Previous Page Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 14


    "చూడు సతీష్-నీక్కావలసింది డబ్బు. నన్ను చంపడంవల్ల నీ డబ్బు నీకు రాదు కదా-" అన్నాడు నాయుడు.
    "కబుర్లొద్దు. చావుకు సిద్దపడు...." అన్నాడు సతీష్.
    నాయుడు దిగులుగా ముఖంపెట్టి- "నా స్నేహితుల్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. అందుకిదన్న మాట నువ్వు నాకిచ్చిన చోట గౌరవం...." అన్నాడు.
    "నా డబ్బు ఎగవేయడాన్నే నువ్వు గౌరవించడంగా భావిస్తున్నావా?"
    "లేదు ఆయుధాలతో ఎవరినీ ఈ యింట్లో అడుగు పెట్టనివ్వను. లోనికివచ్చే ముందు నా మనుషులు అందర్నీ చెక్ చేస్తారు. ఈ చెకింగ్ నా స్నేహితులకు వర్తించదు. నీకు చెకింగ్ జరగలేదంటే నీవు నా స్నేహితుడివని అర్ధం-" అన్నాడు నాయుడు.
    సతీష్ ఆలోచనలో పడ్డాడు.
    "నాదొక్కటే సిద్దాంతం. పిస్తోళ్ళతో సమస్యలు పరిష్కారంకావు. బల్ల కటూ యిటూ కూర్చుని కబుర్లు మొదలెడితే ఏ సమస్యనైనా చిటికెలో పరిష్కరించవచ్చు. నువ్వు కాస్త శాంతపడితే-ఇద్దరం కూర్చుందాం-" అన్నాడు నాయుడు.
    ఆ గదిలో ఒకబల్ల ఉన్నది. ఆ బల్లకు అటొకటీ ఇటొకటీ కుర్చీలున్నవి. బల్ల మధ్యలో ఒక యాష్ ట్రే ఉన్నది.
    సతీష్ పిస్తోలు చేతిలోనే ఉంచుకుని- "సరే- అదీ చూద్దాం-" అన్నాడు.
    ఇద్దరూ బల్ల అటూ ఇటూ కూర్చున్నారు. సతీష్ చేతిలోని పిస్తోలు నాయుడికి గురిపెట్టబడి ఉంది.
    "సిగరెట్ తాగుతావా?" అన్నాడు నాయుడు.
    సతీష్ తల అడ్డంగా ఊపాడు.
    "పోనీ-నేను కాల్చితే నీకే అభ్యంతరమూ లేదుగదా!"
    "లేదు-" సతీష్ తల అడ్డంగా ఊపుతూ అన్నాడు.
    "చాలా సంతోషం-" అంటూ నాయుడు జేబులో చెయ్యిపెట్టాడు.
    "పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే పిస్టల్ పేలుతుంది. నాగురిఎలాంటిదో ఇంతవరకూ నీకు తెలియదు. తెలిశాక నువ్వుండవు....." హెచ్చరించాడు సతీష్.
    నాయుడు జేబులోంచి సిగరెట్ కేసుతీశాడు. అందులోంచి ఓ సిగరెట్ తీసి సుతారంగా పెదిమల మధ్య ఉంచుకున్నాడు. తరువాత సిగరెట్ కేసునే లైతరుగా ఉపయోగించి సిగరెట్ వెలిగించి-కేసును జేబులోకి తోసేసి- "పిచ్చి పిచ్చి అనుమానాలు పెట్టుకోక నేను చెప్పేది జాగ్రత్తగా విను...." అన్నాడు.
    సతీష్ చేతిలోని పిస్టల్ బిగించి పట్టుకున్నాడు. రెప్పవాల్చకుండా నాయుడినే చూస్తున్నాడు. నాయుడు సామాన్యుడుకాదు. అంత సులభంగా తనకులొంగడు. అయితే సతీష్ అతడిని చంపడానికిరాలేదు. నాయుడి విషయంలో తానెంతగా విసిగిపోయాడో తెలియజెప్పడమేఅతడి ఉద్దేశ్యం,
    నాయుడు ఓ దమ్ములాగాడు. సిగరెట్ అతడి ఎడమచేతి వ్రేళ్ళ మధ్య ఉన్నది కుడిచేతితో అతడు బల్లమీది యాష్ ట్రేను గుండ్రంగా తిప్పుతూ- "యాభై లక్షల సరుకు నువ్వు నాకు సప్లయిచేశావు. ఇంకా నీకు పైసాకూడా నానుంచి ముట్టలేదు. ఇదే కదా నీ అభియోగం-" అన్నాడు.
    "ఊఁ" అన్నాడు సతీష్.
    "నీకీ నాయుడి గురించి సరిగ్గా తెలియదనుకుంటాను. ఒకరు నాకు ఋణపడాల్సిందే తప్ప నేనెవ్వరికీ ఋణపడను. నన్నెవ్వడూ ఇంతవరకూ నమ్మకద్రోహి అనలేదు. నీకులా నిలదియ్యలేదు. డబ్బుగురించి నువ్వు పడుతున్న కంగారును నేను అర్ధం చేసుకోగలను. అయితే నాసమస్యేమిటో నువ్వూ అర్ధం చేసుకోవాలి. సరుకు చేరవలసిన చోటుకుచేరింది. డబ్బింకా ఇండియా చేరలేదు-" అన్నాడు నాయుడు.
    "ఈ ఉత్తరం చూసేవరకూ నేను అలాగే అనుకున్నాను. ఓసారి నువ్వూ చూడు-" అంటూ సతీష్ ఎడమచేత్తో తన జేబులోంచి ఓ కాగితం తీసి నాయుడికి అందించాడు.
    నాయుడది అందుకుని చదివాడు. సతీష్ సరుకు విదేశాలు క్షేమంగా చేరినాక వచ్చిన డబ్బును దేనికి పెట్టుబడిగా వాడాలో వివ్బరాలు రాసి ఉన్నాయి. అందులో డబ్బు నాయుడికి చేరినట్లున్నది.
    "సంతకం సరిగ్గా తెలియడంలేదు. ఎవరురాశారీ ఉత్తరం?"
    "జగన్మోహన్!" అన్నాడు సతీష్.
    నాయుడి కుడిచేయి యాష్ ట్రేను తిప్పుతున్నది. అతడు సాలోచనగా- "డబ్బు నాకు చేరిన మాట నిజమే! కానీ అనుకోకుండా అది ఖర్చై పోయింది. నువ్వు కొంతకాలం ఆగగలవా?" అన్నాడు.
    "ఆగలేను. ఇప్పుడే కావాలి...." అన్నాడు సతీష్.
    "పాపం-ఆగుతావనుకున్నాను-" అన్నాడు నాయుడు. అతడి చేతిలోని యాష్ ట్రే తిరగడం ఆగిపోయింది.
    "అంటే?"
    "ఇందాక నువ్వు గురి గురించి మాట్లాడావు. నీకు నామీద గురి లేదు. కానీ నాగురి నీమీద ఉన్నది-" అంటూ నాయుడు కాలుతున్న సిగరెట్ ను యాష్ ట్రేలో పొజిషన్ లో ఉంచాడు. అంతే!
    యాష్ ట్రేలోంచి తుపాకీగుండు-సతీష్ గుండెల్లోంచీ దూసుకుని పోయింది. నాయుడు నవ్వుకుని- "నన్నెదిరించే హీరో ఇంకా పుట్టలేదు-" అనుకున్నాడు.
    
