"చాలా హ్యాపీగా ఫీలవుతున్నా! నన్నడిగితే- ప్రతి కొడుకూ కోడలూ కూడా ఇలాగే ప్రాబ్లెమ్స్ క్రియేట్ చేసే తల్లిదండ్రుల్ని నిర్దాక్షిణ్యంగా ఇంటినుంచి బయటకు గెంటాలి! పాపం రాజేశ్వర్ భార్య ఛాయను ఈ ముసలోడు, ముసల్దీ ఎంత నరకయాతన పెడుతున్నారో మనాళ్ళందరికీ తెలుసు అసలు వీళ్ళను సజీవంగా దహనం చేసినా పాపం లేదు-"
"ఇదీ వెంగమాంబా! ఈ అపార్ట్ మెంట్స్ లోని యంగ్ గాళ్స్ అభిప్రాయం-"
"మరి వయసు మళ్ళిన స్త్రీల అభిప్రాయం ఏమిటి రాజు?"
"ఇప్పుడే అసొసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మంగతాయారు గారిని ఆ విషయం అడిగి తెలుసుకుందాం. గుడ్ మాణింగ్! మంగతాయరుగారూ! రాజేశ్వర్ సమస్య విషయంలో మీరెలా ఫీలవుతున్నారు?"
"ఇదంతా బరితెగించిపోతున్న కోడళ్ళ నియంతృత్వం! పెళ్ళాం చెప్పుడు మాటలు విని, తల్లిదండ్రుల్ని చిత్రహింసలు పెడుతున్న పాపం ఈ కొడుకులదే అని ఖచ్చితంగా అంటాను- నేటి కోడళ్ళే రేపటి అత్తలు అన్న కామన్ సెన్స్ వాళ్ళకుంటే ఈ సమస్యలు తలెత్తవు"
ఆమె డైలాగ్ పూర్తిగాకుండానే ఓ కోడలు కెమెరా ముందుకు దూసుకొచ్చింది.
"అలా ఎందుకనుకోవాలి? నేటి అత్తలే నిన్నటి కోడళ్ళు అనుకుంటే ఏ సమస్యా ఉండదుగా"
"కోడళ్ళబుద్ధి మంచిదైతే ఏ సమస్యలూ రావుగా"
"మీ అత్తలకు పక్షపాత రోగం లేకుండా ఉంటే బాగుంటుందిగా! కూతురూ అల్లుడూ అనేసరికి- అల్లుడు కూతురి మాటే వినాలి! కొడుకూ కోడలూ అనేసరికి- కొడుకు పెళ్ళాం మాట ఛస్తే వినకూడదు- ఈ నికృష్టమయిన బుద్ధి వల్లే గొడవలు"
"చూశావ్ కదా వెంగమాంబా! అత్తా కోడళ్ళ రిలేషన్ షిప్ విషయంలో అభిప్రాయభేదాలు చాలా ఘాటుగా ఉంటున్నాయ్.
"ఎవరెన్ని చెప్పినా, ఈ రోజుల్లో మానవత్వం మరుగున పడిపోతోందని అందరూ ఫీలవుతున్నారు రాజు! అత్తమామల మీద కోడళ్ళు చేసే దౌర్జన్యం పెరిగిపోతున్నట్లు మన ఛానెల్ ఇండిపెండెంట్ గా నిర్వహించిన ఒకసర్వేలో తెలుస్తోంది. అలాగే భార్య మాటలు విని తల్లిదండ్రుల్ని రోడ్డు మీదకు గెంటుతున్న కొడుకుల సంఖ్య కూడా చాలా వేగంగా పెరిగిపోతుందని ఇంకో సర్వేలో తేలింది- ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అలాంటి వృద్ధులను ఆదుకోడానికి పోలీసులు ఏం చర్యలు చేపట్టారు? అనే విషయం గురించి మాట్లాడ్డానికి కలెక్టర్ వాయసరావ్, ఎస్పీ శ్రీలక్ష్మీ రెండ్రోజుల నుంచీ మన ఛానెల్లో వెయిట్ చేస్తున్నారు- ఇప్పుడు- కలెక్టర్ వాయసరావ్ గారు-
వాయసరావ్ గారు! మీరు తీరికలేని కార్యభారంతో ఉన్నా, మా ఛానెల్ కోరిన వెంటనే వచ్చి రెండు రోజుల్నుంచీ ఇక్కడే ఉండి మీ విలువయిన అభిప్రాయాల్ని తెలియజేస్తున్నందుకు సంతోషం! వాయసరావ్ గారూ- ఇప్పుడు చెప్పండి. అత్తామామలను, ఇంటి నుంచి బయటకు గెంటే సంస్కృతి ఎక్కువయిపోయిన నేపథ్యంలో మీ స్పందన ఏమిటి?"
