"మైగాడ్! 36......32......36" అన్నాడు గుండెలు బాదుకుంటూ.
ఆమె గాబరాపడింది.
"ఏంటండీ?" అయోమయంగా అడిగింది.
"ఆహాహా! కాఫీ ఇంత అద్భుతంగా ఎలా చేశారా అని! చాలా రుచిగా ఉంది!"
ఆమె మరింత ఆశ్చర్యపోయింది.
"ఆయ్.......! తమరు ఇంకా కాఫీ తాగలేదుకదండీ! రుచి ఎలా చెప్పారేంటి?"
"ఆయ్......! మనిషిని చూస్తే తెలిసిపోతుందిగదండీ-మీది మావూలు చేయికాదని!"
ఆమెకు నవ్వొచ్చేసింది.
"మా వంటామె నిజంగానే చాలా బాగావంటలు చేస్తుంది. చిన్నప్పుడు అమెరికన్ ఫ్యామిలీ దగ్గర పనిచేసింది."
"అయితే ఇంకేం? ఎక్స్ పోర్ట్ క్వాలిటీ అన్నమాట"
కాఫీలు తాగుతుంటే మాయఅల్మారాలో నుంచి ఫోటో ఆల్బమ్ తీసుకొచ్చి సురేష్ కిచ్సింది.
మొదటిపేజీలోనే మాయపక్కనే భుజంమీద చేయివేసి నిలబడ్డాడతను చాలా స్టయిలిష్ గా, హుందాగా.....
"పెళ్ళాంవుందని తెలిసినా మిమ్మల్ని పెళ్ళికి వప్పించాడంటే మాంఛి బుల్ వర్కర్ అయుండాలి!"
మాయకు అతని మాటలు అర్ధంకాలేదు.
అయోమయంగా తులసివేపు చూసింది.
"అర్ధంకాలేదా? అదేనండి! బుల్ వర్కర్ అంటే మీకు తెలీదనుకుంటాను. అది ప్రాక్టిస్ చేస్తే రోజుకో 'ఇంచ్' చొప్పున పెరుగుతుంది ఛాతి! ఆ బుల్ వర్కర్ ఛాతీ చూసి మీరు చిన్నిల్లుకి వప్పేసుకుని వుంటారుకదూ?"
మాయనవ్వింది.
రెండోపేజీలో మాయ అర్ధనగ్నంగా దిగిన ఫోటో, చేతిలో బ్రాందీ బాటిల్!
"ఇది 'బ్లూకమాండ్" బ్రాందీయాడ్ తీసిన ఫోటో"
"ఇంటిమేట్ సెంట్ వాళ్ళకు పనిచేసిన ఫోటో వుందా మీ దగ్గర?"
"అలాంటిదేయింకో కంపెనీ చేశాను గానీ.....ఆఫోటో సరిగ్గా రాలేదు"
"ఫోటో అక్కర్లేదు. ఆ 'ఇంటిమసీ' వుంటే చాలునాకు"
"అమ్మా! స్నానానికి నీళ్ళుతోడానండీ!" మళ్ళీ వచ్చిందా వంటామె.
"కమాన్ గెటప్!" అంది తులసి సురేష్ నుద్దేశించి.
"ఇద్దరికీ తోడారా?" ఆమె నడిగాడు.
ఆమె తెల్లబోయి చూసింది. "ఆయ్! ఒక్కరికేనండి!"
"ఆయ్.....యిద్దరం ఒకేసారి చేయాలి కదండీ....."
"అయ్యబాబోయ్!" లోపలకు పరుగెత్తింది, చేతులు నోటికి అడ్డుపెట్టుకుని.
"అమెరికన్స్ దగ్గర పనిచేసి కూడా అలా పరుగులు పెడుతుందేమిటి?" మాయ నడిగాడు సురేష్.
"ఆ అమెరికన్ వల్లే గొడవైపోయింది దాని జీవితం. పాపం!"
"ఎలా?"
"వాళ్ళాయన విడాకులిచ్చాడు"
"ఏం జరిగింది?"
"వాళ్ళాయిన పాలకొల్లులో వుండటంవల్ల"
"పాలకొల్లులో వుంటేనేం...?"
'నిజానికతను వైజాగ్ లో వుండాల్సింది. అక్కడే ఉన్నాడనుకుని ఆ రాత్రి అమెరికన్ ఇంట్లోనే వుండిపోయింది. వాడేమో పాలకొల్లు నుంచి లాస్ట్ బస్ లో ఇంటికొచ్చేశాడు"
"నన్నడిగితే ఈ లాస్ట్ బస్ లన్ని కాన్సిల్ చేయాలంటాను. వీటి వల్ల ఎన్ని సంసారాలు కూలిపోతున్నాయో ఆర్టీసి వాళ్ళకు తెలీటంలేదు. ఇవాళే లెటర్స్ టు ది ఎడిటర్ కాలమ్ కి రాసేస్తాను"
లేచి లెటర్ తీసుకుని బాత్ రూమ్ కి వెళ్ళిపోయాడు.
