Previous Page
పాప నవ్వింది పేజి 16

                                 

 

                                      8
    కమల వచ్చినప్పటి నుంచి శ్రీపతి తన గదిలో దాక్కున్నాడు బైటికి రాకుండా. ఇప్పుడు నిద్రపోతున్నారని తెలిసి మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వచ్చాడు.
    పాప కదలటం తో మేల్కొన్న కమల అరవిచ్చిన కనులతో వుంది. శీపతిని చూడగానే నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకు పడుకుంది. ఏం చేస్తాడా అని. శ్రీపతి ఎక్కడ ఏమౌతుందో అని పిల్లి అల్లే నడుస్తూ వచ్చాడు. రెండు నిమిషాలు వాళ్ళిద్దరిని తనివితీరా చూశాడు. రాజేశ్వరిల్లేనే అంటీ అంటనట్లు వాళ్ళిద్దరి తలలు స్పృశించాడు. రెండు క్షణాలు అలానే నుంచుని బైటి కొచ్చాడు.
    కమలకి కలో నిజమో తెలియలేదు. చుట్టూ పక్కల చూసింది. పక్కలో పాప నిద్రపోతూ కనపడ్డది. ఇది కల కాదని దృవ పడ్డది. నిజమే శ్రీపతి తన తల ఆప్యాయంగా పాపతో పాటు తాకాడు. అంతే కాకుండా క్షమాపణ కోరినట్లు అతని ప్రవర్తనే చెబుతున్నది. కమలకి ఆ క్షణాన మనసులో కరుడు కట్టిన ఆవేదన, బాధ దుఖం అన్నీ కదిగేసినట్లు మాయమైనై. ఆనందం పరవళ్ళు తొక్కింది. సంతోషం కట్టలు తెంచుకుంది. శ్రీపతి తను అనుకున్నట్టు, వాళ్ళ అమ్మ చెల్లెలూ చెప్పినట్లు మంచివాడే. ఒక క్షణాన ఏదో వుద్రేకపడ్డాడనుకుంది. తెలికపడ్డ మనస్సుతో హాయిగా నిట్టూర్చి పాపనింకా దగ్గరికి తీసుకుని పడుకుని నిద్రపోయింది.
    మళ్ళీ పాపని చూట్టానికి వచ్చిన రాజేశ్వరి వాళ్ళ ముఖాల్లో కనపడే అ ఆనందపు వెలుగుకి ఆశ్చర్యపడ్డది. శ్రీనివాసరావు గారికి చెప్పడం విని శ్రీపతి కూడా ఎవ్వరూ చూడకుండా వచ్చి తృప్తిగా అవతలి కెళ్ళాడు.
    రెండు రోజుల్లో పాప కమల ఇద్దరూ లేచి మళ్ళీ ఇల్లంతా తిరగటం మొదలెట్టారు. పాప అరుపులకి నవ్వులకి అంతులేదు. ఇల్లు మళ్ళీ వాళ్ళ ఆటపాటలతో ప్రతిధ్వనిస్తోంది.
    శ్రీపతికి మాత్రం మళ్ళీ కమల వెళ్తుందేమోనని దిగులు పట్టుకుంది. గదిలో వొదిగి వొదిగి కూర్చుంటున్నాడు. ఈమూడు రోజుల్నించి.
    రాజేశ్వరి కి దీంతో శ్రీపతికి వొంట్లో బాగాలేదేమోనని అనుమానం వచ్చి చూట్టానికి వెళ్ళింది. మంచం లో పడుకుని శూన్యంగా చూస్తున్నాడు.
