలో చేరిపోయావా బ్యూటీ?"
"డ్యూటీలో చేరలేదు. కానీ చెయ్యవలసిన డ్యూటీ మాత్రం చేసి వచ్చాను."
అతను అర్ధంకానట్లు మొహం పెట్టాడు.
అతనేమనుకుంటాడో అన్నట్లు మధ్య మధ్య అతని కళ్ళలోకి చూస్తూ నెమ్మదిగా, వివరంగా జరిగిందంతా చెప్పింది సౌదామిని.
నోరు తెరచుకుని విన్నాడు బాలూ. తర్వాత పదాలకోసం తడుముకుంటూన్నట్లు అన్నాడు. "నువ్వు మామూలు మనిషివి కావు సౌదామినీ! నువ్వు నిజంగానే నా కోసం దివినుండి భువికి దిగివచ్చిన దేవతవి అయివుండాలి. కనీసం ఏదో మహత్తరమైన నవల పేజీలలో నుంచి ఈ అపాత్రున్ని చేరడానికి బయటికి వచ్చిన ఉదాత్తమైన పాత్ర అయి వుండాలి."
ఆమె నవ్వింది.
నవ్వుతూనే అంది. "ఉదాత్తమైన జీవితానికి దూరంగా రొచ్చుగుంట లాంటి కోటలో ఇరవై సంవత్సరాలు బ్రతికాను. మీ పుణ్యమా అంటూ ఇన్నాళ్ళకి అందులోంచి బయటకు వచ్చాను. ఇప్పుడైనా మనిషిగా బ్రతకనివ్వండి-"
"నువ్వు ఉత్తమనిషివంటే నేను నమ్మలేను."
"అవును! నేనిప్పుడు ఉత్తమమనిషిని కాను కదా?" అంది సౌదామిని నవ్వుతూ.
అంతలో బేబీ జాన్ కధాకళీ డాన్స్ లో విలన్ పాత్రలాగా హఠాత్తుగా ఎగిరి, దూకి రంగప్రవేశం చేస్తూ "నువ్వసలు మనిషివే కావు" అన్నాడు.
తోలుబొమ్మలా ఆడిపోతూ, కోపంతో ఊగిపోతూ అతను చెప్పిన మాటల సారాంశం ఇది.
పొరుగింటి వాళ్ళన్న అభిమానం కూడా లేకుండా ఉన్నవీ లేనివీ కల్పించి తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు.
"గవర్నమెంట్ వాళ్ళు యిచ్చే జీతం డబ్బులు ఎవరికీ సరిపోదు. వీళ్ళకి పైనేదో దొరక్కపోతుందా, వీళ్ళేదో కతక్కుండా ఉంటారా అన్న ఊహ గవర్నమెంట్ వాళ్ళకీ వుంది. అందుకే వాళ్ళు జీతాలు చాలినంతగా పెంచరు. ఎవడి ఏడుపు వాళ్ళని ఏడవనివ్వకుండా పనీపాటా లేని కొంతమంది (ఇక్కడ పనీపాటా లేకపోవడం అనే అంశాన్ని అతను నొక్కి మరీ వక్కాణించాడు) సత్య ప్రచారమే తమ జీవిత ధ్యేయం అన్నట్లు జీసస్ క్రైస్తులా ఫోజు పెడుతూ తమలాటి వాళ్ళకి ద్రోహం చేస్తూ వుంటారు."
చివరగా చెప్పాడు.
ఇది ఇంతటితో పోయేదికాదు. తనకి ఇంటి ఓనర్ దగ్గర బోలెడంత పలుకుబడి వుంది. ఆయన ఫోన్ బిల్లుల తాలూకు వ్యవహారాలు తఃనే చూస్తూంటాడు. తలుచుకుంటే తెల్లారకుండానే వీళ్ళని ఇంట్లోనుంచి గెంటించెయ్యగలడు.
అతను మాట్లాడుతున్నంతసేపూ సౌమ్యంగా విన్నది సౌదామిని. అతను వెళ్ళిపోయాక నెమ్మదిగా అంది, "ఉద్యోగం దొరికేదాకా కన్నీళ్ళు కారుస్తారు. కానీ ఉద్యోగం దొరికాక చెమట కార్చి పనిచెయ్యడానికి ఇష్టపడరు. చాలామంది కదూ?"
మొత్తానికి బేబీజాన్ రెండ్రోజులు తిరిగేలోపల ఇంటి ఓనరుకి చెప్పి, ఇల్లు ఖాళీ చేయించే విషయంలో కృతకృత్యుడయ్యాడు.
