సావిత్రి నవ్వి "నన్నడుగుతారు దేనికి? మీకు తెలియట్లేదూ?" అంది.
కుశల ప్రశ్నలూ కులాసా కబుర్లూ గబగబ గడిచిపోయాయి. గాలివాన గురించి అతని తండ్రి భోగట్టా చేశాడు. "అక్కడకూడా అంతే ఐదారురోజులు కారుమీద పోవడానికి వీలులేక చిదంబరంలో పెట్టేసి రైల్లో ప్రయాణం చేశాము" అని అంటూండగా ఆయన ముఖం నల్లబడిపోయింది.
"ఇదేమిటి? నువ్వెప్పుడొచ్చావమ్మా...." అన్నాడు కళ్ళు పెద్దవిచేసి.
సరోజిని తల దించుకుని గది గుమ్మందగ్గిర నిలబడింది. "అయిదారు రోజులైంది మామయ్యా! నేనూ, తమ్ముడూ వచ్చాము" అంది సన్నని కంఠంతో.
సావిత్రికళ్ళు క్షణంలో విచిత్రభావంతో మెరిశాయి. ఆ అమ్మాయిని సమీపించి ప్రేమగా దగ్గరకు తీసుకుని "చూసి చాన్నాళ్ళయింది. పెళ్ళికూతురిలా అయింది" అన్నది.
మాధవరావుగారు "ఆఁ ఆఁ" అన్నారు. "మరి అక్కడ కులాసానా అంతా -మీ అమ్మా వాళ్ళూ?"
సరోజిని తలవూపింది.
అమ్మ! శివనాథరావు గుండెలో ఏదో కెలికినట్లయింది. గదిలోకి నడిచాడు. అతని నేత్రాలు ఆర్ద్రమైనాయి.
పిన్ని తమ వ్యవహారం కనిపెట్టిందా అనుకున్నాడు. ఒకవేళ చూసిందేమో? అలా అయితే ఈ అనుతాపం భరించడం తేలికకాదే.
ఆ సాయంత్రమంతా ప్రయాణపు కబుర్లతో గడిచిపోయింది.
దక్షిణాది దేవాలయాలముందు యిటువైపున ఎందుకూ పనికిరాదన్నారు. కానయితే గలీజు ఎక్కువట. దేవాలయంలోంచి బయటకు రాగానే ముష్టివాళ్ళు ఎగబడి దుంప తెంచేసేవాళ్ళుట. మద్రాసుకన్నా మథురే నచ్చిందన్నారు. చిదంబరం దివ్యంగా వుందిట. అక్కడనుంచి ప్రతినెలా పూజాకుంకుమ ఇక్కడికి పంపటానికి డబ్బుకట్టి వచ్చారుట. గాలివాన వచ్చినప్పుడు వాళ్ళు చిదంబరంలోనే వున్నామనీ, యిక్కడ ఎలా వుందోనని భయపడి వైర్ యిచ్చామనీ చెప్పారు. తిరుపతికూడా వెళ్ళారు. అక్కడ కృత్రిమత్వం, మోసాలు జాస్తి. కాఫీ తీసుకువద్దామని రోడ్డువార కారు ఆపి, ప్రక్కనే వున్నా హోటల్ దగ్గర నిలబడి అక్కడున్న బల్లమీద ప్లాస్క్ పెట్టి, తల ప్రక్కకితిప్పి కాఫీ అని చెప్పి ఇటు తిరిగే లోగా ఫ్లాస్క్ కొట్టేశారుట.
"అందుకనే మనల్ని ఆక్షేపిస్తారు వాళ్ళు" అన్నాడు మాధవరావుగారు.
"ఎవరు?"
"మన డ్రైవరులాంటి వాళ్ళు, క్రిస్టియన్లు."
మన మతం ఇతరమతాల జోలికి పోదు. అనవసరంగా వాళ్ళ లోటుపాట్లను దుయ్యబట్టదు. మనకు ప్రచారం అవసరంలేదు. వాళ్ళకు కావాలి. అంచేత...
మనమీదా చెడు ప్రచారం చెయ్యటానికవకాశం యిస్తోంది మనమేగద! మనం దైవాన్ని నమ్ముతామని చెప్పుకుంటాం కానీ దైవానికి భయపడినట్లు కనిపించం. గర్భగుడిలోనే దొంగతనాలు చేస్తున్నాం.