    రాజేశ్వరికి అప్పటి దాకా శ్రీపతంటే మొన్నటి సంఘటనతో పేరుకుని వున్న కోపం గాలిలో ఎగిరిపోయింది. 'ఏం బాబూ' అంటూ ఆప్యాయంగా నుదుటి మీద చెయ్యి వేసింది. శ్రీపతి ఆ చల్లని చేతిని పట్టుకుని 'అమ్మా మొన్నటి నా పని క్షమించరానిదేనమ్మా నేను చెప్పలేనంత వ్యధ పడ్డాను. నేనిక్కడ వుంటే కమల వుండకపోతే నేను మళ్ళీ విదేశాలకి వెళ్తానమ్మా. నువ్వు కమలకి చెప్పు మాధురిని వదలి పోవద్దని.' అంటూ వుండగానే అప్పటివరకు నిగ్రహించుకున్న కన్నీళ్ళు పక్కలకి పొంగినై.
    కొడుకు మనసు తల్లికి అవగతం అయింది. మెల్లగా చెంపలు తుడుస్తూ 'పిచ్చి వాడా నీసంగతి నాకు తెలియదుట్రా' నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ముందు నాకు మాటివ్వు ఎక్కడికీ వెళ్ళనని' అని చేతిలో చెయ్యి వేయించుకుంది. 'కమల మనసు వెన్న బాబూ. అంతటి మంచి మనిషి నూటి కొకళ్ళు వుంటారు. పాపంటే ప్రాణం పాపా కోసం వుంటుంది లే నాయనా, నేనూ చెప్తాను. కాని నువ్వు కూడా కమలతో ఒక సారీ మాట్లాడు బాబు.'
    'నన్ను క్షమించలేదమ్మా కమల కూడా ' అని నిరాశగా చూశాడు.
    'లేదురా బాబూ ఆడవాళ్ళ మనసు నీకు తెలియదు . కమల నిన్ను క్షమించగలదనే నే ననుకుంటున్నా. నువ్వు అడిగి చూడు.'
    ఆరోజే కమలతో 'అదుగో కమలా  పాప ఆడుతున్నది కదా అని ఎక్కడి కైనా వెళ్దాం అనుకుంటున్నావేమో, ఈ తడవ కార్లో పంపించకపోగా , కాళ్ళు చేతులు కట్టేసి తాళం పెడతా ఏమనుకున్నావో . పిల్లకి అంత ఆపద గడిపావు. ఇంక నువ్వు గడప దాటటానికి వీల్లేదు.' అంటూ ఎవరికి 'శ్రీపతి కూడా చాలా బాధపడుతున్నాడమ్మా తనతో పాటు ఈ ఇంట్లో వుండటం నీ కిష్టం లేకపోతె తను మళ్ళీ విదేశాలకి పోతానంటున్నాడు.' అంటూ కంట తడిపెట్టింది రాజేశ్వరి. కమల మాట్లాడకుండా విని వూరుకుంది.
    ఆ మర్నాడు కమల కొలను పక్కన కూర్చునుంది పాపని నిద్ర బుచ్చి. శ్రీపతి మెల్లగా వెళ్ళాడు. అక్కడే కొంచెం  దూరంలో కూర్చున్నాడు. మెల్లగా, 'కమలా నన్ను క్షమించమనటానికి కూడా నాకు హక్కులేదు. నేను క్షమించరాని విధంగానే , రాక్షసత్వం అనేకన్నా పశుత్వం తో ప్రవర్తించాను. నిజమే . కాని నేను పశ్చాత్తాపంతో కుమిలి పోతున్నాను. నిన్ను నేను చాలా విధాలుగా అవమానించాను, నాతప్పు నాకు తెలుసు!' కమల మౌనంగా వింటున్నది.
    'నిన్ను ఇప్పుడు అనవసరంగా మాట్లాడిస్తున్నా వనుకుంటాను. కాని ఎక్కువ సేపు నీ సమయం వ్యర్ధం చెయ్యను. నీకిప్పుడు చెప్పాలనుకునేది, పాపకి తల్లివి, తండ్రివి కూడా నీవే ఇక. నాకోసం నువ్వు దానికి దూరం కావద్దు. దాన్ని మళ్ళీ అనాధని చెయ్యొద్దు. నిన్ను తల్లిగా దాని మనసులో నిలుపుకుంది. అట్లాగే నిలిచిపో. రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచినై.