"కష్టాల పరంపర!" అన్నాడు బాలు. ఆ మాటలని నవ్వుతూ, సరదాగా అనాలని ప్రయత్నించాడు. కానీ అతనికి నవ్వు రావడం మానేసి రెండ్రోజులవుతుంది. వాళ్ళు భోజనం చేసి వారంరోజులు దాటుతోంది. ఇద్దరి మొహాలు నీరసంగా కనబడుతున్నాయి.
లేని ఓపిక తెచ్చుకుని, ఉన్న కొద్ది సామానులూ సర్దడం మొదలెట్టారు.
సర్దుతున్నారు సరే, కానీ వెళ్ళేది ఎక్కడికి?
తమదంటూ ఒక అడ్రసు లేకపోవడం ఈలోకంలోని అతిపెద్ద దౌర్భాగ్యాలలో ఒకటి కాబోలు!
సామాన్లు రిక్షాలోకి ఎక్కిస్తుండగా ఎదురొచ్చాడు ఒకాయన.
"హలో! నన్ను గుర్తుపట్టావా అమ్మా?" అన్నాడు నవ్వుతూ.
ఈయన్ని ఎక్కడ చూశానా అని ఒక్కక్షణం ఆలోచించింది సౌదామిని.
వెంటనే గుర్తొచ్చింది.
"మీది టెలిఫోన్స్ డిపార్ట్ మెంట్! అవునా? మీ దగ్గర ఇంటర్వ్యూకి వచ్చాను నేను."
"అవును సెలక్టు చేసినా ఉద్యోగంలో చేరకుండా వెళ్ళిపోయావు నువ్వు. ఆ తర్వాత నిన్ను గురించి వాకబు చేశాను. నేను వెదుకుతున్న మనిషివి నువ్వే అని తెలిసింది" అన్నాడు.
"కొంపదీసి ఇదేదో వారసత్వం మార్కు కథ కాదు కదా!" అనుకున్నాడు బాలూ జనాంతికంగా.
"మా అమ్మాయికి వీణ నేర్పించాలని అనుకుంటున్నానమ్మా! మంచి టీచరుకోసం వెతుకుతుంటే నీ సంగతి తెలిసింది."
ఆయన మొహంలోకే చూస్తోంది సౌదామిని.
"నెలకు రెండొందలయాభై ఇస్తానమ్మా! మా అమ్మాయికి వీణ నేర్పించు, నిజంగా విద్య కావాలి" అని వాళ్ళనీ, సామాన్నీ, రిక్షానీ తేరిపార చూసి "ఇల్లు ఖాళీ చేస్తున్నారా ఏమిటి?" అని అడిగాడు. "అవును. ఖాళీ చేయమన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు."
"మంచిది! మంచిది! మా వీధిలోనే గదిన్నర పోర్షను ఒకటి ఖాళీ అయింది. అక్కడ ఉండొచ్చు. మాకూ దగ్గరగా ఉంటుంది" అన్నాడు.
తమ చెవులను తామే నమ్మలేనట్లు వింటూ వుండిపోయారు బాలూ, సౌదామిని.
దీర్ఘంగా శ్వాస తీసుకున్నారు ఇద్దరూ.
అద్భుతాలు జరుగుతూనే వుంటాయి.
8
ఆరునెలలు గడిచిపోయాయి అలానే.
ఆ ఆరునెలల్లో అరవై ఏళ్ళకు సరిపడే అనుభవాలు!
ఒకరోజున అహమ్మద్ వచ్చాడు.
"ఈ పద్దతి బాగలేదురా! ఎన్నాళ్ళు ఇట్లా! గొర్రెతోకలాంటి జీవితం! నీ టాలెంట్ అంతా వేస్టయిపోవడం లేదూ!" అన్నాడు.
"వేస్టయిపోతోంది. ప్రతిక్షణం అదే ఆలోచిస్తున్నాను. ఏం చెయ్యాలో తోచడం లేదు. ఆ అగ్రిమెంట్ లో నుంచి బయటపడాలంటే బోంబే వెళ్ళి కోర్టులో ఫైట్ చేయాలి లేదా సత్యనారాయణ్ గాడి బార్ కి వెళ్ళి కుర్చీలూ, బల్లలూ తోసేస్తూ వాడితో ఫైటింగ్ చేయాలి. రెండూ జరిగేవి కావు."
కాసేపు ఆలోచించాడు అహమ్మద్. "నాకూ ఏమీ తోచడం లేదు."
చిరాగ్గా చూశాడు బాలూ.