"తుగ్లక్ ఛానెల్ ప్రేక్షకులకు నమస్కారం! మీరన్నది నిజమే గజనీ- వృద్ధుల మీద దౌర్జన్యం- వారిని బయటకు గెంటటం నిజంగా చాలా దారుణం! నా మటుకు నేనూ, మా మిసెస్ ఇద్దరం పేరెంట్స్ ని దేవుళ్ళలాగా చూడాలనే ఆకాంక్షతో ఉన్న వాళ్ళం! పేరెంట్స్ ని పూజించే లెవెల్లో వారిని గౌరవించాలనేది మా ఇద్దరి అభిప్రాయం- అది మన సంస్కృతి-మన భారతదేశం సంప్రదాయం కూడా"
"చాలా బాగా చెప్పారండీ! యువతీ యువకులు మీ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ని ఆదర్శంగా తీసుకుని పేరెంట్స్ ని దేవుళ్ళలా చూసుకుంటే సమాజంలో కన్నీరనేది కన్పించదు. అన్నట్లు వాయసరావ్ గారూ! మీ పేరెంట్స్ ని మీరు అలాగే చూసుకుంటున్నారా?"
"వాళ్ళుంటే నిజంగా దేవుల్లాగానే చూసుకొనేవాళ్ళం!"
"అంటే వాళ్ళు ఏమయ్యారు"
"ఆ.... అదీ.... అది..... ఆ మధ్య మా అమ్మా, నాన్నా ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు- న్యూస్ పేపర్స్ లో చూసే ఉంటారు-"
"అవునవును! గుర్తుకొచ్చింది- వాళ్ళెందుకు ఆత్మహత్య చేసుకున్నారు?"
"అదిప్పటికీ ఫజిల్ గానే ఉంటుంది మాకు"
"మరి మీ భార్య పేరెంట్స్ సంగతేంటి?"
"వాళ్ళిద్దరూ ఒకరోజు గుడికి వెళ్లివస్తామని చెప్పి మాయమయ్యారు. దేశమంతా వెతికిస్తే అదేదో ఆశ్రమంలో అంట్లు తోముతూ, వంటపని చేస్తున్నారని తెలిసింది. నేనూ, నా భార్య వెళ్ళి బ్రతిమాలినా రావటానికి ఒప్పుకోలేదు. భగవంతుని సేవలో నిమగ్నమవాలని వారి కోరిక-"
"కానీ అప్పట్లో న్యూస్ పేపర్లలో- మీరూ, మీ భార్యా చేయించే చాకిరీ భరించలేక పారిపోయారని వార్తలు వచ్చాయ్-"
"అన్నీ అవాస్తవాలు-"
"ఇప్పుడు ఎస్పీ శ్రీలక్ష్మిగారితో మాట్లాడదాం- శ్రీలక్ష్మిగారూ! సొసైటీలో వృద్ధుల సమస్యలపై మీరెలా ఫీలవుతున్నారు?"