    'నాతోపాటు ఈ ఇంట్లో వుండాలని భయపడొద్దు. నేను మళ్ళీ రెండు నెలల్లో విదేశాలకి వెళ్తాను. నువ్వు ఈ నెలా రెండునెల్లు ఎట్లాగో భరించు. నేను వీలైనంతవరకు నీ కంట పడకుండా తిరుగుతాను.
    'కాని ఒక్కసారి నన్ను చాతనైతే క్షమించమని అడుగుతున్నాను. ఆ తృప్తి ఐనా నాకు మిగిలితే ఎక్కడి కైనా వెళ్తాను. విదేశంలో వున్నా నా పాపను ప్రేమగా చూసుకునేవ్యక్తీ నొకళ్ళున్నారన్న ధీమాతో , ఆ మనిషి నన్ను ద్వేషించటం లేదన్న నమ్మకంతో బతుకుతాను. అంటూ కొంచెం సేపు కమల ముఖంలోకి చూశాడు. ఏ భావాలు తెలుసుకోలేక ఆగి మళ్ళీ మొదలు పెట్టాడు.

                                       
    'నా కధంతా పుటుక నించి ఇప్పటి దాకా నీకు చెప్తాను. అంతా విని శాంతంగా నీకెట్లా అనిపిస్తే అట్లా చెయ్యి' అంటూ రాజేశ్వరి చెప్పిందే ఇంకా విపులంగా చెప్పాడు.
    'నా తండ్రిని చూసినాక నా తల్లిని తండ్రితో పోల్చి చూశాను. స్త్రీలోని గొప్పతనం , సహనం, వోర్పు ఆత్మాభిమానం , ప్రేమ వున్నై అన్న నమ్మకంతో పెరిగాను. స్త్రీని ఒకదేవతగా చూశాను. నా తల్లీ , చెల్లెలు నా సరవస్వం అనుకున్నాను. ఆ నమ్మకంతో వున్న నేను ఆశ ఎటువంటిదో తెలుసుకోలేక , మనసారా నమ్మాను. మనుషుల్లో , అందులో స్త్రీలలో ఇట్లాంటి ద్రోహులుండకలరన్న వూహ కూడా నాకు తట్టలేదు.
    'ఆశ చేసిన మోసం నన్ను కుదుళ్ళతో కదిలించింది. స్త్రీ అంటే నమ్మకం వమ్ము చేసింది. స్టీ అంటే వుండే పవిత్రభావం పోయి ద్వేషం, అసహ్యం కరుడుగట్టినై. విదేశాల్లో తటస్తపడ్డ సంఘటనలు కూడా ఈ కొత్తభావాన్నే దృడం చేసినై.
    'ఇంటికొచ్చాకా నిన్ను చూస్తె అనుమానం వేసేది. నీ ప్రవర్తన నమ్మటానికి శక్యం కాకుండా వుండేది నాకు. జీతం తీసుకుని పనిచేసే నీకు పాప మీద అంత ప్రేమ మమత యెట్లా వుంటుందనుకునే వాడిని. అదంతా వంచిస్తున్నా వనుకున్నాను. పసిపిల్లని, పెద్దలనీ వంచిస్తున్నా వనుకున్నాను. పాపా, అమ్మా, నీరజ ఆఖరికి శ్రీనివాసరావు గారు, పనివాళ్ళు కూడా నిన్నభిమానించటం నా కర్ధం కానిధై, సహించలేక పోయినాను. నా నమ్మకానికి గొడ్డలి పెట్టుగా తోచింది. మనసు శతబిదాల చెప్తున్నా నమ్మకూడదనుకున్నాను నిన్ను.'