మరికాసేపు నిశ్శబ్దం తర్వాత బాలూనే అన్నాడు.
"పోనీ ఇలా చేస్తే పోలా?"
"ఎలా?"
"వాడు మనల్ని ఏం చేశాడు?"
"మోసం!"
"మనమూ వాణ్ణి అదే చేద్దాం."
"ఏది?"
"చెప్తాను" అని లేచి నిల్చున్నాడు బాలూ. అతనికి ఒక్కసారిగా ఎక్కడలేని శక్తి వచ్చినట్లు అనిపిస్తోంది.
"ఎలా టాకిల్ చెయ్యబోతున్నావు సత్యనారాయణ్ ని?" అన్నాడు అహమ్మద్. అతను ఉత్సుకతని ఆపుకోలేకపోతున్నాడు.
గుంభనంగా నవ్వాడు బాలు.
"ఫియర్ ఈజ్ ద కీ! అంటే ప్రతివాడికీ ఏదో ఒక భయం ఉండి తీరుతుంది. దాన్ని ఎక్స్ ప్లాయింట్ చేసి దెబ్బకొట్టాలి మనం."
"సత్యనారాయణ్ గాడికి భయమేం ఉంటుంది?"
"చూడు అహమ్మద్!" అన్నాడు బాలూ సహనంగా. "నువ్వు నైట్ క్లబ్ నడుపుతున్నావనుకో! నీకు ముఫ్ఫయ్ ముగ్గురు గవర్నమెంట్ మొగుళ్ళు ఉంటారు. సవాలక్ష భయాలు వుంటాయి. పోలీసులు, మునిసిపాలిటీ వాళ్ళు, ఎక్సైజ్ డిపార్టుమెంటువాళ్ళు, ఎట్ సెట్ రా ఎట్ సెట్ రా! వాళ్ళలో ఏదో ఒక డిపార్టుమెంటు తాలూకు మనుషులమని చెప్పుకుని వాణ్ణి బెదిరించాలి."
"ఈ అయిడియా చాలా పాతదనుకుంటాను."
"పాతదే కావచ్చు. కానీ నిత్య నూతనం. ఏ రోజు పేపరన్నా తిరగెయ్యి. ఇలాంటి మోసగాళ్ళ విశేషాలు కనబడుతూనే వుంటాయి."
"బయటపడిపోతే?"
"ఎప్పుడూ, అందరినీ ఎల్లకాలం మోసపుచ్చాలనుకున్నప్పుడు తప్పకుండా బయటపడిపోతుంది. మనం అలాకాదు ఒక్కన్నే, ఒక్కసారే మోసం చేస్తాం. ఆ కాసేపూ ఒళ్ళు దగ్గరుంచుకుని నాటకమాడితే చాలు."
"ఎందుకైనా మంచిది. మీ ఆవిడకి చెప్పి చూడు."
"మా ఆవిడకి చెబితే వెంటనే వీటో చేసేస్తుంది. వద్దు. అంతా అయ్యాక చెబుదాం."
"వీటో అంటే ఏమిటి?"
"వీటో అంటే చెప్పేంత టైం లేదు. త్వరగా పద."
"ఎక్కడికి?"
"రామస్వామి దగ్గరికి."
రామస్వామి వాళ్ళ క్లాస్ మేట్. అతను రంగూ, రుచీ, వాసనాలేని నీళ్ళలాంటివాడు. ఏ గ్లాసులోపోస్తే ఆ గ్లాసు రంగులో రూపంలో కనబడే ద్రవం లాంటివాడు.
అతను బస్సు ఫుట్ బోర్డు మీద నిలబడి ట్రావెల్ చేస్తుంటే ఆర్టీసీ స్టాఫ్ అనుకుంటారు. రిజర్వుడు కంపార్ట్ మెంట్ లో ఎక్కితే ట్రావెలింగ్ టిక్కెట్ కలెక్టరనుకుంటారు.
అతనొకసారి స్కూటర్ మీద రాంగ్ సైడ్ వెళ్తుంటే ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్ అతని నల్లటి రూపాన్నీ, బిరుసు గడ్డాన్నీ, ఎర్రటి బూట్లనీ చూసి తోటి పోలీసు అయి ఉంటాడని పొరబడి వెళ్ళిపొమ్మన్నట్లు చెయ్యి ఊపాడు స్నేహంగా నవ్వుతూ.
రామస్వామికి చొరవపాలూ, ధైర్యంపాలూ కూడా ఎక్కువే. అతను ఎలాంటి పరిస్థితిలోనూ తొణకడు, బెణకడు.