"వాళ్ళు కొందరు వ్యక్తులు. హిందువులంతా వాళ్ళే కాదుగా?"
"వ్యక్తుల నైతిక ప్రవర్తనను బట్టేకదా-ఎవరైనా సమాజంలోగాని, మతంలోగాని ఘనతని నిరూపిస్తారు."
"అయితే మనుషుల నైతిక గుణాన్ని బట్టి మతాన్ని దూషిస్తుందంటారు ప్రజావళి?"
"ప్రస్తుతం జరిగేది అంతే అవసరం వచ్చినప్పుడూ, వాదన వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? "మా మతం గొప్పది" అని అందులోవున్న నీతిసూత్రాలను ప్రకటించి ఊరుకోవటంలేదు. కేవలం వివేకానందుడు, పరమహంస, రామతీర్ధ మావాళ్ళు. వాళ్ళద్వారానే మా ఘనత వాడవాడలా, దేశదేశాలా వర్ధిల్లింది అని గర్వంతో చాటుకోవటం లేదా?"
శివనాథరావు కొంచెం విరామంతో "నేనో విషయం చెబుతాను వింటారా?" అన్నాడు.
"అప్పటికి మనకింకా స్వాతంత్ర్యం రాలేదు. నేను చాలా చిన్నవాడిని కూడా. సెకండ్ ఫారమో ఏదో చదువుతున్నాను. ఆ రోజుల్లో కాంగ్రెసువాళ్ళూ, కమ్యూనిస్టువాళ్ళూ తన్నుకుంటూ వుండేవాళ్ళు. మనం అప్పుడు పాత ఊళ్ళో వున్న యింట్లో వుండేవాళ్ళం, ఇటు చరఖావాళ్ళూ వుండేవాళ్ళు. మన యిల్లు మార్జిన్. ఆ సమయంలో వాళ్ళుచేసిన అల్లర్లు, తన్నులాటలు మీకుతెలుసు. ఒకరిమీద ఒకరు పెద్ద పెద్దరాళ్ళు రువ్వుకుంటం, ఒకళ్ళ జెండాలు ఒకళ్ళు పీకెయ్యడం, ఎరుపు మార్కు ఆడవాళ్ళు వచ్చి వీళ్ళకళ్ళల్లో కారాలు జల్లటం - ఒకటేమిటి? వాళ్ళు చేసిన అత్యాచారాలకూ, ఆగడాలకూ అంతువుందా? మరి వీళ్ళు దేశోద్దారకులు వీళ్ళనుబట్టి ఆ పార్టీని దూషించగలమా మనం? మనలో మహానుభావులున్నారని ఘనత చాటించుకోవచ్చు. కానీ అందువల్ల జాతినే కీర్తించాలంటే అంగీకరించను. అట్లా చెప్పాల్సివచ్చినప్పుడు అప్రయోజకులు న్నందువల్ల అదే జాతిని విమర్శించాల్సి వుంటుంది."
ఆయన అసహాయంగా నవ్వి ఊరుకున్నాడు.
"రాత్రి భోజనాలదగ్గర సావిత్రి రమ్మని ఎంత బలవంతం చేసినా రాక పోతివి" అన్నది శివనాథరావుతో.
అతను ముభావంగా ఊరుకున్నాడు.
మాధవరావుగారు "అయితే ఏంలే? లైఫ్ శ్పాన్ చాలా వుంది. మీ ఫ్రెండ్స్ అంతా కలిసి వెడుదురుగాని" అంటూ అతనికి లేని విచారానికి ఊరడించేశాడు.