    'నువ్వు కూడా ఆశ అల్లేనే ఏదో కుట్రలో నాటకం ఆడుతున్నా వనుకున్నాను. మోసం వుంది, నీలో అనే నమ్మాను. అందుకనే నీ ప్రతి కదలిక, ప్రతిచర్య నడవడి, పని గట్టుకుని అన్ని వేళ్ళల్లోనూ పరీక్షించాను. చిన్న లోపం కోసం కాపెసుకు కూర్చున్నాను.
    'కాని నువ్వు వీటన్నింటికి అతీతంగా ఎప్పుడూ శాంతంగా ఆనందంగా అందర్నీ సంతోషపరుస్తూ పాప మనసులో పీఠం వేసుక్కూర్చున్నావు. నీ ఆప్యాయతతో అది అన్ని మర్చిపోయి నిన్ను తల్లి స్థానంలో నిలుపుకుంది- ఇది నాకు సహించరానిదైంది. నువ్వు దేవతగా కనిపించావు. కాని అంగీకరించలేకనే ఎదురు తిరిగాను.
    'నా పాప నాకు పరాయిది కావటం నేను భరించలేక పోయినాను. నన్ను 'బూచి' అంటూ నీ దగ్గర చేరే పాప నా అహం మీద దెబ్బ తీసింది. నీలో ఏ లోపం దొరక్క ఏమీ చెయ్యలేక అక్కసుతో నిన్ను చాతైనంత అవమానించాను. నానా మాటలు అన్నాను. కాని నువ్వు ఏనాడు తొందరపడలేదు. ఒక్కసారి తప్ప. నీ ఆ సమాధానం నన్ను ఇంకా రెచ్చగొట్టింది.'
    'నిన్నెట్లానైనా వంచాలని వద్దనుకుంటూనే నిన్ను గమనించాను. నీ ప్రతి కదలిక చదివాను, దీని పర్యవసానంగా వద్దనుకుంటూనే నీ వైపు ఆకర్షించబడ్డాను. ఆశ చేసిన గాయం మానని పుండై నలిపింది. నీ ఆకర్షణ ని ఆశ జ్ఞాపకాలతో విచ్చిన్నం చెయ్యటానికి ప్రయత్నించాను. కాని నీదే పై చెయ్యి అవుతున్నది. నీ ఆకర్ధణకి నేను లొంగి పోయేట్టు వున్నాను.
    'ఆఖరి ప్రయత్నంగా నీ కెదురు నిలవటానికి ప్రయత్నించాను. అదే సమయంలో ఆశ వచ్చి నా మనసుని ఇంకా ముక్కలు చేసింది. కాని నువ్వు ఆశతో అన్న మాటలతో నువ్వు నిజంగా దేవతగానే కనిపించావు. నిన్నందుకనే సంతోషంతో పోగిడాను. కాని చివరికి పాప మాటలతో అమ్మ అన్నట్టు నాలో రాక్షసత్వం విజ్రుంభించింది. ఆవేశంలో నీమీద చెయ్యి చేసుకున్నాను. కాని నువ్వు దేవతవనే అనుకుంటున్నాను. నువ్వు క్షమించినా, క్షమించకపోయినా ఇప్పటి నా అభిప్రాయం మాత్రం ఎప్పటికీ మారదు. ఇప్పటికే నిన్ను చాలా విసిగించాను. నువ్వు ఎప్పటికీ సుఖంగా వుండాలి' అంటూ లేచాడు.
    మాటా పలుకూ లేకుండా అంతా విన్నది కమల. అట్లాంటి శ్రీపతి అన్ని మర్చిపోయి తన దగ్గర తప్పు లోప్పుకుని క్షమించమని అడగటమే వింతగా కనిపించింది. కాని రాజేశ్వరి శ్రీపతిని గురించి చెప్పిన మాటలు, పనివాళ్ళ పొగడ్తలు జ్ఞప్తికొచ్చి ఇది సహజం గానే కనిపించింది. కమల మెల్లగా తలెత్తి చూసింది.