                                               9
    
    ఎరుపురంగు బుల్లెట్! శరవేగంతో ఫిరంగిపురంలోనికి దూసుకునివచ్చింది.
    అదే వేగంతో అదిఊళ్ళో పయనించి ఒక హోటల్ ముందాగింది. బుల్లెట్ కు స్టాండ్ వేసి దిగాడు గోపీ!
    అతడు నెమ్మదిగా నడిచి అక్కడహాల్లో ఐమూలగా ఉన్నచోట కూర్చున్నాడు? అతడి వీపు హోటల్ ద్వారానికి అభిముఖంగా ఉన్నది.
    విశాలమైన హాలు. హాల్లోంచీ మేడమీదకు వెళ్ళడానికి మెట్లున్నాయి. గోపీ ఆ మెట్లవైపే చూస్తూ-"బహుశా-పైన లాడ్జింగై ఉంటుంది-" అనుకున్నాడు.
    బేరర్ వచ్చాడు- "ఒక బీరు...." అన్నాడు గోపీ. కొద్దిక్షణాల్లోనే గ్లాసునిండా బీరుతెచ్చి అక్కడపెట్టి వెళ్ళిపోయాడు బేరర్. ఆలోచిస్తూ నెమ్మదిగా బీరు సిప్ చేస్తున్నాడు గోపీ!
    బహుశా అప్పటికి గోపీ సగం బీరు సిప్ చేసి ఉంటాడు.
    ఒక యువతి పరుగున హోటల్లో ప్రవేశించి-అక్కడ కూర్చున్న ఒకరిద్దరితో ఏమో చెప్పింది. వాళ్ళు నిరాసక్తతతో తల అడ్డంగా ఊపారు. ఆయువతి హోటల్ మేనేజరు వద్దకు వెళ్ళి ఏదో చెప్పింది. అతడూ తల అడ్డంగా ఊపాడు.

 Previous Page Next Page