యాత్రలనుంచి తిరిగివచ్చారని తెలిసి యిరుగుపొరుగు కొంతమంది వచ్చి ఆయన్తో సంభాషిస్తూ కూర్చున్నారు క్రిందహాల్లో సావిత్రి, సరోజినీ లోపల ఓగదిలో ఏదో మాట్లాడుకుంటూ పడుకున్నారు. శివనాథరావుకు మనసులో కొంచెం భయంగా వుంది. ఈ యింటికివచ్చి ఎనిమిదేళ్ళయింది పిన్ని తనకన్నా రెండుసంవత్సరాలు పెద్ద. తననిచూచి నవ్వింది. కానీ ఆమాటే అతనికి భయం కలిగింది. క్రమంగా చనువయింది. తన తల్లిలేని లోటు ఆమె తీరుస్తుందని ఏమీ కలలుగనలేదు. ఆ కోరికాలేదు. ఒకరంటే ఒకరికి అభిమానం వుంది. పోనీ అనురాగం. కానీ అందులో ఆర్ద్రతలేదు. అతనికి జబ్బుచేస్తే ఆమె సపర్యలు చేసింది. కానీ ఇద్దరిమధ్యా వున్న ఆ కాస్తదూరం ఎందుకో నశించిపోలేదు. ఇద్దరిలో కఠినత్వం కాస్తకాస్త వుందేమో.
సరోజినీవాళ్ళ కుటుంబమంటే పిన్నికి సదభిప్రాయం లేదని అతనికి తెలుసు. కారణంలేని వైరభావం. ఈ కారణంగల భావాలుకంటే, కారణం లేని భావాలే బలంగా వుంటాయి ఎందుచేతనో అతనికి పిన్ని అర్ధంకాలేదు. కష్టంకూడా.
సావిత్రి తన నిరసనభావం చేష్టలద్వారా, భంగిమలద్వారా బయటకు ప్రదర్శించదు. అది ఆమె ప్రత్యేకత, ఆకర్షణ, సహజగుణం.
* * *
మరునాడు అతను నిద్రలేచేసరికి వీధిలో ఏదో గలాటా వినబడింది. పిట్టగోడ దగ్గరకు వచ్చిచూశాడు. జనం చాలామంది గుమిగూడి వున్నారు. గుడిపూజారి గలాభాలో చాలా ప్రాముఖ్యత వహిస్తున్నట్లు అంత జనసందోహం లోనూ ఆయన పిలక అటూ యిటూ వేగిరం కదుల్తుండడం బట్టి బోధపడింది. గేటు అవతలగా మాధవరావుగారు నిలబడి విడ్డూరం పరికిస్తున్నారు. శివనాధరావు గబగబ క్రిందకుదిగి తండ్రిప్రక్కన నిలబడి చోద్యం చూడసాగాడు.
పూజారిగారూ, ఆ యింటికి రెండుమూడు ఫర్లాంగుల దూరంలోవున్నా ఇద్దరుముగ్గురు కట్టెల అడితీ వ్యాపారులూ ప్రముఖపాత్ర వహించారు. మాధవరావుగారు కొడుకువంక తిరిగి ఓ చిరునవ్వు నవ్వి మళ్ళీ ఆ దృశ్యాన్ని తిలకించాడంలో నిమగ్నమయ్యారు.
"అన్యాయమండీ అన్యాయం. మళ్ళీ తెల్లవారిలేస్తే వుండేది దేముడిప్రక్కనే, చేసేవన్నీ అలగా పనులు" అని ఓ అడితీ యజమాని దులిపేస్తున్నాడు.
"ఓ జందెంపోగు తగిలించుకుని, తలకి పిలక పెట్టుకుంటే సరిపోయిందా అంట?"
బుర్రమీసాల అడితీ యజమాని చుట్టపొగ గమ్మన వొదిలేసి, రొమ్ము విరుచుకుని "ఛీ ఏం పనయ్యా చేసేది? బుద్దీ, జ్ఞానం వున్నోడు అటువంటి పనిచేస్తాడా అంట? చెప్పేది శ్రీరంగనీతులు, అంతా పెద్ద మనుషులే! ఆహా ఏం దరమమయ్యా దరమం" అని చప్పున ముందుకువచ్చి, మాధవరావుగారి దగగ్ర వినయంగా వొరిగి నిలబడి?" చూడండిబాబూ! మీరే చెప్పండి న్యాయం" అన్నాడు.
ఆయన సంకటంలో యిరుక్కున్నట్లు మధనపడి 'నన్నెందుకు బాబూ మధ్యలో యిరికిస్తారు? మీ యిష్టం ఎలావుంటే అలా కానీయండి' అన్నాడు.
ఈ సమయానికి పూజారి వాళ్ళను సమీపించాడు. మనిషి కొద్దిగా వణుకుతున్నాడు. అయినా పెంకిఘటం కావడంవల్ల తమాయించుకుంటున్నాడు.