    'కూర్చోండి . మీ మాటలు నాలో మిగిలి వున్న ఆవేదనని, అవమానాన్ని బాధని తుడిచినై. మీపట్ల నాకెప్పుడూ సానుభూతి, జాలే కాని కోపం లేదు. ఇప్పుడు మీరు చెప్పింది విన్నాక ఆ అభిప్రాయం ఇంకా బలపడ్డది. మీమీద నా కెలాంటి ద్వేషం , శతృత్వం లేదు. నాకోసం మీరు ఏ దేశాలు వెళ్ళనక్కరలేదు. పంచ ప్రాణాలు మీ మీద పెట్టుకుని వున్న మీ తల్లిని మరవకండి. ఒక్కరే ఏం చేస్తారు? ఇంక పాపకి కన్నతల్లి ఎటూ లేదు. వున్న తండ్రి మీరు దూరం కావద్దు. పసిది , దానికి మీరంటే ఇష్టమే భయం తప్ప. ఆ భయం పోగొట్టండి . మీ పాపే అవుతుంది. ఇంక నా క్షమ అంటారా ఇది మీరిక్కడ సంతోషంగా వుంటానికి అంత అవసరమైతే నే తప్పకుండా క్షమిస్తాను?
    ఆ మాటలకి శ్రీపతికి కళ్ళ నీళ్ళు తిరిగినై. కమల చేతులు అమాంతం పట్టుకుని ' చాలు కమలా . అంతమాత్రం చాలు.' అన్నాడు. కమల సిగ్గుగా చేతులు లాక్కుంది.
    'కమలీ , దొంగా ఇక్కడున్నావా ' అంటూ పాప పరిగెత్తుకొచ్చింది. శ్రీపతి చేతులు జాపినా కమల దగ్గరికి పరిగెత్తింది పాప. అది చూసి చిన్నబుచ్చుకున్న శ్రీపతి ని చూసి కమల 'నాన్న దగ్గరికి పొమ్మా' అంటూ పంపింది.
    పాప నెత్తుకుని శ్రీపతి నడుస్తుంటే, కబుర్లు చెప్తూ పాప శ్రీపతిని, కమలని నవ్విస్తున్నది. హుషారుగా కలిసి వొస్తున్న ముగ్గురిని చూసి రాజేశ్వరి విభ్రాంతురాలైంది. ముఖం సంతోషంగా విప్పారింది.
    కమల శ్రీపతి స్నేహంగా మాట్లాడుకోవటం చూసిన ఇంట్లో వాళ్ళు తృప్తిగా నవ్వుకున్నారు. ఇప్పుడు శ్రీపతి మునపటిల్లె నలుగురి మధ్యలో తిరుగుతూ అందర్నీ నవ్విస్తూ , నవ్వుతూ ఆనందంగా ఉంటున్నాడు. రాజేశ్వరి మనసు సంతోషంతో తేలుతున్నది. శ్రీనివసారావు గారు స్థిమిత పడ్డారు. ఇక గట్టున పడ్డారు అన్నట్లు తిరుగుతున్నారు. పనివాళ్ళు గట్టిగా గాలి పీలుస్తున్నారు. బాబూ, బాబూ అంటూచుట్టుకు చుట్టుకు తిరుగుతున్నారు. కావాల్సినవన్నీ చెప్పకముందే వుత్సాహంగా చేసుకుపోతున్నారు.
    పాప, శ్రీపతి, కమల కలిసి ఆడుతున్నారు, పాడుతున్నారు. నీరజకి చిన్నప్పుడు సంగీతం నేర్పుతుంటే పక్కన తోడుగా కూర్చునే శ్రీపతి కూడా పాడేవాడు. 'అమ్మాయి కన్నా అబ్బాయి బాగా పాడతాడమ్మా.' అనేవాడు మాస్టారు రాజేశ్వరితో. ఇప్పుడా పాటలన్నీ కూనిరాగాలు తీస్తున్నాడు. కమల ఫిడేలు సాధన చేసుకుంటుంటే అవతల నించి వినేవాడు.