మరో అరగంటలో బయట పోర్టికోలో టేబుల్ మీద ఫలహారాలు సిద్దంగా అమర్చింది వంటామె.
తలంటుపోసుకున్న తులసిజుట్టు స్వేచ్చగావీచే గాలిలో అందంగా ఎగిరిపడుతుంటే మాయంత రంగుల కాంబినేషన్ మిడ్డీలో కెమేరా ముందు కూర్చున్నట్లు కూర్చుంది.
"పెళ్ళి ఏర్పాట్లెలా చేద్దాం?" అడిగింది మాయ.
"నాకేం తెలీదు? అంత నీ ఇష్టం" అంది తులసి.
"ఇక్కడే ఓ గుడివుంది! పెళ్ళిళ్ళకు చాలా ఫేమస్! అక్కడ అరేంజ్ చేస్తాను"
"ఎక్కడుందాగుడి?"
"మనం బోట్ లో వెళ్ళాలి. అరగంట ప్రయాణం చేస్తే ఒక చిన్న ద్వీపం వుంటుంది. ఆ గుట్టమీద వుందిగుడి"
"నాకిష్టం లేదు" అన్నాడు సురేష్.
"ఎందుకని?"
"పిల్లకోసం ద్వీపాలు వెతకటం సహజంగానీ, పిల్లనుపక్కన పెట్టుకుని గుడికోసం వెతకటం చాలాచిన్నతనం"
"అయినా తప్పదూ!" నవ్వుతూ అంది మాయ" మన దేశంలో పెళ్ళిళ్ళు నిలబడాలంటే ఈ గుళ్ళూ, గోపురాలు తప్పవూ, లేకపోతే మరీబరితెగించిపోతారీమగ వెధవలు!"
సురేష్ కోపంగా చూశాడామె వేపు.
"ఫరెగ్జాంపుల్?"
"గంగాధరం!"
సురేష్ ఆశ్చర్యంగా చూశాడు.
"ఎవరా గంగాధరం? ఏమా కథ?"
"మా ఫ్రెండ్ రమణీ సందేశ్ బాయ్ ఫ్రెండ్! ఇంట్లోనే దండలు మార్చుకుంటే చాలనివప్పించాడట. ఓ పాపనుకన్నాక ఇంకో భార్యను తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఆ రోజు నుంచీ దండలంటే ఎలర్జీ వచ్చేసింది పాపం దానికి! పూల దండలు కనిపిస్తే చాలు ఫిట్స్ వచ్చి పడిపోతుంది" చెప్పింది మాయ.
"గుళ్ళో పబ్లిగ్గా చేసుకుంటే ఎడ్వాంటేజ్ ఏమిటిట" టీజింగ్ గా అడిగాడు.
"పెళ్ళికొచ్చిన జనంలో ఎవరోకరికి ఆ పెళ్ళి కొడుకుతాలూకూ సైడ్ ట్రాక్ విన్యాసాలు తెలిసివుంటాయ్ కదా! అవి బయటపడితేముందే మేలుకోవచ్చు పెళ్ళిళ్ళల్లో బంధుమిత్రులు అంతమందిని పిలిచేది అందుకే అసలు"
"అవునవును! మా కాలేజ్ లో రాజశ్రీ అనే అమ్మాయి వుండేది. పెళ్ళికి మేమంతా వెళ్ళాంగానీ ఎవ్వరం ఛస్తే నోరు విప్పలేదు. ఆ అమ్మాయితాళి కట్టించుకున్నాక గానీ మా కెవరికీ మనశ్శాంతి దక్కలేదు. తరువాత మాత్రం పాపం ఆ పెళ్ళి కొడుకుమీద జాలివేసింది.
తులసికోపంగా చూసిందతనివేపు.
మాయ అతని మాటలు ఆసక్తిగా వింటోందల్లా అతను మాటలాపేయటం చూసి ఆశ్చర్యపోయింది.
"ఏమిటి చెప్పడం ఆపేశారేం?"
"రమణీ సందేశ్ సంగతీ, రాజశ్రీ సంగతీ మాకెందుగ్గానీ ముందు మీ సంగతులు చెప్పండి....." సబ్జెక్ట్ మార్చేశాడు.
"నా సంగతులేమున్నాయి?" విచిత్రంగా అడిగింది.
"అదే.......! మీ లైఫ్ లో ప్రవేశించిన మగాళ్ళ సంగతి!"
తులసి మరో పోటు పొడవబోయిందిగానీ అతి లాఘవంగా తప్పించుకున్నాడు.
మాయ అది గమనించి నవ్వింది.