"తల్లితండ్రులను సరిగ్గా చూడని పిల్లల మీద క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్ట్ చేస్తే ఇలాంటి ఘాతుకాలు చాలావరకూ తగ్గిపోతాయ్. నిజానికి నేను చొరవ తీసుకుని తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటి వేసిన కొడుకులను చాలామందిని అదుపులోకి తీసుకుని బెదిరించాను. దానివల్ల చాలామంది తమ తల్లిదండ్రులను మళ్ళీ తమ ఇంటికి తీసుకెళ్ళారు."
"కానీ- మీరు ఆ తల్లిదండ్రుల దగ్గరా, కొడుకుల దగ్గర కూడా లంచాలు లాగినట్లు పేపర్లలో వార్తలు వచ్చాయ్ కదా-"
"అంతా అబద్దం! ఆ వార్త రాసిన జర్నలిస్ట్ ని ఒకే ఒక్కరోజు లాకప్ లో పెట్టేసరికి నేను అలాంటి అవినీతికి పాల్పడలేదని తనే మళ్ళీ పేపర్లో రాశాడు-"
"కానీ ఆ తర్వాత మీరు అలాంటి చర్యలు ఎందుకు మానేశారు?"
"హోమ్ మినిష్టరుగారికి నేను ఆ కేసుల్లో లంఛాలు గుంజుతూ జూబ్లీహిల్స్ లో ఫ్లాట్ కొన్నానని ఎవరో నేనంటేపడని జర్నలిస్ట్ లు చెప్పారు. అందుకని వాటి జోలికి పోవద్దని అన్నారు అందుకని"
"థాంక్యూ శ్రీలక్ష్మిగారూ- మీరు మీ విధులన్నీ పక్కన బెట్టి మా ఛానెల్ ప్రేక్షకులకు మీ విలువయిన అభిప్రాయాలను తెలియజేయడానికి విచ్చేసి రోజంతా ఇక్కడే గడిపినందుకు మా ధన్యవాదాలు-"
"రాజూ! ఇప్పుడు రామ్ భరోసా అపార్ట్ మెంట్స్ లో పరిస్థితి ఏంటి?"
"పరిస్తితి ఉద్రిక్తంగా ఉంది వెంగమాంబా! ఈ అపార్ట్ మెంట్స్ లో ఉంటున్న అత్తలూ, కోడళ్ళూ రెండు గ్రూపులుగా విడిపోయారు. అత్తల మీద కోడళ్ళూ, కోడళ్ళ మీద అత్తలూ తీవ్రస్థాయిలో ఆరోపణలు, నిందలు, బెదిరింపులు చేస్తున్నారు. ఏ క్షణాన్నయినా పరిస్థితి చేయిదాటే అవకాశం ఉందని నేనిప్పుడే పోలీస్ ని ఎలర్ట్ చేయటం జరిగింది వెంగమాంబా."
"థాంక్యూ రాజూ! ఇప్పుడో చిన్న బ్రేక్-"
"దయచేసి ఛానెల్ మార్చకుండా మీకుపయోగపడే ఈ వ్యాపార ప్రకటనలు చూడండి-"
"మీ కొడుకులు, కోడళ్ళు మిమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారా? వెంటనే మా 'ఇలవేల్పు' వృద్దాశ్రమంలో చేరండి! నెలకు ఒక్కొక్కరికి పదివేలు కడితే చాలు, మీకు సర్వసౌకర్యాలు అందిస్తాం! స్వర్గం అంటే ఎక్కడో లేదు- మా 'ఇలవేల్పు' లోనే ఉంది. రండి! త్వరగా చేరండి! మీ పిల్లలు పెట్టే నరకయాతన నుంచి తప్పించుకోండి! 24 గంటలూ వెన్నంటి ఉండే డాక్టర్ల సంరక్షణలో నిశ్చింతగా గడపండి"
"రాజూ! ఇప్పుడు తన తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటిన రాజేశ్వర్ ఏమంటున్నారు?"
"రాజేశ్వర్ గారూ! వెంగమాంబ గారి ప్రశ్నకు మీ సమాధానం ఏమిటి?"