    ఒకరోజున నగుమోము వాయించటం విన్న శ్రీపతి కలిసి పాడటం మొదలెట్టాడు. తన రాకను గుర్తించి ఆపిన కమలని వాయించమంటూ, ఇన్నాళ్ళకి ఈ ఇంట్లో ఆనందం పండుతున్నదనుకున్న రాజేశ్వరి వీళ్ళ పాట విని ఆనందాశ్రువులు తుడుచుకుంటూ అవతలి కెళ్ళింది.
    ఈ సమయంలో కమల మేనమామ తనకి వంట్లో బాగుంటం లేదని కమలని పని మానేసి రమ్మని రాశాడు. ఈ వార్త ఇంట్లో ఎవ్వరికీ నచ్చలేదు. పాప వొద్దంటే వొద్దంది. రాజేశ్వరి ఏమనటానికి తోచక 'ఏం చేద్దాం కమలా' అంది. శ్రీపతి ఏమంటాడో అనుకున్న కమల కి శ్రీపతి మౌనం అర్ధం కాలేదు.
    ఆరోజు పాప కమల వదల్లేదు.
    పాప ట్యూషన్ కి వెళ్ళినప్పుడు శ్రీపతి 'కమలా నీతో మాట్లాడాలంటూ తోటలోకి తీసికెళ్ళాడు. కొలను గట్టు మీద కూర్చున్నారు మాట్లాడుకోకుండా.
    'మీ మామయ్యకి బాగాలేదని వుత్తరం వచ్చింది కదా వెళ్తావా' అన్నాడు కొంత సేపటికి శ్రీపతి మెల్లగా.
    'మరి వెళ్ళకపొతే ఎట్లా?'
    'నేనొకటి చెప్తా ఏమీ అనుకోవు కదా?'
    చెప్పమన్నట్లు చూసింది కమల.
    'మీ మామయ్య నిక్కడి తీసుకొచ్చి వైద్యం చేయిస్తే?'
    'అదేమిటి? మామయ్య ఇక్కడి కెట్లా వస్తాడు? ఎందుకు వస్తాడు?'
    'అంత ఆశ్చర్యం దేనికి? ఏం మేనగోడలింటికి రాకూడదా? నువ్వు నన్ను అనుగ్రహిస్తే ఇది నీ ఇల్లే అవుతుంది.... ఇప్పుడే ఏమీ అనకు కమలా. మెల్లగా ఆలోచించు. తొందరేమీ లేదు నీ వొప్పుకుంటే నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తాను. పాప సంగతి చెప్పక్కర్లేదు కదా. అమ్మ కూడా కాదనదు. ఈ జీవితంలో ఇప్పటికైనా నిజమైన ఆనందాన్ని సుఖ సంతోశాలనీ అనుభవించనీ నన్ను. బలవంతం ఏమీ లేదు. నీకు సంపూర్ణ అంగీకారామైతేనే సమాధానం రేపు చెప్పు.'
    ఇంతలోకి పాప రావటంతో ముగ్గురూ లోపలికెళ్ళారు. లోపలి కెళ్ళగానే రాజేశ్వరి 'కమలా మీ ప్రభాకరం మామయ్యకి బాగాలేదుటమ్మా. టెలిగ్రాం వచ్చింది. మరి వెళ్ళి నాలుగు రోజుల్లో వస్తావా' అన్నది.
    పాప 'కమలీ నువ్వెళ్ళద్దు నేను వస్తాను' అని ఏడుపు మొదలెట్టింది.
    కమల పాప నెత్తుకుని మెల్లగా 'లేదమ్మా నేను మళ్ళీ ఎల్లుండి కల్లా తాతయ్య ని తీసుకుని వచ్చేస్తా మాధురీ' అన్నది.
    అది విన్న శ్రీపతి ఆనందంతో ఉక్కిరిబిక్కిరైనాడు. వెలిగిపోతున్న ముఖంతో 'అమ్మా నేనూ కమలీ వెళ్ళి ప్రభాకరం బాబాయిని తీసుకొస్తాం. ఇక్కడే మందిప్పిద్దాం. 'ప్లేన్ లో వెళ్తాం' అని 'కమలీ త్వరగా రెడీగా' అంటూ అవతలి కెళ్ళాడు.'
    రాజేశ్వరి ముఖంలో ఆశ్చర్యం ఆనందం ఒకదానితో ఒకటి పోటీ పడినై. ఆనందమే గెలిచింది. వెయ్యి దీపాలు వెలిగించినంత కాంతి ముఖంలో విరిసింది. సంతోషంతో కమల చేతులు పట్టుకుని ' నిజమా కమలా శ్రీపతి అన్నది, నీది పసిడి మనసు తల్లీ. ఈ ఇంట్లో మళ్ళీ వెలుగు నింపు. వెయ్యేళ్ళు వర్దిల్లమ్మా' అంటూ వంగి నమస్కారం చేస్తున్న కమలని లేవనెత్తి దగ్గరికి తీసుకుంది.
    పాపకి నచ్చచెప్పి వాళ్ళిద్దరూ వూరికి కెళ్ళారు. ఈలోపల నీరజని రమ్మని టెలిగ్రాం ఇప్పించింది రాజేశ్వరి. ప్రభాకరం గారితో దిగిన కమలా శ్రీపతులకి పాపా నీరజా సంబరంగా స్వాగతం చెప్పారు. నీరజ కమలని వాతెసుకున్నంత పని చేసి 'గడుసు దానివి కమలీ , మా ముళ్ళ పందిలాంటి అన్నయ్యని మచ్చిక చేసి సాధువిని చేశావ్' అన్నది.
    'నాదేముంది నీరజా నన్ను తూట్లూ పడేట్లు పొడిచి మీ అన్నయ్యే రాల్చుకున్నారు ముళ్ళన్నీ.'
    శ్రీపతి , కమలా ప్రభాకరం గారి కంతా చెప్పి వొప్పించి తీసుకొచ్చారు ఆయనకీ కాస్త నేమ్మదించాక 'ఏం బావగారు ఎప్పుడు ముడిపెడదాం వీళ్ళిద్దరికి,' అన్నది రాజేశ్వరి.
    'దందేముందమ్మా. అమ్మాయ్ ఎప్పుడంటే అప్పుడే.'
    అ నెల్లోనే వాళ్ళకి వైభవంగా పెళ్ళి చేశారు. నీరజా, పాప సంతోషం పట్టలేక పోతున్నారు. శ్రీనివాసరావు గారు కమలతో ఏమ్మా అత్తగారిని నువ్వు మొదటిరోజు చూసే ఎన్నుకున్నావు. ఇప్పుడు భర్తని ఎన్నుకున్నావు. శృతి కలిసిన వీణలల్లే వుండాలి మీరిద్దరూను. కాని అమ్మాయ్ అప్పుడు నీతో వోప్పుకున్నట్టుగా, నీకిష్టం లేదంటే మాత్రం ఇప్పుడు పంపించం తెలుసా. మూడుముళ్ళు వేసి కట్టేశాడు మా శ్రీపతి నిన్ను' అనటంతో అందరూ సంతోషంగా నవ్వుకుంటూ వాళ్ళని ఆశీర్వదిస్తూ లేచారు.
    అమ్మనీ, నాన్ననీ పక్క పక్కన చూసి సంతోషం పట్టలేక పరవశిస్తూ పాప నవ్వింది.

                              ---అయిపొయింది---

 Previous Page